Previous Page Next Page 
వాసన లేని పూలు పేజి 3

              
                                     2
    ఇంటికొచ్చేటప్పటికి ప్రాణ స్నేహితుడు కాలేజీలో ఒక సంవత్సరం సీనియరూ ఐన రెడ్డి వచ్చి కూర్చుని ఉన్నాడు.
    "ఎంత సేపైందిరా వచ్చి? మా అప్పల్రాజు గాడు కాస్త కాఫీ ఐనా ఇచ్చాడా లేదా?" అన్నాడు రాజు హుషారుగా.
    "మనకు సంకోచమనేది మైక్రో స్కోపు కింద పెట్టి చూసినా కనుపించదుగా. అడిగి మరీ ఇప్పించు కొన్నాను. సరే గాని.... అదేమిట్రా నువ్వు లైబ్రరీ లో ఉన్నట్టుండి మాయమయ్యావ్?"
    రాజు అంతర్యం లోంచి ఉబికి వస్తున్న ఉత్సాహాన్ని అణిచి పెట్టుకుంటూ "ఉండరా బాబూ, కాస్త కాళ్ళూ, ముఖం కడుక్కొని తర్వాత సినిమా కెళ్దాం....అప్పుడు చెప్తాను అన్నాడు.
    రెడ్డి ఇక బలవంతం చెయ్యలేదు. అప్పల్రాజు వడ్డించగా ఇద్దరూ అక్కడే భోజనం చేసి ఓ అరగంట ఆ కబురూ ఈ కబురూ చెప్పుకొని సినిమాకు బయలుదేరారు.
    అప్ లాండ్స్ వీధులన్నీ దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి. తారు రోడ్డ్ల మడ్డి నలుపు -- అందులో తమ ఉనికి తెలియజెయ్యాడానికి ఎంతో అవస్థ పడుతున్న మున్సిపాలిటీ గుడ్డి లైట్లు, నిశీధి సమయం -- నిర్జనమైన రోడ్డు -- పగటి వేళ మాటలు దొరకని మనోభావాలకు చక్కని వాగ్రూపం కనుపించే సమయం, చలిగాలికి గూడలు బిగాబట్టుకుని పాంటు జేబులో చేతులు పెట్టుకొని స్నేహితులిద్దరూ నిరంతరంగా కనిపిస్తున్న యూనివర్శీటీ రోడ్డు వెంట నడక సాగించారు.
    "రిక్షా ఎక్కుదామా?"
    "వద్దు. ఇంకా చాలా టైముంది గా . నడిచే వెళ్దాం." స్వప్న లోకం లోంచి మాట్లాడాడు రాజు.
    రెడ్డి ఆలోచిస్తున్నాడు. సహజ గంబీరుడైన తన స్నేహితుడు ఈనాడు ఇలా మనో వికారానికి గురి కావటం అతనికి తక్కువ ఆశ్చర్యాన్నేమీ కలిగించలేదు. దానికి కారణమేమైనా గాని, సాధారణమైనది మాత్రం అయి ఉండదు. అదేదో తెలుసుకోవాలన్న ఉత్కంట అతనిలో ఎక్కువైంది. "ఏమిటో ఆకాశం లో తెలిపోతున్నావ్....అసలేం జరిగిందేమిటి?" అన్నాడు రెడ్డి.    
    రాజు వెంటనే సమాధానం చెప్పలేదు. లోలోపల ఉక్కిరిబిక్కిరై పోతున్నాడు. చాలాసేపటికి "ఇవ్వాళ ఒక అమ్మాయితో పరిచయమైందిరా" అన్నాడు.
    రెడ్డికి నవ్వాగ లేదు. "ఓరి నీ దుంప తెగ. సస్పెన్సు లో పెట్టి చంపేశావ్ పో. నీ సంతోషం చూసి మీ నాన్నగారు మినిష్టరయ్యారేమో ననుకోన్నాను సుమా! గొప్ప ఘనకార్యమే చేశావ్. ఈ విశాఖపట్నం లో తలుచుకోవాలే గాని, ఒక్కతే కాదు, వంద మందితో పరిచయం చేసుకోవచ్చు. అది అంత అపూర్వమైన విషయమేమీ కాదు."
    "కాకపోవచ్చు, కానీ ఈ అమ్మాయి ఆ వంద మందిలో ఒకతే మాత్రం కాదు.... ఎవరిలోనూ లేని విశిష్టత ఈ అమ్మాయిలో ఉంది."
    "ఏం, దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సరసా ఏమిటి?"
    "అప్సరసంటే నాకున్న అభిప్రాయం వేరు. కవులు వర్ణించినట్లుగా చంద్రుని లాంటి ముఖం చేపల్లాంటి కళ్ళు, తూనీగ లాంటి నడుమూ -- అవన్నీ ఏమీ లేవు. అంత అందమైనదీ కాదు. మనిషి రంగు కూడా నలుపే కాని ఆ అమ్మాయిలో ఏదో అనిర్వచనీయమైన అందం. ఆకర్షణా ఉన్నాయి ఆ కళ్ళు-- నోరు విప్పకుండా కళ్ళతోనే ఎన్ని మాటలైనా చెప్పగలదు తెలుసా?
    "ఐతే అదేదో సినిమాలోలా నల్ల పిల్లన్న మాట. కొంపదీసి ప్రేమించావా ఏమిటి?"
    స్నేహితుని ఎగతాళి మాటలకు రాజు బాధపడ్డాడు. నేనే ఉద్దేశ్యంతో చెప్తున్నానో ఈ మూర్ఖుడు అర్ధం చేసుకోడేమిటి అనుకొన్నాడు మనసులోనే. నాకేమీ తెలియదనుకోకు రెడ్డి ప్రేమంటే నీ నిఘంటువు లో ఉన్న అర్ధంలో ఆ అమ్మాయిని ప్రేమించడం లేదు. కేవలం ఆ అమ్మాయిలో ఎటువంటి ఆకర్షణ ఉందొ చెప్తున్నాను. అంతే . వీలైతే ఆ అమ్మాయితో పరిచయం ఇంకా పెంచుకోవాలను కుంటున్నాను. మనం చదువు కొన్నవాళ్ళం. ఆ అమ్మాయి కూడా చదువు కున్నదే. ఇందులో తప్పేముంది చెప్పు!"
    రెడ్డి కూడా స్నేహితుని మనసు నొప్పించి నందుకు బాధపడసాగాడు. రాజు వట్టి సెంటిమెంటల్ ఫూల్. ఆ సంగతి రెడ్డి కి బాగా తెలుసు. తెలిసి కూడా తానె తొందరపడి అతని మనసు నొప్పించాడు. ఆ తప్పు దిద్దుకోవటానికి ప్రయత్నిస్తూ "నిజమే, అందులో తప్పేమీ లేదు. మన మంతా చదువుకున్న వాళ్ళం. ఇంతకూ ఎవరా అమ్మాయి?" అన్నాడు.
    "పేరు తెలియదు."
    రెడ్డి నవ్వి "బాగానే ఉంది....నాకు కాళ్ళు నొప్పెడుతున్నాయి. రిక్షా పిలుద్దామా?"
    రాజు అన్యమనస్కుడై 'సరే" అన్నాడు.
    స్నేహితులిద్దరూ రిక్షాలో కూర్చుని మౌనంగా సినిమా హాలు వైపు ప్రయాణం చేస్తున్న ఆ సమయలోనే, హార్బరు సమీపంలో నున్న ఒక చిన్న పెంకుటింటి వరండాలో పడుకుని, ఆకాశంలో మినుకు మినుకు మంటున్న నక్షత్రాల కేసి చూస్తూ ఆలోచిస్తోంది వనజ. హాస్పిటల్ నుంచి వచ్చి తమ్ముడు ప్రకాశానికి, తనకూ నాలుగు మెతుకులు వండుకోటానికి ఇంతసేపు పట్టింది. తనకు ఇంటి పని బొత్తిగా చేతకాదు. అక్కయ్య వుంటే స్కూలు నుంచి వచ్చి ఇంట్లో పనంతా ఒక్కర్తే చేసుకొనేది. తనకు ఏ పనీ చెప్పేది కాదు. ఇప్పడు అక్కయ్య హాస్పిటల్ లో ఉంది. అలవాటు లేని ఇంటి పని చెయ్యాలంటే వనజ కు విసుగ్గా ఉంది. పైగా ఇంట్లో ఒక వస్తువుంటే మరొకటి లేదు. ఇవ్వాళ బజారు నుంచి కూరగాయలు తెద్దామంటే డబ్బు లేదు. ఒకటో తారీకున అక్క తెచ్చిన జీతమంతా మందులకూ, మాకులకూ ఎప్పుడో ఖర్చై పోయింది. అక్క హాస్పిటల్ నుంచి బయట పడేదేప్పుడో -- అంత కాలం ఈ సంసారం గడపటం ఎలాగో ఆ భగవంతుడికే తెలియాలి. అసలు అక్క కొచ్చే నూట ఇరవై రూపాయల్లో తిండి, బట్టలు పుస్తకాలూ అక్క ఎలా గడుపు కొస్తుందో నన్న ఆలోచన వనజకు -- ఇప్పుడు-- అక్క హాస్పిటల్లో చేరి సంసార భారం తన మీద పడ్డాక ....కలుగుతోంది. ఈ పది రోజుల అనుభవంతో ఆలోచిస్తే అది కేవలం అసంభవ విషయంగా తోచింది కాని అక్కయ్య తన పొదుపుతో ఆ అసంభవాన్ని సంభావంగా చేసి చూపెడుతూ ఉంది. తనకు గాని తమ్ముడు ప్రకాశానికి గాని ఎప్పుడూ ఏ లోపమూ కనుపించనీయలేదు. ఆ విధంగా ఎలా సర్దు కొస్తుందో అక్కయ్య కే తెలియాలి. ఐనా ఏమిటో ఈ దౌర్భాగ్య జీవితం ? దీనికి అంతం లేదు కాబోలు. ఎన్నటికీ ఎదుగూ బొదుగూ లేని జీవితం. వ్యధిత హృదయంతో ఆలోచిస్తూ, ఆ చలిలో, అలాగే కళ్ళు మూసుకొని వైరాగ్యంలో పడిపోయింది వనజ.
    అలా ఎంతసేపు గడిచిపోయిందో , పక్కింటి వాళ్ళు సినిమా చూసి కాబోలు పిల్లా జేల్లాలతో రిక్షాలు దిగి పెద్దగా నవ్వుకొంటూ తమ పోర్షను లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ చంటి పిల్ల ఒకటే ఏడుపు . వనజ ఊహ స్రవంతి ఆగిపోయింది. ప్రకాశం ఎక్కడి కెళ్ళాడో ఏమో ఇంతవరకూ ఇంటికి రాలేదు. వీడొకడు! అక్కయ్య హాస్పిటల్లో చేరిం దగ్గర్నుంచీ భయమూ భక్తీ లేకుండా తిరుగుతున్నాడు. రాత్రి ఎంతకూ ఇంటికి రాకపోయేసరికి వాడి కోసం భోజనం వడ్డించి మూత పెట్టి వుంచింది.
    వనజ లేచి కూర్చుని బద్దకంగా ఆవులించింది. ఆ రాత్రి కింకా చెయ్యాల్సిన పనులేమైనా ఉన్నాయేమోనని ఆలోచించ సాగింది. చీరే సంగతి గుర్తొచ్చింది. కట్టుకున్న చీరే మాసిపోయింది. అన్నిట్లోకి అదే కాస్త మంచిది. ఆ చీరే తోనే రేపు హాస్పిటల్ కెళ్ళాలి కాబోలు. భగవాన్..... భగవాన్....ఎందుకీ శిక్ష...
    విసుక్కుంటూ లేచి అ చీరే విప్పి బకెట్టు లో నాన వేసింది. అంతలో ప్రకాశం వచ్చాడు జంకుతూ.
    "ఎక్కడి కెళ్ళావురా ఇంతసేపూ?" వనజ కోపంతో అడిగింది.
    "జింఖానా క్లబ్బులో సినిమా చూస్తుంటే ఆలస్యమై పోయిందక్కా. టికెట్టు లేదు కదా అని....ఉండిపోయాను. మనం సినిమా చూసి ఎన్నాళ్ళో అయింది కదక్కా?' జాలిగా అన్నాడు ప్రకాశం.
    వనజకు కోపం పోయి సానుభూతి కలిగింది. తోటి పిల్లలంతా సర్దాగా సినిమాల కేళ్తుంటే పాపం, వాడి మనసెంత బాధపడుతుందో?
    "సరేలే, అన్నం ప్లేటులో పెట్టి ఉంచాను, వెళ్ళి తిను."
    ప్రకాశం తిట్లు తప్పినందుకు బ్రతుకు జీవుడా అనుకొంటూ వంటింట్లో దూరాడు. వనజ నిండా ముసుగు తన్ని మళ్ళీ పడుకుంది. కాని నిద్ర వచ్చే సూచనలేమీ కనుపించలేదు. మనసంతా గ్లానితో నిండిపోయింది. రాజు గుర్తొచ్చాడు. వెంటనే వనజ మనస్సు కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. ఆరోజు అతన్ని కలుసుకొన్నప్పటి నుండీ -- ఏదో పెద్ద అండ దొరికినట్లు -- ధైర్యం కలుగుతోంది. అతని వల్లనే అక్కయ్య ఆపరేషను కు ఒప్పుకొంది. హాస్పిటల్లో డాక్టర్ల అంతా అతనికి తెలిసే వుంటారు. అంతా సవ్యంగానే జరిగిపోవచ్చు. హటాత్తుగా ఆ అబ్బాయి కలవటం ఎంత అదృష్టం?
    భోజనం చేసి ప్రకాశం లోని కొచ్చాడు. అక్క నిద్రపోతుందనే అభిప్రాయంతో చీకట్లో నే అటూ ఇటూ వెతకసాగాడు పక్క బట్టల కోసం. ఎక్కడా కనిపించలేదు. చివరకు లైటు వేశాడు. వనజ కళ్ళు తెరిచే ఉండటం చూసి "రేపు స్కూలు ఫీజు కట్టాలక్కా" అన్నాడు.
    "సరేలేరా రేపు చూద్దాం గాని బయట తలుపు గడి వేసి వచ్చి గొడవ చెయ్యకుండా పడుకో" అన్నది వనజ. ప్రకాశం తలుపు వేసి వచ్చి లైటు అర్పి వేసి మరుక్షణం లోనే గురక పెడుతూ నిద్రపోసాగాడు.
    మర్నాడు వనజ మేలుకొనే సరికి చాలా ఆలస్యమైంది. ఇంట్లోని పని ఎంత తొందరగా చేసినా ఎనిమిదై పోయింది. రాత్రి నానవేసిన చీరే అరి, ఇస్తీ చేసుకొనే ప్పటికి మరి కొంత ఆలస్యం. ఫ్లాస్కు లో కాఫీ పోసుకొని హాస్పిటల్ కు చేరేసరికి పది గంటలైంది.
    "ఇంటి పనంతా ఎలా చేసుకొంటున్నావమ్మా?" పంతులమ్మ ప్రశ్నించింది ప్రేమగా చెల్లెలి తల నిముర్తూ.
    "ఫర్వాలేదక్కా . అంత కష్టంగా ఏమీ లేదు" గ్లాసులో కాఫీ పోసి అక్క చేతి కందిస్తూ "ఇవ్వాళ ఆ అబ్బాయి రాలేదా అక్కా?' అన్నది.
    "ఎవరు -- రాజాఇప్పటి వరకూ ఇక్కడే ఉన్నాడు. టైమైందని కాలేజీ కి వెళ్ళాడు. చాలా మంచి వాడమ్మా. నా విషయం లేడీ డాక్టర్ తో చెప్పాడు. ఆవిడ రాజు వాళ్లకు దగ్గర బంధువల్లె ఉంది. ఈ సమయంలో నా అదృష్టం కొద్దీ ఆ అబ్బాయి దేవుడల్లె వచ్చాడు. ఇప్పుడు నన్నిక్కడ ఎంత శ్రద్దగా చూస్తున్నారో తెలుసా?"
    "పోనీలే అక్కా. ఎలాగో ఈ గండం గడిచి బయటపడితే అంతే చాలు.
    "ఇంకేం భయం లేదమ్మా. రాజు వచ్చిందగ్గర్నుంచి నాకు ఎంతో ధైర్యంగా ఉంది. ఇక్కడ నుంచి క్షేమంగా బయట పడగల ననిపిస్తుంది."
    రాత్రి తనకూ అవే ఊహలు కలిగాయి. ఇప్పుడు అక్కయ్యా ఆ మాటే అంటుంది. అమాయకుడు, స్నేహశీలుడూ ఐన రాజు ముఖం ఒక్క క్షణం వనజ కళ్ళ ముందు మెదిలింది. ఆమె కాసేపు మౌనం వహించి ప్రకాశం స్కూలు ఫీజు కట్టాలంటున్నాడక్కా. నువ్విచ్చిన డబ్బు అంతా ఖర్చై పోయింది." అన్నది కొంచెం సందేహిస్తూనే.
    వనజ అనుమానం నిజమే అయింది. పంతులమ్మ చెల్లెలి వేపు నుంచి దృష్టి మరల్చు కొంది. బహుశా ఒకటి రెండు కన్నీటి బొట్లు కూడా రాలి ఉండవచ్చు! వనజ వెంటనే తన తప్పు తాను తెలుసుకొని "పోనీలే అక్కా, అవన్నీ తర్వాత చూసుకొందాం లే" అన్నది.
    పంతులమ్మ చెల్లెలి మాటలు వినిపించుకోలేదు. "నాకు తెలుసమ్మా. ఆ కొంచెం డబ్బు ఎప్పుడో అయిపోయి వుంటుంది. కాని ఏం చేస్తాం! అదృష్ట హీనులకే వస్తాయి అన్ని కష్టాలూను ఆ ఆనందరావన్నా కనిపిస్తే ఓ వంద రూపాయలు అప్పు అడుగుదామనుకున్నాను. అతనూ రాలేదు. ఈ సంగతి అతని కింకా తెలియలేదేమో తెలిస్తే వచ్చేవాడే.
    "ఆనందరావునా, ఎందుకులే అక్కా అతన్నడగటం?"
    "మరేం చేస్తామమ్మా. మనకు వేరే మార్గమే ముంది చెప్పు." అన్నది పంతులమ్మ బాధగా అది సమాధాన్ని ఆశించి వేసిన ప్రశ్న కాదు అందుకే వనజ అక్కకు సమాధానమేమీ ఇవ్వలేదు. రోగి చేతిని మృదువుగా నిమురుతూ అలాగే కూర్చుండి పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS