
"అమ్మాయ్ వసంతా! ఎక్కడి కెళ్ళావు ఇంతవరకు?" రాత్రి పొద్దు పోయినాక వచ్చిన వసంత తండ్రి గద్దింపు విని ఉలికిపడింది. నోట మాట రాక అలాగే నిలబడి పోయింది.
"నిన్నే! ఏమిటి నీ రాత్రి పూట షికార్లు?' కోపంగా రెట్టించారు ఆనందరావు గారు.
వణికి పోయింది వసంత. ఇంతవరకు తండ్రి తనను పల్లెత్తు మాట అనలేదు. నేడింత కోపానికి కారణం? అని ఆలోచించింది.
"పలుకవెం?" గర్జించారు ఆనందరావు గారు.
ఏడుపొచ్చింది వసంత కు. ఆమె ఏడుపు చూచి ఆనందరావు గారు కోపం తుస్సు మంది. అమ్మాయిని బాధ పెట్టానే అని తల విదిలించి "ఊ, వెళ్ళు" అన్నారు. ఆశ్చర్యంగా పైకి వెళ్ళిపోయింది వసంత కళ్ళు తుడుచుకుంటూ.
ఉస్సురంటూ సోఫా లో కూలబడ్డారు ఆనందరావు గారు.
వసంత చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది. కానీ, తల్లీ తండ్రి తానే అయి పెంచి ఆ లోటును తీర్చాడు. అతి గారాబంగా పెంచి నందుకే ఇష్టం వచ్చిన రీతిగా పెరిగింది వసంత. ఆమె స్వేచ్చ కు ఎవరూ అడ్డు రాకూడదు. కష్టమంటే ఏమిటో తెలియకుండా పెరిగింది. తన కోరిక తీర్చుకోకుండా ఉండడమంటూ ఆమె కింత వరకూ లేదు. తన కిష్ట మైన పని చేసి తీరుతుంది. అందుకే పిల్లలు పెరిగి పెద్ద వారై సత్ర్పవర్తనులు కావాలంటే తల్లి శిక్షణ అవసర మన్నారు. కాని, తల్లీ, తండ్రి ఇరువురి శిక్షణ లేకనే బుద్ది మంతుడు గా పెరిగిన రాజ్ ను తలచుకొని గర్వపడ్డారు ఆనందరావుగారు.
వసంత కావలసింత ధనం ఉంది. అసాధారణ మైన అందమూ, ఆకర్షణా ఉన్నాయి. అందుకు తోడూ కట్టు దిట్టాలు లేని మనసు, అరికట్ట లేని వయసు చేదోడు వాదోడు అయ్యాయి. విచ్చల విడిగా సిగ్గు విడిచి తిరుగుతుంది. కాలేజీ లో. అంతులేని అందానికి ఆలంకరణ తోడైతే ప్రకృతి కి వసంత శోభ అమరినట్లుంటుంది. అటువంటప్పుడు ఆమె కాలేజీ లోని యువకుల నాకర్శించడం గొప్ప విషయం కాదు. ఆ ఆకర్షణతో వారితో ఆటలాడు కొంటుంది. ఆమె ప్రేరపణ లో పిచ్చి వారై ఆమె చుట్టూ తిరుగుతారు. వారిని ఏడిపిస్తూ ఆనందిస్తుంటుంది వసంత.
ఆడదాని అందం ఆమెకు శత్రువంటారు. ఆడవారి అందం మగవారిని పిచ్చి వారిగా చేస్తుంది. వారిని ప్రేరేపిస్తుంది. వారి చేత చేయరాని కృత్యాలను చేయిస్తుంది. యుక్తాయుక్త విచక్షణ లను నశింప చేస్తుంది. ఎందుకు? ఆ అందాన్ని ఆస్వాదించడానికేగా! అందుకై పోటీలు పడతారు. కలతలు పెంచుకుంటారు. నలుగురి లో నగుబాట్లు అయి చింతిస్తారు. అంతా ఆ అందాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించే వారే!
ఆడదాని అందం ప్రకృతి సౌందర్యం కాదు, ప్రతి ఒక్కరినీ సంతోష పరచడానికి. అది ఏ ఒక్కరికో అంకితం కాక తప్పదు. తామాశించిన అందం తమకు దక్కదని తెలిసినవాడు దాన్ని అందుకొని ఆస్వాదించలేని వాడు, దాన్ని నాశనం చేయ ప్రయత్నించేవారు కూడా ఉంటారు. చేతకాక పొతే ఏడుస్తారు. బలహీను లైతే ఆత్మ హత్యలకో, బలవంతు లైతే అఘాయిత్యాల కో పూను కుంటారు. ఆఖరకు తమ పగ, విజయం సాధించినా మిగిలేది ఒక్క బాధా, పశ్చాత్తాపం మాత్రమే.
అలనాడు ఆడదాని కోసం అన్నదమ్ములు కలహించారు. రాజ్యాలు పోగొట్టుకున్నారు. రక్తం కాలువ లై ప్రవహించింది. ఇలా అందరికీ బాధలు కలిగించి, పాపాలు చేయించి, తలవంపులు తెచ్చి, సుఖ శాంతులను దూరం చేసి, ప్రాణాలను బలిగా కొని, మానవత్వాన్నే మరపింపజేసే ఈ ఆడదాని అందం లేకుంటేనెమో! సృష్టి మునిగి పోతుందా? ప్రపంచం అంతరిస్తుందా? అసలు అడ మగ విభేదాలు ఎందుకు? మానవ సృష్టి కి తోడ్పడానికి! అది లేనినాడు మనమే ఉండం. ఏది ఏమైనా ఆడదాని ప్రభావం మగవారి పై చాల వరకు పని చేస్తుందన్నది సత్యదూరం కానేరదు. ఆ ప్రభావాని కేంతటి శక్తి ఉందొ ఊహించలేము. అది కనుక్కో గలిగిన వాడు ఈ సమస్యకే తావుండదు.
వసంత అందరినీ కవ్విస్తుంది. వెంట త్రిప్పు కుంటుంది. వారిని అట బొమ్మలుగా తలచుకొని వారితో ఆటలాడు కొంటుంది. బహుశా చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకొని ఆనందించ వలసినది మరచి పోయి ఇప్పుడు నెరవేర్చు కొంటుందా అనిపిస్తుంది. అయితే యువకులు అట బొమ్మల లాగే ఉండలేరు కదా! సజీవ మూర్తు లై సమయం వచ్చినప్పుడు తమ పనిని నిర్వర్తించుకొని పోవడానికి ఉద్యుక్తులవుతారు. కానీ, వసంత ఎవ్వరికీ అందకుండా దూరంగా తప్పించు కొంటుంది. అలా అందీ అందకుండా ఉండడం లోనే అంతులేని ఆనందం కలుగుతుందంటారు. కానీ, ఆ ఆటే దురదృష్టవ శాత్తూ ప్రమాదాలకు దారి తీస్తుందని కూదా గ్రహించగలిగితే బావుంటుంది. అందుకే ఆమెను ఆబల అన్నారు.
ఆనందరావు గారికి ఆ విషయాలన్నీ తెలిసినప్పటికీ కూతురిని దండించలేక లోలోనే కుమిలిపోతూ ఏనాటి కైనా ఆమె తన ప్రవర్తన మార్చు కొనక పోతుందా అని ఆ శుభ క్షణం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు.
రాజ్ కాలేజీ లో ఆమె ప్రవర్తన చూస్తుంటాడు. అతని మదిలో ఆమె పట్ల అసహ్యం పెరుకోంది. అంతకంటే ఆమె పై జాలి ఎక్కువగా కలుగుతుంది. తన శ్రేయోభిలాషి కుమార్తె అలా అయిపోతున్నందుకు బాధ పడతాడు. కానీ, ఆమెకు చెప్పే ధైర్యం అతనిలో లేదు. అతనికి తెలుసు, ఆమె చుట్టూ తిరిగే వాళ్ళ బుద్దు లేలాంటివో! వారంతా సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఆమెను, ఆమె అందాన్ని పీల్చి పిప్పి చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వసంత ను చూసి అప్పుడప్పుడు భయం కలుగుతుటుంది. కానీ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆనందరావు గారితో నైనా చెప్పి ఆమెకు భయం పెట్టించాలనుకుంటాడు. కాని వారితో చెప్పగలిగే ధైర్యం , స్తోమతు తనకు లేవని ఆ ఉద్దేశ్యం మార్చుకున్నాడు. ఒకవేళ చెప్పినా అది ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఊహించడం కష్టమని భావించాడు.
"వసంతా! నా హృదయం నీ కర్పించాను. స్వీకరించి నన్ను క్రుతార్ధుడిని చెయ్యి" అంటూ తన పాదాల పై సంపెంగ పూలను గుమ్మరించిన అతడిని చూసి కిలకిల నవ్వింది వసంత. ఆ నవ్వు అతని గుండెలలో మృదంగం వాయించినట్లయి "ధన్యోస్మీ" అన్నాడు.
"మూర్తి, ఏమిటి నీకీ పిచ్చి?' అడిగింది వసంత.
"నిజమే , వసంతా. నీ అందం నన్ను పిచ్చి వాడిని చేసింది. నువ్వు నిరాకరిస్తే పిచ్చాసు పత్రే గతి."
"చాలా బావుంటుంది. నువ్వు అందులో చేరితే నేను ప్రతి దినమూ వచ్చి నిన్ను పలుకరించి పోతుంటాను."
'అంతటి అదృష్టానికి నోచుకుంటే ఈ జీవితానికి అంతకంటే కావలసిందేముంది?"
"నీ వాగుడు కట్టి పెట్టి నేనొక ప్రశ్న అడుగుతాను చెప్తావా?'
"నాకు ప్రేమ పరీక్ష పెడుతున్నావా! ఒకటి కాదు, లక్ష ప్రశ్న లడుగు. జవాబులు చెప్పి కధల్లో రాజకుమారుడు సప్త సముద్రాలు దాటి రాజకుమారి ని చేజిక్కించుకొన్నట్లు గా నేను నిన్ను దక్కించుకొంటాను."
"నీ మొహానికి అదొక్కటే తక్కువ' అనుకోని "కాలేజీ లో మీ మగవారికి నాపై గల అభిప్రాయమేమిటి?" అంది.
"చెప్పనా? నువ్వు మాకు ఒక దేవతవు. వెయ్యేండ్లు తపస్సు చేసినా ప్రసన్నం కాని వర దేవతవు. నువ్వు లేనినాడు అసలు కాలేజీ కే విలువ లేదు. అంతకంటే నేనేం చెప్పలేను. చూడు నీ చెక్కిలి కవ్విస్తుంది. నీ నవ్వు పిచ్చి వాళ్ళను చేసి మమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తుంది. నీ పెదవులు కదులుతుంటే అందుకొమ్మని పిలిచి నట్లుంటాయి. అసలు నీ అందాన్ని చూసి ఆనందించ లేని కళ్ళు కళ్ళు కావు. హృదయం హృదయమే కాదు.' అని ఆమె భుజం పై చేయి వేసి ఆమె మొహం పైకి వంగాడు.
వసంత కోపంతో అతన్ని నెట్టి వేస్తూ "మూర్తి, ఇలాంటి తిక్క పనులు చేశావంటే మర్యాద దక్కదు. నాకు కోప మోస్తుంది జాగ్రత్త." అంది.
"నో, నో, మిస్ వసంతా! నువ్వు కోపగించుకొనవలసిన అవసరం లేదు. నిండు చూపులతో ఒక్క తీక్షణమైన బాణం లాంటి చూపు విసిరితే చాలు; అదే మమ్మల్ని చంపేస్తుంది." అంటూ మరో యువకుడు అప్పుడే వచ్చి ఆమె ప్రక్కనే కూర్చున్నాడు.
వసంత కాస్త దూరంగా జరిగి "ఓ! నువ్వా, రంగా" అని చిరునవ్వు విసిరింది. తరించందీ జన్మ అనుకొన్నాడాతడు.
'మా ఏకాంతానికి నువ్వెక్కడ దాపురించావురా , దుర్మార్గుడా! అనుకోని నోటికి వచ్చిన తిట్లు బయటికి వినపడకుండా తిట్టుకొన్నాడు మూర్తి. అక్కడి నుండి లేచి వెళ్లి పోవాలనుకొన్నాడు. కాని, తాను లేనప్పుడు ఆ నీచుడు ఏమైనా చేస్తే? అందుకని ఆ ప్రయత్నం విరమించుకొని అక్కడే కూర్చున్నాడు. ఒకరి వైపోకరు కొరకొరా చూసుకొన్నారు. అది చూసి నవ్వుకోండి వసంత. అతని రాకతో మనసు దిటవుపరచు కొంది. తానొక్కతే ఉన్నప్పుడు మూర్తి ఏం చేస్తాడో అని భయపడింది. కాని వారిద్దరూ కావడంతో ధైర్యంగా కూర్చో గలిగింది. అలా చాలామంది ఉండడమే ఆమెకు కావలసింది. అప్పుడు నిక్షేపంగా ఉండవచ్చు. అదే ఆమెకు కావలసింది.
మరి కొద్ది సేపట్లో మరికొందరు సభ్యులు అక్కడికి జహారయ్యారు. వారందరి చిలిపి మాటలతో, జోక్స్ తో ఒకరి కన్నా మరొకరు ఆమె చేత ఆకర్షించబడాలని వారు పడే బాధ చూసి తృప్తిగా నవ్వుకొంది. అదీ ఆమె దైనందిక కార్యక్రమం.
