Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 3

అదే స్పీడుతో కారుని తరుముతూ వెళ్తున్నాడు సాహస్.
కొద్ది నిముషాల తర్వాత కారు ఒక పెద్ద హోటల్ ముందు ఆగింది. కుర్రాళ్ళు కారు దిగి గబగబ లోపలికి పరిగెత్తారు.
వాళ్ళతోబాటే లోపలికి పరిగెత్తాడు సాహస్.
కానీ లోపల వాళ్ళు కనబడలేదు.
అంతలోగానే బాగా కండలు తిరిగిన ఒక మనిషి అతన్ని అడ్డగించాడు.
"ఎక్కడికి? హోటల్ ఇంకా తెరవలేదు"
"నలుగురు రోగ్స్ హోటల్లోకి వచ్చారు. వాళ్ళని పట్టుకోవాలి"
"లోపలికి ఎవరూ రాలేదు" అన్నాడు మొరటు మృగంలాంటి ఆ మనిషి.
అతన్ని ఎగాదిగా చూశాడు సాహస్.
అతను బుకాయిస్తున్నాడని అర్థమయింది సాహస్ కి.
ఆ నలుగురు కుర్రాళ్ళకీ, ఈ హోటల్ కీ ఏదో సంబంధం వుండే వుండాలి. అసలా హోటలే అంత మంచిది కాదు. శంకర్ అనే ఒక గ్యాంగ్ స్టర్ దానికి ఓనరు.
"శంకర్ వున్నాడా?" అన్నాడు సాహస్.
"లేడు!" అన్నాడు డోర్ మాన్ తక్షణం!
బోర్ గా అతనివైపు చూశాడు సాహస్.
చూడూ! మీలాంటి అల్లాటప్పాగాళ్ళతో వ్యవహారం అంటేనే నాకు అలర్జీ! వెళ్ళి శంకర్ గాడితో చెప్పు! సాహస్ వచ్చాడని!"
అతను ఒక్కక్షణం ఆలోచించి, లోపలికి వెళ్ళాడు. నిముషంలో ఇంకో మనిషిని వెంటబెట్టుకొచ్చాడు.
అతను శంకర్ కాదు!
"నేను శంకర్ కి ప్రైవేట్ సెక్రటరీని! నా పేరు జేమ్స్! చెప్పు! శంకర్ తో నీకేం పని?"
"నేను శంకర్ తోనే మాట్లాడాలి!" అన్నాడు సాహస్.
అసందిగ్ధంగా ఒకటి రెండు క్షణాలు సాహస్ వైపు చూశాడు జేమ్స్. తర్వాత ఏమనుకున్నాడో గానీ, "సరే! రా!" అంటూ లోపలికి దారితీశాడు.
అతని వెంటే లోపలికి వెళ్ళాడు సాహస్.
ఒక హాలూ, రెండు గదులూ దాటాక మేనేజర్ గదిలోకి వచ్చారు. గదిలోకి రాగానే అతనికి కనబడ్డాడు రఘురాం. రఘురాం ఒక యాంటీ నేషనల్!
ప్రతి వ్యక్తిలోనూ ఏదో లోపం వుంటుందని తెలుసు సాహస్ కి. అనేకమైన బలహీనతలని అతను క్షమించగలడు! జాతి ద్రోహాన్నీ, దేశద్రోహాన్నీ, సంఘవిద్రోహాన్నీ తప్ప!
ఈ మూడు లక్షణాలూ ఇంకా అనేకమైన అవలక్షణాలతో బాటు రఘురాంలో వున్నాయి. రఘురాం ఎప్పుడూ తనకి ఎదుట పడకుండా వుండాలని తప్పించుకు తిరుగుతూంటాడు.
అలాంటిది - ఇవ్వాళ అతను నిర్భయంగా నిలబడి నవ్వుతూ తనవైపే చూస్తున్నాడు.
సాహస్ అలా ఒక్క క్షణం ఆలోచనలో వుండి, అంతలోనే తేరుకున్నాడు.
ఆలోగానే పదిమంది గూండాలు పక్కగదిలో నుంచి వచ్చి ఒక్కసారిగా సాహస్ మీద పడ్డారు. ఇద్దరేమో సాహస్ చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. జేమ్స్ వచ్చి, సాహస్ జేబులు చెక్ చేసి, ఆయుధాలేమీ లేవని తేల్చుకున్న తర్వాత ఇంకో తలుపు తీశాడు.
ఆ తలుపు వెనక నిలబడి వుంది - తను ఎవరినయితే రక్షించడానికి ఇక్కడికి వచ్చాడో ఆ ప్రగతి!
ఆమె పెదిమల మీద అపహాస్యంతో కూడిన చిరునవ్వు!
"మిస్టర్ సాహస్! యూ ఆర్ ట్రాప్ డ్!" అంది ప్రగతి వ్యంగ్యంగా!
"యూ ఆర్ ట్రాప్ డ్ సాహస్!" అంది ఆ అమ్మాయి మళ్ళీ.
సరిగ్గా అదే క్షణంలో మొరటు మృగంలా వున్న జేమ్స్ సాహస్ ని బలంగా ముందుకు నెట్టాడు.
కొద్దిగా తూలి, ఆ ఫోర్స్ కి నాలుగడుగులు ముందుకు వెళ్ళిపోయాడు సాహస్. పక్క గదిలోకి అడుగు పెట్టాడు.
అది ఒక పెద్ద కాన్ఫరెన్సు హాలు.
అందులో దాదాపు ఒక వందమంది మనుషులు కూర్చుని వున్నారు.
అది ఎయిర్ కండిషన్డ్ హాలు. అయినా కూడా అక్కడ వున్న వాళ్ళలో అనేకమంది మొహమంతా చెమట పట్టి వుండడం గమనించాడు సాహస్.
మనసుకి కళ్ళు అద్దాలలాంటివి. మనసులో వున్న భావాలు కళ్ళలో కనబడిపోతూ వుంటాయి. సాధారణంగా ఒక్కొక్క మనిషిదీ ఒక్కొక్క స్వభావం - ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మూడ్! స్వభావాన్ని బట్టీ, మూడ్ ని బట్టీ కళ్ళలో భావాలు వేరు వేరుగా కనబడుతూ వుంటాయి. పెరిగిన వాతావరణాన్ని బట్టీ, ఉన్న హోదాని బట్టీ కూడా మొహంలో ఎక్స్ ప్రెషన్స్ మారుతూ వుంటాయి.
ప్రస్తుతం అక్కడ వున్న మనుషుల్లో రకరకాల తరగతులకు చెందిన వాళ్ళు వున్నారు. మేక గెడ్డం లాంటి 'గోటీలు పెట్టుకున్న సైంటిస్టులూ - బట్టతలా, బానబొజ్జలతో సూట్లు వేసుకుని వున్న "కేప్టెన్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ" అనదగ్గ ప్రముఖ పారిశ్రామికవేత్తలూ, బతకలేక బతుకుతూ, బక్కచిక్కిపోయి వున్న మధ్య తరగతి మేధావులూ, కాయకష్టం చేసే వర్గంలో నుంచి ముందుకు వచ్చి, కాసులు వెనకేసుకున్న కార్మిక నాయకులూ...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS