బైటకు చూడగానే రాకేష్ కి షాక్ తగిలినట్టయింది. సూర్యుడు నడినెత్తిన తీక్షణంగా ప్రకాశిస్తున్నాడు. ఎండ ఫెళ్ళున కాస్తోంది.
4
ఏ.జి.బి.యస్సీ. కోర్సు ఆఖరి సంవత్సరంలో రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్ పీరియన్స్ ప్రోగ్రాం (RAWE) అని వుంటుంది. గ్రామాలకి వెళ్ళి పూర్తిగా అక్కడి గ్రామస్థులతో కలిసిపోయి ఆర్నెల్లపాటు వుండాలి. అక్కడే తినాలి. పడుకోవాలి. రైతులు వ్యవసాయం చేసే పద్దతులు చూడాలి. వాళ్ళకి సలహాలు ఇవ్వాలి. ఒకోసారి మనం చెప్పే సలహాకన్నా వాళ్ళు చెప్పే అనుభవమే గొప్పదయితే తెల్లమొహం వెయ్యాలి.
ఇలా ఆర్నెల్లు గడపాలి.
ఒక్కొక్క గ్రామానికీ కొంతమందిని పంచుతారు. విద్యార్ధులు బ్యాచ్ లుగా విడిపోతారు. వీళ్ళు గ్రామంలో ఎవరితోనయినా కలిసి వుండవచ్చు. అది వీలుకాకపోతే విడిగా వండుకుంటూ మానేజ్ చెయ్యాలి.
కేదారగౌరి, రాకేష్ ఒక బ్యాచ్ లో వున్నారు. ఆ ఊళ్ళో కరణంగారు తమ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. లంకంత ఇల్లు వాళ్ళది. వంట మాత్రం స్వంతమే. స్వంత సంసారం పెట్టినట్టు గమ్మత్తుగా వుండేది. ఉప్పు, బియ్యం కొనుక్కోవడం, వంట వండుకోవడం- అబ్బాయిల అవస్థ.... మండుటెండలో పొలాల్లో తిరగటం....
ఈ 'రావే' చాలా కొత్తగానూ థ్రిల్లింగ్ గానూ వుంటుంది.
నచ్చిన అమ్మాయి బ్యాచ్ లో వుంటే మరీ. (ఈ కోర్సు పెట్టిన మొదట్లో విద్యార్ధుల్ని, విద్యార్ధినుల్ని విడివిడిగా పంపేవారు. తరువాత కలిపి పంపుతున్నారు. ఆర్నెల్లపాటూ పైర్ల మధ్య తిరగడం జోకులు అల్లరి) ఇదంతా ఇలా పక్కన పెడితే-
రైతుల దగ్గర్నుంచి నేర్చుకునేది చాలా వుంటుంది. నేర్చుకున్న థియరీకి, పొలంలో చేసే పన్లకీ చాలా తేడా వుంటుంది. ఏపుగా పెరిగిన బంగాళాదుంప మొక్కల్ని చూసి ఇవి ఎప్పుడు ఫలిస్తాయని అడిగి నాలుక్కర్చుకునే స్టూడెంట్లు, గింజల్లేని ద్రాక్షని సృష్టించినట్లే గింజల్లేని వేరుశనగని ఎందుకు తయారుచేయలేమని నిలదీసే అతి తెలివి ప్రబుద్దులూ- నాగల్ని సరిగ్గా పట్టుకోవటం చేతకాని విద్యార్ధులు, ఎద్దుల్ని సరిగ్గా కంట్రోల్ చేయడం చేతకాని విద్యార్ధినులు వగైరా... మొత్తంమీద లోతుకి వెళ్ళేకొద్దీ ఉత్సాహం కలిగించే డ్రైసబ్జెక్టు- కేదారగౌరిలాంటి వారికి మరీ.
రాత్రి పన్నెండింటికి ఆమె నిద్రలో వుంది. పెద్ద పెంకుటిల్లు అది. వసారాలో పడుకుని వుంది. పైరుమీద నుంచి వచ్చేగాలి చల్లగా ప్రశాంతంగా వుంది.
ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆమెకు మెలకువ వచ్చింది.
గుమ్మం దగ్గిర రాకేష్ నిలబడి వున్నాడు.
చంద్రుడి వెలుతురు ఇద్దరిమీదా పడుతోంది.
ఆమె చప్పున లేచింది. "ఏం కావాలి రాకేష్!" అంది సర్దుకుంటూ.
రాకేష్ నవ్వేడు. "ఏంలేదు గౌరీ. నువ్వు అలా పడుకుంటే చూడటం ఎంతో బావుంది. నిన్ను డిస్టర్బ్ చేశానా! సారీ!" అంటూ నెమ్మదిగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అతడిలో తప్పు భావన ఏదీ కనబడలేదు. ఒక ఆరాధన వుందంతే.
తను అన్న మాటలు ఆ అమ్మాయి మనసులో స్పందనని కలిగిస్తాయనీ- అలా పవిత్రంగా, దూరంగా నిలబడి ఆరాధించే తనమీదే ఆమెకి గౌరవం పెరుగుతుందనీ అతడికి తెలుసు. ఆమె అంతట ఆమె చేరువకావడం కోసం వేచి వున్నాడు. అలా ఎన్నాళ్ళయినా వేచి వుండగల ఓర్పు వుంది అతడికి. కొద్దికొద్దిగా ఆమెని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.... తను దూరంగా వుంటూ!
ఆమె వెనక్కి వాలింది.
ఆమె దృష్టి గుమ్మంమీద పడింది.
అతడు ఎంతసేపట్నుంచీ అలా నిలబడి వున్నాడో? ముట్టుకోవాలంటే తనని స్పృశించవచ్చు. కానీ అలా చెయ్యలేదు. దూరంగా నిలబడి ఆరాధిస్తున్నాడు. ఇరవై రెండేళ్ళ అమ్మాయికి చాలా గొప్ప అనుభూతి అది. అహాన్ని సంతృప్తిపరిచే గొప్ప అనుభవం అది.
కానీ ఆమెకి కాదు.
తాను అందంగా వుండదని నిశ్చయంగా ఆమెకి తెలుసు. పడే వెన్నెల్లో తనని చూస్తూ అలా గంటల తరబడి నిలబడే అవసరం ఎవరికీ రాదు, కేవలం తనని సంతృప్తి పరచడానికి ఆ మాట అంటే తప్ప. అది ఆత్మవంచన.
ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంది.
ఆత్మవంచన ఆమెకి అసలు గిట్టదు.
............
మొత్తం పాతికమందిదాకా వున్నారు స్టూడెంట్లు. అందులో ఆరుగురు అమ్మాయిలు. అందరూ పక్కపక్క గ్రామంనుంచి వచ్చి కలిశారు.
కొన్నిరోజుల తరువాత కలవడం వలన అందరికీ హుషారుగా వుంది. ఈ రోజు ఆదివారం.
పాటలూ- మిమిక్రీ- అంత్యాక్షరి....
ఆ గ్రూప్ లో అందరికన్నా హుషారయినవాడు సత్యమూర్తి. రాకేష్ మీద పారసైట్ లా ప్రతీ విషయానికీ ఆధారపడుతూ వుంటాడు.
"ఇప్పుడొక చిన్న గేమ్" అన్నాడు సత్యమూర్తి. "కాస్త తెలివితేటలు ఉపయోగించవలసింది".
అందరూ ఆసక్తిగా చూశారు.
"నేను వరసగా ప్రశ్నలు అడుగుతాను. అందరికీ తెలిసినవే.... మీరు కాగితాల మీద జవాబులు వ్రాయండి. అన్నీ కరెక్టుగా వ్రాసినవాళ్ళు గెలిచినట్టు-"
"వాళ్ళకో బహుమతి కూడా వుంటుంది" పక్కనుంచి అన్నాడు రాకేష్.
"మాకు తెలియని ప్రశ్నలు వస్తేనో?"
"తెలియకపోవడం అన్న ప్రశ్నలేదు. ఎక్కువమంది ఏదంటే అదే కరెక్టు ఆన్సరు. మొదటి ప్రశ్న.... తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలుతున్న కథానాయకుడు ఎవరు?"
అందరూ ముసిముసి నవ్వుల్తో తమ తమ అభిమాన హీరో పేరు వ్రాశారు. పద్దెనిమిది ఓట్లు సురేష్ కుమార్ కి పడ్డాయి.
సత్యమూర్తి అన్నాడు, "గెలవాలంటే మీ అభిప్రాయం కాదు వ్రాయాల్సింది. లోకాభిప్రాయం. ఇది దృష్టిలో వుంచుకుని జవాబు వ్రాస్తే మీరు గెలుస్తారు. రెండో ప్రశ్న- మన బ్యాచ్ లో అందరికన్నా అందమయిన అమ్మాయి ఎవరు?"
'ప్రీతి'కి ఇరవై ఓట్లు పడ్డాయి. ఆ అమ్మాయిలో అందం కన్నా స్టయిల్ ఎక్కువ. కానీ ప్రజాభిప్రాయం- (మాస్ కదా!)
అప్పటికప్పుడు ఐడియా వచ్చి సత్యమూర్తి లతల్తో కిరీటం చుట్టి ఆమె తలమీద పెట్టాడు.
అందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు.
"అందరికన్నా నెమ్మదైన ఒద్దికైన అందరికీ ఇష్టమైన అమ్మాయి ఎవరు?"
కేదారగౌరికి ఇరవై నాలుగు ఓట్లు పడ్డాయి.
ఒక్క ఓటు పడలేదు. అది కేదారగౌరిదే.
"అందర్లోకీ అందమయిన కుర్రాడు ఎవరు?"
రాకేష్ కి ఇరవై అయిదు ఓట్లు పడ్డాయి.
"ఈ శుభ సమయంలో రాకేష్ మనందరికీ ఈ రాత్రికి పట్నం నుంచి డిన్నర్ తెప్పిస్తాడు" అని అనౌన్స్ చేశాడు సత్యమూర్తి... చప్పట్లు.
"అందర్లోకి అందవికారుడు?" అన్నాడు రాకేష్.
అకస్మాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వాతావరణాన్ని తేలిక చేయడానికి సత్యమూర్తి "అవును అతడికి 'అష్టావక్ర' అన్న బిరుదు ఇవ్వబడుతుంది" అని అనౌన్స్ చేశాడు. విద్యార్ధులు ముసిముసిగా నవ్వుకుంటూ ఫిలప్ చేశారు.
ఇరవై నాలుగు ఓట్లు పడ్డ వ్యక్తి లేచి నిలబడ్డాడు. అతడు నిజంగా అష్టావక్రుడు కాదు గానీ అంత అందవిహీనుడే. నల్లగా వున్నాడు. నుదురు విశాలంగా వుంది. అందరికీ నవ్వుతూ నమస్కారం పెట్టాడు. చుట్టూ వున్నవాళ్ళు పెదాలు బిగించి నవ్వు ఆపుకోడానికి ప్రయత్నిస్తున్నారు. కోతి మనసు, సంస్కారపు పొరని దాటి రావడానికి ప్రయత్నం చేస్తూంది.
అతడి పేరు సిద్ధార్థ.
కేదారగౌరి అతడివైపు సానుభూతిగా చూసింది. అతడు నవ్వే ఆ నవ్వు వెనక ఎంత విషాదం వుందో ఆమె కొక్కదానికే తెలుస్తూంది. అర్ధం చేసుకోగలదు కూడా.
ఇంకొకరాయితే ఆ అసహ్యకరమయిన పరిస్థితిలో కోపం తెచ్చుకోవటమో, ఉక్రోషంతో లేచిపోవడమో చేస్తారు.
అతడికి ఇరవై నాలుగు ఓట్లు పడినయ్. ఎవరిదో ఒక ఓటు పడలేదు. తను అసలు ఎవరికీ వేయలేదు. అంటే.....అంటే....
తన ఓటు కూడా అతడు తనకే వేసుకున్నాడన్న మాట.
5
అగ్రికల్చరల్ స్టూడెంట్లు (మొగవాళ్ళు౦ ఫీల్డు ప్రాక్టికల్స్ లో తప్పనిసరిగా నిక్కర్లు వేసుకోవాలి. ఆడవాళ్ళకి కూడా ఆ సౌలభ్యం కలిగించాలని కొందరు ఉత్సాహవంతులైన స్టూడెంటు లీడర్లు వాదించారు కానీ వాళ్ళ కోర్కె ఫలించలేదు.
రాకేష్ బురదలో అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకి నడిచాడు.
పొలంలోకి వచ్చే నీటిని సర్దుతున్నాడు ఒక వృద్ధుడు. సన్నగా అస్థిపంజరంలా వున్నాడు.
"ఈ సమయంలో పొలంలో నీళ్ళు పెడుతున్నా వెందుకు?"
పని చేసుకుంటున్న వృద్ధుడు తలెత్తి రాకేష్ వైపు చూశాడు. "పెట్టకూడదా?"
"మంచిది కాదు" అని వివరించాడు. అంతావిని వృద్ధుడు నీటికి మట్టి తిరిగి అడ్డువేస్తూ "మేం మీలాగా సదువుకోలేదుగా, మాకు తెలీదు" అని లేచి- "అదిగో ఆ మూల పైరుకి ఏదో పురుగు పట్టింది, సూసి సెప్పగలవా బాబూ" అని అడిగాడు.
రాకేష్ కి గర్వం వేసింది. తన అభిప్రాయాలమీద వాళ్ళు గౌరవం వుంచడం.
అతడితో కలిసి, మిగతా వాళ్ళకి దూరంగా ఆ స్పాట్ దగ్గిరకు వెళ్ళాడు. అక్కడ పైరు ఆకుపచ్చ నుంచి పసుపుగా మారుతూ వుంది. తనకు తెలిసిన పరిజ్ఞానంతో "ఇది హైపో...." అని చెప్పబోయాడు.
వృద్ధుడు ఆకుల్ని సవరిస్తున్నట్టు వంగి అస్పష్టంగా పెదాలు కదిల్చాడు. "రేపు రాత్రి ఎనిమిదింటికి 'మహాదష్ట' ఉస్సోక్ సభ్యుల్ని ఉద్దేశించి ఒక ముఖ్యమైన ప్రసంగాన్ని చేస్తాడు. క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలో అది వస్తుంది. వెంటనే బయలుదేరి మన కార్యాలయానికి వెళ్ళు".
చేతిలో వరిపైరు ముక్క అకస్మాత్తుగా తాచుపాము అయినట్టు బెదిరి, చప్పున తలెత్తాడు రాకేష్- దిగ్భ్రమతో.
వృద్ధుడు లేచి, తన నాగలివైపు నడక సాగించాడు, వచ్చిన పని పూర్తి అయినట్టు!
రాకేష్ వొళ్ళు జలదరించింది.
వృద్ధుడి బొడ్డు క్రింద స్పష్టంగా కనిపిస్తోంది.... ఎర్రగా-
ఉస్సోక్ సభ్యత్వంలో అత్యుత్తమ స్థాన చిహ్నం-
రెడ్ స్కెలిటన్!
* * * *
హాలు చీకటిగా వుంది.
దాదాపు వందమంది సభ్యులు కూర్చునివున్నా నిశ్శబ్దంగా వుంది.
అందరి దృష్టీ టీవీమీద వుంది. పేరుకి అది క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ కానీ ప్రసారం ఎక్కణ్ణుంచి వస్తుందో ఎవరికీ తెలీదు. దేశపు ముఖ్య పట్టణాల్లో వున్న ఉస్సోక్ సభ్యులందరూ రహస్యపు గుడారాల్లో చేరి టీవీలో కనపడబోయే దానికోసం వేచివున్నారు.
