రవి కారు దిగడం చూసింది రాధాదేవి. ఒక్క ఉదుటున లోపలకు వెళ్ళి తన గది తలుపులు చూసింది. అది చూసి ఇందిరకు ఆశ్చర్యం కలిగించింది. రవిని డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టి ఇందిర తల్లి దగ్గిరకు వచ్చింది.
"అమ్మా! అమ్మా! తలుపులు తియ్!" అంటూ తలుపులు కొట్టింది లోపలనుంచి సమాధానం రాలేదు.
ఇందిర పిల్చి పిల్చి, ఇక లాభం లేదని తెలుసుకొని డ్రాయింగ్ రూంలోకి వచ్చింది.
రవికి విషయం అర్ధమయింది, లేచి నిల్చున్నాడు.
"వస్తాను ఇందూ!" అన్నాడు.
"సారీ! రవీ! అమ్మకు ఆరోగ్యం బాగున్నట్టు లేదు"
"పర్వాలేదులే! వస్తాను" అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు రవి.
అలా వెళ్ళిపోతున్న రవిని చూస్తూ నిలబడిపోయింది ఇందిర. కారు వెళ్ళిపోయిన శబ్దం అయ్యాక రాధాదేవి తలుపులు తెరిచి ఇందిర దగ్గిరకు వచ్చింది.
"ఏమిటి నీ వుద్దేశం? నేను బ్రతకడం నీకిష్టంలేదా చెప్పు! నువ్వు కడుపులో పడిన దగ్గర్నుంచీ ఎన్ని కష్టాలు అనుభవించానో, ఇంతవరకూ ఎందుకు బ్రతికి వున్నానో ఒక్కసారైనా ఆలోచించావా?"
ఇందిర తల్లి ముఖంలోకి చూసింది. కళ్ళు పీక్కుపోగా కొత్త వ్యక్తిలా కన్పించింది. ఇందిర తల్లిమీద జాలి వేసింది.
"క్షమించమ్మా!" అని మాత్రం అనగలిగింది.
"పద భోజనానికి"
"నాకు ఆకలి లేదు. నువ్వు భోజనం చెయ్యి" అన్నది ఇందిర.
"నీకు ఆకలిగా లేదు. కానీ నాకు ఆకలిగా వుంది! రాత్రి నుంచి నేను అన్నం తినలేదు" అన్నది రాధాదేవి.
"సరే వడ్డించు" అన్నది.
అన్నం ముందు కూర్చున్నారు తల్లీ కూతుళ్ళు. ఇందిర ముద్ద కలిపి నోట్లో పెట్టుకోబోతూ ఒక్కసారిగా బావురుమని ఏడ్చింది.
"ఏమిటే ఆ ఏడుపు? నేను చావలేదనా? అన్నం తినకు మానెయ్" అంటూ రాధాదేవి చెయ్యి కడుక్కుని లేచి నిలబడింది.
"ఎలా తినమంటావమ్మా, మరో రెండు రోజుల్లో న జీవితానికి అంత్యక్రియలు జరగబోతుంటేనూ" ఏడుస్తూ అన్నది ఇందిర.
రాధాదేవికి వెన్నెముకలో ఏదో జరజర పాకినట్టయింది.
"ఏమిటే ఆ మాటలు?" అన్నది రాధాదేవి ఎలాగో గొంతు పెగల్చుకుంటూ.
"మేము వెతుకుతున్న సాక్షులు విమాన ప్రమాదంలో చచ్చిపోయారు" అంది ఇందిర వెక్కిళ్ళ మధ్యలో.
రాధాదేవి ముఖం నల్లగా మాడిపోయింది. వంట్లో వణుకు ప్రారంభించింది.
చచ్చిపోయారా? కాదు వాళ్ళను తనే చంపివేసింది. ఇంటికి వచ్చిన వాళ్ళకు డబ్బిచ్చి వెళ్ళగొట్టింది తను. ఇద్దరి నిండు ప్రాణాలు తీసింది!
అకస్మాత్తుగా చలిజ్వరం వచ్చినట్టు రాధాదేవి వణికిపోసాగింది. పడబోయి గోడ పట్టుకుని నిలదొక్కుకుంది. ఎలాగో తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇందిర ఆమె వెనకే వెళ్ళిపోయింది. "భగవాన్! నన్నెందుకు ఇలా శిక్షిస్తావ్?"
ఆ మాటలు విని ఇందిర గడపలోనే ఆగిపోయింది. కొంచెం పక్కకు జరిగి తల్లి మాటలు వింటూ నిల్చుంది.
"నేనేం తీరని పాపం చేశాను? చివరకు రెండు ప్రాణాలను నిలువునా తీసిన హంతకురాల్ని అయ్యాను. ఒకవైపు కడుపుకొత్త, మరోవైపు నా భర్త చంపిన వాడిమీద ప్రతీకార జ్వాల...ఏదీ తేల్చుకోలేక సతమతమౌతున్న నా నెత్తిమీద మరో దారుణ అపరాధాన్ని మోపావా? ఇంత దారుణ వేదనను భరించలేను, ఆశ్రయం కోసం వచ్చిన వాళ్ళను వెళ్ళగొట్టాను" రాధాదేవి పిచ్చిదానిలా మాట్లాడుతూ వుంది.
ఇందిరకు తను నిల్చున్న భూమి తనను దగా చేస్తున్నట్టు అనిపించింది. కళ్ళలో నిల్చునే శక్తిలేక వాకిలి పక్కగా గోడకు చేరబడి కూర్చుంది.
వారిద్దరి చావుకూ తన తల్లే కారణమా? ఆశ్రయం కోసం వచ్చిన వాళ్ళను వెళ్ళగొట్టిందా? అంటే రాత్రి ఇక్కడకు వచ్చినవాళ్ళు వాళ్ళే అన్నమాట! అంటే తనకు కావాల్సిన సాక్ష్యులు ఎవరో తెలిసే వాళ్ళను వెళ్ళగొట్టింది! తన బిడ్డ జీవితం వాళ్ళ చేతుల్లో వుందని కూడా ఆమెకు తెలుసు కాని ఆ మూడో మనిషి ఆ మూడో మనిషి తన తల్లే అయివుండాలి.
ఏమిటీ దారుణం! తన తల్లి హృదయం ఇంత పాషాణమా? తన బిడ్డ జీవితాన్నే చేతులారా నులిమేసే రాక్షసా?
అవును! సందేహం లేదు. రవిని దీవించిన వ్యక్తి తన తల్లే! అందుకే రవిని చూసి లోపలకు పారిపోయింది. ఎంత పిలిచినా తలుపులు తెరవలేదు. ప్రతీకారం అంటుందేమిటి? తన తండ్రి హత్యకు రవికి సంబంధం ఏమిటి? రవి ఇరవై ఏళ్ళనాడు పసివాడు. తన తండ్రిని ఎలా చంపుతాడు? రవి తండ్రి... జగన్నాధంగారు... అసంభవం! జగన్నాధం మనసున్న మంచి మనిషి. అతను హత్య చేయడం ఏమిటి?
ఇందిర ఆ పైకి ఆలోచించలేకపోయింది. తల బద్దలైపోతూంది. ఏదో మత్తులాంటిది కమ్మేసింది. గోడ ప్రక్కగా వాలిపోయింది.
30
అకస్మాత్తుగా ఎవరో వీపుమీద చరిచినట్టు లేచి కూర్చుంది ఇందిర. గోడ గడియారం రెండు కొట్టింది. గుండెల్లో ఏదో తొలుస్తూంది. తిన్నగా గదిలోకి వెళ్ళి పడుకుంది. మంచంమీద అశాంతిగా కదలసాగింది. నిద్ర రావడంలేదు. ఆలోచనలు రావడం లేదు. దుఃఖం కూడా రావడం లేదు.
