Previous Page Next Page 
వైరం పేజి 3


    ఆ తర్వాత - బ్రహ్మాండమైన జల్లెడలో వేసి జల్లించినట్లుగా భ్రమ!
    అటూ ఇటూ అటూ ఇటూ అటూ ఇటూ..
    అప్పుడు...
    విమానం ఒక్కసారిగా పైకి లేవడం మొదలెట్టింది.
    ఆకాశానికి వేసిన నిచ్చెన ఎక్కుతున్నట్లు ఏటవాలుగా.
    స్పిన్ లోకి వెళ్ళబోయిన విమానం మళ్ళీ పైకి లేవడమా?
    మరి ఇది ఏమైనా తక్కువనా ఏమిటి?
    మూడువందల యాభై కోట్ల రూపాయల ఖరీదు చేసే విమానం కదా!
    ఎంత పకడ్బందీగా తయారుచేసి వుండాలి?
    "థాంక్ గాడ్! ఉల్ఫ్ గాంగ్ హాజ్ డన్ ఇట్ - వన్స్ ఎగెయిన్!" అంది సునయన ఎగ్జయిటెడ్ గా. ఆ విమానం లాగే పైలట్ ఉల్ఫ్ గాంగ్ కూడా తక్కువవాడేమీ కాడు.
    "ఎన్నియో యుద్దముల నారితేరిన వృద్ధమూర్తి.." అని వర్ణింపదగిన సీనియర్ పైలట్!
    విమానం ఎగిరే డిగ్రీ మారింది.
    దాదాపు నిటారుగా పైకి వెళ్తోందా అని భయం కలిగించేటంత డేంజరస్ డిగ్రీలో క్షణక్షణానికీ ఎత్తులని అందుకుంటోంది విమానం.
    అది కొంతమంది ప్రయాణీకులకు ప్రమాదకరం కావచ్చునని ఆ పైలట్ కి తెలుసు.
    కానీ-  
    ఎక్కువమంది క్షేమం కోసం కొంతమందికి దెబ్బలు తగిలినా ఫర్వాలేదు అనుకున్నాడు అతను.
    అప్పటికే నేలమీద పడున్న పర్సర్ లు, ఎయిర్ హోస్టెస్ లు పట్టు దొరకక, జారుడుబండ మీద నుంచి జారిపోతున్నట్లుగా విమానం వెనుక భాగం వైపుకి జర్రున జారిపోయారు.
    అయినా సరే - వాళ్ళ మొహాల్లో చిత్రమైన భావం!
    అదేమిటీ?
    రిలీఫే!
    ఆ అలజడిలో షాంపేన్ బాటిల్ ఒకటి సర్రున దూసుకెళ్ళి ఠపీమని ఒక ఎయిర్ హోస్టెస్ తలని తాకింది.
    అయినా అదేమీ పట్టించుకోనట్లుగా.
    "వెల్ కమ్ స్మార్టీ! అంది ఆ అమ్మాయి ఆ బాటిల్ ని ఉద్దేశించి.
    సంతోషాన్ని పంచుకోవటానికి సాటి మనిషే అక్కర్లేదు - ప్రాణంలేని సీసా అయినా ఫర్వాలేదనిపించే క్షణం!
    ఎయిర్ క్రాఫ్ట్ పైకి వెళ్తోంది!
    ఆ సంగతి క్రూ అందరికీ అర్థమయింది.
    అందుకే ఆనందం!
    దాదాపు ఐదు నిముషాల తర్వాత -
    విమానం శిఖరాన్ని ఎక్కుతున్నట్లు ఏటవాలుగా ఎగరడం మానేసి, లెవెల్ గా ముందుకు సాగడం మొదలెట్టింది.
    అప్పుడు వినబడటం మొదలెట్టింది పైలట్ గొంతు పబ్లిక్ అడ్రెస్ సిస్టంలో.
    "గాడ్ ఈజ్ గ్రేట్! లేడీస్ అండ్ జెంటిల్మన్! మహత్తరమైన విపత్తు నుంచి బయటపడ్డాం మనం!" అని ఆనందంగా చెప్పి, తన పబ్లిక్ అడ్రెస్ సిస్టంని ఆఫ్ చేసేశాడు పైలట్.
    కానీ అతనికి ఆ క్షణంలో తెలియదు -
    తను మరికొద్ది నిమిషాలలోనే మరో ముఖ్యమైన మెసేజ్ ఇవ్వాల్సి వస్తుందని!
    విమానంలో హర్షధ్వానాలు!
    చాలామంది చప్పట్లు కొట్టడం మొదలెట్టారు.
    ఆ సమయంలో కూడా -
    నిర్వికారంగా నిశ్చలంగా కూర్చుని ఉన్నది సూరజ్ ఒక్కడే.
    అతను ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లుగా ఉన్నాడు.
    అయినా, ఆ స్థితిలో కూడా అసంకల్పిత ప్రతీకారచర్యలాగా, తన ఒడిలో ఉన్న మిస్ యూనివర్స్ సునయని అతి భద్రంగా పొదివి పట్టుకునే ఉన్నాడు.
    అతని మొహంలోకి చిత్రంగా చూసింది సునయన.
    ఆమె ఆ క్షణంలోనే అతని ఒళ్ళోనుంచి లేచి ఉండవచ్చును.
    కానీ, తనకి తెలియకుండానే కొద్దిక్షణాల పాటు అలాగ్ కూర్చుని ఉండిపోయి, అతని మొహంలోకి తదేకంగా చూస్తూ వుండిపోయింది సునయన.
    మృత్యువుతో ముఖాముఖీ లాంటి పరిస్థితిలో నుంచి బయటపడ్డామని ఇతనికి తెలియదా?
    అప్పుడు భయమూ లేదు!
    ఇప్పుడు రిలీఫూ లేదు!
    అదే క్షణంలో ఆమె దృష్టి ఐల్ కి అవతలివైపున, వెనుక వరసలో కూర్చుని వున్న ఒక స్వామీజీ మీద పడింది.
    ఆ స్వామీజీకి భయంతో తేలకళ్ళు పడిపోతూ ఉన్నాయి. చూస్తూ ఉండగానే, క్షణాలలో ఫెయింట్ అయిపోయాడు.
    చటుక్కున లేచింది సునయన. తను ఇప్పుడు మిస్ యూనివర్స్ అయినా, మాజీ ఎయిర్ హోస్టెస్ కూడా కదా! చేయగలిగింది చేయాలి.
    లేవగానే కృతజ్ఞతా పూర్వకంగా సూరజ్ వైపు చూసి,
    "ఐయామ్ గ్రేట్ ఫుల్ టూయూ!" అంది సిన్సియర్ గా. కానీ - ఆ మాటలు అతనికి వినబడినట్లే లేదు.
    త్వరత్వరగా స్వామీజీ దగ్గరికి వెళ్ళింది సునయన. తనకి తెలిసిన ఫస్ట్ ఎయిడ్ చెయ్యడం మొదలెట్టింది. ఫ్లయిట్ లో దెబ్బలు తగిలినవాళ్ళింకా చాలామందే వున్నారు. వాళ్ళ విషయం తక్కిన ఎయిర్ హోస్టెస్ లూ, పర్సర్ లూ చూస్తున్నారు.
    అప్పుడు వినిపించింది సునయనకి.
    సర్వసంగ పరిత్యాగులకి కూడా తప్పని భయం అనేదానిని జయించే శక్తిని ఇతనికి ఎవరు ఇచ్చారూ!
    అసలైన వైరాగ్యం అంటే ఇదేనా?
    అసలు అంతటి వైరాగ్యం ఈ యంగ్ మాన్ కి ఎలా కలిగింది?
    వైరాగ్యానికి కారణాలు శతకోటి కావచ్చును.
    ఈ లోకంలో అన్నీ చూసేసి విరక్తి ఉండడం - లేదా - ఈ లోకంలో ఏదీ అందుకోలేక వైరాగ్యం కలగడం.
    అలాగే    
    పురాణ వైరాగ్యం
    ప్రసూతి వైరాగ్యం
    శ్మశాన వైరాగ్యం
    ఆ మాటకి వస్తే తనకీ ఓసారి కలగలేదూ తాత్కాలిక వైరాగ్యం.
    స్వామీజీకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ గతంలోకి వెళ్ళిపోయింది సునయన.

                      *    *    *    *

    మూడు నెలలయి వుంటుంది అది జరిగి. కానీ, మొన్న మొన్నే జరిగినట్లుగా అనిపిస్తోంది.
    ఆరోజు కూడా ఫ్రాంక్ ఫర్ట్ చెన్నై ఫ్లయిట్ లోనే డ్యూటీ తనకి.
    డ్యూటీ అయిపోయాక ఫైవ్ స్టార్ హోటల్లో బస.
    తన తోటి ఎయిర్ హోస్టెస్ లలో చాలామందికి బాయ్ ఫ్రెండ్స్ వున్నారు. కొందరు కలిసీ, కొందరు విడివిడిగానూ పబ్ షాపింగ్ కి వెళ్ళిపోయారు.
    ఓ పబ్ లో ఓ డ్రింకు, కాసేపు కాలక్షేపం.
    ఆ తర్వాత అక్కడనుంచి ఇంకో డిస్కో.
    అక్కడ కాసేపు డాన్సు.
    అక్కడ నుంచి ఓ రెస్టారెంటు.
    అక్కడ థాయ్, మెడిటెరేనియన్ మొదలైన ఫాన్సీఫుడ్.
    అక్కడనుంచి,
    పెద్ద జీతాలూ, చిన్న వయసులూ. పరవళ్ళు తొక్కే ఉత్సాహం!
    కానీ
    తను సునయన- తన పద్ధతి వేరు.
    తన ఇంటరెస్టులే వేరూ!
    అమెరికాలో ఉంటుంది తను. సైకాలజీ మేజర్ తో చదివింది. సినిమా మీడియం మీది ఇంట్రెస్టుతో కొన్ని కోర్సులు చేసింది.
    ఎప్పటికయినా సరే - సినిమాల్లో షైనవ్వాలి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS