Previous Page Next Page 
ఆత్మబలి పేజి 3


    బట్టలూ తువ్వాలూ తీసుకుని స్నానానికి వెళ్ళబోతున్న శోభను పై నుండి క్రిందకు పరిశీలనగా చూస్తూ "రాత్రి ఎక్కడున్నావ్?" అంది కామాక్షమ్మ కంఠంలో అనుమానాన్నంతా ధ్వనింపజేస్తూ.
    శోభ ఠక్కున ఆగిపోయింది. నిర్లక్ష్యంగా కామాక్షమ్మ ముఖంలోకి చూస్తూ "ఒకడు దొరికాడులే, వాడితో ఉన్నాను" అనేసి వెళ్ళిపోయింది స్నానాల గదిలోకి. నిర్ఘాంతపోయి నిల్చున్న తల్లిని సమీపించింది ఉమ.
    "అమ్మా! అక్కయ్యతో అలా మాట్లాడవద్దని ఎన్నిసార్లు చెప్పాను? నీకు చేతనయితే నెమ్మదిగా చెప్పు. లేకపోతే కల్పించుకోకుండా ఊరుకో. అంతేకాని సూటిపోటిమాటలన్నావంటే మరింత రెచ్చిపోతుంది. అక్కయ్యకు నీకంటే ఎక్కువ తెలుసు. తన జీవితాన్ని తను దిద్దుకోగలదు. అనవసరంగా దాని మనసు చికాకు పెట్టకు."
    "దొరికిందిలే! ఎలా అయితేనేం ఒక అక్కయ్య" కసిగా అంది కామాక్షమ్మ.
    "అక్కయ్య దొరకబట్టే మనమింత తినగలుగుతున్నాం" చురుకుగా అంది ఉమ.
    కామాక్షమ్మ నోరెత్తలేకపోయింది.
    శోభ నిర్లక్ష్యమైన ధోరణి ఆమెకెంత కంటగింపుగా ఉన్నా, శోభ కుటుంబానికి అండ అన్న సత్యాన్ని అంగీకరించకుండా ఉండలేదు.
    శోభ స్నానంచేసి బట్టలు మార్చుకొచ్చేసరికి ఉమ పప్పు రుబ్బుతోంది.
    "ఏం చేస్తున్నావు ఉమా!" అంది జాలిగా శోభ.
    "గారెలు చేద్దామనుకుంటున్నా నక్కా! వారమంతా మాకోసం కష్టపడతావు. ఒక్కరోజు నీకు కాస్త టిఫిన్ చేద్దామని."
    "ఆ అభిమానానికి శోభ కదిలిపోయింది. ఉమ దగ్గరగా మరో పీట వేసుకుని కూర్చుంది. "నేనూ సాయం చేస్తాను ఉమా!"
    "వద్దులే అక్కయ్యా! చిటికెలో అయిపోతుంది. నిన్న ఏం జరిగింది.
    శోభ ఉత్సాహంగా అంతా వర్ణించింది.
    "నువ్వూ రావలసింది ఉమా! ఎప్పుడూ చాకిరీలో మునిగి తేలుతుంటావు!" ఉమ శాంతంగా నవ్వింది.
    "మనకు తండ్రి లేడు అక్కయ్యా! కుటుంబ బాధ్యత జ్ఞానం వచ్చిన మన అందరిపైనా ఉంది. కుటుంబం కోసం నువ్వు చెయ్యగలిగిన సహాయం నువ్వు చేస్తున్నావు. నేను చెయ్యగలిగిన సహాయం నేను చేస్తున్నాను. పని చేస్తున్నానని నామీద జాలిపడుతున్నావు మరి, ఇంత సంపాదిస్తున్నావు. మంచి చీరెలు కొనుక్కోవు. చేతికి వాచీ కూడా లేదు. ఫలహారాలు అవీ తినవు. నీమీద నేనూ జాలిపడనా?"
    "అది కాదు ఉమా! వదినేం చేస్తుందీ? చదువుకుంటున్న నీ నెత్తిమీద పనులన్నీ పడేసి ఆవిడగారేం చేస్తున్నట్లు?"
    "హుష్! వినపడుతుంది. పాపం! వదిన నన్ను పనులు చెయ్యమని బలవంత పెట్టదు. తను పిల్లలతో నానా అవస్థా పడుతూంది. వరసగా కాన్పులు రావటంతో బలహీనమైపోయింది. ఆమె అవస్థ చూడలేక నేనే సాయపడుతున్నాను.
    "పిల్లలు! సమస్యలన్నింటికీ ప్రారంభం ఇదే!"
    ఏదో అనబోయి ఆగిపోయింది శోభ. ఉమ నవ్వుతూ అనదలుచుకున్నది నాకు తెలుసు. నువ్వూ అన్నయ్యా పుట్టిన తరువాత మన నాన్నగారు అమ్మను పెళ్ళిచేసుకోకుండా ఉంటే, చేసుకున్నా ఇంతమంది పిల్లల్ని కనకుండా ఉంటే, మనకిన్ని సమస్యలుండేవి కావని కదూ!" అంది.
    శోభ నిట్టూర్చింది.
    "కనీసం అన్నయ్యయినా వివేకంతో వ్యవహరిస్తే బాగుండును."
    "ఇద్దరేగా! బహుశః జాగ్రత్తపడతాడులే." ఉమ పిండి రుబ్బటం పూర్తయింది.
    శోభ అక్కడినుంచి లేచి వరండాలోకి వచ్చింది. చిన్న పెంకుటిల్లు. ఉన్నవన్నీ మూడు గదులు. అందరూ అందులోనే సర్దుకోవాలి. వరండాలోనే శోభ అన్నయ్య ప్రభాకర్ ఏదో వ్రాసుకుంటున్నాడు. శోభను చూడగానే తలెత్తి "ఎప్పుడొచ్చావ్?" అన్నాడు.
    "ఒక గంటవుతుంది." తూచి సమాధానం చెప్పింది శోభ.
    ఇంకా ఎన్నెన్నో అడగాలనుకున్న విషయాలు ప్రభాకరం గొంతులోనే ఆగిపోయాయి. ప్రభాకరం చదువు మెట్రిక్ తో ఆగిపోయింది. పాపం తండ్రి కాలేజీలో చేర్పించకపోలేదు. కాని కాలేజీలో అతడికి చదువు మీద కంటే మిగిలిన విషయాల మీద శ్రద్ధ ఎక్కువ కావటం వల్ల కనీసం పి.యు.సి. అయినా దాటలేకపోయాడు. శోభ పి.యు.సి. ఫస్ట్ క్లాస్ లో పాసవటంతో ప్రభాకర్ కు ఉడుకుమోత్తనం వచ్చింది. "ఆడవాళ్ళకు చదువెందు"కని శోభ చదువు మాన్పించాడు. శోభ పైచదువుల కెళ్తానని ఎంత పట్టుబట్టినా ప్రయోజనం లేకపోయింది. శోభ మొదటినుండి చాలా పట్టుదల గల మనిషి. తను అనుకున్నది సాధించకుండా నిద్రపోదు. తన ప్రయత్నాన్ని ఎవరైనా ఆటంకపరిచినకొద్దీ ఆమె పట్టుదల మరింత అధికమవుతుంది. ఆమె తన చదువు మానలేదు. ప్రైవేట్ గా బి.ఏ.కు కట్టి క్లాసులో పాసయింది. అప్పటికి రెండేళ్ళుగా మంచంలో తీసుకుంటున్న శోభ తండ్రి శాశ్వతంగా కళ్ళు మూశాడు. వస్తున్న పెన్షన్ ఆగిపోయింది. శోభ ఏలూరు తాలూకా ఆఫీసులో యు.డి.సి. ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకుని. మళ్ళీ ప్రతిఘటించాడు ప్రభాకరం.
    "పెళ్ళి కావలసిన పిల్లవి. ఇలా ఉద్యోగాలు చేస్తానంటావేమిటీ?"
    "నాకు తగిన సంబంధం నువ్వు తెచ్చిన మరుక్షణం నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తాను. నేను సరదాకి ఉద్యోగం చెయ్యటం లేదు. ఖాళీగా ఉండలేక చేస్తున్నాను. మన కుటుంబానికి అవసరం గనుక చేస్తున్నాను."
    ఒక్కొక్క మాట ఒక్కొక్క కొరడా దెబ్బలా తగిలింది ప్రభాకరానికి.
    శోభ ఉద్యోగంలో చేరింది. ప్రభాకరానికి పెళ్లి సంబంధాలు రాసాగాయి.
    "నేను కట్నం తీసుకుని, ఆ కట్నంతో నీకు పెళ్ళి చేస్తాను." అన్న ప్రభాకరం మాటలకి పకాలున నవ్వింది శోభ.
    "నవ్వుతావేం?" రోషంగా అన్నాడు ప్రభాకరం.
    "ఉమ్మమాట అంటాను. ఎక్కువ కట్నం ఇచ్చుకోగలిగితే యువతి నిన్ను చేసుకోదు. నీకొచ్చే వెయ్యో, రెండువేలో నా పెళ్లినాటిదాకా ఆగవు. నామాట విని నీలాగే మెట్రిక్ పాసయిన అమ్మాయిని కట్నం ప్రసక్తి లేకుండా చేసుకో! ఇద్దరూ సంపాదిస్తుంటే వేన్నీళ్ళకు చన్నీళ్ళు"
    ఇంతెత్తున లేచాడు ప్రభాకర్.
    "నా భార్య ఉద్యోగాలు చేసి ఊళ్లేలక్కరలేదు. నీలాగా డిగ్రీలు లేకపోయినా, పెళ్ళాం బిడ్డలకు తిండి పెట్టగలనులే!" 


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS