"అయ్యో అమాయకులారా! అతని మోజులో పడి నువ్వు కూడా మోసపోతున్నావు. నిన్నిలా వదిలిపెట్టకూడదు." వీరేష్ ఆవేశంగా అంటూ లేడీ కానిస్టేబుల్స్ కు క్రీగంట సైగ చేశాడు.
వెంటనే ఇద్దరూ వచ్చి సాహితిని చెరొక చేత్తో పట్టుకున్నారు.
వీరేష్ టోపీ పెట్టుకొని జీపు దగ్గరకు బయలుదేరాడు.
అతనివెంటే లేడీ కానిస్టేబుల్స్ సాహితిని తీసుకుని బయలుదేరారు.
"నన్నెక్కడికి తీసుకువెళుతున్నారు?" అసహనంగా అరిచింది సాహితి.
"అరవకు! పద చెబుతాను. ముందు నిన్ను మీ ఆంటీకి అప్పజెప్పి ఇంట్లోంచి కదలకుండా చెయ్యాలి."
వీరేష్ ఆమెను జీపు ఎక్కించాడు.
అతని ఆవేశానికి పట్టుదల తోడవడంతో కసిగా యాక్సిలేటర్ తొక్కాడు. జీపు బిందుమాధవి యింటి దారి పట్టింది.
* * * *
బ్రిటిష్ ప్రభుత్వం కాలం నాటి చట్టాలు, శాసనాలు నేటి మన వ్యవస్థకు సరిపడేవిగా లేవు. అవి నేరస్థులకే అనుకూలంగా వున్నాయి.
కొన్ని కేసులలో నేరస్థుల ఆచూకీ లభించడం లేదంటే, అదీ పోలీసు దర్యాప్తులో లోపంగా భావిస్తున్నారు ప్రజలు. నేరస్థులు తెలివిగా ఏ ఒక్క ఆధారం విడవకుండా చాలా తెలివిగా తప్పించుకో గలుగుతున్నారు.
సురేఖ కేసును కేవలం ఆత్మహత్యగానే యిప్పటి వరకూ ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి కేసులలో పోలీసులు చేసేది కేవలం శవాన్ని శవ పరీక్షకు పంపి, చనిపోయినవారి బంధువులను మరింతగా బాధపెట్టడమే ననుకుంటున్నారు. ఇక పోలీసులు దర్యాప్తు అంటూ తాత్సారం చేసేది కేవలం ప్రజల దృష్టిని మరల్చడం కోసం అనే భావన ప్రజలలో నెలకొని ఉన్నది.
ఆ అభిప్రాయాలన్నీ కేవలం ప్రజలకు పోలీసు వ్యవస్థ మీద వున్న అపోహలేనని తను నిరూపించాలని వీరేష్ ఆరాటపడుతున్నాడు. అందుకు నాందిగా సురేఖ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ ను తన కస్టడీలోకి తీసుకున్నాడు.
రవికుమార్ ను ఇంటరాగేట్ చేస్తే అన్ని విషయాలూ బయటపడతాయి. అప్పటివరకూ ఏ విషయమూ బయటకు పొక్కకూడదు.
సురేఖ కేసులో నేరస్థుడు దొరికాడన్న వార్త బయట పడకుండా ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఈ నోటా, ఆనోటా బయటకు పొక్కనే పొక్కింది. ప్రజలలో సంచలనం కలిగింది.
సురేఖది హత్యా? ఆత్మహత్యా?
పోలీసులు ఆమె చావును ఆత్మహత్యా నేరం కింద కేసు పెట్టారు.
హత్య అయితే, నేరస్థుడు ఎవరు?
నేరస్థుని పేరు తెలిసినప్పుడు ఇన్ని రోజులూ అతని పేరు బయటపెట్టకుండా పోలీసులు ఎందుకు దాచి పెట్టినట్టు?
పట్టణంలో ఎక్కడ చూసినా సురేఖ కేసు గురించి చర్చలే జరుగుతున్నాయి.
వీరేష్ కు ఎడతెరిపి లేకుండా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. రాజకీయ నాయకులు, మహిళా సంఘాలు, న్యాయవాదులు వాళ్ళ సందేహాలను తీర్చుకోవడం కోసం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వాళ్ళందరికీ ఓపికగా సమాధానాలు చెబుతూ, కేసు దర్యాప్తులో వున్నదని దాటివేస్తూ వచ్చాడు వీరేష్.
రవికుమార్ పోలీస్ కస్టడీలో వున్న వార్త అందరికీ తెలిసిపోవడంతో, ఇహ అతడిని చట్టరీత్యా 24 గంటలలోగా కోర్టులో హాజరుపరచవలసి వున్నది.
ఈ నేపథ్యంలో రవికుమార్ ను వెంటనే ఇంటరాగేట్ చేయడానికి గదిలోకి తీసుకువెళ్ళాడు ఇన్ స్పెక్టరు వీరేష్.
నిండా పదహారు సంవత్సరాలైనా లేని అతని వాలకం చూస్తే సురేఖను అతను పాడుచేశాడనిపించటంలేదు. అతని ముఖంలోని అమాయకత్వం, నూనూగు మీసాలు చూస్తే అతనికి అసలు లైంగిక సుఖం గురించి సంపూర్ణంగా అవగాహన వున్నట్టు అనిపించడం లేదు.
మెడికల్ రిపోర్టు ప్రకారం సురేఖ ఆత్మహత్యకు ముందు పురుషునితో సంపర్కం జరిగినట్టు ఆధారాలున్నాయి.
అక్కడి వాతావరణం చూసి, రవికుమార్ లో కలవరం పుట్టింది. వీరేష్ రౌద్రాకారం చూడగానే అతని ఫ్యాంటు తడిసిపోయింది.
ఇన్ స్పెక్టర్ చేతిలోని లాఠీని చూసి అతను గజగజ లాడాడు.
వీరేష్ కు అతని మానసిక పరిస్థితి అర్థమయింది. మనిషి శరీరం కంటే బుద్ధి ముఖ్యమైంది. అతని మనసు అతనిచేత తప్పు చేయించిందంటే నమ్మశక్యంగా లేదు వీరేష్ కు. ఏ పరిస్థితులు అతన్ని నేరానికి ప్రోత్సహించాయి? వయసు తెచ్చిన వ్యామోహమా? లేక దగ్గరకు వచ్చిన అవకాశమా?
రవికుమార్ తను వేసే ప్రశ్నలకు జవాబివ్వగల మానసిక స్థితిలో ఉన్నాడా? క్షణం ఆలోచించి అడిగాడు వీరేష్.
"చూడు రవీ! జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు జరిగిపోయింది. తప్పు చేయడం మానవ నైజం, క్షమించడం దైవ గుణం..." క్షణం అతని కళ్ళలోకి చూశాడు.
రవికుమార్ అవునన్నట్టు తల ఊపాడు.
"కాని, నువ్వు చేసిన తప్పుకు తోటి విద్యార్థిని సురేఖ జీవితం బలైపోయిందే మరి!"
ఆ మాటలు రవి కళ్ళల్లో నీళ్ళూరాయి.
"నువ్వు తిరిగి ఆమె ప్రాణాలు ఎలాగూ తేలేవు. కనీసం నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా అయినా నిజాన్ని దాచకుండా చెబితే మంచిది. నాకు చేతనైన సహాయం చేస్తాను."
"సార్! నేను ఎవరినీ ఏమీ చేయలేదు!" రవి ఖంగారుగా అన్నాడు.
"ఆల్ రైట్! నువ్వేమీ చేయలేదు. అసలేం జరిగిందో చెప్పు!"
రవి ఆలోచనలో పడ్డాడు.
"భయపడకు రవి!...జరిగింది నిర్భయంగా చెప్పు..." అనునయంగా అడిగాడు.
"ఆడపిల్లలు బట్టలు లేకుండా వుంటే..." రవి సిగ్గుతో తల వంచుకున్నాడు.
"ఫర్వాలేదు, సిగ్గుపడకు, చెప్పు రవీ!"
"ఎలా వుంటారో చూడాలన్న కోరిక పుట్టింది నాలో. కాని నాకు ధైర్యం చాలలేదు. పుస్తకాలు అద్దెకు యిచ్చే ఒక వ్యక్తితో పరిచయమయింది. అతను నాకు కొన్ని బొమ్మల పుస్తకాలు ఇచ్చాడు. వాటిలో నగ్నంగా వున్న అమ్మాయిల ఫోటోలు చూశాను. ఫోటోలో కన్నా సహజంగా ఆడపిల్లలను నగ్నంగా చూడాలని వుందని అతనితో చెప్పాను. అతను చదవమని కొన్ని తెలుగు నవలలు యిచ్చాడు. అది చదివాను. వాటితో ఒక నవలలో రాసినట్టు చేయాలనిపించింది. ఆ విషయం అతనితో చెప్పాను. అతను నాకు ధైర్యం చెప్పాడు. ఆ నవలలోని పధకంలాగానే అతనిచ్చిన మత్తు మందును హల్వాలో కలిపి పిక్ నిక్ కు వచ్చిన అందరికీ ఇచ్చాను. దాంతో అందరికీ మైకం కమ్మింది..." చెప్పడం ఆపి మంచినీళ్లు అడిగాడు.
