ఇన్ స్పెక్టర్ వర్ధనరావు తన అధికారాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు.
"అలాగే సార్! ఎస్ సార్! మీ ఇష్టం సార్! మీరు ఎలా చెబితే అలా" అంటూ మా వేపు గుర్రుగా చూశాడు అహోబిలం.
అంతే.
మా విడుదల ఖాయమై పోయింది.
18
"ఇప్పుడు మనమేం చేయాలి?" రామ్ సింగ్ అడిగాడు.
"అదే ఆలోచిస్తున్నా బ్రదర్! రిస్క్ తీసుకోక తప్పదేమో అనిపిస్తున్నది."
"రిస్కా? ఏ విషయంలో? దేనికి?" ఆత్రుతా, ఆందోళనగా సమ్మిళిత స్వరంతో అడిగాడు రాంసింగు.
"ఇన్ స్పెక్టర్ వర్ధనరావు మనల్ని తేలికగా విడిచిపెట్టడు. అంతవరకూ మనం క్షేమంగా బ్రతికి బయటపడ్డాము. బాస్ గాడు బ్రతికి వున్నాడా? లేడా? అన్న అనుమానం మనకి లేకుండా బాస్ గాడు పోలీసు స్టేషన్ కి ఫోను చేయటం జరిగింది. బాస్ గాడు బ్రతికి వున్నాడు అన్న అంతవరకూ గుడ్ న్యూసే. కాకపోతే వాడు మనమీద పీకల దాకా కోపంతో పగబట్టి వున్నాడన్నది వాడు అందించిన సమాచారం వల్ల ఖాయంగా తెలుస్తున్నది. మనం దొంగలమని, హంతకులమని, స్మగ్లర్లమని అలా ఏదో ఒకటి చెప్పక, కోటీ యాభై లక్షల వజ్రాల గురించీ మనకి తెలుసునని ఇన్ స్పెక్టర్ కి సమాచారం ఎందుకు అందించాడో మాత్రం నాకు అర్థం కావటంలేదు" ఓ ప్రక్క ఆలోచిస్తూనే ఇంకో ప్రక్క నా మనస్సులో మాట చెప్పాను.
"అదికాదు భాయ్! తనేమో కోటీ యాభై లక్షలు విలువగల వజ్రాలు తీసుకుని పారిపోతూ, ఇంకా మనతో చెలగాటం ఆడుతూ, ఇక్కడే కూర్చొని వుండటం ఇష్టంలేక ఇన్ స్పెక్టర్ కి ఈ సమాచారం అందించి మనల్ని జైల్లోనే వుంచాలని మళ్ళీ మనల్ని మరింత ఇరుకున పెట్టాలని ఆలోచించి వుంటాడు" అంటూ తనకి తోచింది చెప్పాడు రామ్ సింగ్.
"నువ్వు చెప్పింది ఒక విధంగా కరెక్టే అనుకుందాం బ్రదర్! కానీ తెలివి తక్కువవాడు కూడా ఏదయితే రహస్యంగా వుండాలో దాన్ని బయట పెట్టరు"
"అంటే?"
"ఇన్ స్పెక్టర్ కి ఫోను చేసినపుడు మన కథకి మూలమైన వజ్రాల గురించీ చెప్పకుండా మన దగ్గర ఏదో నిథి రహస్యం వుందనో, లేక హాజీమస్తాన్ కి అనుచరులమనీ, శోభారాజ్ కి మేనత్త కొడుకులమనీ, ఇలా ఏదో ఒక కట్టుకథ అల్లి చెప్పేవాడుగానీ, వజ్రాల సంగతి చెప్పేవాడు కాదు. పైగా వజ్రాల కేసు ఇన్ స్పెక్టర్ దృష్టిలోకి వచ్చింది. బాస్ వజ్రాలు చేజిక్కించు కోవటమూ జరిగింది. పనిగట్టుకుని ఈ విషయం ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడూ అంటే కాస్త గట్టిగా ఆలోచించవలసిన విషయమే" అన్నాడు.
"కోటి యాభై లక్షల వజ్రాలు బాస్ గాడిచెయ్యి జారిపోయాయేమో" రామ్ సింగు గబుక్కున అనేశాడు. ఇది ఆలోచించి అన్నమాట కాదు. అయినా నాకు కొత్త అయిడియా తెలియచేసినట్లయింది.
మృదువుగా రాంసింగ్ భుజం తట్టాను. "నీ ఐడియా మెచ్చుకో తగిందే బ్రదర్! నీ ఐడియా ప్రకారం వజ్రాలు వాడి చెయ్యి దాటిపోయాయనే అనుకుందాం. అలాంటప్పుడు బాస్ గాడు చేతులు ముడుచుకుని కూర్చోడు. వజ్రాలకోసం తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అంతేకాని టైమ్ వేస్టు చేస్తూ నీకూ నాకూ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేస్తూ కూర్చోడు. ఒక విధంగా నువ్వు చెప్పింది కరెక్టు కాకపోవచ్చు. నక్కజిత్తుల బాస్ గాడి ఆలోచన ఇంకోటి అయి వుండొచ్చు. మన ఆలోచనలన్నీ వ్యర్థం మనం అర్జెంట్ గా చేయవలసిన పని బాస్ గాడి గురించి ఆరాలు తీయటం అది ముఖ్యం."
"బాస్ ఎక్కడున్నాడని వెతుకుతాం. పైగా ఇప్పుడు వాడికి మన మీద పీకలదాకా కోపం వుంది. మనం కనపడితే చీల్చి చెండాడటానికి రెడీగా వుండే వుంటాడు. పైగా మనం ప్రతిరోజూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మనం కనపడి సంతకం పెట్టి రావాలి. మన ప్రాణానికి ఈ బెడద ఒకటి, ఇటు బాస్ గాడిని, అటు పోలీసులని ఒకేసారి మాయ పుచ్చాలి. అంటే మనం ఇక్కడినుంచి మాయం కావాలి."
"అలా అయితే ఇన్ స్పెక్టర్ గాడు మనల్ని ఇంకా అనుమానిస్తాడు కదా!"
"నిజమే బ్రదర్ అనుమానిస్తాడు. అందుకే రెండు రోజులపాటు పోలీస్ స్టేషన్ కి బుద్ధిమంతుల్లాగా వెళదాం. ఆ తరువాత మంచిరోజు చూసుకుని జై పరమేశ్వరా! అందాం. అంతకుమించి మార్గంలేదు. అయినా సమయం వుందికదా ఆలోచిస్తాను నేను" అన్నాను.
"ఆలోచించు. బాగా ఆలోచించు భాయ్!" అంటూ రామ్ సింగ్ నాకు ప్రోత్సహిస్తూ అన్నాడు!
చిన్న ఆధారం దొరికితే, పెద్ద ఆలోచన చేయవచ్చు. చిన్న ఆధారమే దొరకలేదు. ఇంక పెద్ద ఆలోచన చేసేదేముంది? కానీ, ఒకటిమాత్రం నిజం. నా ఊహకి అందనిది ఏదోవుంది. అది ఏమిటి? అని తెలుసుకున్న మరుక్షణం కోటలో పాగా వేయటం అన్నది కూడా చాలా తేలిక.
