"ఎందుకు దొరకవూ? బయట ప్లాట్ ఫారం నిండా పంపులున్నాయి. టీ స్టాల్ కూడా వుంది" అన్నాడు.
"ఆ సంగతి నాకూ తెలుసు."
భాస్కరుకు వళ్ళు మండిపోయింది.
"మరి తెలిసే ఎందుకు అడుగుతున్నారు?"
"బయటికి వెళ్ళడం ఇష్టంలేకే మిమ్మల్ని అడుగుతున్నాను" కొంచెం జంకుతూ అన్నది.
అప్పటికి కాని అతనికి, ఆమె తనను మంచినీళ్ళు తెచ్చిపెట్టమని అడుగుతున్నట్టు తోచలేదు.
వెంటనే లేచి బయటకు వెళ్ళాడు. పది నిముషాల్లో ఒక చేత్తో టీ గ్లాసూ, మరో చేత్తో నీళ్ళగ్లాసూ పట్టుకొని వచ్చాడు.
"అయ్యో టీ కూడా తెచ్చారెందుకండీ?" నొచ్చుకుంటూ నీళ్ళగ్లాసు అందుకుని గటగటా తాగేసింది.
"ఫర్వాలేదు. తీసుకోండి" టీ గ్లాసు అందించాడు భాస్కరు.
"వద్దండీ! మీరు తాగండి." మొహమాటపడిపోతూ అన్నది సన్నగా.
"నేను తాగే వచ్చాను. తీసుకోండి."
"థాంక్స్" అన్నది గ్లాసు తీసుకొని.
అలా అన్నప్పుడు ఆమె కళ్లు మెరిశాయి. అందమైన ఆమె కనురెప్పల్నీ, సోగ కళ్ళనూ, ఆ కళ్ళల్లో కదిలిపోతున్న పలుకుల్నీ చూస్తూ తన్మయత్వం చెందాడు భాస్కరు.
ఖాళీ గ్లాసులు టీ దుకాణంలో ఇచ్చి తిరిగి వెయిటింగ్ రూంలోకి వచ్చాడు.
"నెల్లూరు వెళ్లే బండి ఎన్ని గంటలకు వస్తుంది?" ఓరగా చూస్తూ ప్రశ్నించింది ఆమె.
"ఇప్పుడెక్కడ బండి, అది ఎప్పుడో వెళ్ళిపోయింది. మీకు తెల్లవారేదాకా ఇక బండి లేదు" అన్నాడు అతను.
"తెల్లవారేదాకా బండిలేదా?" గాబరాగా అడిగింది ఆమె.
"తెల్లవారుజామున బందరు బండి వుందిలెండి."
"అమ్మ బాబోయ్! బందరు బండా" అని వెంటనే నాలుక కర్చుకుంది.
ఆమె వాలకం చూస్తుంటే భాస్కరు బుర్రలో అనేక ప్రశ్నలు పుట్టుకొచ్చాయి పుట్టగొడుగుల్లాగ.
"ఇంకో గంటలో హాయిదరాబాద్ ఎక్స్ ప్రెస్ వస్తుంది."
"హయిదరాబాద్ వెళ్ళేబండి గంటలో వస్తుందా? అయితే నాక్కూడా ఒక టికెట్ తెచ్చిపెట్టండి." హ్యాండ్ బ్యాగ్ తెరుస్తూ అన్నది.
అతని అనుమానం నిజమైంది. తను విసిరినా వలలో చిక్కుకుంది అనుకున్నాడు.
"ముందు నెల్లూరు బండి అడిగావ్, ఇప్పుడు హయిదరాబాద్ కు టికెట్ తెచ్చిపెట్ట మంటున్నావ్. ఏమిటి కథ!" ఏకవచన ప్రయోగం చేశాడు భాస్కరు.
ఆమె మాట్లాడలేదు. తల వంచుకుంది.
దాంతో అతనికి ధైర్యం ఎక్కువయింది. ఆమె కుర్చీకి దగ్గరగా వెళ్ళి నిల్చున్నాడు.
"బందరు అంటే అమ్మబాబోయ్ అన్నావ్. అంటే బందరు నుంచి వస్తున్నావన్నమాట." 'నీ సంగతంతా నాకు తెలిసిందిలే' అన్నట్టు వుంది అతని ధోరణి.
"ఎక్కడనుంచో ఓ చోటు నుంచి వస్తున్నాను. అసలు నా సంగతి మీకెందుకూ?" కోపంగా లేచి నిల్చుంది ఆమె.
గడపలోకి వచ్చి బయటికి తొంగిచూసి, తిరిగి లోపలికి వచ్చింది. అతనికి దూరంగా వున్న మరో కుర్చీలో కూర్చుంది.
"ఇదిగో అమ్మాయ్! నిజం చెప్పు! ఎక్కడ నుంచి వస్తున్నావ్? లేకపోతే?" పోలీసు ఆఫీసరు దర్జాలో అన్నాడు.
"ఏమిటయ్యా నీ బెదిరింపు? ఏం చేస్తావంటా?" కోపంగా అన్నది ఆమె.
"ఏం చేస్తానా? పోలీసులకు అప్పజెపుతాను."
ఆ మాటతో ఆమె హడలి పోయింది. బిక్కమొహం వేసింది. బెదురుగా అతని ముఖంలోకి చూసింది. దెబ్బతిన్న లేడి పిల్లలాగ.
అదే అదనుగా భావించి తన కుర్చీని ఆమెకు దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు.
"నువ్వు లేచిపోయి వస్తున్నావ్! అవునా!" అతను ఆమె ముఖంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ అన్నాడు.
