Previous Page Next Page 
ఆత్మబలి పేజి 4


    శోభ మాట్లాడలేదు.
    చివరకు అక్షరాలా శోభ అన్నట్లే జరిగింది. రెండువేల కట్నంతో చదువురాని పార్వతిని చేసుకున్నాడు ప్రభాకరం. చీరలకు కొంత, పెళ్ళి ఖర్చులకు కొంత ఖర్చయి మిగిలినది బ్యాంక్ లో వేద్దాం, వేద్దాం అనుకుంటుండగానే లెక్కకు రాకుండా ఖర్చయిపోయింది. ప్రభాకరం సంపాదన అతని భార్య మందులకూ, పిల్లల పాల డబ్బాలకూ దానికీ సరిపోవటమే కష్టమవుతుంది. ఒకరకంగా కుటుంబానికి ముఖ్యాధారం శోభ సంపాదనే అయింది. దానికి తోడు శోభలో ఏకోశానా స్వార్థం లేదు. తన జీతమంతా ఉమకిస్తుంది. ఉమా ఎంతో సమర్థతతో ఆ సంసారాన్ని నిర్వహిస్తుంది. ఇన్ని కారణాల వల్ల అన్నగా శోభ మీద అధికారం చెలాయించలేడు ప్రభాకర్. తనమీద మరొకరు అనవసరపు అధికారాన్ని చెలాయించటం శోభ కూడా సహించలేదు.


                                      3


    "మాలతి ఆత్మహత్య చేసుకుందిట!"
    గుప్పుమంది వార్త. ఆరోజు లేడీస్ వెయిటింగ్ రూంలో ఎవరి నోట విన్నా, ఈ వార్తే! రకరకాల వ్యాఖ్యానాలు!
    "ఎవరినో ప్రేమించిందట! ప్రేమ సఫలం కాలేదు. ఆత్మహత్య చేసుకుంది."
    "అదికాదు. అతడు నమ్మించి మోసం చేశాడుట! అందుకని."
    "మోసమంటే? మరొకరిని చేసుకున్నాడా?"
    "బహుశః నెల తప్పిందేమో! అంతా అయ్యాక ఆ మహానుభావుడు నాకు తెలియదని ఉండవచ్చు. లేకపోతే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుందీ!"
    "అయినా, ఈ రోడ్ సైడ్ రోమియోలను నమ్ముకోమన్నదెవరు? రెండు ఈలలు వేసి నాలుగు పాటలు పాడగానే ప్రేమ అయిపోతుందేమిటీ?" ఇలా రకరకాలుగా ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తున్నారు.
    మాలతి ఆత్మహత్య వార్త వింటూనే రాపడిపోయిన ఉమకు ఈ వ్యాఖ్యానాలు శూలపు పోట్లలా ఉన్నాయి. మాలతి ఉమకు స్నేహితురాలు! ఏంటో ఆత్మీయురాలు. ఉమకు మతిపోయినట్లుగా అయింది. కాలేజీకి సెలవు ఇచ్చారు. అందరూ తిరుగుముఖాలు పట్టారు. చింతలపూడికి బస్ ఉన్నా, ఉమ నడిచే వెళుతుంది. సాధ్యమైనంతవరకూ ఖర్చు తగ్గించటమే ఆమె ఆశయం. శోభ కూడా ఎన్నోసార్లు బస్ లో రమ్మని హెచ్చరించింది. "పెద్ద దూరం కాదు. నడుస్తానులే! ఆరోగ్యానికి మంచిది" నవ్వుతూనే సమాధానమిచ్చింది. ఉమ సహనానికీ, సాధు స్వభావానికీ ఆశ్చర్యపోతూ లోలోన ప్రశంసించుకోవటం కంటే శోభ చెయ్యగలిగిందేమీ లేకపోయింది. ఒకప్రక్క విశాలమైన తమ్మిలేరూ, మరొకప్రక్క ఏవేవో తోటలూ ఉన్న ఆ నిర్మానుష్యమైన రోడ్డుమీద నడుస్తూ మాలతి గురించే ఆలోచించసాగింది ఉమ.
    అందరూ చేస్తున్న వ్యాఖ్యానాలు నిజమేనా? మాలతి జీవితంలో మోసపోయిందా? మాలతి తనతో ఎంతో సన్నిహితంగా వుంటుంది. అయినా ఏనాడూ ఏ ప్రేమ వ్యవహారాలూ చర్చించలేదు. ఆ మధ్యమాత్రం ఎవరో రామారావు ఊరికే తనవెంట పడుతున్నాడనీ, అల్లరిగా మాట్లాడుతున్నాడనీ చెప్పి విసుక్కుంది. వెంటనే, 'కాని బాగుంటాడు కదూ?' అని కూడా అంది. అంతే. ఆ తర్వాత ఏమైనా జరిగిందా? ఏమో? ఎంత దారుణం!
    చటుక్కున ఆమెకు రోజూ తన వెనుక మోటారుసైకిలు మీద వస్తున్న వ్యక్తి గుర్తుకొచ్చాడు. ఆకర్షణీయమైన విగ్రహం. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. రోజూ సాయంత్రం తాను కాలేజి నుండి ఇంటికి వెళ్ళే సమయంలో చింతలపూడి రోడ్డుమీద తారసపడుతున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కు తిరిగి చూస్తాడు. కుతూహలంతో అతనిని గమనించే ఉమ కళ్ళతో అతని కళ్ళు చాలాసార్లు కలుసుకున్నాయి. సిగ్గుతో ముడుచుకుపోయి తల మరింత దించేసుకునేది ఉమ. ఈరోజు అతను తటస్థపడలేదు. తమ కాలేజీకి సెలవని అతనికి తెలియదు కాబోలు! తన ఆలోచనకు తనే నవ్వుకుంది ఉమ. అతడు తన కొరకే వస్తున్నాడని ఏముందీ? లక్షమంది లక్షపనుల మీద పోతుంటారు. కాని అతడు వెనక్కు తిరిగిచూస్తాడు. తను మాత్రం చూడలేదా? అతనంత ఆకర్షణీయంగా ఉన్నాడు గనుక చూసింది. అయితే తనుకూడా....ఛీ! పాడు మనసు ఎలా పరుగులు పెడుతుందో?
    దిగులుగా ఇల్లు చేరుకుంది. మనసంతా చిరాకుగా ఉంది. ఆ చిరాకంతా మాలతి పోయినందుకెనా అని మనసు తను ప్రశ్నించుకుంది. "అతడు కనపడలేదని" లోలోపల ఏదో గొంతు నిశ్శబ్దంగా పలికింది.
    ఆ రాత్రి ఉమకు ఎన్నో పీడకలలు వచ్చాయి. తనను ఎవరో ప్రేమగా పిలుస్తున్నారు. అతనే - రోజూ స్కూటర్ మీద తనకు తారసపడే వ్యక్తి. తనను చేతులు జాపి ఆహ్వానిస్తున్నాడు. అతని కళ్ళలో తనపట్ల ఆరాధన. తను పరవశంతో మైమరచిపోయింది. జాపిన అతని చేతుల్లో వాలిపోయింది. మరుక్షణంలో అతని హృదయంలో నుండి ఏదో మంట తనను కాల్చి భస్మం చేయసాగింది. భయంత్ కెవ్వున కేకవేసి లేచి కూర్చుంది ఉమ. తెలతెల వారుతోంది. తెల్లవారుఝాము కలలు నిజమవుతాయంటారు. ఇదేం కల? ఉమ కేకకు శోభకు కూడా మెలకువ వచ్చింది.
    "ఏమిటి ఉమా?" అంది.
    "అసలివాళ రాత్రంతా నువ్వేదో కలవరిస్తూనే ఉన్నావు. ఎందుకింత అశాంతిగా ఉన్నావ్?"
    "మా క్లాస్ మేట్ మాలతి ఆత్మహత్య చేసుకుంది. ఆ కారణంగా మనసంతా చికాగ్గా ఉంది."
    "ఆత్మహత్యా! నాకు ఆత్మహత్య చేసుకున్నవాళ్ళంటే జాలి లేదు. కోపం, అసహ్యం. ఒట్టి పిరికివాళ్ళు! ఏం సాధిద్దామనో ఈ పిచ్చి పనులు?
    "పరిస్థితులు తలకు మించితే, ఏం చెయ్యగలరక్కయ్యా!
    "ధైర్యంగా ఎలాంటి పరిస్థితులనయినా ఎదుర్కోవాలి. తనకలాంటి ధైర్యముందో లేదో ముందుగానే ఆలోచించుకోవాలి. అలాంటి ధైర్యంలేని వాళ్ళు ఆ పరిస్థితులకు దూరంగా ఉండాలి. అంతేగాని బలహీనతతో ప్రలోభాలకు లొంగిపోయి పిరికితనంతో పరిణామాల నెదుర్కోలేకపోవటం నీచం..."
    ఉమ ఇంక వాదించలేదు. తెల్లవారవస్తుండటం వల్ల పక్కమీంచి లేచిపోయింది.
    ఆరోజు సాయంత్రం అతను తారసపడితే వంచిన తల ఎత్తకూడదనీ, అతను వెనక్కు తిరిగిచూసినా తానది గమనించనట్లు నిర్లక్ష్యంగా ఉండాలనీ గట్టిగా నిర్ణయించుకొంది ఉమ.
    స్కూటర్ చప్పుడు వినిపించింది. గబుక్కున తల వంచేసుకున్దిల్. స్కూటర్ దాటిపోయింది. నెమ్మదిగా తలెత్తింది. అతను కాడు. అతను తనకు బాగా గుర్తు. వెనుకనుండి కూడా గుర్తు పట్టగలదు. ఆ తరువాత వారం రోజులవరకూ అతను కనపడలేదు. ఉమ మనసు అల్లకల్లోలమయిపోయింది. అణచి పెట్టుకున్న కొద్దీ అతని ఆలోచనలు మనసంతా క్రమ్ముకుంటున్నాయి. జరిగిందేమీ లేదు. పోతూ పోతూ అతను చూసేవాడు. క్షణికంగా తమ చూపులు కలిసేవి. అంతే! ఎన్నో జన్మలనుండీ తమ మధ్య విడదీయరాని అనుబంధమున్నట్లు అనుభూతి. అతనికి వంట్లో బాగులేదేమో! ఎందుకు రాలేదో? ఇవే ఆలోచనలు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS