Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 3


                                             జమీందారుడు

    విశ్వలాపురం జమీందారుగారైన లక్ష్మీసుందరప్రసాదరావుగారిది పేరెన్నికగన్న ఆరువేల నియోగి కుటుంబము. హైదరాబాదు నవాబుగారి పరిపాలనలోనికి వచ్చిన రాజమండ్రి సర్కారు దగ్గర వెండి తలందాను, బంగారు పొన్నుకఱ్ఱ, ఇరువదియైదూళ్ళకు వీరమిరాసీలు, నాలుగు సంప్రతులకు బదస్తూలు, దివాణం పొందుతూ, నిశ్శంక మహాశంక సింహమాన సకలవిద్యజ్జన ప్రముఖ సంస్థిత' అని బిరుదు పొంది ఎల్లాప్రగడ నన్నయనాయని పౌత్రులు గౌరవం పొందినారు. ఆ వీరమిరాసీలు క్రమక్రమంగా చిన్న జమీగా పరిణమించినవి.
    వారు నవాబులకు పన్ను కట్టుచుండిరి. వారి రాజకార్యనిపుణతకును వేగుదనమునకును, జమీ దక్షితతో పరిపాలించి ఐశ్వర్యవంతముగ జేయుచున్నందుకును నవాబులు మెచ్చుకొని బంగారు తలందాను, రవ్వల ఒరగల నిశితకరవాలము, శ్వేతచ్చత్రము, బంగారు పల్లకీ, బిరుదునిశానీ లిచ్చి శతాశ్విక దళమునకు దళవాయిగా నొనరించిరి.
    విశ్వలాపురం జమీ మొగలితుర్రు పరిపాలన క్రిందికి వచ్చిన పిమ్మట నన్నయమంత్రి వంశీకుడైన తల్లాప్రగడ గజపతిరాజు మొగలితుర్రు వారికడ అమాత్యుడై రాజ్యము సర్వవిధముల విజృంభింపజేసెను. కలిదిండి మహాప్రభువు జగపతిరాయని స్వామి కార్యనిర్వహణదక్షతకు, స్వామిభక్తికి మిగుల సంతసించి, 'మహామంత్రి, రాజవంశోద్దీపక' అను బిరుదులూ, రెండు గ్రామములతో దయ చేయించినారు.
    అట్టి యుత్తమావంశమున జన్మించిన శ్రీ రాజా లక్ష్మీసుందరప్రసాదరావు, స్వకుల దీపకుడయి, సదాచార సంపన్నుడై నూతన విజ్ఞాన ప్రకాశమున తన హృదయమును గాంతిమంతము చేసికొని, పాశ్చాత్య విద్యయందును గడతేరినాడు. సంస్కృతమున బి.ఎ. పరీక్షయం దుత్తీర్ణుడయి ప్రసిద్ధ పండితుల పాదములకడ సంస్కృత భాషామృతము సేవించి, అమరభావ పులకితుడైనాడు. తాను జమీందారుడయ్యు రైతుల కష్టములు పటాపంచలయి, వారు బాగుపడిననే గాని భావిభారత భాగ్యోదయము కాదని నిశ్చయించి, పూర్వపు శాసనసభలకు నూతన శాసనసభలకునుగూడ అధిక సంఖ్యాకులగు ప్రజలచే ప్రతినిధిగా వరింపబడి ప్రభుత్వమునాకు ప్రక్కలోని బల్లెమయి మెలగినాడు.
    రాజనీతిశాస్త్రమున నతడు న్యాయపతి సుబ్బారావుపంతులుగారి ప్రియశిష్యుడు, మోచర్ల రామచంద్రరాయని ప్రియ స్నేహితుడు అయ్యు గాంధీగారి అసహాయోద్యమముచే దేశము విప్లవమున బడిపోవునని ఆయన నమ్మాడు. కావున శాసనసభలో స్వార్థపరులగు ప్రజాద్రోహులకు తన స్థానమయినను చిక్కకుండా చేయగలుగుటయే తాను చేయగల దేశసేవయని నమ్మిన సత్పురుషుడాతడు.
    లక్ష్మీసుందరప్రసాదరావుగారికి గంజాంజిల్లాలో నారికేళవలస జమీందారగు క్రొవ్విడి వీరబసవ రాజవరదేశ్వరలింగము గారు తమ ప్రథమ పుత్రిక వరదాకామేశ్వరిదేవి నిచ్చి వివాహము చేసినారు. వారి గర్భమును నిరువురు పుత్రికలు. నొక పుత్రుడు పవిత్ర మొనర్చినారు. ప్రథమ పుత్రిక శకుంతలా దేవిని నెల్లూరుజిల్లాలో నొక చిన్న జమీకి ప్రభువైన భావనారాయణరావు గారి ప్రథమ పుత్రుడు విశ్వేశ్వరరావుగారికిచ్చి వివాహము చేసినారు.
    కుమారారాజా విశ్వేశ్వరరావు చాలా గర్వి. ఇంగ్లండు దేశమునకు పోయి ఆక్స్ ఫర్డ్ లో ఎం.ఎ. పట్టమునంది, హిందూదేశమునకు వచ్చి, యుద్యోగుల నాశ్రయించి డిప్యూటీ తహసీల్దారు పదవి ప్రథమముననే సముపార్జించి, ప్రాపకముచే డిప్యూటీ కలెక్టరు పీఠం అచిరకాలముననే యదిష్టించినాడు. తాను జమీందారు ననుమాట మరచిపోయి పై యుద్యోగుల కాడ వినయముగా సంచరించువాడు. బ్రిటీషు ప్రభుత్వము ఇండియాను వీడినచొ నొక్క పురుగైన బ్రతుకదనియు, అత్యంత ఫలవంతము, నతి సుందరమునగు భారత భూమండల మెల్ల ఆసేతుహిమాచలము సహారా యెడారి అయిపోవుననియు నతనికి భయము.
    విశ్వేశ్వరరావు మామగారితో హిందూదేశాన నాగరికతయే లేదనుచుండును, పాశ్చాత్యుల భరతభూమి మెట్టక పూర్వమిచటివారెల్ల ఆఫ్రికా వాసులగు నీగ్రోలవలె ఒకరినొకరు చంపికొని తినుచుండిరనియు దనయభిప్రాయము వెలిపుచ్చుచుండును.
    కోర్టులో నగ్నివర్షము కురిపించి యభ్యర్దులను న్యాయవాదులనుగూడ దూదివలె నేకి విడుచును. న్యాయనిపుణములగువాదముల నాతడర్ధము చేసికొనలేక యుక్కిరిబిక్కిరియై తన తీర్పునందు వానిని జారవిడిచి తప్పుదారిబడి పై న్యాయాధికారిచే సన్న సన్నని చీవాట్లు తినుచుండును. అతని తాబెదార్లు అరచేత ప్రాణము లుంచుకొని మసలుచుందురు.
    ఇంట్లో భార్యాభర్తలకు చుక్కెదురు. సంతతము ఎట్టి చిన్నవిషయమునకైన ఇరువురకు మాటపట్టింపులు వచ్చి ఒకరితో నొకరు మాటలాడుట మానివేసికొందురు. జమీందారుల బిడ్డలమను నభిమాన మిరువురి మనఃపథముల నెల్లప్పుడు జాగరితమైయుండి సుడిగాడ్పులు రేపెట్టుచుండును.
    వారి బిడ్డలు తల్లిదండ్రుల సర్వవిధముల ననుకరించుచు వారిలో వారు, సేవకులతో, తల్లిదండ్రులతో, తోడిపిల్లలతో కలహమాడుచుందురు.
    కలహదేవతకు వారిది పుట్టిల్లు. అపశ్రుతిమేళవింపుతో, బహు రాగముల కలయికతో నాదేవి వారింట విచిత్ర నృత్యము సలుపుచుండును.
    లక్ష్మీసుందరప్రసాదరావు గారి ప్రథమ పుత్రికాజామాత లిట్లు తిక్తఫలములైపోయి ఆయన హృదయమును తీరని కోరికలచే బాధాపూర్ణము చేసిరి.
    శకుంతలాదేవికి సంగీత సాహిత్యములు నేర్పించినాడు. రాజమహేంద్ర పురవాసియగు నొక యమెరికను మిషనరీ భార్యకడ నామె కాంగ్లభాష గరపించినాడు. ఈ విద్యలామెకు గర్వము వృద్ధి చేసినవి. కళాభిజ్ఞతలేని జామాత కవి చీదరజనింపజేయు పిచ్చిపోకడలైనను, జిల్లా జడ్జీల భార్యలకడ, కలెక్టర్ల సతులకడ పాడుమని భార్యను ప్రోత్సహించుచుండెడివాడు. ఆమె విరసముగా తానవియెల్ల మరచిపోయినానని భర్తతో నప్పడము విరిచెడిది.
    రెండవ కూతురు శారద చిన్నతనము నుండియు శాంతవర్తన. మూగదేవుని వలె మాటలాడక విశాలనయనములతో, చిత్తరువు వలె నన్నియు పరికించునది. ఆమె ఒక్కసారి దేనిని విన్నను మరి మరవదు. ఆమె మాటలలో సున్నితమై, తేటయై, మధురమగు చక్కని తెలివితేట నీటియూటవలె ప్రవహించును. వీణ తీగలు, కోయిల గొంతులు కొండకోనలోని వేణుని కుంజముల పాటలు గూడ పేలవము చేయగలిగినది ఆమె కంఠము. గాన మూర్తియగు శ్రీరామయ్యగారి పాదములకడ నామె సంగీతము నేర్చికొన్నది. శ్రీరామయ్యగారు గాత్రములో, ఫిడేలు వాద్యములో దక్షిణాపథమున పేరెన్నికగన్న కళాస్వరూపులు. జంత్ర వాద్యములో నాయనను మించువారు ఆనాడు లేరు. తన కమాను కదల్పులోని విశ్వగీతాస్వనము నాయన శారద కమానులోనికి ప్రవహింపజేసినాడు. శ్రీ త్యాగరాజమూర్తి కనులారా మూసి శ్రీ సీతారాముని ప్రత్యక్షము జేసికొనిన దివ్యగానములో జనించిన తారకలగు కృతులు, ఆ సంప్రదాయముతోనే శ్రీరామయ్యగారు శారదకు ధారపోసినారు, శారద వీణయు బాగుగా నేర్చుకొనుచున్నది, వీణాదక్షుడగు వేరొక యుత్తము వైణికునికడ.
    శారదకు తండ్రియన్న ప్రేముడి యెక్కువ. ఆమె చిన్న తమ్మునొక్క క్షణమైన వదలియుండదు. అచ్చముగా తన తల్లిపోలికయైన శారదను చూచినా జమీందారుగారికి గాఢానురాగము పెనవైచికొనిపోవునది. తన ఆశయములకీమియే తగిన కుమారితయని యాయన గర్వపడును. 'చదువులలో చిత్రమెల్ల జదివిన బాలా!' అని ఆనందభాష్పములతో తనయను గాఢలింగనమొనర్చి యొకనాడు జమీందారుగారు తన స్నేహితులకాడ, అప్పటికి బదునొకండేండ్లు ప్రాయముగల శారదచే సంగీత సాహిత్యసభ చేయించినాడు. వృద్ధుడు, శాంతమూర్తి, తేజస్వియగు భాస్కరమూర్తి శాస్తుర్లు బి.ఎ., ఎల్.టి.గా రామెకు నాలుగుభాషలు, ఛప్పన్న విద్యలు నేర్పినారు.
    నేడు శారద పదునాల్గు సంవత్సరముల యెలనాగ. అందాలప్రోవు. సుగుణాల నిధి. చదువుల కన్నతల్లి. ఆమెకు తపఃఫలమై జీవితకల్పమగు భర్తను గొనితేవలయు.

    సంఘసంస్కరణాభిలాషి యగు జమీందారుగారు శారదకు ఉన్నత విద్యలు చెప్పించవలెనని యెంత కుతూహలపడినను ఆయన హృదయము మాత్రము పూర్వ సంప్రదాయ ఘంటాపథము దాటలేకపోయినది. వయసుమీరి పోకుండ శారదకు వరుని తేవలయు. ఇదివరకు జమీందారీ కుటుంబములతో వియ్యమందినాడు. ఆ సరదా తీరినది. తల బొప్పెలు కట్టినది. ఈనా అనుంగుకూతురిని 'జమీందారు రాతుచేతనిడనమ్మ త్రుశుద్దిగ నమ్ము శారదా!' అని హృదయమున శపథము చేసికొన్నాడు.
    భార్యయైన వరద కామేశ్వరీదేవి తన అన్నగారి కొమరుడగు శ్రీ క్రొవ్విడి బసవరాజేశ్వర జగన్మోహనరావునకు శారదనిచ్చి యుద్వాహ మొనరింప పట్టుపట్టినది. అన్నగారగు విశ్వేశ్వర ఆనంద సువర్ణేశ్వరలింగం గారు విజయనగర వేశ్యవాటి సముద్రజనిత మాయాప్సరోమణీ నీచ శృంగార సమారాధనలో ప్రాణముగూడ ధారపోసి, ఆస్తి అప్పులపాలు చేసి పోయినాడు. 'కోర్ట్ ఆఫ్ వార్డ్సు' వారు వ్యవహరించి అప్పులు నిశ్శేషముగా దేర్చివేసి, రెండులక్షల రూపాయల నిలువతో నిరువది రెండేండ్ల వయసున జగన్మోహనరావుకు జమీ అప్పగించినారు. ఈ చిన్న జమీందారుని గూర్చి రహస్యములు కథలై దేశమంతట ప్రాకుచున్నవి.
    లక్ష్మీసుందర ప్రసాదరావుగారా సంబంధము మాట భార్య కదిపినప్పుడు జుగుప్సపడినాడు. "అమ్మాయిని నరకకూపంలోకి వేరే తోయనక్కరలేదు! మన హృదయాలు పాషాణాలు చేసుకోవాలి మీ మేనల్లుడి కివ్వాలంటే" అన్నారు.
    శీఘ్రముగా వివాహము చేయ సంకల్పించి వరునికై ఆంధ్రదేశము వలలు వేసి వెదకించినారు. అభిజాత్యముగలవాడు, అన్నవస్త్రములకు లోపములేని వాడు, మంచి తెలివైనవాడు, రూపవంతుడు, గుణవంతుడు, చదువుకొన్నవాడు గావలెనల్లుడు. సుప్రసిద్ధ నియోగికుటుంబము లన్నియు వెదకించినారు. వాడ్రేవువారు, మంచిరాజువారు, మారెళ్లవారు, చెన్నాప్రగడవారు_ వేయేల గోత్రములు ఋషులు కలియని ఇంటిపేర్లవారి జాబితా గవర్నమెంటు వారి 'నీలపు కాగితము' వంటిది తయారైనది.
    తారాచువ్వ వలె పైకెగయు బాలురకు ధనముండదు. ధనమున్న వారు విద్యాగర్భదరిద్రతలో మునిగియున్నారు. రెండునుగల బాలకులకు రూప సంపద ఎరువుతీసికొని రావలయును. కొంచెము కొంచెముగా నీ మూడును ఏకీభవించిన నరులు విషకుంభ సమానులు. జమీందారుగారికి విసుగు జనించి శారదకు తగిన భర్త దొరుకునాయనిపించినది. తన భావవీధిలో నడయాడు జామాతకేమాత్రము తీసిపోయినను అట్టివానికి చూచి చూచి తన ముద్దుల పట్టి నొసగుట కాయనకు మనసొప్పినదికాదు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS