Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 38


    హరితకు కమలాకర్ తో అది తొలి పెళ్లిచూపులూ, మలి పెళ్లిచూపులుకూడా.
 
    కమలాకర్  బి. టెక్. పాసయ్యాడు. ఆస్తి సంప్రదాయమూ వున్న తల్లిదండ్రులున్నారు. అన్నదమ్ములిద్దరిలో  ఇతడు చిన్నవాడు. అందగాడిలోకి జమ కాకపోయినా  కురూపికూడా కాదు! ఫర్వాలేదనిపించే రూపురేఖలు. కాని హరిత ప్రక్కన నిలబెడితే మటుకు ఆమెకు భర్త అయ్యే ఓటు మాత్రం ఎవరూ వేయరు! హరితకు జతగా నిలబెడితే ఇతడికి లేని అందం ఎత్తి చూపినట్టుగా అవుతుంది.....

    హరిత తల్లిదండ్రులకు వరుడి అందచందాల గురించి పెద్ద పట్టింపు ఏం లేదు! మంచి మనసు, భార్యను పోషించుకోగల స్తోమత వుంటేచాలు అనుకొనే ఈ దేశంలో సగటు తలిదండ్రులు వాళ్లు.

    హరితకమాత్రం అతడిని చూడగానే అసంతృప్తి తేలుకుట్టినట్టుగా అయింది.
 
    టిఫిన్ లు ,టీలు యధావిధిగా తతంగం నడిచాక' హరితను హాలులోకి తీసికెళ్లి తివాచీమీద కూర్చోబెట్టి చూపించారు.

    ఆహార విహారాలలో ఎంతో ఆధునికత సంతరించుకొన్న తలిదండ్రులు కూతురిపెళ్లి దగ్గరికి వచ్చేసరికి నక్కా - సంప్రదాయ బద్దులుగా ప్రవర్తించడం చిరాకనిపించింది హరితకు.

    వచ్చిన చుట్టాలందరినీ కుర్చీలో కూర్చోబెట్టి తనని చాపమీద కూర్చోబెట్టడం, పమిట సర్దుతూ ఒద్దికగా కూర్చోమని తల్లి హెచ్చరించడం - ఇదంతా కూడా మగ పెళ్లివాళ్లకు అనవసరపు  ప్రాముఖ్యం యిచ్చి వాళ్ళకి  కావాలని కిరీటం తొడిగినట్టుకాదూ? ఇదేమని అడిగితే ఇది సంప్రదాయమంటారు. ఇదెక్కడి సంప్రదాయం? బానిస సంప్రదాయం!పిల్లను పిల్లవాడికి చూపించడం  తప్పితే పిల్లా పిల్లవాడు పరస్పరం చూసుకొనే స్నేహ పూర్వకమైన వాతావరణం కల్పిస్తే బాగుండదూ?"

    "ఇంకా చదివే ఉద్దేశ్యం వుందా?" పెళ్లికొడుకు తల్లి అడిగింది.

    హరిత సమాధానం చెప్పేలోగానే తండ్రి అందుకున్నాడు. "పోస్టుగ్రాడ్యుయేషన్ వరకూ చెప్పించాలనుకున్నాం అనుకున్నది చేశాం. ఇంకేమైనా చదివించాలనుకొంటే పెళ్లయ్యాక మీ ఇష్టం తనిష్టం."

    పెళ్లికొడుకు తండ్రి హనుమంతరావు అన్నాడు. ఆడపిల్లల చేత ఉద్యోగం చేయించడానికి నేను వ్యతిరేకిని సంసారం పొందిగ్గా దిద్దుకోగలిగితే చాలు! అంతకు మించిన ఉద్యోగం లేదు."

    "నేను మీతో కొంచెం డిస్కషన్ పెట్టుకుంటాను. అభ్యంతరమా?" హరిత తలెత్తి ఆయనకేసి చూస్తూ కొంచెం చురుగ్గా అడిగింది.

    "నో అబ్జక్షన్!" ఆయన భుజాలు కుదేసి అదోలా నవ్వాడు.

    "స్త్రీ ఆర్దిక స్వాతంత్ర్యం కలిగి వుండడం మీద మీ అభిప్రాయం ఏమిటి?"

    "స్త్రీ ఆర్దిక స్వాతంత్ర్యమని వినడమేగాని అది ఎక్కడా కనిపించలేదే నాకు."

     "అదేమిటండీ? ఇంతమంది ఆడవాళ్లు వుద్యోగాలు చేస్తుంటే మీకు స్త్రీ ఆర్దిక స్వాతంత్ర్యమే కనిపించలేదా?" ఆశ్చర్యంగా అడిగింది హరిత.

    "పిచ్చిపిల్లవు! లోకానుభవంలేని మాటలంటే ఇవే. ఉద్యోగం చేసే ఆడవాళ్లంతా ఆర్దిక స్వాతంత్ర్యం కలిగి వున్నారనుకొంటున్నావా?  పెళ్లికాకపోతే తలిదండ్రులు పెళ్లయితే భర్తా అత్త్గగారు  ఆమె సంపాదనమీద అధికారం కలిగి వుంటారు. ఆమెమీద అధికారాన్ని కలిగి వున్నంతవరకు ఆమె సంపాదనమీద కూడా అధికారం ఖచ్చితంగా వాళ్లు కలిగి వుంటారు!ఉద్యోగం చేసే ఆ ఆడపిల్లనైనా అడుగు తన జీతం తనిష్టం వచ్చినట్టుగా ఖర్చుపెట్టుకోగలుగుతుందేమో!   ఆర్దిక స్వాతంత్ర్యం పేరుతో మీరు చేసే ఉద్యోగాలు పురుషుడికి అదనపు లాబాన్ని  తెచ్చి పెడుతున్నాయి!అతడి  ఆర్దిక భారాన్ని తగ్గిస్తున్నాయి!  అంతేకాని, మీరు ఏ స్వేచ్చకోరి ఆ ఉద్యోగాలు చేస్తున్నారో ఆ స్వేచ్చని మాత్రం మీకివ్వడం లేదని ఖచ్చితంగా చెప్పగలను!"

    "మీ మాటకాదనలేని నగ్నసత్యమండీ! మా ఆఫీసులో లేడీటైపిస్టు సుధ అనే అమ్మాయి వుంది.  జీతం మొత్తం తీసికెళ్లి భర్త చేతిలో పోస్తుంది. అతడు బస్సు చార్జీలకు లెక్కగట్టి ఇస్తాడు." అన్నాడు కృష్ణారావు.

    "కాని, నా జీతం నా భార్య చేతికిస్తాను. రావుగారూ!" కొద్దిగా చిల్లర ఖర్చులకు వుంచుకొని సంసారానికి ఆర్దిక మంత్రి ఆవిడే."అన్నాడు హన్మంతరానవు. తనెంత  సహృదయుడో చూచుకోండి అన్నట్టుగా నవ్వి.

    "జమా ఖర్చులను నమ్మకంగా చూసే ఒక నౌకరుగా తప్ప భార్య అన్న గౌరవంతో వుండదలెండి!  ఒక పది రూపాయలు కూడా ఆమె ఖర్చు పెట్టుకొనే స్వతంత్రాన్ని కలిగి వుండదు!" మంటగా అనుకొంది హరిత.

    "ఆర్దిక స్వాతంత్ర్యమన్నది సంపాదించే పురుషుడికి మాత్రం వుందా? త్రాగుబోతుల్ని జూదరుల్ని వదిలిపెట్టండి సంసారపక్షం వాళ్ల గురించి నేను చెప్పేది. పిల్లలు, చదువులు, పెళ్లిళ్లు భవిష్యత్తు గురించిన ఆలోచన - వీటికే కదా అతడి జీవితమంతా అంకితం! ఎవరు మాత్రం జల్సాగా ఓ పది రూపాయలు ఖర్చుపెట్టుకోగలుగుతున్నారు!" అన్నాడు మళ్లీ ఆయనే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS