వారలా నవ్వుకుంటుండగా రాజ్ అటుగా వచ్చాడు. వారిని చూసి ఒక్క క్షణం అతని మనసు చివుక్కు మంది. కిలకిల నవ్వుతున్న వసంత తలెత్తి ముందుకు చూసి చేతిలో పుస్తకంతో ముందుకు పోతున్న రాజ్ ను చూసి నవ్వు ఆపేసి "శేఖర్" అంటూ లేచి అతని కోసం పరుగెత్తింది. "ఏం చూసి ఆ పుట్టుదరిద్రుడి వెంట పడుతుందిరా భాయీ" అన్నాడొకడు. అది వినీ విననట్లు ముందుకు పోయింది వసంత.
ఆమె పిలుపు విని అక్కడే నిలబడి పోయాడు రాజ్.
"నాన్నగారు రాత్రికి నిన్నోసారి వచ్చి పొమ్మన్నారు" అంది అతని దగ్గర చేరి.
"అలాగే వస్తాను" అని ముందు కడుగేశాడు రాజ్. అతన్ని అనుసరించింది.
"నువ్వు ప్రతి దినమూ ఇక్కడి కొస్తావా? అయితే నీవెంట నేనూ వస్తాను. ఆ రోగ్స్ తో విసుగు పుడుతోంది" అంది అతని మొహం లోకి చూస్తూ.
రాజ్ ఆ మాటలు విని 'నీ దృష్టి నా మీద కూడా పడిందా' అనుకోని "ఈ దినం ఊరికే వచ్చాను. అంతే" అన్నాడు.
"ఏం పుస్తకమది?' అని అతని చేతిలోని పుస్తకాన్ని తీసుకొని చూసి తిరిగి ఇచ్చి వేస్తూ "ఇంగ్లీషు లిటరేచర్ చాలా కష్టం కదూ?' అంది.
"ప్రయత్నిస్తే అన్నీ సులభమే అవుతాయి. ఆ. మరిచాను. నాకు వేరే పనుంది" అని ఆమె సమాధానానికి ఎదురు చూడకుండా గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగిపోయాడు.
వసంత నిట్టూర్చి సముద్రం వైపు చూసింది. అలలు నాట్యం చేస్తున్నాయి. 'అక్కడ నాతొ మాట్లాడుతూ కాలం గడపడానికి అంతమంది చస్తుంటే ఇతగాడికి నాతొ ఎక్కువగా మాట్లాడానికి గూడ ఇష్టం లేదు. ఆనందం అంటే ఏమిటో తెలియని మొద్దు' అనుకోని అక్కడే కూలబడింది.
రాత్రి ఎనిమిదవుతుండగా రాజ్, ఆనందరావు గారింటికి బయలుదేరాడు. హోటలు లో భోజనం చేసి, తిన్నగా అక్కడికి చేరుకున్నాడు. హల్లో ఎవరూ కనిపించలేదు.
"అయ్యగారూ లోపలున్నారా వెంకన్నా?' అని నౌకరు ను అడిగాడు.
"లేరు బాబూ! అమ్మాయి గారు మీరోస్తే పైకి పంపించ మన్నారు" అన్నాడు వాడు.
రాజ్, వసంత గది లోకి ఆడుగు పెడుతూ ఆమె ఏదో ఆలోచనలలో మునిగి ఉండడం గమనించి పొడిగా దగ్గాడు. అది విని 'రా, శేఖర్. కూర్చో" అని ఆహ్వానించింది వసంత.
"నాన్నగారు బయటి కెళ్లారా?"
"అసలు ఊళ్ళో నే లేరు. రైతులతో మాట్లాడెందుకు ప్రక్క పల్లె కెళ్లారు. రేపటికి గాని రారు. నేనే నీతో మాట్లాడాలని అలా చెప్పాను."
"నాతొ మాట్లాడవలసిన విషయాలేమున్నాయి?"
"చాలా వున్నాయి. ముందలా కూర్చో" అని అతని చేతిని పట్టుకొని అతన్ని కుర్చీలో కూర్చో బెట్టింది.
రాజ్ మౌనంగా ఆమె ఏం మాట్లాడుతుందోనని ఎదురు చూస్తున్నాడు. వసంత ఆ కుర్చీ చేతి పైని కూర్చొని రెండు చేతులు అతని భుజం మీద వేసి వాటి పై తన గడ్డం ఆనించి "శేఖర్, నేనంటే నీ కిష్టం లేదా?' అంది.
రాజ్ తీక్షణంగా ఆమెను చూసి ఆమె చేతులను తీసి వేస్తూ "నా ఇష్టాయిష్టాలతో నీకేం పని?' అన్నాడు.
'అంత కటువుగా మాట్లాడకు, శేఖర్! నాలో ఏం లోపం చూసి అంతగా అసహ్యించు కుంటున్నావు?"
"నిన్ను అసహ్యించు కొంటున్నానని ఎవరు చెప్పారు?'
"చెప్పక్కరలేకుండానే తెలుసుకో గలిగే విశయాలు చాలా ఉంటాయి."
అన్నింటి లోనూ అంత తెలివిగా ప్రవర్తిస్తే బాగుంటుందేమో!"
'అంటే?"
"ఒకరు చెప్పకుండా తెలుసుకోగలిగే వారికి ఇది వివరించి చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను."
"ఈ డొంక తిరుగుడు మాటలెందుకు మాట్లాడతావ్?'
"కొందరి జీవితాలే వంకరగా ఉంటాయి లే."
"నీ మాటలకేం గానీ , నే చెప్పేది విను. నువ్వు ఇక్కడే ఉండి చదువుకో. ఇద్దరం తోడుగా ఉందాం. కలిసి కాలేజీ కి కార్లో పోదాం. నాకర్ధం కాని పాఠాలు నువ్వు చెప్తుండు. ఇక్కడే హాయిగా ఉండచ్చు."
"నీకు డబ్బుంది. కాబట్టి బాగా చెప్పగలిగే లెక్చరర్లు చాలామంది ఉన్నారు. వారి దగ్గరికి ట్యూషన్ కు పొతే నాకు శ్రమ తగ్గించి నట్లుంటుంది. నీ ఉద్దేశ్యం నెరవేరినట్లుంటుంది. నా పాఠాలే చదువుకోలేని నేను నీకేం చెప్పగలను?'
"పోనీ, ఇక్కడే ఉండిపో. తోడుగా ఉందాం."
"ఇన్నాళ్ళ నుండి లేనిది ఈనాడు ఎందుకు కలిగిందో ఈ అపేక్ష!"
"చెప్పమంటావా?"
"నిరభ్యంతరంగా."
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను."
ఆ మాట విని లేచి నిలబడ్డాడు రాజ్. కిటికీ దగ్గరికి వెళ్ళి క్రింద నున్న తోటలోకి చూసి నవ్వు కొన్నాడు.
"అసలు ప్రేమంటే ఏమిటో చెప్పగలవా, వసంతా?"
"ఈ అర్ధం లేని ప్రశ్నలే వద్దన్నది."
"హు. ప్రేమంటే వెకిలి నవ్వులతో అందరినీ వెంటేసుకుని తిరగడమని నీ ఉద్దేశ్యం కదూ! అందరినీ ఆకర్షించుకొని వారి నేడిపిస్తూ వారు పడే అవస్థ చూసి ఆనందించడమే కాబోలు ప్రేమంటే నీ దృష్టిలో. నన్నూ వారిలో ఒకరిగా ఎంచు కొన్నావా?"
"శేఖర్!"
"ఎందుకలా గర్జిస్తావ్! ప్రేమ అనేపదానికి, నీబోటి వారికి భూమ్యాకశాలకు మధ్య నున్న దూరం లాంటిది. నీలాంటి వ్యక్తులు దాన్ని ఉచ్చరించడానికి గూడా అర్హులు గారు. ఎందుకు పవిత్రమైన ఆ పదాన్ని అపవిత్రం చేస్తావు?"
"శేఖర్, ఈ నిందా వాక్యాలు భరించ లేను."
ఇటు తిరిగి "ఎందుకు భరించ లేవు? నే నేమైనా నీ పైన అన్యాయపు నిందలు వేస్తున్నానా? నే చెప్పేది అబద్దమా? కేవలం నీ అందంతో కాలేజీ లోని యువకులను కవ్వించి ఆశలు రేకెత్తించి వారి నేడిపించడం అసత్యమా? ఎప్పుడూ నీ వినోదం కోసం షికార్లు, సినిమాలు తిరుగుతూ వారిని పాడు చేయడం నిజం కాదా? నీకు లొంగని వారిని చిలిపి మాటలతో, చేష్టలతో లొంగ దీసుకొని నీ పాదా క్రాంతులుగా చేసుకో ప్రయత్నించడం సత్యం కదా? చెప్పు. ఇందులో ఏది అబద్దమైనా చెప్పు, వసంతా! నీకేం తెలుసు? ఆ అమాయకుల హృదయాలు నీకపట ప్రేమతో ఎంతగా ఉప్పొంగినా , నిన్ను అందుకోలేక ఎంతగా తల్లడిల్లి పోతున్నాయో నీకు తెలుసా? రాత్రులందు నిద్రకు నోచుకోరు, తిండి సరిగా తినలేరు. కాలేజీ లో పాఠాలు సరిగా వినరు; ఎల్లప్పుడూ నీధ్యాసే; ఎప్పుడూ నిన్ను చూస్తుండాలని, ఎప్పుడూ నీ తియ్యని మాటలు వినాలని , నీతో ఆనందంగా కాలం గడపాలని తహతహ లాడుతుంటారు. నిన్ను ఎలా ఆకర్షించు కోవాలా అని, ఏం చేస్తే నువ్వు వారికి వశ మవుతావా అని, ఎంత అందంగా ప్రేమ లేఖలు వ్రాస్రే నువ్వు వారిని ప్రేమిస్తావా అనే ఆలోచనలతో బుర్రలు పగుల కొట్టుకుంటారు. అందులో నూరో వంతు తెలివిని, ఆలోచనను చదువు కుపయోగిస్తే ఫస్టు క్లాసు లో పాసవుతారు. నీకు తెలియదు వసంతా! నిద్రలో వారి గుండె లలో నాట్యం చేస్తుంటావు. వారి కళ్ళలో ఎప్పుడూ మెదులు తుంటావు. వారి జీవితాలను నాశనం చేస్తున్నావు. మనిషిని ఒకేసారిగా చంపడం లేదు కానీ హింసించి మరీ చంపుతున్నావు. ఇదేనా నువ్వు చెయ్య వలసిన పని? సెకండ్ బి.ఎ చదువుతున్నావు. ఎందుకు? నీ చదువు తగలేయ్యనా! నీ అందమనే లోయలో దాన్ని పారేశావా! వారి ఆవేదనను అర్ధం చేసుకోలేక పైగా ఆనందించే నీకు హృదయ మెందుకు? హు ప్రేమంటే తెలుసుకోలేని నువ్వూ ప్రేమిస్తున్నా నంటే నవ్వాలో, నీపై జాలి పడాలో తెలియడం లేదు" అన్నాడు ఆవేశంగా రాజ్.
"శేఖర్!' అంది వసంత ఏడుస్తూ చేతులతో మొహం కప్పుకొని.
"వసంతా, నీచుట్టూ తిరిగేవరిలో ఒక్కరినైనా నువ్వు అర్ధం చేసుకోగలిగావా! ఒక్కరినైనా ప్రేమించ గలిగావా?అని చేతకానప్పుడు వారి నేడిపించడమెందుకు? వారిలో నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావని పొంగిపోయే వారు ఉంటారు. నిన్ను భవిష్యత్తు లో తమ జీవిత భాగస్వామి గా ఎంచుకొని కలలు కంటారు. ఆ కలలు ఫలించవని తెలుసుకొన్న నాడు వారి హృదయా లెంతగా తల్లడిల్లి పోతాయో తెలుసా? వారిలోనే నీలాగే నటిస్తూ నీ వెంట తిరుగుతూ నీ అందాన్ని అస్వాదించి ఆనందించాలానే వాళ్ళు ఉన్నారు. వీలుకాకపోతే నిన్నూ, నీ అందాన్నీ నాశనం చేస్తారు. అది వారి తప్పు కాదు. అందుకు ఆస్కార మిచ్చిన నీదే తప్పు. ఇప్పటికైనా నువ్వు నీ ప్రవర్తన మార్చుకుంటే సంతోషం" అని తిరిగి కిటికీ వైపు మొహాన్ని త్రిప్పేసు కున్నాడు.
ఒక్కొక్క మాటా ఒక్కొక్క శూలమై గ్రుచ్చు కుంది వసంత కు. ఆ బాధతో గిలగిల లాడింది. ఆమె హృదయం. మెల్లిగా అతని దగ్గరకు చేరి అతని భుజం మీద వాలిపోయి , "నీకు తెలియదు, శేఖర్. నేను నిన్ను ఈ లోకం లో అందరి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు నా కోరిక నంగీకరిస్తే రేపటి నుండి దానికి స్వస్తి చెపుతాను. నా మాట నమ్ము." అంది.
వింత షరతు. క్రొత్త ప్రేమ ప్రమాణం.
భుజానికి చల్లగా తగలడం తో ఇటు తిరిగి ఆమెను లేవనెత్తాడు. ఆమె ఏడుస్తుంది. కాని, అతనికి జాలి కలుగలేదు.
"వసంతా, అది అసంభవం. నువ్వు నీ ప్రవర్తన మార్చుకోలేవు. మార్చుకోవాలన్న అదంత సులభం కాదు ఒక్క రోజులో. నేను నిన్ను ప్రేమించడమనేది అసాధ్యం. కలలోని మాట. కలలు నిజమయ్యే పరిస్థితి వస్తుందంటారు. కాని అదేన్నటికి సంభవించదు. నువ్వు నీ ప్రవర్తన మార్చు కొన్నప్పుడు అతి భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. వాటిలో చిక్కుకోవడం నా కిష్టం లేదు. కొండ చివరి నుండి పడబోతున్న రాయిని, విపరీతమైన గాలికి ఊగిస లాడే దీప శిఖను పట్టుకో లేము; ఆరిపోకుండా రక్షించ లేము. అసంభవ మైన విషయాలు జరిగినప్పుడు ఎన్నో నష్టాలు సంభవిస్తాయి. నేను నీకు ఇవ్వగలిగిన ఒక్క సలహా విను. నీ ప్రవర్తనతో మీ నాన్నగారు ఎంతగానో కుమిలి పోతున్నారు. నీ మిత్రులే నిన్ను అసహ్యించు కుంటున్నారు. నువ్వు ఇలాగే ఉంటె నీ జీవితమే పతనమై పోతుంది. అటువంటి పరిస్థితి రాకుండా, మేలుకొన్న నాడు నేను నిన్ను గౌరవిస్తాను. అంతకన్నా నేనేం చెయ్యలేను."
"శేఖర్, నా హృదయాన్ని గాయపరచ వద్దు. నిన్ను ప్రార్ధిస్తున్నాను. నీ హృదయంలో స్థానమిచ్చి నన్ను రక్షించు. లేకపోతె నేనేమై పోతానో నని భయంగా ఉంది. నా ప్రార్ధన మన్నించు." అని అతని కాళ్ళ పై పడి ప్రాధేయ పడింది.
"వసంతా! ఏమిటిది?" అంటూ ఆమెను లేవనెత్తి ఆమె కన్నీరు తుడిచి, "నేను నిస్సహాయుడ్ని. మొదట నీ యందు ఏర్పరచు కున్న నా అభిప్రాయాన్ని మార్చు కోలేను. నీ మనసు కష్ట పెట్టి నందుకు క్షమించు" అని అక్కడి నుండి త్వరత్వర గా బయటి కొచ్చేశాడు.
వసంత అలాగే ఏడుస్తూ గాయపడిన , దెబ్బ తిన్న మనసుతో ప్రక్కపై వాలిపోయింది. ఆమె అహం దెబ్బ తిన్నది. అంతగా ప్రార్ధించినా మన్నిచని రాజ్ పైన విపరీతామైన కోపం వచ్చింది. 'నన్ను ఇంతగా ఎదిపించావు. ఏనాటి కైనా ప్రతీకారం తీర్చుకొంటాను చూడు' అంది ఆమె హృదయం. మగజాతి పైనే కక్ష బూన మంది అవమానానికి గురైన మనసు.'
రాజ్ కలత పడిన మనసుతో గది చేరుకొన్నాడు.
"ఇంతవరకూ ఎక్కడి కెళ్లావన్నయ్యా?" అని అడిగింది అంతవరకూ అతని కోసం కాచుకొని ఉన్న సుగుణ.
"ఆనందరావు గారు పిలిపిస్తే వెళ్లానమ్మా" అని గదిలోకి పోయి పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నాడు. కానీ చదువు సాగలేదు. పుస్తకంలో ఆమె ఏడుస్తూ ప్రార్ధిస్తున్న రూపు కనిపించి కలవర పరుస్తుంది. తాను చాలా మూర్ఖంగా ప్రవర్తించానెమో ననుకున్నాడు. 'తన తిరస్కారణతో ఎంతగా విలపించి ఉంటుందో! ఎంతగా బాధపడిందో! ఎంతో ఆశతో తన కోరిక తెలిపింది. కాని అదెలా సాధ్యం? అసహ్యించుకొన్న ఆమెను తిరిగి ప్రేమించగలడా? అది సాధ్యమా! ఆమె గత చరిత్ర తనను బాధించదూ!"
"ఈ పాఠం అర్ధం కాలేదు. కాస్త చెప్పన్నయ్యా!' అంటూ వచ్చింది సుగుణ.
