"కొడుకైతే నీలా మొహమాటపడతాడుటోయ్! నేతెక్కి కూర్చుంటాడు." నవ్వేశాడు ప్రసాదరావు.
ఇద్దరి మధ్యా ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లాయి. చేతులు కట్టుకుని పచార్లు చేస్తున్న ప్రసాదరావు , "చూడబ్బాయ్, పెద్ద కబుర్లాడక డబ్బు తీసుకెళ్ళు." అంటూ తల ఎత్తి వాసు వైపు చూసి కలవరపడ్డాడు.
తల వంచి నిలుచున్న వాసు బుగ్గల మీద నుంచి బొట్లు బొట్లుగా కన్నీళ్లు కారుతున్నాయ్.
"ఇదేమిటోయ్ ? ఎవరు నువ్వు? ఐతే మరో ఐదు ఇస్తాను తీసుకెళ్ళు. అంతేకాని ఆడపిల్లలా ఏడుస్తారటోయ్ !" అంటూ మరో ఐదు రూపాయల కాగితం బల్ల మీద పెట్టాడు ప్రసాదరావు.
"వద్దు, వద్దు , సార్ - పోతాను" అంటూ గుమ్మం దాటబోతున్న వాసు చెయ్యి టక్కున పట్టుకున్నాడు ప్రసాదరావు.
ఆ స్పర్శ లో ఏదో తియ్యదనం, వ్యక్తం కాని ఏదో మమత, అలసిన ఆ లేత మొహాన్ని చూస్తూ జాలి , "పాపం, చాలా నీరసంగా కన్పిస్తున్నావ్. భోజనం చేసిపో" అంటూ బలవంతాన కుర్చీలో కూర్చోబెట్టాడు ప్రసాదరావు , వాసుని.
వాసుని పరిశీలనగా చూసిన ప్రసాదరావు మనస్సు కలుక్కుమంది. ఏదో గుర్తుకు వచ్చి. 'బహుశా తన కొడుకు ఇదే వయస్సు లో ఉండి ఉంటాడు. వాడికేం? దర్జాగా, హాయిగా బ్రతికేస్తుంటాడు. డబ్బు గల ఇంటి పిల్ల కొడుకు' అనుకుంటూ దీర్ఘ్హంగా విశ్వసించి , నిశ్శబ్దాన్ని చేదిస్తూ , "నీకు తలిదండ్రులున్నారా, అబ్బాయ్?' అన్నాడు ప్రసాదరావు.
ఉన్నరన్నట్టు తల ఊపాడు వాసు.
'అయితే పేదవారా?" ఆ ప్రశ్నలో సానుభూతి.
కాదన్నట్టు వాసు తల ఊపేసరికి ఆశ్చర్యంగా చూస్తూ, 'అయితే అలిగి పారిపోయి వచ్చావా?' అన్నాడు ప్రసాదరావు.
"అబ్బే, అలాంటి వాణ్ణి కానండి." చిన్నగా నవ్వి అన్నాడు వాసు.
"నా దగ్గరి కెళ్లమని ఎవరు చెప్పారు? అసలింతకీ ఎందుకొచ్చావ్?' ఖచ్చితంగా నొక్కి అన్నాడు ప్రసాదరావు.
"మీ దగ్గరి కెళ్ళమని ఎవరూ చెప్పలేదు. నేనే వచ్చాను." టక్కున అన్నాడు వాసు.
అర్ధం కానట్టు నవ్వి, "అదే ఎందు కొచ్చావని?" అని రెట్టించాడు ప్రసాదరావు.
ఇబ్బందిగా కదిలి మళ్ళీ కూర్చుని మౌనంగా ఉండి పోయిన వాసు వైపు విసుగ్గా చూస్తూ "అసలు నువ్వెవరు?" అన్నాడు ప్రసాదరావు.
"నేను....నేనాండి?' అంటూ అతని మొహం లోకి చూసి, "మీరు నన్ను కాలేజీ చదువు చదివిస్తారని....అధమం ఫీజులన్నా కడతారని....అడగడానికొచ్చానండి...." అని ఒక్కో మాట వత్తి వత్తి ప్రయత్నపూర్వకంగా అన్నాడు వాసు.
ఈసారి ప్రసాదరావు దిగ్భ్రాంతుడయ్యాడు. కొన్ని క్షణాల తర్వాత, బాగుంది....చదివించాలంటే దేశంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఏదో విరాళమంటే పదీ పరకా ఇస్తూ వచ్చాను కాని.... ఇదేమిటి? నా అడ్రసేవరు చెప్పారు నీకు?' అన్నాడు ప్రసాదరావు అసహనంగా.
"మా చిన్న మామయ్యా...."
షాక్ తిన్నట్టు చూశాడు వాసు వైపు. కొన్ని క్షణాల తరువాత సర్దుకుని, "అతని పేరు?" అన్నాడు నెమ్మదిగా.
"కె. గోపాల్రావండి. మా తాతయ్య తాసిల్దారు చేసేవారట."
ఈసారి నిలువునా చలించి పోయాడు ప్రసాదరావు. వాసు చేతుల వైపు అత్రతగా చూశాయి అతని కళ్ళు. కుడి మండ పై నల్లని చిన్న పుట్టుమచ్చ . కళ్ళు పెద్దవి చేసి అతనిలోని యేవో పోలికలు వెతుకుతూ , పరిశీలనగా , ఆప్యాయతతో మనస్సంతా బరువెక్కగా , హృదయ మర్ద్రంకాగా, నిండుగా చూసి, "నువ్వు.... నువ్వు..... మధు కొడుకువా?' అని ప్రశ్నించాడు. నూతి లోంచి వచ్చినట్టుందా ప్రశ్న.
చివాల్న రోషంగా తల ఎత్తి, "కాదండి , బస్ కండక్టర్ ప్రసాదరావు గారి కొడుకు నండి" అన్నాడు వాసు. అతని గొంతు తడిగా ఉంది.
పట్టలేని వాత్సల్యంతో అతని మనస్సు ఉప్పొంగి పోయింది. రోషంతో ఎరుపెక్కిన వాసు మొహం అతన్ని కదిలించి వేసింది. మెత్తగా, పచ్చగా, అందంగా కనిపించే పదహారేళ్ళ అబ్బాయి తన కొడుకు. రెండు చేతులా బలంగా దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకోవాలని పించింది. అతని బుగ్గలూ, అందమైన క్రాపు, మెరిసే ఫాలం గట్టిగా ముద్దులతో నింపేయ్యాలనిపించింది.... కాని, ఏ ఒక్కటీ చెయ్యలేని ప్రసాదరావు పెదవుల పై చిన్న హసరేఖ విరిసింది. కారణం? ఇలాంటి అనుభూతులు అతని నుంచి పొందే వయస్సు దాటిపోయింది. బాల్యం లోంచి యౌవ్వనం లోకి, పసితనంలోంచి పరువమైన ఊహల్లోకి అడుగిడుతున్న వయస్సు లోని తన కొడుకు. అప్రయత్నంగా అతని చూపుల్ని నీటి తెర కప్పింది.
"బస్ కండక్టర్ మీ నాన్నని నీకెవరు చెప్పారు బాబూ?' మొహం చాటు చేసుకు కళ్ళు వత్తుకుని అడిగాడు ప్రసాదరావు.
"మా అమ్మమ్మ నన్ను కాలేజీ లో చేర్పించమంది. పెద్ద మామయ్య 'కండక్టరు కొడుకు కలెక్టర్ అవుతాడా?' అని నవ్వాడు. మా నాన్న కండక్టరు కాబోలనుకున్నాను."
'అదృష్టముంటే అవుతాడని చెప్పు. మీ అమ్మ ఏమంది?" అతని ఇష్టంతో ప్రమేయం లేకుండానే వచ్చాయా మాటలు.
"అమ్మ కూడా మా నాన్న కండక్టరనే అంది.ఏమంటుంది? ఆమె దగ్గర డబ్బు లేదుగా? ఏడిచింది... మరేం చెయ్యగలదు!" పేలవంగా నవ్వాడు వాసు.
తాను ఊహించని ఈ పరిణామానికి తట్టుకోలేక పోతున్నాడు ప్రసాదరావు. అతని హృదయం చలించి పోతుంది. కలో, వాస్తవమో! ఏం జరుగుతుందో! ఎందుకిలాటి క్షణం ఎదురైందో! నిలుచోలేని ప్రసాదరావు చేతులు కట్టుకుని పచార్లు చేస్తూ క్షణక్షణం వాసు వైపు చూస్తున్నాడు. తన పోలికలూ, భార్య పోలికలూ కలబోసుకున్న అతని రూపం. గుండెల నిండుగా ఏదో తృప్తి. కొడిగట్టే దీపం తిరిగి ప్రజ్వరిల్లుతున్నట్టు, కొండెక్కే జ్యోతికి మళ్ళీ చమురు పోసినట్టు ఒక్కసారి ప్రసాదరావు కళ్ళు వింతగా మెరిశాయి. భవిష్యత్తు లో చిక్కటి బలమైన కాంక్షలు నెరవేరగలవని. టక్కున ఎందుకో అతను కనుబొమలు చిట్లించి ఆగిపోయాడు.
మౌనంగా తల వంచి కూర్చున్న వాసు వైపు పరిశీలనగా చూస్తూ "నిన్ను....నిన్ను.... నిజంగా నా దగ్గరి కెళ్ళమని ఎవరూ చెప్పలేదా?" అని ప్రశ్నించాడు ప్రసాదరావు. ఆ గొంతు మాములుగా లేదు.
"లేదు, సార్ . అసలు మీ దగ్గరి కేళతానని చెపితే ఇల్లు కదలనిస్తారా?" నవ్వా డదోలా వాసు.
ఇంతలో ఒక ఫ్యూన్ రావడంతో ఇద్దరి సంభాషణ ఆగిపోయింది.
"రెండు మీల్సు తీసుకురా" అంటున్న ప్రసాదరావు మాట కడ్డు వస్తూ , "వద్దు. నేను భోజనం చెయ్యను." అన్నాడు వాసు. అతని తెగువ అతన్నే భయపెడుతుంది కాబోలు -- చిన్నగా మేను కంపిస్తుంటే బెదురుగా చూస్తున్నాడు వాసు.
"ఏం? ఎండుకోద్దు? ఆకలి లేదా?" ఎందుకలా భయపడుతున్నట్లున్నావ్? నీ ఫీజులు కట్టి చదివిస్తాగా?" ఆ గొంతులో సన్నని బాధ, జాలి.
కృతజ్ఞతగా తడి కళ్ళతో చూశాడు వాసు ప్రసాదరావు వైపు.
"వద్దు, వద్దంటూ మొహమాటపడుతున్న వాసుని కొసరి కొసరి తినిపించాడు ప్రసాదరావు అన్నం.
భోజనం ముగించి లేస్తూ, "అయితే మీరు ఫీజులు కడతారన్నారని మామయ్యతో చెపుతాను" అన్నాడు వాసు.
"అలాగే. నేనూ ఉత్తరం వ్రాస్తాను. అడ్రసు తెలుసా గోపాలానిది?" అన్నాడు ప్రసాదరావు.
"ఆ వ్రాసి ఇస్తాను. పది గంటలకు రైలుంది. మరి వెళతానండి" అన్న వాసు వైపు తెల్లబోయి చూశాడు ప్రసాదరావు.
"ఎదిగిన కొడుకు.... దబ్బు కోసం తల్లి పంపి ఉంటుంది' అనుకోగానే ప్రసాదరావు వదనం జేవురించి కరుణ కరిగిపోయింది.
"అయితే.....అయితే ....నా దగ్గరి కిన్నాళ్ళ తరవాత మీ అమ్మ....నీ అమ్మ.... వెళ్ళమంటే వచ్చావు? అవునా?" ఆ గొంతు చలించింది అసహనంగా.
"లేదు, పాపం! అసలు మీ రెక్కడున్నారో అమ్మకి తెలియదు. నా మాట మీరు నమ్మకపోతే నేను చేయ గలిగిందేమీ లేదు. 'నేను భోజనం , వసతీ ఇస్తాను. పెద్ద మామయ్య ఫీజులు కడతాడేమో అడిగి రమ్మన్నాడు గోపాలం మామయ్యా.... మీరు బ్రతికి ఉండగా ఇలా అందర్నీ దేవిరించవలసిన అవసరం నాకు లేదనిపించి తెగించి.... మీరెవరో నాకు తెలియదు... మిమ్మల్నేప్పుడు చూడలేదు. కాని నేనుగా మీ దగ్గరి కొచ్చి అడిగాను.' మరి మాట రాలేదు. గొంతు పూడిపోయింది వాసుకి.
సంతోషంతో మేనుపులకరిస్తుంటే "వెరీ గుడ్! మంచి పని చేశావ్! నేను చాలా అదృష్ట వంతుణ్ణి!" అని వాసు భుజం చరిచాడు ప్రసాదరావు.
"ఏమండీ.....' అంటూ సంశయంగా ఆగిపోయిన వాసు వైపు చిరునవ్వుతో ప్రశ్నార్ధకంగా చూశాడు.
"మీరు....మీరు....అంటే బస్ కండక్టర్ ప్రసాదరావు" అంటే, "అవును , నీకు తండ్రిని. నిజంగా నీ తండ్రి దగ్గరికి నువ్వొచ్చావు. ఈ సత్యం నువ్వూ నేనూ వాస్తవంగా అనుకోలేకపోతున్నాం . అవునా?" అంటూ ఫకాల్న నవ్వి, "ఐదు సంవత్సరాలు ఓ కండక్టరు గా బ్రతికెడు , బాబూ , మీ నాన్న" అన్నాడు ప్రసాదరావు. అతని గొంతులో ఆవేశపు జీర, వ్యధ.
అలా చేపుతూన్న ప్రసాదరావు హృదయంలో తలదూర్చి భోరున ఏడవాలని పించింది వాసుకి. తనని అతను దగ్గరగా తీసుకుని ఓదార్చి లాలించి అనునయ వాక్యాలు పలికితే బాగుండుననిపించింది. 'నాన్నా' అని గొంతెత్తి అరవాలనిపించింది. ఇంకా 'ఎందుకు నన్ను, అమ్మని వదిలేశారు? నేనం తప్పు చేశాను? నన్నెందుకు దూరంగా ఉంచారు?' అని అడగాలనిపించింది.
అలా తన వైపే చెమ్మగిల్లిన విశాలమైన కనులెత్తి చూస్తున్న వాసు వైపు చూసిన ప్రసాదరావు , "రేపు ఉదయం వెళ్ళవచ్చు. ఈవేళకి ప్రయాణం వద్దు.' హాయిగా నిద్రపో....ఏం బాబూ!" అన్నాడు జాలిగా.
"ఇప్పటికే చాలా లేటయింది. సీటుకి అప్లై చెయ్యాలి." నసిగాడు వాసు.
"పదహారు సంవత్సరాలు అమ్మ దగ్గర హాయిగా ఉన్నావు. నీ ముద్దు మురిపాలు మీ అమ్మ చూసుకుంది. కాని ఈ నిర్భాగ్యుడి దగ్గర ఓ రాత్రి గడపలేవా, బాబూ! నిన్నేమని పిలుస్తారు?' ఆ గొంతు నిండు- వ్యధ, నిష్టూరం.
"సార్...." అర్ధం కానట్టు చూశాడు వాసు.
ఆ అబ్బాయి తన కొడుకని గుర్తించిన తరువాత వాసు "సార్....' అనేసరికి చెళ్ళున కొరడా దెబ్బలా అనిపిస్తుంది ప్రసాదరావు కి.
"సార్....." అంటూ పేలవంగా నవ్వుకుని, 'ఇన్నాళ్ళ తరువాత ఊడిపడ్డ తండ్రి నొక్కసారిగా ఎలా సంభోదిస్తావు బంధాన్ని పురస్కరించుకుని.....నీ పేరేమిటి?.... అంటే ఎలా పిలుస్తున్నారు?' అన్నాడు ప్రసాదరావు.
"వాసు. అలాగే పిలుస్తారు. రేపు ఉదయం వెళతానండి" అన్నాడు వాసు, ఇంట్లో ఉన్న ఒక్క మంచం వైపు ఇబ్బందిగా చూస్తూ.
"అలా పడుకో.' మంచం చూపించాడు ప్రసాదరావు.
"ఆహా మీరు పడుకోండి. దిండు ఇస్తే క్రింద పడుకుంటాను" అన్నాడు వాసు.
"మంచం పెద్దదే. ఇద్దరం పడుకుందాం ఈవేళకి. ఈసారి నువ్వోచ్చేసరికి నీకు వేరే బెడ్ ఏర్పాటు చేస్తాను." అంటూ చనువుగా చెయ్యి పట్టి మంచం మీద కుదేశాడు వాసుని ప్రసాదరావు.
