Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 38


    "నేను త్వరలోనే వస్తాను వేమా!" గుర్రాన్ని అదిలించబోయాడు, గుర్రం కళ్ళెం పట్టుకుని ఆపింది వేమ.
    "నీవు విజయుడవు కావాలి. ఈ ప్రసాదం తీసుకో" అన్నది. సోమదేవుడు ఎక్కిన గుర్రాన్ని దిగి ప్రసాదం స్వీకరించాడు. తల వొంచుకుని కన్నీరు దాచుకొంటున్నది వేమ.
    "వేమా! విచారించక. త్వరలోనే తిరిగి వస్తానన్నాను కదా!" "సోమదేవా! ఇప్పుడు నాకే విచారమూ లేదు. నీవు కొండవీటి అభిమన్యుడవు. నీ పరాక్రమం నాకు తెలుసు. కాని, విధి మన వివాహానికి అడ్డుపుల్లలు వేసి ఆనందిస్తున్నది. దీని పర్యవసానమేమిటో తలచుకుంటే గుండె దడగా వున్నది. నన్ను నీ మనసులో గుర్తుంచుకుంటావు కదూ!" ప్రయాణపు తొందరలో ఆమె భావాన్ని గ్రహించలేకపోయాడు సోమదేవుడు. చెంగున గుర్రం మీదికి గెంతి దక్షిణంగా పరుగెత్తించాడు. అతడు కనుమరుగైపోవటం కన్నులారా చూచి వేమ వెనుదిరిగింది.
    కొండవీడు రాజ్యానికి పునాదులు అప్పటికే బీటలు వారాయి. సవిరం ఎల్లయ్య నాయకత్వంలో అంతఃకలహం బయలుదేరింది. శ్రీనాధయ్య రెండవసారి సర్వజ్ఞసింగభూపాలుణ్ని మెప్పించి నందికంత పోతురాజు కఠారిని తెచ్చాడు, సోమదేవుడు యుద్ధానికి వెళ్ళిన సంగతి ఆయనకూ తెలియదు. కోమటి వేముడు ఈ కష్ట దశలో సోమదేవుణ్ని ప్రక్కనుంచుకుని కొంత మనశ్శాంతి పొందాలని కబురు చేశాడు. సోమదేవుడు నవులూరు యుద్ధంలో ఉన్నాడని తెలిసి ఖిన్నుడయ్యాడు. శ్రీనాధయ్యను పిలిపించి ఈ విషయం చెప్పాడు. శ్రీనాధయ్య ఈ వార్త వినగానే క్షణంసేపు కన్నులార మోడ్పి చింతామణిని జపించాడు. ఆయనకు సరస్వతీడేవి నక్షాత్కరించి దుశ్శకునాలను చూసినట్లనిపించింది.
    అంతలో ఒక సేవకుడు చారుని వెంటపెట్టుకుని వచ్చాడు.
    "నీవు ఎక్కడ నుండి ఏ వార్తలు తెచ్చావు?" శ్రీనాధయ్య ప్రశ్న.
    "నవులూరు నుండి యుద్ధ వార్తలు" చారుడి సమాధానం.
    "మా సోమదేవునికి కుశలమే కదా!" కోమటి వేముని తత్తరపాటు గమనించి శ్రీనాధయ్యకు జాలివేసింది.
    "ప్రభూ! సోమదేవునికి కుశలమే! ఆయన పద్మనాయక రాజులపై పరాక్రమించి యుద్ధం చేస్తున్నారు. పిన వేదగిరి సైన్యాలు కలవరపాటు చెంది ఉన్నాయి. ప్రభూ మనకు విజయం తధ్యమ్" అన్నాడు చారుడు. కోమటి వేముని మనసు శాంతించింది. ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. అయితే శ్రీనాధయ్య చారుని వార్తలోని సంశయాన్ని గ్రుచ్చి ఎత్తాడు.
    "ఇంత మాత్రానికే విజయం తధ్యమని నీవెలా చెప్పగలవు. జయాపజయాలు దైవాధీనాలు గదా?" ప్రశ్నించాడాయన.
    చారుడు తన తొందరపాటును గ్రహించాడు.
    "ప్రభూ! విజయం తధ్యమేనని మన సైన్యాలు భావిస్తున్నాయి. ఎందుకంటే యక్కటి వీరవిక్రముడైన సోమదేవులవారు భీషణ ప్రతిజ్ఞ చేశారు" అన్నాడు సంశయిస్తూ. ఈ తూరి భయపడ్డది శ్రీనాధయ్య.
    "సోముడా! ప్రతిజ్ఞ చేశాడా! ఏమని?" శ్రీనాధయ్య ప్రశ్న.
    "నేను రేపు సాయంత్రం రవి అస్తమించేలోగా పద్మ నాయకరాజుల స్కంధావారాన్ని యక్కటి వీరుడనై ప్రవేశించి పినవేదగిరి తలకొట్టి తెస్తాను" అని సోమదేవులు ప్రతిజ్ఞ చేశారు. ఆయన అన్నంతపని చేయగల అసహాయ శూరులు కనుక మనకు విజయం తథ్యమేనని మన వారంతా భావిస్తున్నారు" అని చెప్పి తాను శలవు తీసుకున్నాడు. వేముని ముఖం వివర్ణమైంది.
    శ్రీనాథయ్య నోరు తెరచినది తెరచినట్లే వుండిపోయింది. సోమదేవుడు పద్మనాయకుల స్కంధా వారంలోకి అసహాయుడై వెళుతున్నాడా? ఒకవేళ పిన వేదగిరి తల నరికి వేయగలిగినా అతడు తిరిగి రావటం జరుగుతుందా? ఆయన కళ్ళముందు వేమాంబ ముఖం కదలాడినట్లనిపించింది. ఆ ముఖం దీనంగా వినిపిస్తూ కన్నీరు విడుస్తున్నది.
    శ్రీనాథయ్య కోమటి వేమునితో సంభాషణ కొనసాగించకుండా వెళ్ళిపోయాడు. ఆయన ఆ రోజంతా జనత పాలలో గడిపి మరునాడు వుదయాన్న పెద్దియజ్వను కలిశాడు. ఆయనకు నమస్కరించి ఆశీనుడయ్యాడు. పెద్దియజ్వ దీర్ఘ ఆలోచనా ముద్రలో వున్నట్లు ఆయన ముఖమే చెబుతున్నది.  
    శ్రీనాథయ్యా! కొండవీటికి శని రోజులు దాపురించాయి.
    "పెద్దయ్యగారూ! వేమాంబ భవితవ్యాన్ని గురించి వేమ ఆలోచిస్తున్నాను. ముక్కు పచ్చలారని పసికందు! సోముడు చూడబోతే దుందుడుకు వీరుడు! ఏమిటి రానున్న విపరీతము?" శ్రీనాధయ్య ప్రశ్న విని పెద్దియజ్వ విరక్తిగా నవ్వారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS