Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 38

చివరికి,
పుండరీకాక్షయ్య వల్ల కించిత్ లాభం లేదని గ్రహించిన ఇన్ స్పెక్టరు, ఆయన అడ్రస్ తీసుకుని "నేనెప్పుడు కబురుచేస్తే అప్పుడు తక్షణం ఇక్కడ వాలాలి." అని చెప్పాడు.
"వాలటానికి నేనేమన్నా పక్షినా!" అనుకున్న పుండరీకాక్షయ్య.
"మీరు కాకి చేత కబురంపితే చాలు వున్నపళాన వచ్చి ఇక్కడ వాలతానండీ! కానీ, మరా సమయంలో నేను ఇంట్లో లేకపోతే ఎలాగండీ?" అమాయకంగా ముఖంపెట్టి అడిగాడు పుండరీకాక్షయ్య.   
"ఆ పాట్లేవో మేము పడతాం. ఎవరు ఎక్కడ వున్నా మేము వెళ్ళగలం. అదంతా మేము చూసుకుంటాం. ప్రస్తుతానికి మీ పని ఇక్కడ పూర్తి అయింది. ఇక మీరు వెళ్ళవచ్చు." అన్నాడు ఇన్ స్పెక్టరు.
పుండరీకాక్షయ్య బ్రతుకు జీవుడా!" అనుకుంటూ పోలీస్ స్టేషన్ లోనుండి బయటపడ్డాడు.
కానీ,
ఆయనకి అంతటితో దుర్ఘటనల నుండి విముక్తి లభించలేదు.
పుండరీకాక్షయ్య పరిస్థితి ఇలా వుంటే,
అక్కడ ఆ భార్యా భర్తల పరిస్థితి, మరోరకంగా వుంది.

                                      17

అక్కడ వీధిలైట్లు లేవు.
దరిదాపుల్లో వూరు కూడా లేదు.
బస్సు బస్సూ ఢీకొని యాక్సిడెంట్ అయింది రాత్రి పూట. అంతక్రితం వానపడి ఇప్పుడు ఆగినా, ఆకాశం మాత్రం ఇంకా మేఘావృతమై వుంది.
దాంతో ఆ ప్రదేశమంతా కటిక చీకటిగా వుంది.
బస్సూ బస్సూ గుద్దుకున్న తరువాత, ముందు బస్సు వెళ్ళి, బాగా పల్లంగా వున్న ఒక నీటి గుంటలో కూరుకుపోయింది. అప్పటికప్పుడే బస్సులోకి బురదనీళ్ళు వచ్చేశాయి. ఆ బస్సులో వాళ్ళు ఎంతమంది సజీవులుగా వున్నారో, మరెంతమంది విగతజీవులు అయ్యారో, ఆ భగవంతుడికి తెలియాల్సిందే.
బస్సు పల్లంలోకి జారిపోయేటప్పుడు, వినిపించిన హాహాకారాలు తప్ప మళ్ళీ శబ్దం అన్నది ఆఖరికి చిన్న మూలుగు కూడా ఆ బస్సుల్లోంచి వినిపించలేదు.
ఆ బస్సు సంగతి అలా పడితే.
శివరావు వాళ్ళు ఎక్కిన బస్సు పరిస్థితి మరోవిధంగా వుంది.
అక్కడేవున్న పెద్ద మర్రిచెట్టుకి వెళ్ళి బస్సు ముందుభాగం బలంగా గుద్దుకోవటంతో బస్సు ముందుభాగం అప్పచ్చిలాగా అణగిపోయింది. డ్రైవింగ్ సీట్ లోవున్న డ్రైవర్ శరీరం, సీటుకీ ఇంజన్ కి మధ్య నొక్కుకు పోయి నజ్జు నజ్జు అయింది.
అంతేకాదు.
బస్సు స్పీడుగా వెళ్ళి గ్రుద్దుకోవటం వల్ల ముందు సీటులో వున్న ఓ నలుగురు సీట్ల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మరణించారు. చాలామంది కాళ్ళు విరిగి, చేతులు విరిగి బాధతో అరిచేవాళ్ళు, షాక్ తో తెలివి తప్పిపడి పోయినవాళ్ళూ, బస్సు లోపల నానా గందరగోళం ఏర్పడింది.
ఇంజన్ భాగం పూర్తిగా పాడుకావటం వల్ల బస్సులో అంతవరకూ వెలుగుతున్న లైట్లు ఆరిపోయాయి.
బయట చీకటి, బస్సు లోపల చీకటి, చనిపోయిన వారెందరో! బ్రతికిన వాళ్లెందరో! గాయాలతో బాధపడేవారు ఇంకెందరో! ఒకళ్ళకి ఒకళ్ళకీ తెలియకుండా పోయింది. బస్సు ప్రమాదంలో ఇంకా బ్రతికివున్న భయస్తులు పెద్దగా ఏడ్పులూ అరుపులూ ప్రారంభించారు.
వాళ్ళందరి పరిస్థితీ అలా వుండగా,
వెనుక సీట్లో జ్వరంతో పడుకున్న పార్వతి, బస్సు చెట్టుకి గ్రుద్దుకోంగానే దభ్ మంటూ సీటుమీంచి క్రిందికి వరిగిపోయింది. కాళ్ళు పట్టేసినట్టయి ఒకసారి పైకిలేచి కూచుందామని ఆ దుర్ఘటన జరిగేముందు ఒకసారి లేచి నుంచున్నాడు. దాంతో అతనికి బాలెన్స్ కుదరక, ఇంతెత్తున ఎగిరిపడటమే కాక, తల వెళ్లి సీటుకి తగిలి పూర్తిగా స్పృహ కోల్పోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS