ఈ మాట విని గాయత్రి ముఖం వివర్ణమయింది.
"అమ్మగారూ! వారు వ్యాపారం పనులలో మునిగి ఉన్న మాట నిజమే! కాని నన్ను మాత్రం నిర్లక్ష్యం చేయరు. నాతో చాల బాగుంటారు.
ఎంతో ప్రేమగా నన్ను చూచుకుంటారు! ఈ విషయం ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఏముంది? వారి ప్రశ్నలు వారికి ఉండవచ్చు!
కాని హద్దుమీరిన అనుమానాలు వారికి రాకూడదు. వచ్చినా మనం సమాధానాలు చెప్పుకోగలమా? అబ్బాయి దూరంగా ఉండి వ్యాపారం పనులు చూచుకుంటున్నాడు కాబట్టి మీరు బామ్మ అయే సూచనలు కన్పించటల్లేదని ఎవరో పనిలేనివారు అన్నారు.
కాదు నా బిడ్డలిద్దరూ సక్రమంగా కలిసి ఉంటున్నారు అని మీరు వారికి సంజాయిషీ యిచ్చుకోవాలనేముంది? సమయం వచ్చినప్పుడు కరుడుకట్టిన వారి సందేహాలు కరిగిపోతాయి కదా?" అంది గాయత్రి.
ప్రపంచంలో తల ఎత్తుకు తిరగాలంటే మన గురించి ఎదుటివారి మనసుల్లో ఉండే సందేహాలను తొలగించాలి నిజమే!
కాని ఇది వ్యక్తిగతమయిన సమస్య! కుటుంబ సమస్య!
అతని సమీప వ్యక్తులు తెలుసుకో తగిన అంశమేకాని బయటివారికి వివరించటం సంజాయిషీ యిచ్చుకోవటం లాంటివి జరగకూడదు. ఆ అవసరం రాకూడదు.
ఇలా అలోచించి సమాధాన పడింది సుమిత్ర.
పనిలేనివాళ్ళు కల్పించిన అసందర్భమయిన చిక్కు ఆలోచనలకి కలతపడి సమర్ధించు కోవటానికి ఏదో మాటాడకూడదు. ఆ అవసరం వచ్చింది. అలా మాటాడించటం వెర్రివాళ్ళని చేయటం అది లోకులపని?
ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి పనికిమాలిన ఆలోచనలు చేసి అనవసరమయిన విషయాలలో కల్పించుకుని కూపీలు లాగి రూమర్లు ప్రచారం చేయించే రకం. కాబట్టి తాను బాధ పడకూడదు అని దృఢంగా నిర్ణయించుకుని ఈసారి అతడే వచ్చి మరో మారు ఆ ప్రస్థావన తెచ్చినా మరొకరు అలా ప్రస్థావన తెచ్చినా తిప్పి కొట్టాలని ధృవీకరించుకుంది.
"మీరిద్దరూ అలా ఉండటమే గాయత్రి మాకు కావలసింది. నేను వినదలుచుకున్న శుభవార్త అదే! బయటి వాళ్ళు లక్ష అనుకుంటే మనకేమిటి?" అంది. నవ్వుతూ లేచి వచ్చింది.
మనసు మీది పెద్ద బరువు దింపుకునే కార్యక్రమంలో పది నిముషాలు ఆలస్యం అయినా ఆమె భోజనం ముగించి తన గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుని హాయిగా నిద్రపోయింది.
యధాప్రకారం తల్లి వెళ్ళిపోయిన డైయినింగ్ టేబిల్ మీద కూర్చుంది గాయత్రి. ప్రక్కన ఉండవలసిన వాల్మీకి లేడు.
ప్రపంచం బహు దొడ్డది. కూపీలు లాగటంలో లోకులకు ఆసక్తి ఉంటుంది. నిజంగానే వాల్మీకి వ్యాపారం పనులలో తలమునకలు అవుతున్నాడు. ఇంటికి వచ్చి వారం రోజులు దాటిపోయింది.
పనివారు ఈ వార్తలను బయటకు అందిస్తారు. వారు వార్తలకు తమ ఊహలు జోడించి ప్రచారం చేస్తారు.
ముద్దు ఎత్తలేక పోయింది గాయత్రి. తన జీవితం గురించి అందరికి తెలిసిపోదా? ఆయన ఎంతో మంచివారు. అలా వ్యాపారం పనుల్లో మునిగిపోవడంలో తన అనుమతికూడా వుంది వారికి.
కాని ప్రపంచానికి ఇది అపార్ధమయింది.
ఈ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు కేంద్ర బిందువులాంటి ఇల్లు ఇది.
మా విషయాలు మీకెందుకు అనటం సాధ్యపడదు.
వారి అనుమానాలను నివృత్తి చేయటం ఈ యింటిలో ప్రతిఒక్కరి బాధ్యత. ముఖ్యంగా తన బాధ్యత. వారి మాటను నిర్లక్ష్యం చేస్తే తన మాటల్ని వారు గౌరవించరు. అలా జరిగిన నాడు ఈ ఇల్లు నిలబెట్టుకుంటూ వచ్చిన ప్రత్యేక గౌరవ మర్యాదలు మట్టిపాలు అయినట్లే!!
మనసు బరువెక్కి ముద్ద దిగలేదు.
కలిపిన అన్నం అలాగే వదలి షింక్ దగ్గర చేయి కడిగి లేచి వెళ్ళింది గాయత్రి. ఆమె వాలకాన్ని అతి సమీపంనించి గమనించింది వర్ధిని.
ఆ తరువాత గంటకు వాల్మీకి పట్నంనించి వచ్చాడు.
పైకి వెళ్ళనే లేదు. క్రింద గదిలో స్నానం ముగించి బట్టలు మార్చుకుని భోజనానికి వచ్చాడు. "వడ్డన చేయటానికి చిన్న అమ్మగారిని పిలుస్తా అయ్యగారూ;" అంది వర్ధని.
"మేలుకునే ఉంటే పిలువు" అన్నాడు వాల్మీకి.
"అయితే వద్దులే! భోజనం అయ్యాక నేనే పైకి వెడతాను" అన్నాడు.
టేబిల్ మీద గాయత్రి విడిచి వెళ్ళిన కలిపిన అన్నం ఉండటాన్ని గమనించాడు వాల్మీకి.
ఆ టేబిల్ మీదికి వచ్చే వ్యక్తులు నలుగురే.
తాను గాయత్రి అత్తాయమ్మగారు. ఊళ్ళో ఉంటే మరదలు ఆమని! ఆ ఇద్దరిలో అన్నం తినకుండా వెళ్ళిపోయినవారు ఎవరు?
"గాయత్రి భోజనం చేసిందా?" అని అడిగాడు అనుమానంగా.
"లేదండి! కలుపుకున్నారు. తినకుండానే చేయి కడిగేసుకుని పైకి వెళ్ళిపోయారు" వర్ధని ఆ ప్రశ్నకోసం ఎదురుచూస్తున్న దానిలా చెప్పింది.
"ఓ అలాగా! అయితే రెండు ప్లేట్లు పైన గదిలో ఉంచు. అని చెప్పేసి పరుగులాంటి నడకతో పైగదికి వచ్చాడు వాల్మీకి.
గాయత్రి నిద్రలాంటి నిశ్శబ్దంలో మునిగి అర్ధచేతనిగా పడి ఉంది.
మంచంమీద కూర్చుని భుజం మీద చేయి వేశాడు.
ఆమె ఇహలోకంలోకి వచ్చి ఉలికిపడి చూచింది.
వాల్మీకిని చూడగానే ఎప్పటిలా చిరునవ్వులు చిందించలేదు. కొంటె చూపులతో కౌగిలింతలు అందించలేదు. మెడను చేతులతోచుట్టి బావురుమని ఏడ్చింది.
అతడు విస్మయంతో కరిగి నీరయిపోయాడు.
ఆమె కన్నీరు చారికలు కట్టిన చెంపల్ని తుడిచాడు.
పసిపాపలా వెక్కిళ్ళు పెడుతోంది గాయత్రి.
"ఏమయింది నీకు? పిచ్చిదానా? ఎందుకలా ఏడుస్తున్నావు?" అన్నాడు జాలిగా.
"ఊఁ! ఇప్పటికి వచ్చి వారం రోజులయింది కాని...." అన్నదామె జీరపోయిన కంఠస్వరంతో! మాట పూర్తి చేయలేదు.
అతడు మధురంగా నవ్వేశాడు.
రెండు భుజాలు పట్టుకుని మెత్తగా గుండెలమీదికి హత్తుకున్నాడు.
"అక్కడ మరెవరితో అయినా కులుకుతున్నానని నీకు అనుమానంగా ఉందా?" అన్నాడు. నా కోసమే ఎదురు చూస్తారని తెలుసు నాకు! మీరు చాల మంచి భర్తగారు. అందరికి మీలాంటి మంచి భర్తలు దొరకరు.
మీమీద నాకు ఎప్పుడూ అనుమానం రాదు.
ఇంకెప్పుడూ అలా అనకండి!" అంది.
"మాటలు రాకుండా ఉండాలంటే నా నోరు నువ్వే మూయించాలి" అన్నాడు. సిగ్గుపడి దూరంగా తొలగిపోవాలనుకున్న గాయత్రిని మరింత దగ్గరగా తీసుకున్నాడు. వాకిలి దగ్గర వరండాలో అడుగుల చప్పుడుతో పాటుగా చిన్న దగ్గు వినిపించింది. పెద్ద ఇంటిలో ప్రవర్తించుకునే తీరు తెలిసిన వర్ధని వాకిలి దగ్గర చప్పుడు చేసి భోజనం ప్లేట్లు తీసుకుని గదిలోకి వచ్చింది.
వారు వేరు వేరు అయిపోయారు.
"నాకు ఆకలిగా లేదు. అందుకే అన్నం వదిలేసి వచ్చాను"
"నీ ఆకలి ఏమిటో నాకు తెలుసు, నువ్వు తినకపోతే నేనుకూడ తినను. అని మొరాయించాడు వాల్మీకి. తలుపులు బోల్టు బిగించి తిరిగి వచ్చింది గాయత్రి.
ఒకరికొకరు ముద్దలు కలిపి అందించుకున్నారు.
ఆ రాత్రి ఒక కలలాగా కరిగిపోయింది.
ఉదయమే గాయత్రి గురించి వాకబు ప్రారంభించింది సుమిత్ర.
"వర్దనీ! అమ్మాయి ఇంకా నిద్రలేవలేదా?"
"లేదండీ! అప్పుడే లేవరనుకుంటా!" అంది వర్ధని ముసిముసిగా నవ్వుతూ. ఆ సమాధానం చాలాసార్లు వింది సుమిత్ర! అర్ధమయిపోయింది.
"రాత్రి అబ్బాయిగారు వచ్చారా?"
"అవునండి! భోజనం కూడ పై గడిలోకే తెప్పించుకున్నారు. ప్లేట్లుతీసేద్దామని పదిగంటలకు పైకి వెళ్ళాను. అప్పుడే తలుపులు బోల్టులు బిగించి ఉన్నాయండి. ఉదయమే తీసేద్దామని తిరిగి వచ్చాను.
ఇంకా తీయలేదండి తలుపులు అంటూ చెప్పినట్లు కాకుండానే అంతా చెప్పేసింది వర్ధని. ఆమెకు ఆ తెలివితేటలున్నాయి కాబట్టే గాయత్రికి బాగావచ్చి కుదురుకోగలిగింది.
పనివారు యజమానికి కొన్ని విషయాలు చెప్పకూడదు.
కొన్ని విషయాలలో సలహా యివ్వకూడదు.
కాని వర్ధని యజమానితో చాలా జాగ్రత్తగా ఆలోచనా పూర్వకంగా మాటాడుతుంది.
ఇవ్వదగిన సలహాని ఇవ్వదగిన పద్ధతిలో ఇవ్వగలదు.
అందువల్ల ఆ కుటుంబానికి ఆంతరంగికురాలు అయింది.
సేవకురాలు అనే హద్దుల్లో ఉంటూనే అన్యాపదేశంగా సలహాదారు కూడ అయింది. ఆ హద్దులు దాటదు కాబట్టి ఆమెకు అనుమతిచ్చింది సుమిత్ర! సేవకురలుగా అందరికి కన్పించే స్నేహితురాలు హోదాలో ఉంచి గౌరవించింది. ఆమె మాటలు విని నవ్వింది సుమిత్ర.
గడియారం వంక చూచింది, సమయం తొమ్మిది.
"నీకు బుద్ధి ఉందా! పిలిచేవరకూ ఆ వైపు వెళ్ళకు" అంటూ ఆ తీరు తనకీ అర్ధమయిందని సంతోషపూర్వకమయిన సూచన అందించింది సుమిత్ర.
"అలాగే అమ్మగారూ! నాకు తెలియదా?" అనేసి వెళ్ళిపోయింది వర్ధని. పది గంటలు అవుతూ ఉండగా తలంటుపోసుకుని వరండాలో కురులార్పుకుంటూ కన్పించింది గాయత్రి!
