నారాయణుడు
బెజవాడ ప్లాటుఫారంలో నారాయణరావును జూచునప్పటికి, జమీందారు గారికి హృదయ మొక్కసారి యేలోకో ద్రవించిపోయినది. అస్పష్టముగ నొక్క వాక్కు ఇతడే శారదకు వరుడు అని తన హృదయాంతరాళము నుండి నిశ్శబ్దగీతాన ప్రతిధ్వనించినది. నారాయణరావుకు వివాహము కాలేదని ఏల తట్టినదో జమీందారుగారీనాటికిని చెప్పలేడు.
వ్యవహారములకై వచ్చిన వారి తోడను, తోటివారితో మాత్రమే సంభాషించు జమీందారుగారు నారాయణరావు కడకేగి 'మీకు వివాహమైనదా?' యని ప్రశ్నించినారు. పిమ్మట మొగమెరుకగల రాజేశ్వరరావు వలన నారాయణుని గూర్చిన వివరములడిగి తెలిసికొన్నారు. ఆయన కంటికి పుస్తకాల దుకాణము కడ దూరముగా నున్నప్పుడే నారాయణరావుని యాజానుబాహువిగ్రహము, పురుషత్వము మూర్తీభవించిన తేజముతో కనిపించినది.
అవయవ స్పుటత్వము కమ్మెచ్చున దీసినట్లున్నను, అతని కనుబొమ్మలలో, పై పెదవి మలుపులో, రేఖలు తిరిగిన్ నిడివి చెవులలో, సమమైన నాసికలో, వనితా లాలిత్యము వెన్నెలవలె ప్రవహించుచుండును. గాఢముష్టిఘాతమైన స్తంభమునైన విరుగగొట్టగల యాతని చేతులు దీర్ఘాంగుళులతో, మెత్తని తలములతో నందమైయున్నవి. ఎత్తయి విశాలమైన యాతని ఫాలము, నల్లని దట్టమైన జుట్టు పొదువుకొన, కారు మబ్బు లాక్రమించిన వెన్నెల తులుక వలె విరిసి పోయినది.
నారాయణరాయని యౌవనసుదృఢ దీర్ఘ దేహకాంతి ప్రవాహములో జమీందారుగారు చిరపిపాసువగు హృదయమును తనివోవ నోలలార్చినారు. తమకు సమీపమందుననే ఇన్నినాళ్లు దాగియున్న యీ పురుష రత్ననును తన భాగ్యదేవత నేటికి సాక్షాత్కరింపజేసినదని మురిసిపోయినారు.
లక్ష్మీపతి నారాయణరావునకు మూడవ బావమరిదియు, మేనత్త కొడుకును. తల్లిదండ్రుల కొక్కడే సంతానమగుట సోదర సోదరీ ప్రేమ యెరుగక. తన హృదయమంతయు నత్తవారి కుటుంబమునకు ధారపోసినాడు. చిన్నబావయగు నారాయణరావును తమ్మునివలె ప్రేమించినాడు. అతని భావనాపథముల నారాయణరావు అమర్త్యబాలకుడు.
ఏలూరి నుండి తాడేపల్లిగూడెం స్టేషను వరకు లక్ష్మీపతి శ్రావణపేయముగా నారాయణుని గుణగణవర్ణన చేయుచుండ, స్పెన్సరుచుట్ట కాల్చుచు మెత్తని మొదటి తరగతి దిండుపై పరచిన బూరుగదూది దిండ్లపై నొరగి, జమీందారు గారు హృదయమార వినుచున్నారు. 'నారాయణ మనస్సు చాలా మెత్తనండి. ఒకళ్ళ బాధ చూళ్ళేడు. చిన్న బాలుడుగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఏడిస్తే వాడికళ్ళ గౌతమి తిరిగేది. తన అందమైన వస్తువుల్ని వాళ్లకిచ్చి ఊరడించడానికి ప్రయత్నించేవారు. ఎంతమందో నౌకర్లున్నా చెల్లెళ్ళనీ, అన్నగారి బిడ్డల్ని తనే ఎత్తుకుంటాడు. ఆ పిల్లలు తల్లిదండ్రులకన్న నారాయణంటే చెంగున గంతువేసేవారు. చంటిబిడ్డ తల్లి దగ్గరకు వెళ్ళడమల్లా పాలకోసమే గాని వాడి ప్రక్కలోనే నిద్ర. మావాడి గొంతుకలో తేనెల తీయదనం, ఉరుముల గాంభీర్యం పెనవేసుకొన్నాయి. పాటలు పాడితే నాకు కళ్ళనీరు తిరిగేది. సంగీతం నేర్చుకోరా అంటే నేనంత పవిత్రుణ్ణి కానురా అనేవాడు.
'బళ్ళలో చదివేటప్పుడు తోటివాళ్ళొక్కళ్ళూ బాధపడకూడదు కదండి. పుస్తకాలు బొమ్మలు తినుబండారాలు అందరికీ అస్తమానం పంచుతూ ఉండేవాడు!' తాడేపల్లిగూడెం నుండి నిడదవోలు వరకు నారాయణరావు చదువు సంగతి లక్ష్మీపతి జమీందారుగారికి పదముపాడినాడు.
'ఎప్పుడూ ఏ పరీక్షా తప్పలేదు. ప్రతి తరగతిలోనూ మొదటివాడే. ఇంటరు మూడు సబ్ జెక్ట్సులో మొదటిమార్కులు, బంగారు పతకాలు సంపాదించాడు. ఇంతలో మహాత్మాగాంధీగారి సహాయనిరాకరణం వచ్చింది. రాజమండ్రి కాలేజీ వదలివేసి దేశంకోసం పనిచేశాడు. ఖైదుకు వెళ్ళాడు. ఆరు నెలలు నిర్బయంగా కృష్ణ జన్మస్థానంలో గడిపాడు. వచ్చాడు. స్వరాజ్యపార్టీ అంటే ఇష్టంలేదు. బి.ఎస్.సి. ఆనర్సు చదివాడు. రెండవవాడుగా నెగ్గాడు. ఎఫ్.ఎల్.లో మొదటిస్థానము తప్పదు కదాండి.'
నిడదవోలు దాటేసరికి లక్ష్మీపతి తన బావగారి ఆస్తి వేదపారాయణము చేసినాడు. 'ఇద్దరన్నదమ్ములు. మూడువందల ఇరవై ఎకరముల మాగాణి ఉంది. తోటలు ముప్పయ్ ఎకరములపైన ఉండవచ్చు. వడ్డీ వ్యాపారంలో లక్షా అరవై వేలవరకు తిరుగుతున్నట్లు జ్ఞాపకం. బ్యాంకులో షేర్లతోపాటు రెండు లక్షల రూపాయలవరకు ఉన్నవి. ఎంత లేదన్నా ఇరవైవేలదాకా నికరాదాయం ఉంటుంది. మా మామగారు సుబ్బారాయుడు గారు మంచి గుణవంతులు. మా అత్తగారు జానకమ్మగారు పార్వతీదేవి నలుగురు కుమార్తెలకూ వివాహాలయినాయి. మంచి సంబంధాలు చేశారు.'
జమీం: సర్వవిధాలా వరప్రసాదిగా ఉన్నాడు మీ బావమరిది. నా సంకల్పానికి దైవమనుకూలిస్తే, మా అమ్మాయి నేనూ ధన్యులమవుతాము.
లక్ష్మీ: అదేమిటండీ! తమరు గొప్పవారు. తమరు తలచుకొంటే జమీందార్ల సంబంధాలే కుదురుతాయి.
జమీం: సరి, జమీందార్ల మాటకేమి గాని మన నియోగులలో సరియైన ఒక్క సంబంధం చెప్పండి. మీరు చిన్నవారు. చదువుకుంటున్నారు. మీ యెఱుకను మంచి సంబంధం చెప్పండి.
లక్ష్మీ: (చిరునవ్వుతో) చిత్తం! నాకుమాత్రమేమి తెలుసునండి!
జమీం: అవునుగదా! నా మనస్సు చివికిపోయేటంత వరకు గాలించి వదిలేను. ఇంత దగ్గిరలో మహారాజులు ముచ్చటపడిపోయే సంబంధం ఉందని తెలియక పోయింది. కాని భగవంతుని కృపవల్ల ఇప్పటికైనా తెలిసింది. లేకపోతే జా జన్మల్లా దుఃఖపడి ఉందును.
లక్ష్మీ: మనస్సులు కలిస్తే అంతా అలా కనబడుతుంది. నాకూ, మావాడు మీ అల్లుడు కావటం ఎంతో సంతోషం. కాని మా కుటుంబాలు పల్లెటూరి కుటుంబాలు!
జమీందారు గారాలోచనాపథములలో నెగయుచు అర్ధనిమీలిత నేత్రులయి కూరుచుండిరి. రైలు కొవ్వూరిలో ఆగి, గోదావరి వంతెన దాటుచున్నది.
సుందరీమణియై, నారాయణరావు పోలికలు గలిగి, ఒక చిన్న బాలునకు తల్లియైన ప్రోయాలొకర్తు కొత్తపేటలో పుట్టినింట తనకై ఎదురుచూచు చున్నట్లు తోచి, లక్ష్మీపతి, చిరునగవు మెరుములీన, గోదావరి జలముల పారజూచుచుండెను. ఆమె ప్రేమమూర్తి భర్తకు సదుపాయములమర్చుచు నామె వేయి కనులు, వేయి చేతులతో పరిచర్య చేయును. ఈ నిర్మల గౌతమీనీలజలములకు నామె హృదయమునకు ఎంత చుట్టరికమున్నది! తమ సర్వస్వము భర్తలకే ధారపోయు హిందూ వనితామణులు భర్తలకు పూజింపదగిన వారు. లక్ష్మీపతిరా వా గౌతమీ నిర్మల గంభీరతలో తన ముద్దుబిడ్డ మోమింతలో చూచినాడు. అతని మోమున, సంధ్యాకాశమున అరుణరాగము వలె, చిరునవ్వలంకరించినది.
బండి గోదావరి దాటి స్టేషను కడకు వచ్చి ఆగినది. జమీందారుగారును, లక్ష్మీపతియు బండి దిగినారు. లక్ష్మీపతి 'అయ్యో, సెలవు పుచ్చుకుంటాను. నమస్కారమండి' అని తన స్నేహితులున్న పెట్టెకాడకు పోయినాడు. ఆలం ఏలూరిలోనే దిగినాడు. కూలీలు మూడు నిముషములలో సామానులు సర్దినారు. రాజేశ్వరరావు, నారాయణరావు, లక్ష్మీపతి గారులు పరమేశ్వరమూర్తి, రాజారావుల భుజాలమీద తట్టిరి. ప్రీతిపూర్వకముగా కరస్పర్శ గావించి, వారు సెలవు గైకొని టిక్కెట్లు పుచ్చుకొను ద్వారము కాడకు వచ్చినారు. ఇంతలో జమీందారు గారును వేరొక పెద్దమనిషియు, నలుగురయిదుగురు జవానులు ముగ్గురు జమీందారీయుద్యోగు లీయువకులకడకు వచ్చినారు.
జమీం" ఈయన నాకు చిన్నతనం నుంచి స్నేహితుడు. వేపా శ్రీనివాసరావుగారు, ఈ ఊళ్లో పెద్ద వకీలు.
శ్రీని: చాలా సంతోషంగా ఉండండి మీవంటి పడుచువాళ్లను కలుసుకోవడం. మరేమంటే మీరు భావి ఆంధ్రదేశానికి కీర్తితెచ్చే మణులని మా జమీందారుగారు చాలా చెప్పారు, యీ రెండు నిమిషాల్లోనే.
జమీం: వీరు లక్ష్మీపతిగారు. వారు ఈయన బావమరిది నారాయణరావుగారు.
లక్ష్మీ: (జమీందారుగారు పేర్లకి తడుముకొనుట చూచి) అతడు రాజేశ్వరరావు నాయుడు.
శ్రీని: చాలా సంతోషంగా ఉందండి. ఈరోజున మీరంతా మా యింటికి అతిథులుగా దయచేయాలి. తప్పదు లక్ష్మీపతి గారూ! మీరు మాట తీసేశారంటే నాకు మనస్సు నొప్పి కలిగించారని నష్టానికి దావా తెస్తాను.
లక్ష్మీ: (నిముషంలో గ్రహించి) రాజేశ్వరుడి మాట నేను చెప్పలేను గానీ, మేమిద్దరం వస్తాము.
రాజే: నేను ఇంటికి వెళ్ళి తర్వాత వస్తాను.
శ్రీని: ఇంటికి వెళ్ళి భోజనానికి రావాలి. లేకపోతే దావా తప్పదు.
రాజే: మీకు మూడు పైసలు డిక్రీ ఇస్తాను. ఇప్పుడే చెల్లించమంటే చెల్లిస్తాను.
శ్రీని: రాజేశ్వరరావు గారూ! మీ నాన్నగారు నాకు పూర్వం నుంచి పరిచితులు. నా సరదా తీర్చండి.
రాజే: పదిగంటలకు కలుసుకుంటాను. సెలవు.
అందరును స్టేషన్ బయటకు వెళ్ళినారు. సామానులు జమీందారుగారి గుర్రపు బగ్గీలలో సర్ధించి, శ్రీనివాసరావు గారు తన మోటారులో అతిథు లిరువురిని తన ఇంటికి గొనిపోయిరి.
జమీందారుగారు సొంత మోటారు మీద తమ భావనమునకు వేంచేసినారు.
