2
"కాకినాడ మెడికల్ కాలేజీ కి ఏడు వేల రూపాయల డొనేషన్ కట్టి ఎనార్ధం అయింది. నువ్వు మాత్రం పి.యు.సి పాస్ అవలేదు" అంది కౌసల్య నిష్టూరంగా. సాక్సు తొడుక్కుని బూట్లు తుడుచుకుంటున్న తిలక్ ఒక్కసారి తల్లి కేసి చూసి తల వంచుకున్నాడు.
"మన ఈ రామచంద్ర పురం లోనే కాదు ఈ జిల్లా హైస్కూళ్ళన్నింటి లోనూ ఫస్టు గా పాస్ అయేవాడివి. మరి ఆ కాకినాడ వెళ్ళి పి.యు.సి. లో చేరగానే ఏం వచ్చింది ఏమో -- మార్చి పోయింది. సెప్టంబరు పోయింది !"

"ఇంకా సెప్టెంబరు రిజల్ట్స్ రాలేదు కదా? అప్పుడే పోయిందంటావెం?" అన్నాడు తిలక్ కొంచెం కోపంగా.
"పౌరుషానికి కేం లోటు లేదు. ఏం వచ్చినా రాకపోయినా, పిత్రార్జితం ఇదొక్కటోచ్చింది."
"అమ్మా,అంటే నీకు కోపం కాని, రిజల్ట్స్ రాకుండానే పోయిందంటే ఎలా చెప్పు?"
"పేపర్లో వేరే రావాలేమిటి నీ రిజల్టు? రాకుండానే నిర్ణయం అయిపొయింది."
"ఎలా?"
"ఎలా ఏమిటి? రెండు పేపర్లు పాడు చేశానన్న రోజునే నీ రిజల్టు అనుమానం లో పడింది." అంటూ సోఫాలోంచి లేచింది కౌసల్య.
బూట్లు తొడుక్కుని అద్దంలో చూసి టై సర్దుకుంటూ "ఒకపేపరు అందరూ పాడు చేసారు. మాకు కోర్సు లో లేనివాటి మీద ఒకటి రెండు ప్రశ్న లిచ్చారు. అంతా ఆ పేపరు కి మోడరేషన్ ఉంటుందంటూన్నారు" అన్నాడు తిలక్.
"అ! ఇక మోడరేషన్ లో పాస్ అవాలి. ఏమ్. బి.బి.యస్ చదివేవాడివి, మోడరేషన్ లో పాస్ అవుతానంటే సిగ్గు లేదూ?" అంటూ తీక్షణంగా అని, అద్దాల బీరువా తాళం వేసేసి, తాళాల గుత్తి పైట చెంగు కు ముడి వేసుకుంటూ వెళ్లిపోయింది కౌసల్య లోపలికి.
తిలక్ కు ఏమీ పాలుపోలేదు. అమ్మకు ముక్క చివర ఉంటుంది కోపం. ఎందులో ఏమాత్రం తేడా వచ్చినా భరించ లేదు. పోనీ, సంగతి ఇది అని విడమరిచి చెబుదామంటే వినిపించుకోదు. 'చాల్లే, సమర్ధించావు !' అంటుంది. ఇంట్లో వస్తువులు ఉంచడం దగ్గర నుంచి పరీక్షలలో మార్కులు తెచ్చుకోవడం దాకా అన్నీ నియమిత పద్దతిలో జరగవలసిందే! తల దువ్వుకున్నాక దువ్వెన టేబిల్ మీద మరిచిపోయినా, షర్టు హేంగరు కు వేసుకోవడానికి బద్దకించి తలుపు మీద పడేసినా వీధిలోకి వెళ్ళేటప్పుడు టై కట్టుకోవడం మరిచి పోయినా తల వాచేటట్లు చివాట్లు పెడుతుంది. గుమస్తా కు ఒక మాటు బాంకు లో కట్టమని డబ్బు ఇస్తే , అయన అది ఇంటికి తీసుకు పోయారు బాంకు టైము అయిపొయింది, ఇంక ఆ రోజుకు కట్టుకోరని. ఆ మర్నాడాయనను డిస్మిస్ చేసినంత పని చేసింది. 'ఇందులో ఏం పోయిందమ్మా? నేనేం వాడుకున్నానా చేశానా?" అని అయన ఎంత మొత్తుకున్నా వినిపించుకోదే! 'అది వేరే విషయం. బాంకు టైము అయిపొయింది అన్నప్పుడు డబ్బూ, పాస్ బుక్కూ నాకు ఇచ్చేసి మరీ వెళ్ళాలి మీరు ఇంటికి. ఏం పోయిందంటారేమిటి? క్రమశిక్షణ పోయింది. నా మాట మీద గొరవం పోయింది.' అంటూ ఒకటే కేకలు. పనిమనిషి చెప్పకుండా ఒకరోజు మానేస్తే ఆ మర్నాడు దాని జీతం అణా పైసాలతో లెక్క చూసి ఇచ్చేసి మానిపించేసింది. 'ఏం అంటే నువ్వు చెప్పకుండా ఒక రోజు మానేశావు. నేను చెప్పకుండానే నిన్ను పూర్తిగా మానిపించేస్తున్నాను.' అంది. అమ్మకు కోపం అది పనిలోకి ఓరోజు రాలేదని కాదు , రానని ముందుగా చెప్పలేదని.
ఇంతలో కౌసల్య అక్కడికి వచ్చింది. డ్రెస్ వేసుకుని సిద్దంగా ఉన్న తిలక్ ను చూసి అంది. "ఎక్కడికి బయలుదేరుతున్నావు ఎండలో?"
"బజార్లో కి...పేపరు వచ్చిందేమో చూద్దామని...."
"పేపరు ఇంటికి వస్తుందిలే! నువ్వు దాని కోసం ఎదురు వెళ్ళక్కర్లేదు." ఇనప్పెట్టి తాళం తీసి పది రూపాయల కట్టలో నోట్లు లెక్క పెడుతూ లోపలికి వెళ్ళబోయింది.
"అమ్మా" అన్నాడు నెమ్మదిగా వెనక నుంచి తిలక్. నోట్లు అలా లెక్క పెడుతూనే , ఓమారు వెనక్కు తిరిగి తిలక్ కేసి చూసింది ప్రశ్నార్ధకంగా.
"నాకో అయిదు రూపాయలు కావాలి" అన్నాడు నేలకేసి చూస్తూ.
కౌసల్య ఏభై వరకూ లెక్క పెట్టి , జ్ఞాపకం కోసం అక్కడ వేలు అడ్డు పెట్టి "నీకు ఇప్పుడు డబ్బు ఎందుకు?" అంది.
"మా స్నేహితులు , నేనూ మాటీనీ ప్రోగ్రాం వేసుకున్నాము" అన్నాడు కొంచెం భయపడుతూ.
"ఇదిగో ఇలా చెడు సావాసాలు చేసి మాటినీ లూ అని అంటూ తిరగడం మూలానే పోయి ఉంటుంది పరీక్ష." కౌసల్య ఇలా అంటుండగానే గుమస్తా అక్కడి కి వచ్చాడు.
'ఇలా చూడండి గుమస్తా గారూ! మీకే నెల నుంచి రావాలి ఇంక్రిమెంటు?"
"వచ్చే నెల నుంచి అండి."
"అయితే కొత్త దాసీ దానికి, వంట మనిషి కీ ఈ నెల నుంచి అన్నమాట. కొత్త దాసిది చేరి ఏడాది అయిందిగా? దానికి కూడా ప్రావిదెంటు ఫండు ఎకౌంటు ఓపెన్ చెయ్యండి."
"ప్రావిడెంటు ఫండు అంటున్నారేమిటండోయ్ ! అన్నాడు అప్పుడే ప్రవేశిస్తున్న అడిటరు.
"మీరూ వచ్చారా? మీకోసమే చూస్తున్నా. మీకు వీధి గదిలో ఏర్పాటు చేయించాను. ఎకౌంట్లూ వోచర్లూ అన్నీఆ గదిలోనే ఉన్నాయి. మా గుమస్తా గారు మీకు సాయం చేస్తారు" అంది కౌసల్య.
"అలాగే లెండి. ఏమిటి నేను వచ్చేటప్పటికి ప్రావిడెంటు ఫండ్ అంటున్నారు?"
"ఆ! మా కొత్త దాసీ దానికండి."
"మీ గృహ సంబంధమైన నౌకర్ల, చాకర్ల విషయంలో లేబర్ యాక్టు ఏమీ నిబందించక పోయినా, మీరు మాత్రం ఇంక్రి మెంట్లూ, ప్రావిడెంటు ఫండూ , పెన్షన్ ఇస్తూనే ఉన్నారు."
"లేబర్ యాక్టు కోసం ఇస్తామటండీ! వాళ్ళ ఒంట్లో రక్త మాంసాలు మనం పీల్చేసి, తర్వాత వెళ్లిరా అంటే వాళ్ళు మాత్రం ఎక్కడికి పోతారు? మా నాన్నగారు అంటూ ఉండేవారు -- 'ప్రతివాడికి ముసలితనం వచ్చేసరికి కాస్తో కూస్తో కూడా బెట్టుకున్నది వెనకాల ఉండకపోతే , వాడి జీవితం దుర్భరం అవుతుంది ' అని."
"మీరిలా అంటారా? నేను ఎన్నో పెద్ద పెద్ద సంస్థల ను ఆడిట్ చేస్తూ ఉంటాను. పెన్షన్ మాట దేవుడెరుగు. పది పదిహేను సంవత్సరాల నుంచీ పని చేస్తున్న వాళ్లకు ప్రావిడెంటు ఫండు కూడా ఉండదు. అదేమిటంటే ఏదో కుంటి సాకు చూపిస్తారు."
కౌసల్య చిన్నగా నవ్వి ఊరుకుంది. ఆడిటర్ ఆమె దగ్గర సెలవు తీసుకుని వీధి గదిలోకి వెళ్లాడు. గుమస్తా అతణ్ణి అనుసరించాడు.
'ఆడిట్ అప్ టు డేట్ చేసెయ్యండి. ఏమీ మిగల్చవద్దు" అని హెచ్చరించి కౌసల్య లోపలికి వెళ్లిపోయింది.
గుడ్లప్పగించి ఇదంతా చూస్తున్న తిలక్ ఉత్సాహం అంతా నీళ్లు కారిపోయి, రుమాలుతో మొహం తుడుచుకుంటూ సోఫా లో కూలబడ్డాడు. 'అయిదు రూపాయలిమ్మంటే వీల్లేదు పొమ్మన్న అమ్మ, పనివాళ్ళకూ నౌకర్ల కూ ఇంక్రిమెంట్లు ఎలా ఇచ్చేస్తుందో! పని వాళ్ళ పాటి చెయ్యలేదు కన్న కొడుకు! ప్చ్......' ఇలా ఆలోచిస్తున్న తిలక్ పేపరు వాడి కేక విని లేచాడు. మధ్య పేజీ లో రిజల్ట్స్ కనిపించేసరికి వేగంగా గుండె కొట్టుకోసాగింది. బెడురుబెడురుగా ఒక్కొక్క నంబరేచూసుకుంటూ వెళ్ళుతున్నాడు. మధ్య మధ్య పదేసి నంబర్లు కనిపించడం లేదు. కళ్ళు చీకట్లు కమ్ముతున్నట్లయింది. కంగారు కంగారుగా తన నంబరు కోసం వెతుకుతున్న తిలక్ ఉన్నట్టుండి ఆగి, 'నేను పాస్ అయ్యా" అని ఒక్క అరుపు ఆరిచాడు.
దొడ్డి వసారా లో పనిమనిషి కేదో పురమాయిస్తున్న కౌసల్య అస్పష్టంగా వినిపించిన ఈ కేకతో కంగారు పడింది. "ఏమిటిరా?' అంటూ వసారా లోకి వచ్చే లోగానే "అమ్మా" "అమ్మా" అంటూ రెండు మూడు కేకలు వేశాడు.
"ఏమిటిరా బాబూ! ఏం జరిగింది!" అంటూ వస్తున్న తల్లితో "కంగారు పడకమ్మ . నేను పాస్ అయ్యాను" అన్నాడు తిలక్. కౌసల్య అక్కడే నిలబడి పోయి, కొంచెం సేపు ఊరుకొని "నిజమే!" అంది ఆశ్చర్యంగా. "ఇదిగోనమ్మా-- కావలిస్తే చూడు ఇంకా నంబరు ." అంటూ పేపరు ఆమెకు అందించాడు. కౌసల్య తన కళ్ళతో చూశాక తృప్తి పడింది. పేపరు మళ్ళీ రెండు మూడుసార్లు చూసి 'వెర్రి నాయనా! నా చేత అనవసరంగా చివాట్లు తిన్నావు" అని తిలక్ జుట్టు నిమిరింది. తిలక్ కు కళ్ళ నీళ్ల పర్యంతం అయింది. 'అమ్మ ఎంత మంచిది!" అనుకున్నాడు.
"ఏం చెయ్యను నాయనా? కళ్ళన్నీ నీ మీదే పెట్టుకునీ, నా ఆశలన్నీ నీ చుట్టే పరుచుకునీ జీవిస్తున్నాను. నువ్వు పరీక్షలు పాసయి ఉన్నత చదువు ల్లోకి వస్తే , నా బాధంతా మరిచిపోయి , నేను పడిన శ్రమా చేసిన కృషీ ఫలించాయని సంతోషిస్తాను. గర్విస్తాను. ఫలానా పెరుమాళ్ళయ్య గారి మనవడు అని అంతా చెప్పుకోవాలి నిన్ను" అంది ఉద్వేగంతో.
"ఎప్పుడూ అమ్మా అలాగే అంటుంది. తనకు స్కూలు ఫైనలు లో జిల్లా హైస్కూళ్ల న్నింటి మీద ఫస్టు మార్కు వచ్చినప్పుడు ఎంత గర్వపడిందో, పి.యు.సి పోయిందని తెలిసినప్పుడు అంత క్రుంగి పోయింది. "దగ్గరుండి ఇక్కడ ప్రతి క్షణం చూసుకుంటూ చదివించుకున్నాను కనుక ఫస్టుగా పాస్ అయ్యాడు. కాకినాడ లో వాడు ఒక్కడు. చదువుతున్నాడో లేదో చూసేవాల్లెవ్వరూ ? సినిమాలు, స్నేహితులు-- ఇష్టం వచ్చినట్లు తిరిగి ఉంటాడు. అందుకే పరీక్ష పోయింది. ఇంకా వచ్చే ఏడు పాస్ అవుతాడు కదా -- అని వాడి కోసం కాకినాడ మెడికల్ కాలేజీ లో ఏడు వేలు డొనేషన్ కూడా కట్టేశాను. వాళ్ళ ధర్మమా అని పై ఏడు కి సీటు రిజర్వు చేశారు కాని లేకాపోతే ఏడు వేలూ గంగా ప్రవేశం." ఇలా ఏంతో ఇదయింది అమ్మ. ఇప్పుడు పాస్ అయ్యానంటే సంతోషించదూ?'
"మా నాయన పాస్ కాకపొతే ఇంకెవరు పాస్ అవుతారు? ఏదో ఆ ఏడు గ్రహ బలం బాగుండక పోయింది కాని" అంది.
తిలక్ వాచీ కేసి చూసుకున్నాడు. కౌసల్య నవ్వుతూ, "ఏం, మాట్నీకి వెళతావా? వెళ్లు. ఇదిగో పది రూపాయలు. సరిపోతాయా? మీ స్నేహితుల్ని తీసుకుని వెళితే వెళ్లు. వాళ్లకి టీ పార్టీ మాత్రం చేసేయ్యకు. రేపొద్దున్న ఇంట్లో ఏర్పాటు చేద్దాము" అంది. తిలక్ పది రూపాయల నోటు అందుకుని ఒక్క అంగలో వీధిలోకి వచ్చాడు. దొర ;లాగ వీధిలో నడిచి వెళ్లుతున్న తిలక్ ను చూసి, సంతృప్తి గా తనలో తాను నవ్వుకొని, ఇంతలో ఏదో శల్యం లా హృదయం లో మెదలగా కళ్ళ నీళ్లు పెట్టుకుంది. కాని వెంటనే పైట తో కళ్ళు ఒత్తుకుని, కింది పెదవి పంటితో నొక్కి పెట్టి, గంబీర్యంతో లోపలికి నడిచింది. అబ్బాయి విజయవార్త అందరికీ అందించడం కోసం.
