Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 3


    ప్రేమకి ఇదేదో సినిమా చూస్తున్నట్టుంది.

    అక్కడ పెళ్ళిపందిరిలో ఏం జరుగుతూ వుందో తెలియటం లేదు.

    "ఊఁ- త్వరగా?"

    "ఇది అన్యాయం!"

    "మర్డర్లు చేసేవాడికి అన్యాయమేమిటి?"

    పెళ్ళికొడుకు తండ్రి భారంగా అక్కణ్ణుంచి కదిలాడు.

    ప్రేమ ఆత్రంగా కిటికీలోంచి చూడసాగింది. ఆయన పెళ్ళిపీటల దగ్గరకెళ్ళి కొడుకుతో ఏదో చెప్పాడు.

    ప్రేమ గుండెలు వడివడిగా కొట్టుకోసాగాయి.

    ఇంతలో పెళ్ళికొడుకు లేచాడు. అతడి చేతిలో మంగళసూత్రం తళుక్కుమంది. మంగళవాద్యాలు గట్టిగా మ్రోగసాగేయి.

    మూడుముళ్ళూ పడ్డాయి.

    ప్రేమ పెదాలమీద చిరునవ్వు వెలిసింది. అప్రయత్నంగా "కంగ్రాట్స్!" అంటూ వెనుతిరిగి చూసింది.

    గది ఖాళీగా వుంది.

    ఆ యువకుడు లేడు.

    ఆమె చుట్టూ చూసినా కనబడలేదు. ఈ లోపులో పెళ్ళికొడుకు తండ్రి రావడం కనిపించింది. వస్తూనే, "ఏడీ- మాట నెగ్గించుకున్నాడుగా వాడేడీ!" అన్నాడు. ప్రేమ మాట్లాడలేదు. ఆయన ఆత్రంగా తోటిపెళ్ళి కొడుకుమీద ముసుగుతీసి ఆ కుర్రవాడు భద్రంగా వున్నాడా లేదా అని చూసుకున్నాడు. సగం దుప్పటితీసి షాక్ తగిలినట్టు వదిలేసేడు.

    దుప్పటిక్రింద ప్రేమ తాలూకు బెడ్డింగు వుంది! ఆమెకు ముందు అర్ధంకాలేదు. అర్ధం కాగానే నవ్వొచ్చింది. ఆడపిల్లననే విషయం కూడా మర్చిపోయి బిక్కమొహంతో నిలబడ్డ ఆయన్ని చూసి తెరలు తెరలుగా నవ్వసాగింది.


                         *    *    *    *


    ఎపిలోగ్ కి ఎపిలోగ్ :

    "అద్భుతం! గుడ్- వెరీగుడ్!" అన్నాడు ప్రసాదరావు, ఆనందంతో పొంగిపోతూ! "అంతా అనుకున్నట్టే జరిగింది."

    రైల్వే టిక్కెట్ ఎగ్జామినరు చేతిలో డబ్బువంక ఆహ్లాదంగా చూసుకున్నాడు. పెళ్ళికొడుకు తండ్రి మాత్రం కొద్దిగా నసిగాడు. "నా కొడుకు నా గురించి ఏమనుకున్నాడో ఏమో! నాక్కాబోయే కోడలికి ముందే నామీద చెడు అభిప్రాయం ఏర్పడిపోయింది."

    ప్రసాదరావు బిగ్గరగా నవ్వుతూ, "అందుకేకదయ్యా నీకు నాలుగు వేలిచ్చింది. నువ్వాడిన నాటకానికి అది చాల్లే! ఇప్పుడు నీ కోడలూ కొడుకూ హాయిగానే వున్నారు కదా!" అన్నాడు.

    "హాయిగానే వున్నారనుకోండి!"

    "మరింకేం? పెళ్ళయి పదిరోజులైపోయింది కూడా. అన్నట్టు ఆ కత్తి పట్టుకున్న కుర్రాడివంక ప్రేమ ఏమన్నా ప్రేమగా చూసిందా?"

    "ఏమో తెలీదండీ!"

    "ఏడ్చినట్టుంది" అని టిక్కెట్ కలెక్టరువైపు తిరిగి, "చైను లాగినప్పుడన్నా ఆరాధనా పూర్వకంగా చూసిందా!" అని అడిగాడు.

    "నేనప్పుడు అక్కడ లేనండి!"

    "ఏడ్వలేకపోయారు. సరే- వెళ్ళండి!" అన్నాడు ప్రసాదరావు.

    ప్రేమ అనబడే ఓ కోటీశ్వరుడి కూతురిచుట్టూ అల్లబడుతున్న వలలో మొదటి భాగం అది.


                            *    *    *


                                                         ప్రారంభం


    ఎర్రటి సూర్యుడు మరింత ఎర్రనై పశ్చిమానికి కృంగిపోతూన్న సమయాన- ఆ ఎరుపుదనం వికృతంగా, భయంకరంగా ప్రతిబింబిస్తూన్న ప్రాంగణంలో, బల్ల వెనక్కి తల ఆన్చుకుని నిస్పృహగా కళ్ళు మూసుకుని వున్నాడు వేణు.

    అతని సహనాన్ని పరీక్షించడానికా అన్నట్టు- విశాలమైన వరండా మధ్యగా వున్న హాలు తలుపు ఎంతకీ తెరచుకోవడం లేదు. స్థంభానికి ఆనుకుని ఒక పేషెంట్ కునికిపాట్లు పడుతున్నాడు. గోడ ప్రక్కగా వేసి వున్న బల్లమీద మరో నలుగురు పేషెంట్లు కూర్చొని ఉన్నారు.

    ప్రయివేటు ఆస్పత్రి అది! డాక్టర్ రాజారావు యువకుడే ఐనా చాలా కొద్దికాలంలోనే మంచిపేరు తెచ్చుకున్నాడు. బాగా డబ్బు వసూలు చేస్తాడని ప్రతీతి. వేణు తాహతుకి అది పెద్దదే ఐనా, అతడు వెనుకాడలేదు. కారణం అతడి చెల్లెలు.

    మృదుల అంటే అతడికి ప్రాణం. చెల్లెల్లో అతడు చిన్నప్పుడు చచ్చిపోయిన తల్లిని చూసుకున్నాడు. ఆ తల్లి బాధతో తల్లడిల్లిపోతూ వుంటే ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. అది ధర్మాసుపత్రి కావడంతో రోగం అలాగే వుండిపోయింది. రాజారావు దగ్గరికి తీసుకెళ్ళమని ఎవరో సలహా ఇచ్చారు.

    ఒకవైపు ఫ్యాక్టరీ రీ స్ట్రయిక్ అవడం వలన జీతాలు రావడంలేదు. మరోవైపు కుటుంబం గడవడం కష్టంగా వుంది.

    అయినా వేణు వెనుకాడలేదు. అప్పు సంపాదించి నర్సింగ్ హోంకి తీసుకెళ్ళాడు. అక్కడ ఆమెకు ఎన్నోరకాల పరీక్షలు జరిగాయి. చివరకి రిజల్టు చెప్పేరోజు వచ్చింది.

    అదే ఈ రోజు!

    నిశ్చలంగా, నిర్మలంగా బల్ల వెనక్కి ఆనుకుని కూర్చుని వున్నాడు వేణు. అది పైకి కనబడే ఆకారం మాత్రమే. లోలోపల ఉవ్వెత్తున లేచిపడే కడలి తరంగాల్లాటి ఆలోచన్లని బైటకి ప్రస్పుటమననివ్వకపోవటాన్ని అతడు పదో ఏటనే నేర్చుకున్నాడు. అతడి తండ్రి అతడు ప్రస్తుతం చేస్తున్న కంపెనీలోనే ఫోర్ మెన్; ఒకరోజు నైట్ షిఫ్టు పని చేస్తూ వుండగా చక్రం లాగేసింది. రెండు కాళ్ళూ మోకాళ్ళకు పైగా తెగిపోయాయి.

    ఆ అర్దరాత్రి నిశ్శబ్దం అతడికింకా జ్ఞాపకం వుంది. ఆ ఆస్పత్రి కూడా యిలాగే వుండింది. అప్పటికి అతడి తండ్రికి స్పృహరాక అది రెండో రోజు. స్పృహ రాలేదు కాబట్టి అతడూ, అతడి తల్లీ, అతడి చెల్లీ స్థబ్దంగా రోగి పక్కనే వుండవలసి వచ్చింది. స్పృహలో వున్న ఫ్యాక్టరీ యాజమాన్యం అలా స్థబ్దంగా వుండలేదు. చెయ్యవలసిన ఏర్పాట్లు అన్నీ చేసేసింది. ఆ రోజు రాత్రి వేణూ తండ్రి తాగి వున్నాడని సాక్ష్యాలు సంపాదించింది. అలా తాగి, ఫ్యాక్టరీ చక్రం దగ్గిర వున్న 'జాగ్రత్త జోన్' దాటి లోపలకి వెళ్ళాడని నిరూపించింది.

    రెండోరోజు అర్దరాత్రి మెలకువ వచ్చిన తండ్రి వేణూని దగ్గిరకు తీసుకున్నాడు. కేవలం 'ఫ్యాక్టరీ వాళ్ళు డబ్బు ఇస్తారు. దాంతో జాగ్రత్తగా తల్లినీ, చెల్లెనీ చూసుకో" అని చెప్పటం కోసం. ఆ తరువాత అతడి ప్రాణం పోయింది.

    అప్పుడు కూడా వేణూ నిశ్చలంగానే వున్నాడు.

    ఇది జరిగిన పదిహేను రోజులకి మరింత దారుణం జరిగింది. తల్లి వురేసుకుని చచ్చిపోయింది. కారణం ఎవరికీ తెలీదు__వేణుకి తప్ప.

    ఆకస్మిక మరణం పొందిన కార్మికుడికి ఫ్యాక్టరీ చెల్లించవలసిన నష్టపరిహారం గురించి మాట్లాడటం కోసం రావలసిందిగా మానేజర్ దయానందం కబురు చేసేడు. గొర్రె నమ్మింది. గెస్ట్ హవుస్ కసాయి గృహం అయింది.

    "ఒరేయ్! మానేజరుగారు రమ్మన్నార్రా! నాన్న తాలూకు డబ్బు ఇస్తారట" అని వెళ్ళేముందు వేణుకి చెప్పింది. మరుసటిరోజు ఆమె మరణానికి కారణం ఏమిటా, అని చుట్టుప్రక్కల వాళ్ళు అన్వేషిస్తున్న సమయంలో కూడా అతడు మౌనంగా నిశ్చలంగా వున్నాడు- పదేళ్ళ వయసులోనే జరిగింది అర్ధం చేసుకుని కూడా.

    ఆ తరువాత అతడిని తోటి కార్మికుడు ఒకడు మానేజర్ దయానందం దగ్గరికి తీసుకెళ్ళాడు. "తల్లి తండ్రీ చనిపోయారు బాబూ! మీరు ఆదుకోకపోతే అన్నా చెల్లెళ్ళిద్దరూ వీధిన పడతారు" అన్నాడు వేడికోలుగా.

    "నాకు బాధగానే ఉందిగానీ, మరీ పదేళ్ళోడిని ఫ్యాక్టరీలో చేర్చుకుంటే ఇనస్పెక్టరు ఫైనేస్తాడు. ఎట్టరా?" అన్నాడు దయానందం.

    "వయస్సు ఎక్కువేద్దాం బాబూ?" అన్నాడు రామయ్య. వేణూ తండ్రీ, అతడూ కలిసి ఆ ఫ్యాక్టరీలో ఇరవయ్యేళ్ళ నుంచీ పనిచేస్తున్నారు.

    "ఆలోచన బాగానే ఉందనుకో. కానీ, వయసెక్కువ వేస్తామని పూర్తి కూలీ ఇమ్మంటే కుదర్దు సగమే ఇస్తాం. ఇష్టమైతే చేరమనండి...."

    అలా వేణు జీవితం నిర్ణయింపబడింది. మిషను పక్కన పడిన బొగ్గు లేరటం అతడి దినచర్య అయింది. మానేజర్ దయానందం దయా గుణాన్ని అందరూ పొగుడుతున్నప్పుడు కూడా అతడు నిశ్చలంగానే ఉన్నాడు.

    రామయ్యతో కలిసి ఉద్యోగాన్ని అర్ధించటానికి వెళ్ళినప్పుడు మానేజర్ దయానందం అన్న మాటలు అతడికి గుర్తున్నాయ్.

    "తాగేసి మిషన్ దగ్గరికి ఎవడెళ్ళమన్నాడ్రా? అదేదో మామూలు ప్రమాదంలో ఛస్తే ఫ్యాక్టరీ పదివేలు నష్టపరిహారం చెల్లించేది కదూ!"

    "ఆడు తాగడు బాబూ! జీవితంలో ఎప్పుడూ దాన్ని ముట్టుకొని ఎరగడు."

    "ఆ రోజు కర్మ అట్లా రాసి పెట్టుంది తాగాలనిపించిందేమో! పోనీ ఆడు ఛస్తే చచ్చాడు- దానికేవయిందట? ఎందుకు ఉరేసుకుందట?"

    "కారణం ఆ భగవంతుడికే తెలియాలి బాబూ!"

    "మొగుడు సచ్చి పదిహేను రోజులైనా కాకముందే ఉరేసుకుందీ అంటే దానికి కారణాలేముంటాయిరా తెలివిలేని ఎదవా! ఆ మాత్రం ఊహించలేవూ? అయినా దాని సంగతి ఇప్పుడు మనకెందుకులే కానీ వీడికి ఉద్యోగం ఇచ్చాంగా ఇక ఎల్లండి. ఆ సచ్చినోడికి రావాల్సిన కాంపన్సేషనూ అవీ అని ఇక గొడవెట్టకండి."

    "అలాగే బాబూ!" అన్నాడు రామయ్య నమస్కరించి వెనుదిరుగుతూ. వేణూ కూడా అతడితో పాటే తిరిగి పదడుగులు వేసి, గుమ్మం దగ్గర ఆగి, వెనక్కి తిరిగాడు. 

    దయానందం ఇటే చూస్తున్నాడు.

    అప్పుడు అన్ని రోజుల తర్వాత వేణు నవ్వేడు. పెదాలు విడివడనట్టూ-కొద్దిగా విచ్చుకుని, సన్నటి చిరునవ్వు.

    అంత అకస్మాత్తుగా, అకారణంగా ఆ కుర్రవాడు అలా నవ్వటాన్ని వేరే విధంగా అర్ధం చేసుకున్న మానేజరు తనూ మామూలుగానే నవ్వేసేడు.

    ఆ నవ్వు కర్ధం పదిహేను సంవత్సరాలుగా పెరిగి, పెద్దదై బలీయమై వేణులో చోటు చేసుకుంటూందని దయానందానికి తెలీదు.బ్రతకడం కోసం చాలా కష్టపడవలసి వచ్చింది వేణుకి. ఫ్యాక్టరీ వాళ్ళిచ్చినది ఏ మూలకి సరిపోయేది కాదు. చెల్లెలు చిన్నది. ఇంట్లో ఇద్దరే. అప్పట్నుంచే అతడికి ఆ నిండుతనం అలవాటయింది. అతడి జీవితంలో ప్రత్యేకంగా ఆనందం, విషాదం అంటూ ఏమీ లేదు. కేవలం కష్టం మాత్రమే వుంది. బొగ్గులేరే కుర్రవాడి స్థితి నుంచి ఫిట్టర్ వరకూ మాత్రమే ఈ పదిహేను సంవత్సరాలలోనూ ఎదగగలిగాడు. అతడు సాధించిన ఒకే ఒక విజయం- బియ్యే పాసవ్వటం. అతడికి తల్లి బాగా గుర్తున్నది. ఆ రోజుల్లోనే అంత బీద కుటుంబంలో పుట్టీ, ఆమె ఎనిమిదో క్లాసువరకూ చదువుకుంది. పాకముందే కూర్చోపెట్టి సాయంత్రప్పూట కూతురికి, కొడుక్కీ రామాయణ భాగవతాలు చదివి వినిపించేది. ఆ సంస్కారంతోనే కూతురికి 'మృదుల' అని పేరు పెట్టుకున్నప్పుడు తండ్రి 'మనకట్టాటి నాగరీకం పేర్లేమిటే' అని ఏడిపించాడు కూడా!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS