Previous Page Next Page 
అష్టావక్ర పేజి 5


    నెమ్మదిగా టీవీ ప్రకాశవంతమైంది. ఆకాశం ఉరుములూ మెరుపులూ, గాలీ వానా....

    శ్మశానం మధ్యలో వృద్ధుడు తవ్వుతున్నాడు. విషాచి చేతి ఎముకల్ని సేకరించాడు.

    చూస్తున్న వారందరూ అది తమ ఊరి ప్రదేశం కాదని గ్రహించారు. కాష్మోరా ప్రసన్నం అవబోతూన్న లైవ్ టెలికాస్ట్..... టెన్షన్ తో వాళ్ళ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి.

    సరిగ్గా అదే సమయానికి ఆకాశం సగానికి విరిగినట్టు ఫెల్లున శబ్దమైంది. ఒక మెరుపు పిడుగులా మారి, చూసేవాళ్ళ కళ్ళు చెదిరేలా భూమి వైపుకి విపరీతమైన వేగంతో వచ్చి, భూమిలోనికి చొచ్చుకుపోయింది. బావి తవ్వినట్టు భూమికి నల్లగా కన్నం పడింది. పగిలి బీటలు వారిన భూమి సందులోంచి ఎముకలతో చేసిన పెట్టె లాటిది బయటపడింది.

    వృద్ధుడు మంత్రోచ్చాటన ఆపి, శిఖరం దిగి, ఆ పెట్టె దగ్గరికి వచ్చాడు. స్వరక్తంతో దాన్ని అభిషేకం చేసి, మూత తెరిచాడు. లోపల్నుంచి ఒక తోలు బయటకి తీశాడు.

    ఎన్ని వందల, వేల సంవత్సరాల నుంచి అది అలా నిక్షిప్తం గావింపబడివుందో - అయినా చెక్కుచెదరలేదు. దానిమీద రక్తంతో వ్రాయబడ్డ అక్షరాల్ని అతడు ఎలుగెత్తి బిగ్గరగా చదవసాగాడు.

    "రాజులకి రాజు, క్షుద్ర గణాధిపతి అయిన కాష్మోరా అంశతో మానవజాతిని ఏలటానికి కుట్టిసైతాన్ వారసుడు పుట్టే సమయం ఆసన్నమయింది.

    మహా మాంత్రికులైన విషాచి, కాద్రాల ఎముకల పొడిని గ్రామపు ఉత్తరపు దిక్కున పైర్లలో జల్లాలి. నీటిలో కలపాలి. అగ్నిలో వేసి గాలివాటున పొగ పల్లెకి వదలాలి. ఆ తరువాత ఎనిమిదిమంది పిల్లలు ఆ గ్రామంలో పుడతారు. ఒక కన్ను వున్నవాడు ఒకడు- ఒక స్తనమున్నవాడు. నాలుగు చేతులున్నవాడు- రెండు శరీరాలు ఏకమయినవాడు- ఇలా ఏడుగురు పుడతారు.


    ఎనిమిదోవాడు అష్టావక్రుడు.

    అందరిలాగా కాకుండా అతడు గర్భాన్ని చీల్చుకుని బయటకు వస్తాడు. ఆ విధంగా ప్రసవంలోనే తల్లిని చంపుతాడు. మొదటిరోజే తండ్రి మరణానికి కారణభూతుడవుతాడు. అతడు నవ్వడు. రోదించడు. దెయ్యాన్ని నమ్మిన వాళ్ళందరినీ కూడగట్టుకుని, దెయ్యపు అంశతో ప్రపంచాన్ని ఎలతాడు. అడ్డువచ్చిన వారిని ఊచకోత కోస్తాడు. రక్తం తాగుతాడు. అతడి నీడలో దెయ్యాన్ని నమ్మిన వాళ్లుమాత్రం హాయిగా బ్రతుకుతారు. సర్వ స్వేచ్చలూ అనుభవిస్తారు.

    ఈ పత్రాన్ని చదివిన వాళ్ళూ, విన్నవాళ్ళూ ఈ క్షణంనుంచే అష్టావక్రుడి పుట్టుకకోసం సాధనచేయాలి. పూజలు నిర్వర్తించాలి. రక్తతర్పణం కావించాలి".


    హాలు చీకటి అయింది. సభ్యులు కదలలేదు చాలావరకూ. ఆనందం, కొద్దిగా భయం. రకరకాల భావాలు వాళ్ళ మనసులో చోటు చేసుకున్నాయి. అష్టావక్రుడు పుట్టేవరకూ తమ మీద ఎంతో పెద్ద బాధ్యత వుందని వారికి తెలుసు.


                   *    *    *    *


    "ఈ రోజు అదోలా వున్నావేం" అని అడిగింది కేదారగౌరి.

    "ఏం లేదే" అని మాట తప్పించాడు.

    ఆ మరుసటిరోజు పొలానికి మామూలుగానే వెళ్ళాడు. మధ్యాహ్నం క్యారియర్ విప్పి లంచ్ చేసి చేతులు కడుక్కుంటూ వుండగా పొదచాటునుంచి 'రాకేష్' అని వినపడింది. అటు వెళ్ళాడు. తనని మొదట ఉస్సోక్ కి వెళ్ళమని చెప్పిన వ్యవసాయదారు రెడ్ స్కెలిటన్.

    అతడివైపు ఏమిటన్నట్టు చూశాడు.

    "అటు వెళ్ళు" దిగుడు బావివైపు చూపించాడు.

    "ఎక్కడికి?"

    "లోపలికి".

    ఉస్సోక్ లో పై స్కెలిటన్ చెప్పిన మాటకి ఎదురుప్రశ్న వేయకూడదు. రాకేష్ బావి మెట్లు దిగి కిందికి వెళ్ళాడు. లోపల నీళ్ళు లేవు. ఎండిపోయి వుంది. ఒక మూల చిన్న రంధ్రం వుంది. నడుము వంచి లోపలికి వెళ్ళాడు. చిన్న గది, ఒక రకంగా చెప్పాలంటే సమాధిలా వుంది. అటువైపు కూర్చున్న వ్యక్తి తల తిప్పకుండానే "రా ఇదిగో ఈ పొడిని ఇక్కడ వుంచుతున్నాను. సూర్యరశ్మి తగలకూడదు. రాత్రి వచ్చి తీసుకెళ్ళు. ఈ పల్లె ఉత్తర దిక్కున పొలాల్లో జల్లు. మరింత పొడిని గాలివాటు చూసి పొగచేసి పల్లె మీదకి వదులు. నీట్లో కలుపు" అన్నాడు.

    రాకేష్ కి ఆనందంతో ఒక క్షణం మాటరాలేదు. ఈ పనికి తను ఎన్నుకోవటం?

    ఆనందంగా "నేను అగ్రికల్చరల్ బి.యస్సీ. స్టూడెంట్ ని. ఇదంతా చాలా సులభంగా చేయగలను" అన్నాడు.

    "మూర్ఖుడా" అన్నట్టు ధ్వనించింది వృద్ధుడి కంఠం.

    "ఈ పనికి నువ్వు ఎన్నుకోబడటానికి కారణం అదికాదు. తన కన్నా పెద్దవాళ్ళతో సంబంధం పెట్టుకొంన్ నికృష్టుడు కావాలి దీనికి".

    సలసల కాగే నూనె మొహంమీద కొట్టినట్టయింది రాకేష్ కి. ఉస్సోక్- ఉస్సోక్-ఉస్సోక్ మనసు పొరల్లోకి వెళ్ళిపోయే ఉస్సోక్....

    "నీతోపాటు ఆ అమ్మాయిని తీసుకెళ్ళు. ఆమె కన్నెయేనా?"

    "నిశ్చయంగా కన్నే".

    "ఆమె కీ విషయం తెలిసే అవసరంలేదు. నీతోపాటు వుంటేచాలు".

    రాకేష్ తలూపాడు.

    "ఇక వెళ్ళు. రాత్రికి రా".

    అతడు వెనుదిరిగాడు.

    "చూడు".

    అతడు ఆగాడు.

    "బ్రహ్మవృత్త ఖేచరి నేర్చుకోవాలన్న ఆశ ఇప్పట్లో పెట్టుకోక, కష్టసాధ్యమైన విషయం అది".

    ఒక్కసారిగా బెదిరిపోయి "ఏమిటీ" అన్నాడు.

    "నన్ను చంపి, అష్టావక్రుడికి కుడిభుజం అవుదామన్న నీ ఆలోచన వుంది చూశావూ- అది ఫలించదని చెపుతున్నాను".

    రాకేష్ గొంతు తడారిపోయింది. "ఏ.... ఎవరు మీరు" అని అడిగాడు.

    అప్పటివరకూ అలా వున్న వృద్ధుడు నెమ్మదిగా తల తిప్పాడు.

    మొహంమీద కంబళి క్రిందికి జారిపోయింది. మనసు లోతుల్లోకి వెళ్ళి రహస్యాన్ని శోధించగల చూపు- రాబోయే కుట్టిసైతాన్ కి కాబోయే అనుంగు అనుచరుడు- కాద్రా సమాధి తవ్వినవాడు- పర్వతాన్ని ఎక్కినవాడు... ఎవరీతడు?... అంతలో ఆ వృద్ధుడి పెదాలు అస్పష్టంగా కదిలినయ్, "నా పేరే.... మహాదష్ట".

రాకేష్ వణికిపోయాడు. రెడ్ స్కెలిటన్స్ క్కూడా ఎవరిని చూసే భాగ్యం లభించదో, ఎవడు ఈ భవిష్యత్ ప్రపంచపు రాజో... అతడికి ఇంత దగ్గిరగా!!

    "రాకేష్! నీ మనసులో ఆలోచన పట్ల నువ్వేం సిగ్గుపడకు. ఇంత నికృష్టమైన, అసహ్యమైన ఆలోచనలున్న మనుషులే సైతాను కిష్టం! రాబోయే ప్రపంచంలో నీకు ఉన్నతస్థానం లభిస్తుంది. మరింత రక్తపాతానికీ, కన్నెల బలులకీ సిద్ధంగా వుండు. నాశనం చేయాలి. దేముడి మీద నమ్మకాన్ని నాశనం చేయాలి. ఈ రాత్రి దానికి ప్రారంభోత్సవం చెయ్యి. దార్కా, కాద్రాల ఎముకల పొడితో పైర్లను విషపూరితం చేసి దాన్ని తిన్న గ్రామస్థుల రేతస్సుని వికృతం చెయ్యి. స్త్రీల గర్భం పూర్ణకుంభం కాకుండా చెయ్యి. మొత్తం ఎనిమిదిమంది పుట్టాలి. ఎనిమిదో వాడు తొందరగా పుట్టాలి.... ఇక వెళ్ళు, ఆ అమ్మాయిని నీతో తీసుకెళ్ళు. క్షుద్ర గణదేవత కాష్మోరాకి స్త్రీలంటే ఇష్టం".

    ఆ సాయంత్రం రాకేష్ కేదారగౌరిని అడిగాడు.

    "రాత్రికి మనమో థ్రిల్ చేద్దామా"

    "ఏమిటి?"

    "కొంతమంది పేదరైతుల పొలాల్లో రహస్యంగా ఎరువుజల్లటం".

    ఆమె అర్ధంకానట్టు "ఎందుకు?" అంది.

    "జస్ట్ థ్రిల్. వాళ్ళు బీదవాళ్ళు! రెండ్రోజులు అయ్యాక చెప్దాం. సంతోషిస్తారు".

    "అందులో ఏమి థ్రిల్-?"

    "ప్లీజ్"

    "సర్లే" ఆమె వప్పుకుంది.


                                                       6


    కృష్ణాపురం.

    గుడి ప్రక్క కోనేటి నీళ్ళుగానీ, దూరంగా వున్న చెరువు నీరు గానీ ఎవరూ తాగటానికి ఉపయోగించరు. నాలుగు బావులున్నాయి. ఒకటి బ్రాహ్మలది. ఒకటి కరణం గారింటిలో వుంది. మిగతా రెండూ ఊరివాళ్ళవి.

    రాత్రి ఒంటిగంటకి వాటిలో కాద్రా, విషాచీల అస్థిమిశ్రమం కలిపాడు రాకేష్. అప్పుడు అతడి పక్కకేదారగౌరి లేదు. దానికి ఒక గంట ముందే, ఆమెతో కలిసి వెళ్ళి గాలిపాటుగా పొలాలమీదకి ఆ కీకసపొడిని వదిలాడు అతడు. అదే చాలా కష్టమైంది. వెళుతున్నప్పుడే ఆమె తీవ్రమైన అభ్యంతరం తెలిపింది. "ఈ అర్ధరాత్రి ఏ పొలంలో ఎరువు జల్లుతాం?" అని.

    రాకేష్ బ్రతిమాలేడు- "దార్లో నీకా వివరాలు చెపుతాను ప్లీజ్" అని.

    కారు నడుపుతూ "నేనొక సంగతి చెపుతాను నవ్వవుగా" అన్నాడు.

    గౌరి మొహం చిట్లించి "ఏమిటి" అంది.

    "ఈ భస్మం ఒక దొర ఇచ్చాడు. ఇది పైర్లమీద చల్లితే- బాగా పండుతాయట. మనం జల్లేది ఎరువులు కాదు".

    "నీకు నిశ్చయంగా మతిపోయింది" అంది కేదారగౌరి. "కారు వెనక్కి తిప్పు".

    "ప్లీజ్... అలా అనకు నా నమ్మకం నాది- "మన 'రావే' ప్రోగ్రాం కూడా అయిపోతూంది. మళ్ళీ ఈ ఊరు ఎలాగూ రాము. కాస్త మంచి చేసిపోవటంలో నష్టంలేదుగా!"

    "నీ కిలాంటి నమ్మకాలున్నాయని నాకు తెలీదు".

    "ఇవ్వాళ శుక్రవారం అవునా".

    "అవునేం?"

    "ఈ రోజే ఎందుకు తలంటుకున్నావు? ఎవరి నమ్మకం వారిది".

    ఆమె దీనికి సమాధానం చెప్పలేదు. ఇది ట్రెడిషను. అది మూఢనమ్మకం. రెండింటికీ తేడా వివరించటం అనవసరం.

    కారు ఆగింది. పల్లెని పట్నానికి కలిపే దారి అది. రోజుకి ఒక్కసారి మాత్రం బస్సు ఆ దారిన వస్తుంది.

    "దిగు" అన్నాడు కారు ఆపి.

    "నేనెందుకు" అంది- ఆ పనేదో నువ్వే చెయ్యి అన్నట్టు. అతడు కాస్త సిగ్గుపడుతూ "ఈ పనిలో స్త్రీ కూడా వుండాలట" అన్నాడు. "రేపు పంట ఎక్కువగా పెరిగితే ఆ పుణ్యంలో నీకూ కాస్త భాగం..."

    "చాల్లే-చాల్లే" అంటూ ఆమె కారు దిగింది. అతడంటే ఆమెకి ప్రేమ లేకపోవచ్చు. ఒక్క తల్లి లేకపోతేనే తనెంత ఒంటరితనం అప్పుడప్పుడు అనుభవిస్తుందో ఆమెకి తెలుసు. అటువంటిది, తల్లిదండ్రులిద్దరూ లేని అతడిని ఏమాత్రం మనసు నొప్పించటం ఆమెకి ఇష్టంలేదు.

    అందుకే కారు దిగింది.

    దక్షిణం వైపు నుంచి గాలి బలంగా వీస్తూంది. పైట శబ్దం చేసుకుంటూ రెపరెపలాడుతుంది. గాలి మనిషిని పక్కకి తోసేస్తూంది.

    "ఊఁ- ఏం చెయ్యాలి" అంది.

    "చేతులు దోసిలిగా పట్టు" అంటూ అతడు సంచి విప్పాడు.

    అకస్మాత్తుగా గాలి ఆగిపోయింది!

    దాన్ని ఆమె కూడా గ్రహించింది. అంత బలంగా వస్తున్న గాలి వున్నట్టుండి ఆగిపోవడం ఆమెకి ఆశ్చర్యం అనిపించి వర్షం వస్తుందా అన్నట్టు ఆకాశంకేసి చూసింది. ఆకాశం నిర్మలంగా వుంది. ఈ లోపులో అతడు ఆ భస్మాన్ని ఆమె దోసిటిలో పోశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS