Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 38


    అయితే రమణ చాలా బుద్ధిమంతుడు. పెద్దలయెడ, తన శ్రేయస్సుకోరే వారియెడ అతడి మనస్సెప్పుడూ వినమ్రమయ్యే ఉంటుంది. తనలోని సంకుచితత్వం వదిలించుకొని ఈ అంతస్తుకు తగిన విధంగా తన అంతరంగాన్ని అతి విశాలం చేసుకొంటున్నాడు. ఈ పరిసరాలకుఅలవాటు పడిపోవడానికి నిరంతరం కృషిచేస్తున్నాడు. తన చుట్టూ ఉన్నవారి మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నాడు శాయశక్తులా.

    కాని అతడి దురదృష్టం అదేమో రావుగారి నౌకర్లకూ, ఆశ్రితులకూ అతడంటే లోకువే. భార్గవరామ్ ను గౌరవించినట్లుగా ఈ చిన్నయజమానిని గౌరవించలేరు. అతడిని చూచి చాటుగా మూతులు ముక్కులు విరుస్తారు. ముందరపోతుంటే వెనక వెక్కిరిస్తారు దరిద్రుడికి నడమంత్రపుసిరి పట్టిందని ఈసడిస్తారు.

    సుబ్బయ్యకు అతడంటే నిరాదరణ.

    గోవిందస్వామికి నిర్లక్ష్యం.

    రావుగారు నిర్లిప్తులు.

    కృష్ణవేణికి నిరాసక్తత.

    రమణను దత్తు చేసుకొనేవరకు కృష్ణవేణి ఉబలాటం అంతా యింతా కాదు. దత్తత జరిగేదాకా నిద్రపట్టలేదు. ఇప్పుడు తప్పు చేశానేమోనని తపన! అతడిని సహజమైన ప్రేమకు దూరం చేశానేమోనని బాధ! కృష్ణవేణి కొద్దిరోజుల్లోనే తెలుసుకొంది భార్గవుడు తనకు ఎంత దూరంగానైనా వెళ్ళనీ అతడిని ప్రేమించినట్లు రమణను ప్రేమించలేనని.
   

       
                                                                          17



    ఆనాటి మధ్యాహ్నం భార్గవరామ్ గదిలోకూర్చొని బీరువాలోంచి తీసుకొన్న పుస్తకం చదువుతూంది దేవదాసి.

    మేనత్త ఎప్పుడొచ్చిందీ తెలియదు. చటుక్కున దేవదాసి చేతిలో పుస్తకం లాగి బీరువాలోకి విసురుగా గిరవాటుపెట్టింది. "పద నీకీ గదిలో ఏం పని? ఈ పుస్తకాలే నీ బావ మనసుకు సమాధికట్టాయి. నీకా సమాధిలోకి వెళ్ళిపోవాలనుందా? రెక్కపట్టి గది యివతలికి ఈడ్చుకువచ్చేసి, తలుపులు దభియినమూసి, తను తెచ్చిన తాళం పెట్టింది.

    అత్త ప్రవర్తనకు ఆశ్చర్యంతో కొయ్యబారి నిల్చుంది దేవదాసి.

    కోడలి భుజం నెమ్మదిగా తట్టి "దేవతా, బావంటే నీకెంత యిష్టమో నాకు తెలుసునే! వాడు నిన్ను అన్యాయం చేశాడు. దురదృష్టవంతుడు. తనూ అన్యాయమయ్యాడు. నిన్ను వాడు పోగొట్టుకొన్నాడు గాని నేను పోగొట్టుకోవాలనుకోలేదు. రమణకు చేసుకొంటున్నాను. నీ మనసు బావ వశమైందని తెలిసీ రమణకు భార్యగా నిర్ణయించాను. ఏనాటికైనా బావను మరిచి మరొకరికి ఇల్లాలిగా పోవలసిందేకదా? అందుకని రమణను చేసుకోమనడంలో తప్పుచేస్తున్నానని అనుకోలేదు.

    "నువ్వింకా బావ గదిలో కూర్చొని ఆ పుస్తకాలలో అతడిని వెదుక్కొంటూ కాలక్షేపం చేయడం చూచి ఎలా సహించేది చెప్పు!" కరుణా గాదదికంగా అన్నది కృష్ణవేణి.

    అత్త సూక్ష్మ దృష్టితో తన హృదయాన్ని నగ్నంగా శోధించిందనిపించింది. ఆ క్షణంలో సిగ్గు కలుగలేదు దేవదాసికి. దుఃఖ వీచిక అంతరంగంనుండి సాగివచ్చింది. నేత్రాలు సజలాలయ్యాయి. మేనత్త భుజంమీద తలాన్చి "అత్తా" అన్నది రుద్థస్వరంతో.

    కృష్ణవేణి హృదయం తీవ్రంగా కదిలిపోతుందంటే, జాలిగా "నా పిచ్చితల్లీ" అంటూ మరింతగా గుండెలకు ఆన్చుకొంది ఆ పిల్లను.

    బావ స్మృతిని దూరం చేసుకోకపోయినా రమణను అభిమానించక పోలేదు దేవదాసి. అతడంటే ఆమెకు సదభిప్రాయం ఉంది. రోజూ తప్పనిసరిగా ఒకటి రెండుసార్లు ఇద్దరూ కలుసుకొంటూ ఉంటారు. అది రావుగారి పూజాసమయంలో. రావుగారి ఆరోగ్యం ఈ మధ్య మరీ చెడిపోయింది. వృద్ధాప్యం రోగ రూపంలో ఆయన మీద తీవ్రమైన దాడి జరుపుతూంది. ఎంత సుస్తీగానైనా ఉండనీ, దేవతార్చన ఆపడంలేదాయన.

    ముందు వెనుకగా, రావుగారి దేవతార్చన అయిహారతీ తీర్ధం ఇచ్చే సమయానికి రాతగిన వాళ్ళందరూ పూజా మందిరంలో హాజరు అవుతారు, రమణ వస్తాడు. కాని కళ్ళెత్తి చూడడు. దేవదాసి సంకోచం వదిలించుకొని చూస్తే అతడు తండ్రి పూజాక్రమాన్నే అత్యంత ఏకాగ్రతతో తిలకిస్తూ కనబడతాడు. ఏకాగ్రతతో ఉన్న ఆ ముఖాన్ని ముగ్ధయై చూచేది దేవదాసి.

    మరి ఇక ఎక్కడ తారసపడినా దారిచూపేగాని ప్రక్కచూపులు ఉండేవికాదతనికి. రమణ ఒక విశిష్ట వ్యక్తి అన్నభావం దేవదాసికి ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS