17
వెంకయ్యకోసం కబురుచేసిన కామాక్షమ్మకి తీరా అతను వచ్చిన తరువాత ఏం మాట్లాడాలో అర్ధంకాలేదు. అదీగాక సుబ్బులుని ఒక్కదాన్నే రమ్మనటం బాగోదని ఆ యిద్దరినీ రమ్మనమని కబురుచేసింది.
కాని కూతురిని తీసుకురావటం తప్పనుకుని తను ఒక్కడే వచ్చాడు.
సుబ్బులు కనుక వస్తే విషయాలన్నీ అడిగి తెలుసుకునేది. వెంకయ్య వచహదని సోములు లోపలికి వెళ్ళి కామాక్షమ్మకి చెప్పాడు.
ఏం మాట్లాడుతుంది కామాక్షమ్మ అయినా? పిలిపించింది తను కాబట్టి వచ్చిన మనిషితో మాట్లాడకుండా పంపిస్తే మర్యాద కాదని తనున్న చోటుకే తీసుకురమ్మని సోములుకి చెప్పింది. మరో అయిదు నిముషాలలో వెంకయ్య ఆ గదిలోకి వచ్చి కామాక్షమ్మ కూర్చోమని కుర్చీ చూపించిన తరువాతగానీ కూర్చోలేదు.
లోగడ తనకి తన భార్యకి జరిగిన అగౌరవాన్ని యింకా మరిచిపోలేదు. అందుకే నిలబడ్డాడు. అది చూసిన కామాక్షమ్మ కూర్చోమంది.
"సుబ్బులుని కూడా తీసుకురమ్మన్నానుగా అన్నయ్యా!" అంది.
"స్కూలుకి వెళ్ళిపోయింది. వుంటే తీసుకురానూ?...అన్నట్లు కామాక్షమ్మ అక్కా నేనేదయినా అంటే నీకు కోపం వస్తుంది గాని, కోపం తెచ్చుకోనంటే ఒక్కటంటే ఒక్క మాట అడగాలని వుంది!" అన్నాడు అటూ యిటూ చూసి ఎవరూ లేరనుకుని!
ఏమిటని అడగలేక పోయింది. గతంలో తామిద్దరి మధ్య జరిగిన సంభాషణను వెలికి తీసి తనను దెప్పి పొడవడు కదా? అనగలడు కూడాను. ఎందుకంటే తను తీసి తెప్పించిందిగా?
"ఏమిటి వెంకయ్య!" నెమ్మదిగా అడిగింది.
"అసలు నువ్వేం తప్పు చేశావని యిలా నాలుగు గోడల మధ్య ఏదో తప్పు చేసిన దానిలా కూర్చోవటం? నీ ప్రమేయం ఏముందని అంతలా బాధపడటం?..." అనడిగాడు. అక్కడికి కామాక్షమ్మ మీద తనకెంతో ప్రేమ వుందన్నట్లుగా?
"సుబ్బులు కూడా వస్తుందేమో? అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలనిపించింది...."
అసలు విషయం దాత వేస్తూ అంది కామాక్షమ్మ.
"కావేరికి సినిమా పిచ్చి వుందని అందరికీ తెలిసిన విషయమేగా? యింకా మా సుబ్బులుని అడిగేదేమిటి? అసలు యిక్కడ వాళ్ళు చూసేటందుకన్నట్లుగా మా యింటికి వచ్చి సుబ్బులుని వెంటబెట్టుకెళ్ళేది? కాలువగాట్టుకి వెళ్ళేసరికి ఏదో ఒక చిన్న విషయం మీద మా సుబ్బులుతో తగూపెట్టుకుని తను ముందు వెళ్ళిపోయేదట! స్కూలు జరిగిన తరువాత ఎప్పటికోగాని స్కూలుకి వచ్చేది కాదట! అంటే ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వచ్చేదన్నమాట. నువ్విలా దిగులుపడటం నాకేం నచ్చలేదక్కా? ఆడపిల్ల తండ్రి తల్లీ పడే బాధ మేనకోడలు గురించి నువ్వు పడతావేమిటి?...యిదేమీ బాగోలేదక్కా!..."
"పెళ్ళి నాలుగు రోజులుందనగా వెళ్ళిపోయింది!....."
మధ్యలోనే వెంకయ్య అందుకుని అన్నాడు__
"పోతేపోయింది జెష్టపీనుగ! యింకానయం! ముందే పోయింది. పెళ్ళి అయినా తరువాత లేచిపోలేదు, అదింకా పరువు తక్కువ అయ్యేది! అన్నట్టు నువ్వు పెట్టిన నలభై కాసుల బంగారంతో సహా లేచిపోయిందటగా?...వెధవ బంగారమేగా పోయింది? నీ పరువేం పోలేదు? అదీ అదృష్టం! యింత కంటే ఎక్కువే వుంది బంగారం నీ దగ్గర! మగవాడు వినాయకానికి నువ్వు "ఊఁ" అంటే పిల్లనిచ్చేవాళ్ళు కోటిమంది వున్నారు నువ్వేమీ బెంగపడకు! ఆ లేచిపోయినది భ్రష్టురాలుగా భావించి మనసుకి సంతోషం తెచ్చుకో అక్కా?..."
వెంకయ్య మాట పూర్తి అయిందో లేదో అంతవరకూ ఓపికగా విన్న వినాయకం యింక ఆ అవమానకరమయిన మాటలు వినలేక విసురుగా అక్కడికి వచ్చాడు. అసలే పుట్టెడు బాధలో వున్నాడు. పరామర్సాకి వచ్చేవాళ్ళు శూలాలులాంటి మాటలు అంటుంటే విని భరించగల శక్తి ఆ తల్లి కొడుక్కీ లేకపోయాయి. వయస్సులోను, అనుభవంలోను కామాక్షమ్మ పెద్దది కాబట్టి పరిస్థితులను బట్టి నిదానించ గలుగుతోంది.
అంత నిదానించ గల శక్తీ, వయస్సు వినాయకానికి లేవు!
"మామయ్య! ముందు ఆ కుర్చీలో నుంచిలే!" అన్నాడు తీక్షణంగాను కోపంగానూ చూస్తూ!
వెలవెలబోతున్న ముఖంతో కుర్చీలో నుంచి లేచాడు వెంకయ్య. కామాక్షమ్మ కొడుకుని వారించాలనుకున్నది గాని నోరు విప్పలేకపోయింది.
"లేచిపోయింది! లేచిపోయిందని పదిసార్లు నొక్కించి అనక్కరలేదు! మా బాధలేవో మేము పడతాము. నీ ఓదార్పులు మాకేమీ అవసరంలేదు! వచ్చిన దారినే వెళ్ళు!"
వాకిలివైపుకి చూపించుతూ కోపంగా అన్నాడు.
"నన్ను రమ్మనమని పిలిపించి చేసిన మర్యాద ఇదేనా అక్కయ్య? అసలు నేనేమి తప్పు మాట్లాడానని అల్లుడికి అంత కోపం రావటం?....అక్కయ్యవు కనుక! మంచి మనసుతో అప్పుడప్పుడూ ఆదుకునే దానివి కనుక? నాపరంగా అన్నాను....యిందులో తప్పేమయినా వుందా?"
"వినాయకం! మామయ్య నీ కంటే పెద్దవాడు! అలా తూలనాడ వచ్చునా? నువ్వు లోపలికి వెళ్ళు!..." అంది కామాక్షమ్మ!
"పెద్దవాడే! కాదనను! యిలా మాటలు మాట్లాడితే నేనూరుకొను....మర్యాదగా వెళ్ళమనమ్మా! ఆఁ ....ఆఁ..."
కోపంగా తల్లి వైపుకి, వెంకయ్య వైపుకి తీక్షణంగా చూస్తూ తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు వినాయకం భుజం మీద వున్న కండువాను దులుపుకుంటూ!
"ఏ అక్కయ్యా! నన్ను రమ్మనమని యింటికి పిలిపించి ముఖం వాచేటట్లు చీవాట్లు వేయించటం భావ్యమా? ఒకసారి నువ్వు చివాట్లువేశావు. పెద్దదానివి! అక్కయ్యవని తలవంచుకుని వెళ్ళిపోయాను...యిప్పుడు నీ కొడుకు చూశావా? ఎంతెంత మాటలు అంటున్నాడో?...యింకా నయం! సుబ్బులుని తీసుకురాలేదు! అది కూడా వచ్చినట్లయితే కొడుకు అన్న మాటలకి యిల్లు పీకి పందిరి వేసి వుండేది! దానికంత పౌరుషం!...సరే పెద్దదానివి! నీ ముఖం చూసి ఊరుకుంటున్నాను గాని ఈ కుర్రకుంక అన్నమాటలకి జవాబు చెప్పలేకనా?...అయినా నా నోరునయితే మూయించుతాడేమో గాని లోకం నోరు మూయించగలడా? ఒక్కసారి జబారులోకి వెళ్ళి ఒక పావుగంట నిలబడితే కావేరి బండారమంతా వినగలరు! మరి వాళ్ళందరినీ అనగలడా?"
