Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 38

    రేపటి చరిత్రకు  ఈ రోజే  స్వాగతమిచ్చే  అవకాశాన్ని  జారవిడువకూడదు.

    అయితే...ఇది నా ఒక్కడి  ఉద్యమం కాదు. కొన్ని లక్షలమందిది. చచ్చిన పాత  నాగరికతకు సానుభూతి  బాష్పాలూ  రాల్చి, కొత్త ప్రపంచాన్ని  పునర్నిర్మిద్దాం.

    'గతకాలమె  మేలు వచ్చుకాలము  కంటే' అని అనుకుంటారా_అలాగే వుండండి. నాకేమీ అభ్యంతరం లేదు.

    ఇంత విశాల విశ్వంలోని  అనంత  వాస్తవికత  ఎదురుగుండా  గోచరిస్తూ వుంటే, ఇంకా  అభూతకల్పనలతో  కాలయాపన చేస్తూ_ ఉన్న వాస్తవాన్ని  నిశితంగా, లోతుగా  పరిశీలించడం  మానేసి, మీకు మీరే అన్యాయం చేసుకోకండంటాను.

    శ్రమకు విలువ కట్టలేం.

    ఇప్పుడు మనం జీవిస్తున్న సమాజంలో రెండే రెండు వర్గాలున్నాయి. దోపిడీ  చేస్తున్న వర్గం ఒకటి, ఆ దోపిడీకి  గురవుతున్న  వర్గం ఒకటి. అది స్పష్టంగా కనిపిస్తూనే వుంది.

    'ఈ బూడిద తీసుకో. ఇది మీ జబ్బులన్నిటినీ వదలగొడుతుంద'ని అంటే ఆ బూడిదను  కళ్ళు  కద్దుకొని  స్వీకరించే  అస్తికోత్తములున్న  దేశం మనది.

    అంతెందుకు? మా ఆవిడ  సరోజ కూడా ఆ కోవకు చెందిందే. అయితే_చిన్నమార్పు ఏమిట్రా  అంటే ఆవిడ ఈ బూడిదల్ని, జాతకాలని నమ్మడం, కనబడ్డ ప్రతీరాయికీ  మొక్కడంలాంటి పన్లు  చెయ్యదు.

    లేని ఆ దేవుడి  కోసం తన ఇంట్లోనే  ఓ గది కేటాయించేసింది. తెల్లవారకుండానే  దీపాలతో, పువ్వులతో, ఊదొత్తులతో, కర్పూరపు సువాసనలతో ఆ గది కళకళలాడిపోతూ  వుంటుంది. ఆమెను కూడా  మార్చగలననే నమ్మకం నాకుంది.

    దేవుడంటూ  ప్రాకులాడుతున్నా, కళ్ళముందు కనిపించే సత్యాన్ని  అర్ధం చేసుకొనే  తెలివి ఆమెకి వుంది. తన ఇంట్లో వున్న దేవుడి వరకే తనపరిమితి. అయినా_ పేరుపడ్డ  దేవాలయాలంటే  ఒళ్ళూపై తెలియదామెకి. మేము బెజవాడలో  అడుగుపెడితే  స్వాతి  బలరామ్ గారింట్లోనే బసచేస్తాం. నన్ను బలరామ్ దంపతులకి వదిలేసి, తాను  కనకదుర్గమ్మ  దర్శనం చేసుకోడానికి  వెళ్ళిపోతుంది.

    'ఎందుకు సరోజా! ఈ గుళ్ళకీ, అమ్మవార్లకీ, పూజలకీ  అంటూ కాలాన్నీ డబ్బునీ కూడా  తగలేస్తావ'ని  తిడతాను. "ఏదో నా పిచ్చి నాది" అని నవ్వేస్తుంది.

    ఇదంతా  ఎందుకు చెప్తున్నానంటే...ఎవరి వెర్రి వారికానందం, కొంత మందికి కొన్ని పనులు చెయ్యడానికి  ధైర్యం చాలదు. ఆ అధైర్యాన్ని  'ధర్మంకాద'నో  'నైతికశక్తి' అనో సమర్ధించుకుంటారు.

    సమాజంలోని  వర్గ వ్యత్యాసాలే  మన ప్రవర్తనల  కంతటికీ  మూలకారణం అని నాకు ఏనాడో తెలుసు" అని శ్రీశ్రీగారు మాట్లాడుతూ వుండగా, ఓ కుర్రవాడు నా దగ్గరకొచ్చి ఓ చీటీ ఇస్తూ  "ఇది శ్రీశ్రీగారికి అందజెయ్యండి" అన్నాడు.

    "నువ్వే ఇవ్వు బాబూ! మరేం ఫరవాలేదు" అన్నాను.

    ఆ కాగితంలోని  విషయాన్ని  చదవమన్నాడతడు.

    "వారి చేతికందించు. దానికి సమాధానం ఇస్తారుగా. అందరితో  పాటే నేనూ వింటాను" అన్నాను.

    ఇంతలో మా బైజు వచ్చి  "అమ్మా! నేను అప్ప దగ్గరికి వెళ్ళనా" అని అడిగాడు.

    "నేను తీసుకు వెళతాను. రా బాబూ" అని ఆ అబ్బాయి  మా వాడ్ని వెంటపెట్టుకొని స్టేజి మీదకి వెళ్ళాడు. మా బైజుతోపాటు, తాను రాసిన ఆ కాగితాన్ని కూడా శ్రీశ్రీగారికి అప్పగించేశాడు.

    అందులో అతడడిగిన  ప్రశ్న. దానికి  శ్రీశ్రీగారి  సమాధానం ఈ విధంగా వున్నాయి.

    "పోనీండి శ్రీశ్రీగారూ! ఏ దేవుడూ, దెయ్యమూలేదనే  ఒప్పుకుందాం. కానీ మనందర్నీ  నడిపించే ఏదో తెలియని శక్తి ఉందని ఒప్పుకుంటారా" అని ఆ ప్రశ్న.

    దానికి "ఓ తప్పకుండా  ఒప్పుకుంటాను. కానీ అది తెలియని శక్తి ఏమీకాదు. అందరికీ తెలిసిందే. అధవా తెలుసుకోవలసిందే_అదే 'ధనశక్తి' అంటాన్నేను" అని సమాధానమిచ్చారు శ్రీశ్రీగారు.

    ఇంతలో మరి రెండు ప్రశ్నలు వచ్చాయి.

    అందులో ఒక ప్రశ్న... "యువకులకు మీరిచ్చే సందేశం ఏమిటి?" దానికి శ్రీశ్రీగారి సమాధానం.... "ఎవరి సందేశాలకూ ఎదురు చూడవద్దని."

    రెండవ ప్రశ్న... "శ్రీశ్రీకి కూడా కొన్ని  బలహీనతలున్నాయని  విన్నప్పుడు మీరెలా ఫీలవుతారు?"   శ్రీశ్రీగారి జవాబు_ "బలహీనతలు  లేని వారెవరు? నా బలహీనతలను అధిగమించడానికి, బలాన్ని పెంపొందించుకోడానికి  నేనెప్పుడూ ప్రయత్నిస్తూ వుంటాను."

    ఆఖరి ప్రశ్న అంటూ మరో కాగితం వచ్చింది. "తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీశ్రీ ఎంతకాలం నిలుస్తాడని మీ అంచనా?" అన్న ఆ ప్రశ్నకు "తెలుగు భాష  నిలిచినంతకాలం" అని సమాధానమిచ్చి కూర్చొండి పోయారు.

    తర్వాత అరగంటకి  సభ ముగిసిపోయింది. ఆటో గ్రాఫులివ్వడం  మొదలైన కార్యక్రమాలతో, మేము ఇంటికి చేరుకొనేసరికి రాత్రి పది గంటలయ్యింది.

    ఇంటికి చేరాక మాకు నిద్రపట్టలేదు. మేమిద్దరం మౌనంగా కొంతసేపూ, మాట్లాడుతూ కొంతసేపూ  అర్ధరాత్రి దాటేవరకూ  కాలక్షేపం చేసి, మర్నాడు ఉదయం మద్రాసుకి బయలుదేరిపోయాం.

    ఇదంతా  కృష్ణశాస్త్రిగారి మరణం  తర్వాత  జరిగిన కధ. మళ్ళీగతంలోకి  అంటే శ్రీశ్రీగారి షష్టిపూర్తి సన్మానం జరిగిన కాలంలోకి  (1970)వెళదాం.

    షష్టిపూర్తి అయ్యాక  ఇంటికొచ్చిన శ్రీశ్రీగారు  ఆ సన్మాన వివరాలు చెప్తూ "1970...ఈ చక్రాలు మహావేగంతో  తిరుగుతున్నాయని  నేననుకుంటున్నాను సరోజా" అన్నారు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS