Previous Page Next Page 
తప్పు పేజి 3

 

    అతను కొంచెం దూరం జరిగాడు. తూర్పు గోదావరి లో కుగ్రామం లో వున్న అతడు జమీందారీ వంశపు యువకుడు. విశాఖపట్టణం లో మేనమామల యింట వుండి కాలేజీ చదువులు చదువు కుంటున్నాడు. అతని తాతముత్తాతలు జమీందార్లు. ఆ యింట యింతవరకూ సంస్కృతం చదివిన వారూ, వేదాల్ని అధ్యయనం చేసినవారే తప్ప ఇంగ్లీషు చదువులు చదివినవాళ్ళు లేరు. తండ్రి అతడిని ముచ్చటపడి యింగ్లీషు చదువు  చదివించేందుకు యింతదూరం పంపాడు. పంపినా అతను కొడుకుని పిలక కత్తిరించుకోమని చెప్పలేదు. యజ్ఞోపవీతాన్ని తీసివేయ మనలేడు. నుదుట గంధపు చుట్టూ క్రింద సిందూరాన్ని చెరిపి వెయమని కూడా అనలేదు. అయన నిష్టా గరిష్టుడు. కొడుకుని కూడా అదే విధంగా తన శాసనంతో బ్రహ్మణ్యానికి కళంకం రాకుండా పెంచాడు. పెంచుతున్నానని అయన అనుకున్నాడు. గౌరీ పతి యింటికి వెళ్లినప్పుడు తండ్రి అభిప్రాయాలకి యెన్నడూ నీరుపోసి యెరుగడు. ఎమ్. ఎస్సి చదువుతున్న తన కొడుకు చదువుకు తప్ప నాగరికత కు ప్రాముఖ్యత కి యివ్వలేదని క్రీగంట గమనిస్తున్న ఆ తండ్రి మురిసిపోయాడు. చాతీ మీద చేతిని వేసుకుని భార్యతో తన పుత్ర రత్నాన్ని గురించి గర్వంగా చెప్పుకునే వాడా వృద్దుడు. సోమయాజులు గారి భార్య ఘటికురాలు. యింట వుల్లిపాయ పోపు వాసనే యెరుగని కొడుకు పై వూళ్ళో యెంతవరకూ అత్మసాక్షిగా బ్రతుకుతున్నాడో అంచనా వేసుకునేందుకు తాపత్రయపడేది. గౌరీపతి యేది చేస్తున్నా ఆవిడకి కొంత అసహజంగానూ, కృత్రిమంగా నూ తోచేది. భర్తతో ఈ విషయం ఎత్తినప్పుడు అయన ఆవిడ మాటల్ని కొట్టి పారేస్తూ 'యెందుకోయ్ అంబా నీకు నా కొడుకంటే అంత వలపక్షం.' అనేవాడు.
    గౌరీపతి మనో నేత్రాల ముందు ఈ సంఘటన లన్నీ ఒక్కసారి కదిలాయి. అతను మరోసారి అన్నపూర్ణ వైపు చూశాడు. ఆ పిల్ల యిదివరకటి కన్నా అందంగా, యౌవ్వనం లో ప్రకృతి వేసిన ముద్రకి స్త్రేత్వాన్ని జత చేసుకుని మిస మిస లాడిపోతోంది. బేలగా అర్ధిస్తున్న ఆ దీనురాల్ని వుద్దేశించి ఏదో దారి చూపించాలనే తాపత్రయం అతన్ని అణువణువున దహించి వేయసాగింది.
    'చెప్పు గౌరీ పతీ, ఆడదానికి సమాజం యిలాంటి పనులు చేస్తే యేపాటి గౌరవం యిస్తుందో నీకు తెలీదూ. పుట్టబోయే బిడ్డకి తండ్రి యెవరు? అనే ప్రశ్నకి సమాధానం యేమనియివ్వను?'  ఆ పిల్ల మాటలు రంపపు కోతల్లా అతన్ని చీల్చి చెండాడుతున్నాయి. ఆ క్షణం లో అతడికి సమాజం పట్ల నిరసన భావం కలిగింది. చదువుతున్న చదువుని అపుజేసి పరారి అయిపోవాలని పించింది. అన్నపూర్ణ ని వెంట తీసుకుని సువిశాల భారత భూభాగంలో యెక్కడైనా కాయకష్టం చేయాలనిపించింది. అతని హృదయం లో చెలరేగిన అలజడి ఒక విధంగా గుండెల్ని వజ్రసదృశం చేసింది. ఆ క్షణాన భీరువు వలె  పారిపోవడం ధర్మం కాదని తోచింది. అతను లేచి నిలుచున్నాడు. రెండు చేతులూ చాపాడు. అతడి బాహువుల్లో వొదిగిపోయిన అన్నపూర్ణ కి స్వర్గ ద్వారాలు తనకోసం తెరిచినట్లయింది. కాపుల పిల్ల అయినా తండ్రి తల్లీ ప్రోద్భలం వల్ల అతనితో బాటు కాలేజీ లో చదువు కుంటున్నది. ఆమె ఊహాగానం విను వీధుల్లోకి సాగిపోసాగింది. అతను అండగా నిలబడుతూ హామీ యిచ్చాడు. నిశ్చింతగా గృహోన్ముఖురాలైంది.

         

                                       2
    తానొకటి తలుస్తే దైవం మరొకటి తలచడం యుగయుగాలుగా జరుగుతున్నదే. నిమిత్త మాత్రుడైన మానవుడు ఆశలు పెంచుకుని ఆకాశ సౌధాలు నిర్మించడం సహజం. యే పెను తుఫానులకో, మరే ఝుంఝుమారుతాలకో ఆ సౌధాలు నేలమట్టం అయిపోగానే విచిత్రంగా నలిగి పోతాడు.
    గౌరీపతి మేనమామల యింటికి వెళ్ళాడు. రెండురోజులు తిరగక మునుపే తండ్రి మంచం మీద అవసానదశలో వున్నట్లు టెలిగ్రాం రాగానే నిర్ఘాంత పోయాడు. అన్నపూర్ణ కి చెప్పి వెళ్ళిండుకు కూడా అతనికి వీలు చిక్కలేదు. మేనమామలు అతడిని అనుక్షణం అంటి పెట్టుకునే వున్నారు. అతనితో బాటు పెద్ద మేనమామ బయలుదేరాడు.
    మనసుని విశాఖపట్టణం లోనే ఉంచి అతను బయలుదేరాడు శరీరాన్ని మేనమామతో బాటు తీసుకుని. గోదావరి దాటి అతను పేరూరు చేరుకునేసరికి పరిస్థితులు అతడిని తికమక పెట్టాయి. తండ్రి అరుగు మీద కూర్చుని శ్లోకాల్ని వల్లే వేస్తూ యజ్ఞోపవీతాన్ని వడుకుతుంటే బండి దిగిన గౌరీపతి నిశ్చేష్టుడయ్యాడు. తలెత్తి మేనమామ వైపు చూడగానే అతను దృష్టిని తప్పించుకున్నాడు.
    కొడుకునీ బావమరిదిని లోపలికి ఆహ్వానించి సోమయాజులు గారు కుశలం అడిగారు. టెలిగ్రాం విషయం యెంత బూటకం అయిందీ అప్పుడు గానీ బోధపడలేదు గౌరీ పతికి. తండ్రి, మేనమామ, తల్లీ అందరూ కలిసి అతని వ్యక్తిగతఅభిప్రాయాలకి యేమాత్రం ఆస్కారం యివ్వకుండా నిమిషాల మీద పెళ్ళి మాటలు జరిపి క్షణాల మీద మేనమామ కూతురు భావానితో పెళ్లి జరిపించేసి వూపిరి పీల్చుకున్నారు. అతను ఆ సమయంలో సామ్రాజ్యాల్ని పోగొట్టుకున్న చక్రవర్తి మాదిరి డీలాపడి పోయాడు.
    అప్పుడు అర్ధం అయింది గౌరీపతికి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగే అన్న వతులో తన ప్రేమ పురాణం బయట పడ్డదని. కాలేజీకి వెళ్ళినా అన్నపూర్ణ కనిపించలేదు. అతను ఆ పిల్ల యింటికి వెళ్ళే సాహసం చేయలేక పోయాడు. పరీక్షలయాక భార్యతో సహా అతను వరంగల్ చేరుకున్నాడు. వూరు వదిలి వెళ్ళిపోతే చాలని చూసిన మేనమామలు నిశ్చింతగా గుండెల మీద చేతులు వేసుకున్నారు.
    భావాని సామాన్య కుటుంబం లో చదువు సంధ్యలు అంతగా అబ్బక పోయి పుట్టినప్పటికీ తెలివితేటలు గలది, గౌరీపతికి అన్నపూర్ణకి గల సంబంధాన్ని తమ యింట్లో అనుకోవడం యెరుగును. గిరి గీసిన సాంప్రదాయాలూ, సదాచారాలు వీటిని బావ కాలదన్నుతున్నాడని ఆవిడకి తెలుసును. కులభ్రష్టుడయ్యె బావని తల్లి తండ్రులు వుద్దరిస్తాం అని అనుకుంటుంటే నోరు విప్పలేక పోయింది. పెళ్ళి అయినా భర్త యెదురుగా నిలిచి మాట్లాడే రోజులు కానప్పుడు పెదవి బిగించి వూరుకుంది. వరంగల్ లో అతను వుద్యోగం లో చేరాడు. వూరు మారినా జ్ఞాపకాలు అతడిని కుళ్ళ బొడుస్తూ వుంటే ఒక్కోరోజు ఆడపిల్ల కన్నా అన్యాయంగా పక్క మీద వాలిపోయి కంటికీ మింటికీ యేకధారగా కన్నీరు కార్చేవాడు. చేసిన పాపం అతడిని అడకత్తెర లో బిగించి చూర్ణం చేయసాగింది. భర్త పరిస్థితికి తల్లడిల్లి పోయింది భవాని. అతనికి ధైర్యం చెప్పి పంపింది.
    నెలలు నిండి మగపిల్లాడిని సుఖంగా ప్రసవించింది అన్నపూర్ణ. తల్లితండ్రులు చిత్రవధ చేసినా గౌరీపతి పేరు చెప్పలేదు ఆ పిల్ల. మూడో కంటి వాళ్ళకి తెలియకుండా ఆ శిశువు ని అనాధశ్రమం లో ఉంచే ప్రయత్నం చేస్తున్న తల్లితండ్రుల్ని వారించ లేకపోయింది. దిక్కులు పగిలి పోయేలా గుండెలు అవిసి పోయేలా కన్నీరు కార్చినా అన్నపూర్ణ మాతృప్రేమకి విలువ లేకపోయింది.

                    
    మేఘాలతో ఆకాశం పూర్తిగా కప్పబడి పోయి ప్రళయం వచ్చేందుకు సిద్దంగా వున్నట్లు తయారైంది ప్రకృతి. మెరుపులు కళ్ళని చీల్చుకుంటూ గీసుకు పోతున్నాయి. గాలి ఉదృతానికి ఇళ్ళు సైతం పునాదులతో పెకిలింపబడి నేల కూలుతున్నాయి. చెట్లు గౌరీ పతిలాగే అసహ్యంగా భూములోకి కూరుకు పోతున్నాయి. ఆ నిశీధి లో, కాళ రాత్రి లో అతను అడుగులో అడుగు వేసుకుంటూ అన్నపూర్ణ యింటి వాకిలిని తట్టాడు.
    అన్నపూర్ణ తల్లి తలుపు తెరిచి గతుక్కుమంది. చాలాకాలంగా ఆవిడ ఆ తలుపుల్ని బిగించి వేసింది. అతను మొహాన్ని పైకి యెత్తి ఆవిడ వైపు చూసి "అన్నపూర్ణ యేదండీ," అని అడిగాడు.
    ఆవిడ సమాధానం చెప్పక మునుపే పక్కగదిలో పసివాడు 'కేర్' మన్నాడు. ఆవిడ నిస్త్రాణగా కూర్చుండి పోయింది. అతను ఆ గది చేరుకున్నాడు. అన్నపూర్ణ పిల్లాడిని వొళ్ళో కూర్చో బెట్టుకుని దేవతలా విలపిస్తున్నది. ఆముదం గుడ్డి వెలుతుర్లో గౌరీపతి ని గమనించింది. అడపులిలా యెగిరిపడలేదు. ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత నిర్లిప్తత అవరిస్తుందంటారు. అదే స్థితిలో వుంది ఆ పిల్ల. గౌరీ పతిని చూసి చిన్నగా నవ్వి కూర్చోమన్నది సైగ చేస్తూ.
    అతను దోషిలా తల దించుకున్నాడు .
    అన్నపూర్ణే ప్రారంభించింది.
    "చూసిపోవాలని వచ్చినట్టున్నారు. బావున్నారా. నీకు పెళ్లి అయిందని మన క్లాసు మేటు వరదరాజు చెప్పాడు. ఆవిడ ఏక్కడుందేమిటి.'
    అతను సమాధానం యివ్వలేదు.
    అన్నపూర్ణ కళ్ళు చిత్రంగా తిప్పింది. 'వో! అర్ధం అయింది. పెళ్లి కాని అన్నపూర్ణ కి పిల్లడేమిటా అనుకుంటున్నావా? అదంతేలే. ప్రేమించానాన్నవాడు నట్టేట ముంచాడు. పోనీ అతడిని గురించి దేనికి? బాబుని అమ్మా నాన్నా అనాధాశ్రమానికి యిచ్చేసి మరే వూరైనా తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నారు. యెలా చెప్పు గౌరీపతి. వాళ్ల తండ్రి వచ్చి నా బాబుని యివ్వు అంటే నేనేం జవాబు చెప్పను? '
    'ఆఫ్ కోర్స్ అమ్మా నాన్నా నాదంతా భ్రమ అన్నారనుకో' అన్నపూర్ణ బిగ్గరగా యేడుస్తూ యేడుపులోనే అంది. 'సమాజం పతిత కొడుకని అంటుంది. అప్పుడేం చేయను? వీడికి సంఘం లో ప్రతిష్ట రావాలి. మూడో కంటి వాళ్ళకి తెలియకుండా నా బిడ్డని నువ్వు పెంచి పెద్ద చేయకూడదు పెద్ద భారం అయిన పనే అనుకో. స్నేహితుడివి కదా. నా కోర్కె తీర్చలేవూ!'
    గౌరీపతి కళ్లల్లో నీళ్ళు చిమ్ముకున్నాయి. రెండు చేతులూ చాపి పిల్లాడిని అందుకున్నాడు. అతని గొంతులో మాటలు కరువు అయిపోయాయి. అన్నపూర్ణ మొహాన్ని దోసిట్లో దాచుకుని ఏడుస్తుంటే దగ్గరగా వెళ్ళి ఆమె తల మీద చేయి వేసి 'బాబుకి లోటు రానివ్వను' అన్నాడు. తల్లీ తండ్రి ఈ విషయాన్ని అర్ధం కాని వారిలా చూస్తున్నారు. యెంత త్వరగా వచ్చేదో అంత త్వరగానూ నిష్క్రమించాడు. హోరు గాలిలో, వర్షం తుఫాను లో అతను పిల్లాడిని గుండెల్లో అదుముకుని వడివడిగా స్టేషను వైపు బయలుదేరి కదిలే రైల్లో యెక్కి కూర్చున్నాడు.
    భవాని బిడ్డని అందుకుని పసివాడి చెక్కిళ్ళ మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంది. పద్దెనిమిది యిరవై ఏళ్ళ భవాని భర్త రహస్యాన్ని తనలోనే యిముడ్చుకుని సమాజానికి గంతలు కట్టి స్వంత బిడ్డ మాదిరిగా చూస్తూ తన బిడ్డడే అని నలుగురికీ చెప్పింది.
    వొడలు బళ్ళు అయేయి. బళ్ళు ఓడలయాయి. పిన్నలు వృద్దులయారు.  వృద్దులు కాటిలో కలిసిపోయారు. యిటు భవాని తల్లుతండ్రులూ, అటు సోమయాజులు దంపతులూ కూడా చరిత్రలో కనుమరుగయారు. సోమయాజులు గారి నల్లమందు అలవాటు లో , నిర్లక్ష్య భావం లో రెండు యేకరాలు పేరూరు లో యిల్లు మాత్రం మిగిలాయి. గౌరీపతి కొడుకు విశ్వనాధం ఐదేళ్ళ వాడు యిప్పుడు. పిల్లాడి తో సహా అతను తిరిగి స్వస్థలం చేరుకున్నాడు. ముమ్మూర్తులా గౌరీపతి నే పోలిన విశ్వనాధం భవాని అనురాగపు స్రవంతి లో జీవన నౌకని తీరాలకి ఎయేటి కాయేడు చేరుస్తూ పెరిగి పెద్దవాడయ్యాడు.
    విశ్వనాధానికి యిరవైయేళ్ళు రాగానే మీనాక్షి తో పెళ్లి జరిపించారు తల్లి తండ్రులు. గౌరీపతి అడపా తడపా విశాఖపట్టణం వెళ్ళినా అన్నపూర్ణ జాడ దొరకలేదు. కొందరు వూరు వదిలి వెళ్ళిపోయారన్నారు. మరికొంత మంది ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుందన్నారు. యేది యేమైనా మరి అన్నపూర్ణ లేదు.
    మీనాక్షి కాపురానికి కాలు మోపిన తరువాత భవాని గర్భం నిలిచింది. ఆరుసార్లు ఆవిడ కి గర్భస్రావం అయింది. మీనాక్షి కాలు పెట్టిన వేళా విశేషం అనే అన్నారు అందరూ.
    గోవింద పుట్టగానే నెలల పిల్ల. గోవిందని మీనాక్షి చేతుల్లో వుంచి భవాని బాలింతరాలి వాతం వచ్చి పోయింది. గోవింద అన్నా వదిన ల సంరక్షణ లో పెరిగి పెద్దదైంది.
    యిన్నేళ్ళు కాలకూట విషాన్ని కంఠం మధ్య దాచుకున్నట్లు గౌరీపతి ఆ రహస్యాన్ని అలాగే వుంచగల్గాడు. కానీ అతడికి మీనాక్షి కనిపించగానే శూలాల్తో పొడుస్తున్న బాధ కలిగేది. మీనాక్షి ని కులం చెరిపిన వాడయ్యేడని మధన పడేవాడు.
    చివరి దశలో కొడుకుని పిలిచి ఆనాటి సాంఘిక పరిస్థితులూ, సంప్రదాయాలూ , వీటిని గురించి సవివరంగా చెప్పి అతని జన్మ రహస్యం చెప్పేసి వూపిరి పీల్చుకుని నిశ్చింతగా ప్రాణాలు వదిలాడు. విశ్వనాధం తన జన్మని అసహ్యంగా చిత్రించుకోలేదు. తండ్రి యే కులం అయితే బిడ్డలు ఆ కులానికి చెందినా వారే అవుతారనే సంగతి అతనికి తెలుసు. అంతేకాదు భవాని చిరునవ్వుతో 'నాయనా' అంటున్నట్లుండేది. 'అమ్మా నువ్వు....నువ్వే మా అమ్మవి' అనుకునేవాడు నిశ్శబ్దంగా. చెల్లెల్ని ప్రాణం కన్నా యేక్కువగానే చూసుకున్నాడు. ఆ రహస్యం మరి బయట పెట్ట దలుచుకోలేదు అతను.

                               *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS