శారద
గౌతమీజల చుంబిత ప్రత్యూష వాయు బాలకులు ఒయ్యారముగా దేలియాడుచు వచ్చి, ఆ వన పుష్ప చేలాంచలములలో దోబూచులాడుచుండిరి. వసంత గాఢ సౌరభములు పొగవోలె సుడులు కట్టి యెల్లెడల వ్యాపించుచున్నవి. బోగిన్ విల్లాలయు, గులాబులయు, వివిధ కుంకుమ వర్ణములు, మల్లీమాలతుల స్వచ్చ హృదయార్ద్ర శ్వేతవర్ణములు, చంపక కనకాంబరముల సువర్ణరాగములు, నీలాంబర నిర్మలనీలములు కలసిమెలసి చిత్రరూపమై సొబగుమించిన జమీందారుగారు యుపవనములో, శారద ముగ్ధ వనలక్ష్మివలె పూలు కోయుచున్నది. శారదకు పూలన్న ప్రాణము (ఏ బాలకు గాదు?). పూల చరిత్రలన్నియు నామె వల్లించినది. పూల మనసులు, పూల బాసలు నామె యెరుగును. ఏ ఋతువులనే పూలవతరించునో, ఏ ప్రదేశముల నే కుసుమములు కళకళలాడిపోవునో హాసప్రఫుల్ల వదనయై శారద చెప్పచుండును.
శారదా కుమారి సౌందర్యమూర్తి. ఆమె నయనములు విస్పారితములై, యర్దనిమీలితములై, దీర్ఘ నీలవర్త్మాంచలములై, విచిత్ర జీవిత నాటకము నాలోచించుచు, నాశ్చర్యహాసముల వెదజల్లుచుండును. నల్లని పాపలు రెప్పలమాటున సగము దాగికొని యామినీ నీలాకాశ గంభీరములై తోచును.
మేలిమి బంగారు రంగులో తామర యెరుపు కలిపిన శరీరఛాయ. నవయౌవనపు తొలి వెలుగు లామె ఫాలముపై, నాసికాగ్రాముపై, బుగ్గలపై, పెదవుల యంచులపై, చిబుకముపై, కంటి పైరెప్పలపై, చెవుల తమ్మెలపై నర్తించుచుండును. స్వప్నసీమలగు కనుబొమ్మలు సన్ననై చంద్రవంక వంపులు తిరిగి చెక్కుల మాయమైనవి. బంగారు గన్నేరు మొగ్గవంటి ముక్కు, విలువంపగు సరుణోత్తరోష్టముపై పైడిమేడ గట్టినది. మధ్య సుడినొక్కుతో కాశీరత్న పుష్పముల జంటబోలి యామె యధరము స్పష్ట రేఖాంకితమై తేనియలు చెమరించుచున్నది. లేత దానిమ్మపూవామె చిబుకము. పదునాలుగేండ్ల యెలప్రాయపు మిసిమిరేకలు కర్ణముల నుండి యంగుళీయాంచలముల కెత్తిపోతలైనవి. బాహు మూలముల నుండి పాదతలములకు సొంపు లెగబోయు ఏటి కెరటాల వంపులు మిలమిలలాడిపోవు కమ్మని చందన వర్ణపు పట్టు పరికిణీ మడమలతో మెలివడి పోయినవి, నానాట నానందకిసలయములై మొలకెత్తు ముగ్ధ భావములు గులాబి రైక మబ్బుల, నీలిపయ్యెద జిలుగువెలుగుల తొంగిచూడసాగినవి.
ప్రక్కపాపిట తీసికొని, ఒత్తె పొడవైన కచభారమును పిరుందులవరకు వ్రేలాడు వాలుజడగా గీలించి, కాళ్ళకు జరీబుటాపూవులా మొఖమల్ లూఢియానా చెప్పులు తొడుక్కొని, చెవుల లోలకులలో, కుడిముక్కు పుటమున బేసరిలో, మెడను హారములలో రవ్వలు, నీలాలు, కెంపులు తళుకులీనగా, నెమ్మదిగా పూవుల నరసికొనుచు, వయ్యారముగా నడుగులిడుచు, తోటలో శారదాదేవి విహారము చేయుచుండగా, "నాన్నగారు వచ్చినా"రని కబురు వచ్చినది.
శారదాదేవి జమీందారు గారి తనయ నన్నమాట మరవదు. ఆంధ్రదేశమున తన సుగుణములచే, దాతృత్వ దీక్షచే వంశధార నుండి పెన్న వరకు వేనోళ్ళ వినుతింపబడు శారదాంబ జమీందారిణి గారి మనుమరాలగుటచే నామె పోలికలన్నియు పుణికిపుచ్చుకొన్నది.
'తల్లీ శారదాంబా! ఈ దీపం నువ్వు పెట్టినదమ్మా! ఈ బిడ్డలు నీవారమ్మా! ఈ వంశము నువ్వు నిలిపినడమ్మా' అని యీ నాటికిని జమిందారుగారు తల్లి నెన్నియో వేలమంది జనులు తలచుకొని మొక్కుచుందురు. జమీందారు గారి తండ్రి జీవించియున్నప్పుడును, ఆయన కీర్తిశేషులైన వెనుకను, జమీందారిగారి చిన్నతనములోను, జమీందారు గారు పెద్దలి రాజ్యభారము వహించిన వెనుకను, శారదాంబా జమీందారిణిగారు బ్రతికినన్నాళ్ళు అహోరాత్రులు అన్ని వర్ణముల వారికి అన్నప్రదానము గావించినారు. మాల మాదిగలకు వంటలు చేయించి పెట్టించినారు. ఎందరికో పెండ్లి పేరంటములు చేయించినారు. సంగీత సాహిత్య శాస్త్ర, వేదాది విద్యా పారంగతులకు వార్షికము లొసగి, సంభావించినారు. సంగీత సాహిత్య శాస్త్ర, వేదాది విద్యా పారంగతులకు వార్షికము లొసగి, సంభావించినారు. హైదరాబాదు సంస్థానములో వర్తకము చేసి, కోటికి పడగనెత్తిన గంగరాజు సుజనరంజనరావుగారికామె ఏక పుత్రిక. సుగుణ సంపదయు ధనసంపదయు నామెలో గంగా యమునల వలె సంగమించినవి.
తండ్రిగారు వచ్చిరని తెలియుటతోడనే, శారద మోమున సంతోషము విఱియబార, తలలో తురుముకొనుటకు గోసికొన్న పూవులను సజ్జలో నిడికొని, విసవిస నడచి భవనములోనికి బోయినది. మేడమీద తన గదిలో నద్దముల యెదుట నిలుచుండి పూవులను సవరించుకొని, యా బాలిక నాయనగా రెక్కడ నున్నారో వెంకాయమ్మ నడిగి తెలిసికొని యచ్చటికి బోయినది.
జమీందారుగారు తాను చదువుకొను గదిలో సోఫాపై కూర్చుండి యున్నారు. శారద తల్లిగారు వరద కామేశ్వరీదేవియు నచ్చటనే దిండ్ల కుర్చీలో కూర్చుండి భర్తతో మాట్లాడుచున్నది. జమీందారుగారి అక్క సుందరవర్ధనమ్మయు నచట నిలుచుండి 'ఎందుకోయి, పిలిపించినావు?' అని యడిగినది.
సుందర వర్ధనమ్మగారు విగతభర్తృక హైకోర్టు న్యాయాధిపతి చేసి, లక్షలు సముపార్జించి, న్యాయధర్మములో ప్రఖ్యాతి వహించిన విశ్వనాథంగారామె భర్త. వేదాంత జ్ఞానోపార్జనాసక్తి యామెకు మిక్కుటము. సంతతము ఆమె పట్టుబట్టలతోనే యుండును. ఆమె కుమారుడు తండ్రిబోలి చెన్నపట్టణములో న్యాయవాదవృత్తిలో పేరును, ధనమును వెనుకవేసికొనుచు దివ్యముగ కాలక్షేపము చేయుచున్నాడు. పుత్రునింట తన యాచారాదికములు సాగమి, ధర్మకర్మపరతంత్రుడగు నామెతమ్ముని ఇంటనే యుండి, యాజమాన్యము వహించి, కాలక్షేప మొనర్చుచున్నది.
జమీం: చిన్నమ్మాయికి ఈరోజున పెళ్ళికొడుకు వస్తున్నాడు.
వర్ధనమ్మ, వరదకామేశ్వరి: ఎక్కడ నుంచి, ఎవరు?
జమీం: కొత్త సంబంధం.
వర్ధనమ్మ: మనదేశమేనా? మనదేశములో ఇదివరకు మనం చూసి నచ్చవనుకున్న సంబంధాలేగా అన్నీ!
వరద: జమీందారీకుటుంబమేనా?
జమీం: (నవ్వుచు) నన్ను చెప్పనివ్వండి మఱి. మనదేషమే. జమీందారీ కుటుంబంకాదు గాని పరువైన నియోగులు. చాలా సిరిసంపదా కలవాళ్ళు. (భార్యవంక చూచుచూ) జమీందారులకు కూడా అప్పిచ్చేటంత నిల్వవుంది.
వర్ధనమ్మ: పల్లెటూళ్ళలో మినపకాయ కాల్చుకొని తింటూ డబ్బు నిల్వవేసుకొన్న కోమట్లలాంటి మనవాళ్ళు కొందరున్నారు. అలాంటివాళ్ళు కాదుకదా?
వరద కామే: బాగా అన్నారు వదినా!
జమీం: మనకన్నా మర్యాదకలవాళ్ళు. జమీందారులకు బుద్ధులు నేర్పగల పరువు ప్రతిష్టలు కలవాళ్ళు.
వర్ధనమ్మ: పెళ్ళికొడుకు ఎలా ఉంటాడు?
వరద కామే: ముంజేతి కంకణానికి అద్దమెందుకు వదినా! పెళ్ళివారు వస్తున్నారుగా! పల్లెటూరి ఆంబోతుకేమీ తీసిపోడు లెండి.
వర్ధనమ్మ: ఆ! మరచిపోయాను, పెళ్ళికొడుకు ఏం చదివాడు?
జమీం: పెళ్ళికొడుకుది నవమన్మధాకారం. ఒంట్లో రక్తము లేక పాలిపోయి, అదో మంచి మేలిమి బంగారు రంగని చెప్పుకుంటూ నాలుగడుగులు నడవలేని మన జమీందారి దద్దమ్మ కాడు. అందానికి అర్జునుడు, బలానికి భీముడూ. ఈ సంబంధము కుదిరితే మన శారద అదృష్టవంతురాలు.
వరద: కాకి ముక్కుకు దొండపండు. ఇంతకూ మీకు మావాడు నచ్చలేదు. వాడికేమి లోటో, ఎందుకు నచ్చలేదో నాతో చెప్పారు కాదు. ఖర్చు కొంచెము ఎక్కువ చేస్తే దుర్వ్యయమంటారు. ఓర్వలేనివాళ్ళు కల్పించినవన్నీ నమ్ముతారు. శారద కూడా ఎదుగుతూంది. దాని అభిప్రాయము కూడా అడగడం మంచిది. మీరు నవ నాగరికులు గాదూ! వీరేశలింగంపంతులుగారితో స్నేహము చేసినవాళ్ళేగా! ఆడపిల్లకు ఏ సంబంధం ఇష్టమో అది చేయడమే మంచిది కాదూ?
వర్ధ: ఆ! మరదలుగారు స్వయంవరాలు చేయించమంటారు. శారదను పిలిపించండి.
ఇంతలో మెరుపుతీగవలె శారద యచ్చటికి వచ్చినది. తండ్రిగారు చేతులు చాచుటతోడనే యా బాలిక పూలబంతివలె ఆయన కౌగిలింతలోనికి వచ్చి వ్రాలెను. కుమార్తె శిరము మార్కొని తనప్రక్క సోఫాపై కూర్చుండబెట్టుకొని, జమీందారుగారు 'శారదా, ఎక్కడికి వెళ్ళినావమ్మా' యని ప్రశ్నించిరి.
శా: తోటలో పువ్వులు కోసుకుందామనీ, నీళ్ళు సరిగ్గా తోడాడో లేదో చూద్దామనీ వెళ్ళాను. నాకోసం మీరు చెన్నపట్నం వ్రాసిన పుస్తకం వచ్చిందండి బాబయ్యగారూ. నిన్ననే షేక్స్ పియర్ మొదలుపెట్టింది మా దొరసానమ్మగారు. 'వెన్నీస్ వర్తకుడు' అనే నాటకం. మనం తప్పించుకున్న పుస్తకంలో నాటకాలన్నీ ఉన్నాయి. బొమ్మలు కూడా చాలా బాగా ఉన్నాయండి. కాని 'వెరిటీ ఎడిషన్' కావాలట. అది తెప్పించి పెట్టారూ బాబయ్యగారూ?
జమీం: నీ ఈడున షేక్స్ పియర్ పేరే తెలియదమ్మా నాకు. నీకు మంచి గురువుగారు దొరికింది. నాదగ్గర 'ఆర్డెను ఎడిష'నుంది. అది వెరిటీ కన్నా చాలా మంచిది.
తండ్రి కుమార్తెల కిరువురకు సంభాషణ ఇంగ్లీషులోనే జరిగినది. తండ్రి శారద వైపు చిరునవ్వుతో చూచి ఇంగ్లీషులో నిట్లు పలికెను.
'శారదా! జగన్మోహనరావు సంగతి నీకు చాలా వివరించి చెప్పాను. నీకు సర్వవిధములా తగిన వరుణ్ణి ఈరోజున రప్పిస్తున్నాను. చదువులో మొదటివారిలో మొదటివాడు. రూపసంపదే కాదు, మంచి బలమైనవాడూ, అందమైనవాడూ. ధనంలో మనకెంత ఆస్తి ఉన్నదో అతనికి అందులో సగం ఉన్నది. అతను ఎఫ్.ఎల్.పరీక్షకు వెళ్ళినాడు. మొదటివాడుగా నెగ్గుతాడు. పరీక్షలోనూ, ఆటలలోను నెగ్గిన మెడల్సు, కప్పులు కకివారి షాపంతషాపు పెట్టించవచ్చునన్నారు.'
శారద సిగ్గుపడి చిగునగవుతో మాట్లాడక తలత్రిప్పి యూరకున్నది.
వర్ధనమ్మ గారు తమ్మునితో 'నీతో చెప్పుటకు సిగ్గుపడుతుందేమోనోయి' అని యన్నది.
'వారంతా సాయంత్రమునకు అమ్మాయిని చూడడానికి వస్తారు' అని జమీందారు గారు స్నానమునకు లేచినారు.
