Previous Page Next Page 
పరిహారం పేజి 38


    "ఇంతకు ముందే."
    "అమ్మాయి కబురు చేసిందా? నేను జాబుద్వారా మీ అమ్మగారికి తెలియ పరుద్దామనుకొంటున్నాను. ఎనిమిదో తేదీ దశమి అవుతుందట, నిశ్చయ తాంబూలాలకు మంచిరోజు అన్నారు."
    "మంచిదండీ అమ్మతో చెబుతాను."
    "వధూనిశ్చయంమీరు చేశాక, వర నిశ్చయం మేం చేసుకొంటాం........ఎక్కడికో వెడుతున్నట్టున్నారు?"
    "పిక్చరుకు వెడుతున్నాం, నాన్నా?"
    "వెళ్ళండి, వెళ్ళండి! టైం అయినట్టుంది" సంబరందా అన్నాడు జగన్నాధరావు.
    పిక్చర్ చూసి ఇవతలికి వచ్చేశాక, వీడ్కోలు తీసుకొంటూ "రేపోసారి మా ఇంటికి రాగలరా?" అని అడిగాడు మనోహర్.
    రజని సందేహంగా చూచింది. 
    "ఎందుకు?"
    "ఊరికెనే. ఓసారి మా ఇల్లు చూడకూడదూ?"
    "పెళ్ళయ్యాక చూడనా?"
    "ఏం ఇప్పుడు చూడకూడదన్న ఇదేమైనా ఉందా?"
    "అబ్బే అలాంటివేం లేవు వస్తాను"
    రజని సాన్నిధ్యంలో గడిచిన ఆ నాలుగు గంటలు మనోహర్ హృదయంలో తీయని అనుభూతి రేపాయి. రజని ముగ్ధ మనోహరరూపం. అతడి హృదయంలో గాఢంగా ముద్రపడింది. ఆమెతో జీవితాన్ని ఊహించుకొంటూంటే అతడికి తీయగా స్వర్గంలో తేలిపోతున్నట్టుగా అనిపించింది. అందం, ఐశ్వర్యం - ఓహ్ అదృష్టమంటే తనదే.
    మరునాడు ఉదయం పది గంటలయ్యే సరికి రజని కోమలమ్మ కాంపౌండ్ ముందు కారు దిగింది. ఆమెతో ఆమె చిన్నమ్మ కూతురు చాయకూడా వచ్చింది. ఉమెన్స్ కాలేజీలో బి.ఎ. ఫస్టియర్ చదువుతోంది ఛాయ
    "ఓ! ఛాయా! ఇలా వచ్చావేమిటి?" అంటూ ఓ అమ్మాయి పలుకరించింది. ఆ అమ్మాయి పేరు రమణి. ఛాయకు క్లాస్ మేట్. కోమలమ్మ కాంపౌండ్ లో అద్దెకుంటున్నారు!
    "ఈవిడ మా కజిన్. మీ మనోహర్ గారికి కాబోయే శ్రీమతి" అంటూ రజినిని పరిచయం చేసి "వస్తాను వెళ్ళేముందు కలుస్తాను!" అంటూ రజనితో ముందుకు కదిలింది ఛాయ.
    రజని, ఛాయ రాగానే బాత్ రూం చూపి కాళ్ళు కడుక్కోమని చెప్పి వంటావిడ మంగమ్మ చేత టేబిల్ మీద ప్లేట్లు తెప్పించి పెట్టింది కోమలమ్మ, ఈ ఏర్పాట్లు మర్యాదలు చూసి రజని మహాబిడియ పడిపోయింది  "ఏమిటత్తయ్యా? కొత్తల్లుడికి చేసినట్టు ఎందుకు ఈ మర్యాదలు?"
    "పెళ్లయి నువ్వు మా కోడలిగా రాలేదుగా? ఇప్పుడు కనీస అతిధి మర్యాదలు చేస్తున్నాం" సమర్ధించుకొంది కోమలమ్మ. ఏదో వెనుకటి తరహా మనిషిని. ఏమైనా పొరపాట్లుంటే వెక్కిరించకేం?"
    టిఫినులు టీలు పూర్తి అయ్యాయి.
    "భోజనానికి ఆలస్యం ఉందిగా? ఈలోగా మనిల్లు చూపెట్టుకురా, మనూ!"
    క్రిందిభాగం చూపించి తీసుకు పోయాడు మనోహర్. 
    "మీ లాగ ఇంటిని కళాత్మకంగా అలంకరించుకోవడం నాకు తెలియదు. నువ్వొచ్చాక యీ ఇంటిని, ఇంటిలోని మనుష్యులను కళాత్మకంగా తీర్చి దిద్దుకోవలసిన బాధ్యత నీదే?"
    "ఇంటిని కళాత్మకంగా దిద్దుకోవచ్చునేమో గాని మనుష్యుల్ని కళాత్మకంగా ఎలా దిద్దుతారబ్బా?" రజని వింతగా బుగ్గన వేలుంచుకొంది.
    "మాకు మీలాగ సున్నితమైన అభిరుచులు లేవు. మాకు డబ్బున్నా జీవితాన్ని సౌందర్య వంతంగా దిద్దుకోవడం తెలియదు నువ్వొచ్చాక మాకు అవన్నీ నేర్పించాలి!"
    మనోహర్ పడకగది కిటికీ దగ్గిర నిలబడితే పెరటి వైపు భాగమంతా కనిపిస్తూంది. పెరటి స్థలం చాలా విశాలంగా ఉంది. మధ్యనుయ్యి, ఓ పక్క గేదెల షెడ్డు, గడ్డి వాము ఉన్నాయి.
    "ఖాళీ స్థలం అంత వదిలేశారెందుకని? చక్కగా ఎన్ని చెట్లయినా పెంచవచ్చును కదా?"
    "అంత ఓపిక ఎవరికి? చెప్పాను కదా? అవన్నీ నువ్వు వచ్చాక జరుగవలసిన పనులవి!"
    ప్రక్కనే ఉన్న చాయ. "ఏమండోయ్. బావగారూ జీతం భత్యంలేని నౌకరుగా కుదుర్చుకొంటున్నారల్లే ఉందే మా అక్కను!" అంది.
    "ఇక్కడే వస్తుంది యుద్దం మీకు, మాకు!" మనోహర్ ఇంటికప్పు ఎగిరిపోయేలా గట్టిగా నవ్వేశాడు.  "ఇంటిని దిద్దుకోవడం భర్తను సుఖపెట్టడం, పిల్లల్ని పెంచుకోవడం ఇవన్నీ సహజమైన విషయాలు స్త్రీకి. నీలాంటి విప్లవ యువతులు మాత్రం వీటికి కల్పించే అర్ధాలు మాత్రం వేరు. ప్రకృతి సహజంగా పురుషుడు శారీరకంగా బలవంతుడు. స్త్రీ బలహీనురాలు. అందుకే ఆవిణ్ని అబల అన్నారు. ప్రకృతి సహజమైన ఈ అసమానత వల్లే స్త్రీకి, ఇంటి, పని పురుషుడికి బయట పని ఏర్పరచబడింది. స్త్రీ పురుషుల్లో ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి. సంసారంకోసం పురుషుడు శ్రమ పడతాడు సంపాదిస్తాడు. స్త్రీ వండుతుంది, పెడుతుంది తనూ తింటుంది. కాని, నేటి స్త్రీ ఆపని బానిసత్వంగా ఫీలవుతుంది. మరి పురుషుడు ఎందుకు ఫీల్ కాకూడదు? అతడుమాత్రం బయట ఎందుకు శ్రమపడాలి? ఎందుకు సంపాదించాలి? ఇద్దరి శ్రమా సమానమైనప్పుడు , ఇద్దరిశ్రమా ఒకరికోసం ఒకరిదైనప్పుడు ఒకరు మాత్రమే బానిస లక్షణంగా ఎందుకు ఫీల్ కావాలి?"
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS