"మహాదష్ట...."
"అవును. ఎవరి పేరు చెప్తే పసిపిల్లలు పాలు మానేసి రక్తాన్ని అడుగుతారో... ఎవరి గురించి ఏమాత్రం తెలిసినవాళ్ళైనా వారిని తమ దైవంగా ఆరాధిస్తారో... అతడు! ఉస్సోక్ (Underworld Society of Secret Occult) ప్రెసిడెంటు మనదైవం- ఈ ప్రపంచానికి అతి తొందర్లో కాబోయే రాజాధిరాజు... మహాదష్ట".
"అతడిని కలుసుకోవటానికి వీలవుతుందా?"
"అతడినా..." అంటూ పొట్టి వ్యక్తి బిగ్గరగా నవ్వాడు. "అతడిని చూసినవాళ్ళు చాలా తక్కువ. కేవలం రెడ్ స్కెలిటన్స్ మాత్రమే చూడటానికి అర్హులు. ఆ స్థితికి రావాలంటే చాలా మెట్లు ఎక్కాలి".
"ఎంతకాలం పడుతుంది?"
"నిన్ను ఆర్నెల్లు పరీక్షించిన మీదట ఇక్కడికి తీసుకొస్తున్నాను. ఈ సొసైటీలో నువ్వు చేర్చుకోబడితే నీకు బ్లూ స్కెలిటన్ ఇవ్వబడుతుంది. పది పదిహేనేళ్ళు నిర్విరామంగా పనిచేస్తే వైట్ స్కెలిటన్ గా ప్రమోట్ చెయ్యబడతావు. తరువాత ఎల్లో -ఆపైన బ్లాక్... వీటిని చేరుకోవటానికి ఎంతో ప్రయాస పడాలి. బ్లాక్ స్కెలిటన్ అయ్యాక ఏదైనా విశిష్టమైన సేవ చేయగలిగితే అప్పుడు రెడ్ స్కెలిటన్ అవుతాడు. అతడికి మాత్రమే మహాదష్టని చూసే అర్హత కలుగుతుంది. అంత కష్టం".
"ఇదంతా ఏదో కరాటేలా వుందే!"
"అవును. ఏమాత్రం తప్పటడుగు వేసినా దెయ్యాలరాజు పేగులు బయటికి లాగేస్తాడు".
ఇంతలో యిద్దరూ ఒక పురాతనమైన యింటిముందు నిలబడ్డారు. పది అడుగుల ఎత్తున్న తలుపులు వర్షానికి నాని, ఎండకి ఎండి చిట్లిపోయినవి- ఎప్పటినుంచో బిగించబడి వున్నట్టు వున్నాయి. పొట్టి వ్యక్తి బెల్ నొక్కాడు. లోపల గంట మోగింది. మరో నిముషం తరువాత తలుపులు తెరవబడ్డాయి.
లోపలికి అడుగుపెడుతూ "ఒక్క అనుమానం!" అన్నాడు.
"ఏమిటి చెప్పు..."
"ఆర్నెల్లు నన్ను పరీక్షించావు నిజమే. కానీ ఎంతో రహస్యమైన ఈ సీక్రెట్ సొసైటీలో చేరటం ఇంత సులభమైనప్పుడు- ఈపాటికే ఇందులో ఎవరైనా శత్రువులు చేరి ప్రభుత్వానికి ఆ విషయం తెలియబర్చవచ్చుగా!"
పొట్టి వ్యక్తి నవ్వాడు. "మనసులో కల్మషం పెట్టుకున్న వాడెవడూ ఇక్కడ అబద్ధమాడలేడు. ఎంత అనుభవం వున్న గూఢచారి అయినా కుట్టి సైతాను ముందు తల వంచాల్సిందే. అబద్ధమాడి ఇక్కడివరకూ వచ్చినా- ప్రాణాల్తో బయటకు పోలేడు".
టప్ మని చప్పుడవటంతో పొడుగాటి వ్యక్తి వెనక్కితిరిగి చూశాడు. తలుపులు మూసుకుపోయాయి.
ఎందుకో తెలీదు. అతడి శరీరం అప్రయత్నంగా జలదరించింది. కొన్నివేల అదృశ్య శరీరాలు తనచుట్టూ తిరుగుతున్నట్టూ, కొన్ని లక్షల కళ్ళు రహస్యంగా తనని పరిశీలిస్తున్నట్టూ అనిపించింది. చెవి పక్కగా ఒక గాలి హో హో హో అని అరుచుకుంటూ వెళ్ళిపోయిన భావన కలిగింది. చల్లటిగాలి శరీరాన్ని స్పృశించి చుట్టూ తిరుగుతూన్న అనుమానం వచ్చింది. దాంట్లోంచి బయట పడదామనుకున్నాడు. గొంతువిప్పి ఏదో మాట్లాడబోయాడు. మాట రాలేదు.
అక్కణ్ణుంచి వెళ్ళిపోదామన్న కోర్కె బలంగా కలిగింది. వెన్ను పూసని వేళ్ళతో పట్టుకుని ఎవరో కదిలించి పరీక్షిస్తున్నట్టు, నరాలన్నీ కుంచించుకుపోతున్న అనుభూతి.
భయంవేసింది. వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోతాను అనాలనుకున్నాడు. అనలేకపోయాడు.
ఇదంతా గమనించని పొట్టి వ్యక్తి మామూలుగా చెప్పుకుపోతున్నాడు. "అందువల్లే ఇంతకాలం ఇంత పకడ్బందీగా ఈ సొసైటీ నడపబడుతూంది. నువ్వు అదృష్టవంతుడివి ఆఖరి క్షణంలోనైనా మాలో చేరావు. మిగతా ప్రజలందరూ మన క్రింద బానిసలు అనబోయే సమయంలో..."
ఇద్దరూ విశాలమైన హాలులోకి ప్రవేశించారు.
అక్కడో ముసలి వ్యక్తి వున్నాడు. తెల్లటి గడ్డం, వృద్ధుడు వణుకుతున్నాడు.
"ఇతడేనా మహాదష్ట!" రహస్యంగా అడిగాడు పొడుగాటి వ్యక్తి.
"ఇంకా నయం. అతడు కేవలం వైట్ స్కెలిటన్ మాత్రమే".
"నువ్వు...?"
"నేనూ నీలాగే బ్లూ స్కెలిటన్ ని. పదేళ్ళుగా ఇలాగే వున్నాను."
పొడుగువ్యక్తి ఆర్నెల్లుగా దీని గురించి ఆలోచిస్తున్నాడు. మొదట్లో తేలిగ్గా తీసుకున్నాడు. కానీ స్నేహితుడు పదేపదే చెప్పటంతో నమ్మకం కుదిరింది. ఇప్పుడు స్వయంగా చూస్తూంటే అది బలపడుతోంది.
"వైట్ స్కెలిటన్ అయ్యాక అతడు ఎన్నో ఘాతుకాలు చేశాడు. మహాదష్టని మెప్పించటానికి ఎన్నో క్షుద్రదేవతలకి పిల్లల్నీ, కన్నెల్నీ బలిఇచ్చాడు. ఇంకా ఎల్లో స్కెలిటన్ కాలేదు. దానికోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అయినా మహాదష్ట అనుగ్రహం ఇతడిమీద ప్రసరించలేదు" అంటూ దగ్గరికి వెళ్ళి "ఉస్సోక్ లో చేర్పించటం కోసం ఒక సభ్యుణ్ని తీసుకొచ్చాను" అన్నాడు.
వృద్ధుడు తలూపాడు.
పొట్టి వ్యక్తి మంట ముందు మోకాళ్ళమీద వంగి, "ఉస్సోక్ నిబంధనల ననుసరించి- ఆర్నెల్లు పరీక్షించి- సంతృప్తి చెంది- ఇతడిని తీసుకొచ్చాను" అన్నాడు.
ముగ్గురూ పక్కగదిలోకి వెళ్ళారు.
వృద్ధుడు అసలు మాట్లాడక పోవటాన్ని పొడుగాటి వ్యక్తి గమనించాడు. అతడి కళ్ళల్లో విషంతో కూడిన తేజస్సుని కూడా గమనించాడు. ఒక క్రొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుంది అతడికి. అంతలో లోపలి దృశ్యం చూసి అవాక్కయ్యాడు.
ఆ గదిలో నిలువెత్తు పెద్ద గెలిటన్ వుంది. దానికి రెండు రంధ్రాలున్నాయి. రంపపు మిల్లులా వుందది. పూర్వం ఉరికి బదులు ఇటువంటిదే వాడేవారు.
ఇద్దరి చేతులూ వెనక్కి కట్టబడ్డాయి.
ఇద్దరు మోకాళ్ళమీద కూర్చుని తలలు అందులో పెట్టాక పైనించి స్క్రూలు బిగించబడ్డాయి. పైన బ్లేడ్ మీద కాంతి భయంకరంగా మెరుస్తోంది. అది క్రింద పడితే రెండు మెడలూ అనపకాయల్లా తెగిపోతాయి.
"ఇప్పుడు నిన్ను కొన్ని ప్రశ్నలడుగుతారు. నువ్వు అబద్ధం చెప్పాలనుకున్నా చెప్పలేవు. నువ్వు వేరే వుద్దేశ్యంతో ఇక్కడికి వచ్చి వుంటే ఆ సంగతి నీ నుంచి బైటపడగానే పైన బ్లేడు సర్రున క్రిందికి జారుతుంది. నిన్నూ, సరీగ్గా పరీక్షించకుండా నీలాటి వాడిని తీసుకొచ్చినందుకు నన్నూ ఒకేసారి చంపుతుంది. ఇలా జరగదనే భావిస్తూ..... శలవు" అంటూ కళ్ళు మూసుకున్నాడు.
పొడవాటి వ్యక్తి కూడా కళ్ళు మూసుకున్నాడు.
కొద్దిసేపు నిశ్శబ్దం.
ఒక శబ్దం వినిపించింది. దూరంగా ఎక్కడో రెండు ఎలుకలు కిచకిచ దెబ్బలాడుకుంటున్న శబ్దం. నెమ్మదిగా ఆ శబ్దం దగ్గిరగా వచ్చింది. ఒక తీగెమీద ఒకే రిథమ్ లో కొడుతున్న శబ్దం. అతడెంతో కంట్రోల్ చేసుకోవాలనుకున్నాడు. చేసుకోలేకపోయాడు. మగత కమ్మేస్తూంటే వృద్ధుడి స్వరం మొదటిసారిగా వినబడింది.
"ఉస్సోక్ సమాజంలో చేరటానికి ఉత్సాహపడుతున్న ఓ సభ్యుడా! నీకు స్వాగతం. నీ కోరికలన్నీ కుట్టిసైతాను పూర్తి చేస్తుంది. సాతానునే నమ్ము. ఇప్పుడు నువ్వు మా ప్రశ్నలకి నిజాయితీగా- అబద్ధం చెప్పకుండా సమాధానం చెప్పుతావు".
అతడికి వినపడుతోంది. ఆలోచించాలనుకున్నాడు కానీ మెదడు మాత్రం స్వాధీనంలో లేదు.
"మిత్రుడా! ఇప్పుడు చెప్పు. నువ్వు ఎందుకు ఇంత కష్టభూయిష్టమైన పని నెన్నుకున్నావు? మాలో ఎందుకు చేరాలనుకున్నావు?"
అతడి అట్టడుగు పొరల్లోంచి మనసులో మాట బయటికొచ్చింది.
"నాకు డబ్బు అంటే చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో చాలా భవనాలూ, కార్లూ నావి కావాలనిపిస్తుంది. ఎంతోమంది సేవకులు వుండాలనిపిస్తుంది. అందమైన అమ్మాయిల పొందు కావాలనిపిస్తుంది. సర్వసౌఖ్యాలూ పొందాలనిపిస్తుంది".
"నిజం చెప్పినందుకు సంతోషంగా వుంది. మిత్రుడా... నీ పేరు?"
అతడికి అబద్ధం చెప్పాలన్న చిలిపి ఆలోచన వచ్చింది. కానీ ఇటువంటి వాళ్ళని చాలామందిని చూసినట్టు తీగెల ప్రకంపనం ఒకే రిథమ్ లో వినపడుతూంది. నాలుక, మెదడు స్వాధీనంలో లేవు. అది అంతరాత్మ స్వాధీనంలో వుంది. మెదడు ఆలోచిస్తూనే వుంది- నాలుక తన పని తాను చేసుకుపోతూంది.
"మిత్రుడా! నీ పేరు?" మరోసారి అడిగాడు.
"రాకేష్..."
* * * *
ముగ్గురూ మరో గదిలో ప్రవేశించారు. ఆ గదిలో నలుగురున్నారు. నలుగురూ వృద్ధులే. తెల్లటి గడ్డాల్తో అందరూ ఒకేలా వున్నారు.
"షర్టు విప్పు" అన్నాడు పొట్టి వ్యక్తి. "ఫాంటు కూడా".
రాకేష్ కాస్త తటపటాయించాడు. అయితే అతడి గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఒక హోమంలో వాళ్ళేదో వేస్తున్నారు. గది అంతా తెల్లటి పొగ నిండి, ఒకరికొకరు కనపడటం మానేశారు.
అంతలో రాకేష్ భుజంమీద, వెనుకనుంచి చెయ్యిపడింది.
"బ్రహ్మోపాసన, మంత్రోపాసన, ప్రతిమోపాసనలతో కుట్టి సైతాన్ అనుగ్రహం సంపాదించబోయే కొత్త సభ్యుడా! అష్టావిధ పురుష శక్తి గ్రహాధిపతి అయిన కుట్టిసైతాన్ నిన్ను అనుగ్రహించుగాక".
దట్టంగా అలుముకున్న మంచుమేఘాల్లోంచి ఎవరో హరికెన్ లాంతరు పట్టుకొస్తున్నట్టుగా సన్నటి వెలుగు దగ్గరగా వచ్చింది. దగ్గరికి వచ్చాక అది దీపం కాదనీ ఎవరో పళ్ళెంలో హారతి పట్టుకొస్తున్నారనీ రాకేష్ గ్రహించాడు. దగ్గరికి వచ్చాక అది హారతి కూడా కాకుండా, ఒక రబ్బరు ముద్రలాంటి పుర్రె మండుతూ వుండటం చూశాడు.
ఏం జరుగుతుందో అతడు గ్రహించే లోపలే వృద్ధుడు దాన్ని పట్టకారుతో పట్టుకుని రెండు చేతుల్తో అతడి శరీరం మీద గట్టిగా నొక్కాడు. గది గోడలు కంపించిపోయేలా అతడు కేకపెట్టి స్పృహ తప్పినట్టు కూలిపోయాడు.
రాకేష్ కి స్పృహ వచ్చేసరికి పొట్టి వ్యక్తీ అతడూ- ఇద్దరే మిగిలారు.
"మనం వెళదామా?' పొట్టి వ్యక్తి అడిగాడు.
రాకేష్ కి నీరసంగా వుంది. కాళ్ళమధ్య చర్మం కాలిన వాసన ఇంకా వస్తూనే వుంది. అతడు లేస్తూ వుండగా పొట్టి వ్యక్తి అన్నాడు- "మన వాళ్ళందర్నీ నువ్వు సులభంగా గుర్తుపట్టగలవు. అలాగే వాళ్ళూ నీ శరీరం మీద గుర్తు, బట్టల పొరల వెనుకనుంచి కూడా గమనించగలరు. మనవాళ్ళతో నువ్వు ఏదయినా మాట్లాడవచ్చు. పరాయివాళ్ళ దగ్గర మాత్రం ఈ విషయం నోరు విప్పకూడదు".
"నాకింకా ఆశ్చర్యంగానే వుంది".
"ఏమిటి?"
"సామాన్య సభ్యత్వం దొరకడానికి కూడా ఇంత కష్టమయిన ఈ సీక్రెట్ వరల్డ్ లో నన్ను కేవలం రెండే రెండు ప్రశ్నలు అడిగి ఎలా చేర్చుకున్నారు?"
"బ్లేడ్ మీద గొంతు ఆన్చి, మనిద్దరం ఆ గెటప్ లో ఎంత సేపున్నామని నీవనుకుంటున్నావ్ రాకేష్?"
"అయిదు నిముషాలో.... పదో".
"మనం ఈ గృహంలో ప్రవేసించి?"
రాకేష్ మనసులోనే లెక్కవేసి, "మనం లోపలికి ప్రవేశించేటప్పుడు రాత్రి పదవుతూంది. ఇప్పుడు అర్దరాత్రి అయివుండదూ?" అన్నాడు.
ఇద్దరూ ద్వారం దగ్గరికి వచ్చారు.
"ఉస్సోక్ ని అంత తేలిగ్గా అంచనా వేయకు రాకేష్. నిన్ను ఎన్నో ప్రశ్నలడిగారు! నీ గురించిన చరిత్ర, నీ కార్యక్రమాలూ- నీకు తెలియని నువ్వు- నీ బలహీనతలూ- నీ మనసులో సంక్షిప్తమైన వివరాలూ, ఆలోచనలూ అన్నీ ఉస్సోక్ రికార్డులో నిక్షిప్తమైపోయాయి. ఒకప్పుడు ఉస్సోక్ లో కేవలం మంత్రగాళ్ళూ, క్షుద్ర దేవతోపాసకులూ మాత్రమే వుండేవారు. కార్యక్రమాలు చాలా నిగూఢంగా జరిగేవి. ఇప్పుడు దీన్ని విస్తరించవలసిన అవసరమైనట్టు మహాదష్ట ఆజ్ఞ ఇచ్చాడు. ఏదో గొప్ప విషయం జరగబోతూంది. ప్రపంచాధిపత్యం కుట్టి సైతాన్ చేతుల్లోకి రాబోయే ముహూర్తం దగ్గర పడిందని మనవాళ్లు అనుకుంటున్నారు. సభ్య ప్రపంచంలో మామూలు మనుష్యులుగా కలిసిపోయి మనం కొన్ని పనులు చేయాలి. ఈ చివరి సమయంలో నువ్వు ఇందులో చేరడం నీ అదృష్టం" అంటూ తలుపు తెరిచాడు.
