"ఇది బార్ కావడంచేత నీకలా అనిపిస్తోంది. అది నోవాకోలా!" అని చెప్పాడు.
మరోసారి సిప్ చేసింది భారతి. అదిప్పుడు కాస్త రుచిగానే అనిపించింది.
నోవాకోలాలో 'రం' కలిపి తెప్పించాడని భారతికి తెలీదు.
ఆమెచేత తాగించాలన్నదే అతని ఉద్దేశ్యం. గ్లాసులోని ద్రవమంతా పూర్తిచేసింది భారతి.
బోసు తన మేథస్సుకి తనే పొంగిపోయాడు.
"డూ యు వాంట్ వన్ మోర్!" అడిగాడు.
"ఊ....." అంది. తనకేమిటో అయిపోతున్నట్టుగా వుంది. కడుపులోంచి సన్నని మంట వేస్తున్నట్టుగా, ఒళ్ళు తూలుతున్నట్టుగా.
"నేను తీసుకొంది నోవాకోలా, అంతేగా, అంతే!" అంటూ పకపకా నవ్వింది భారతి.
స్టివర్డ్ తెచ్చిన గ్లాసుని ఎత్తి గడగడా తాగేసింది భారతి.
బోసు నవ్వుకున్నాడు.
మందుకున్న శక్తి అదే!
అది రుచి చూడక ముందు అసహ్యం. ఒకే ఒక చుక్క నాలికపైన పడితే ఇక వెనక ముందు ఆలోచించడు మనిషి.
ఇంతకాలం తనను పిచ్చికుక్కలా చేసి ఆడించిన భారతి ఈనాడు తన చేతికి చిక్కింది.
ఈరోజు కరువుతీరా ఆమెను అనుభవించాలి. అదే అభిప్రాయంతో ప్రిపేర్ అవుతున్నాడు బోసుబాబు.
చేతి వాచిలోకి చూశాడు బోసుబాబు.
ఏడు దాటింది. అంటే చీకటి పడింది. బిల్లు చెల్లించి భారతికి ఆసరాగా చేతిని అందించాడు భారతి తూలిపోతూ లేచి నుంచుంది.
మనోహర్ పిచ్చిగా చూశాడు.
అతనికి పూర్తిగా అర్థం అయింది. తనని ఏడిపించడానికే భారతి అతనితో కలిసి ఇలా చేసింది. కానీ ఆ రాస్కెల్ మోసం చేసి ఏదో తాగించాడు.
అతను అచేతనంగా కూర్చుండిపోయాడు. అడ్డుపడటానికి ఆస్కారం లేదక్కడ. భారతి అతను కలిసి రావడం అందరూ చూశారు. సిగరెట్ తీసి వెలిగించాడు. వాళ్ళకేసి చూస్తూ కూర్చుండిపోయాడు.
భారతి నడుంచుట్టూ చేతిని వేసి బయటికి నడిపించుకొని వెళ్ళిపోయాడు బోసు.
ఆటోలో ఆమె అతని ఒడిలోకి వాలిపోయింది.
తన ఇంటిముందు ఆటో ఆగగానే ముందు బోసు దిగి ఆటోవాడికి డబ్బులిచ్చేశాడు.
ఓసారి అటూ ఇటూ చూసి భారతిని మెల్లగా దింపాడు. కొద్ది దూరంలో ఎవరో నడిచి వస్తున్నారు.
ఆమె ఓ చేతిని తన మెడమీద వేసుకొని, తన చేతిని ఆమె నడుంచుట్టూ వేసి గేటుకేసి నడిచాడు.
మరికొన్ని నిమిషాల్లో భారతి పూర్తిగా తనసొంతం అయిపోతుంది.
ఇన్నాళ్ళ తన కోరిక ఈనాడు నెరవేరబోతోంది.
మత్తెక్కిన వెర్రి ఆనందంతో గేటుమీద చెయ్యివేశాడు బోసుబాబు.
భారతి స్పృహలోలేదు. అచేతనంగా అతను నడిపిస్తుంటే నడుస్తోంది.
కాని బోసుబాబు అనుకున్నట్టుగా జరగలేదు. అతను ఊహించని రీతిలో మెరుపుకన్నా వేగంగా మనోహర్ ఫియట్ కారు సర్రుమని పెద్దగా చప్పుడు చేస్తూ గేటు దగ్గర ఆగింది.
కారు ఆగడం, డోర్ తీసుకొని మనోహర్ కారులోంచి కిందికి గెంతడం క్షణంలో వెయ్యోవంతు కాలంలో జరిగిపోయింది.
బోసుబాబు తేరుకొని చూసేలోగా మనోహర్ పిడికిలి బిగించి బోసు గెడ్డంపైన కొట్టాడు.
ఆ దెబ్బ సామాన్యమైంది కాదు ఉక్కు పిడికిలితో కొట్టినట్టుకాగా బోసుకి కళ్ళు బైర్లు కమ్మాయి. భారతిని కిందికి వదిలేశాడు.
అదే సమయంలో అక్కడికి సారధి వచ్చాడు. భారతిని గుర్తించాడు సారధి. మనోహర్ కొట్టడంతో భారతిని అతడు వదిలేయడం సారధి చూశాడు.
తూలి కింద పడబోయి నిలదొక్కుకొని మనోహర్ కేసి కసిగా చూసి ఓ అడుగు ముందుకు వేశాడు.
మనోహర్ ఎడం చేత్తో అతని పీకని పట్టుకొని కుడిచేత్తో ముక్కు విరిగిపోయేలా ఫట్ మని కొట్టాడు.
"అమ్మా" అంటూ నేలపైన కూలిపోయాడు బోసుబాబు.
అతని ముక్కు వెంట, నోటివెంట రక్తం కారుతోంది.
కింద పడ్డ అతన్ని కాలితో తొక్కిపట్టి చెప్పాడు మనోహర్.
"రోగ్. మరోసారి పిచ్చివేషాలేస్తే ఈసారి యమలోకానికి పంపిస్తాను. కబడ్దార్" బోసు కిక్కురుమనలేదు.
అప్పటికే భారతిని లేవదీసి పొదివి పట్టుకున్నాడు సారధి.
"థాంక్యూ సో మచ్. నేను అంతా చూశాను. మా భారతిని కాపాడినందుకు మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో అర్థం కావడం లేదు" అన్నాడు సారధి.
అతనెవరో తెలీక మనోహర్.....
"మీరూ?" అని అడిగాడు.
"నేను భారతి బావని. నా పేరు సారధి. సాధారణంగా భారతి టైంకి ఇంటికొచ్చేస్తుంది. ఇంత ఆలస్యం ఎందుకయిందోనని ఎదురుచూస్తూ నేను......"
"ఐసీ" అన్నాడు మనోహర్.
"నా పేరు మనోహర్" అంటూ బోసు భారతిని ఎలా ట్రాప్ చేయడానికి ప్రయత్నించిందీ వివరంగా చెప్పాడు.
"థాంక్యూ..... థాంక్యూ" అన్నాడు సారధి.
"మీరిలా ఆమెని రోడ్డుమీద తీసికెళితే బాగుండదు, రండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అన్నాడు కారు డోర్ తీసి.
సారధి ఇంకేమీ ఆలోచించలేదు. అతను చెప్పింది నిజమే.
రోడ్డుమీద ఎవరూ లేకపోబట్టి సరిపోయింది. లేకపోతే భారతిక రోడ్డుమీద తలెత్తుకొని తిరగ్గలిగేది కాదు.
అత్తయ్య ఇంటి దగ్గర లేదు. అది కూడా మేలే అయింది.
భారతిని కారులో కూర్చోబెట్టి అతనూ ఎక్కాడు. భారతి మూలుగుతోంది. సారథి భుజంపైన తల వాల్చింది.
సారధి ఆపమన్నచోట కారు ఆపాడు. సారథి విండోలోంచి తల బయటపెట్టి బయటకి చూశాడు.
రోడ్డుమీద ఎవరూలేరు. చుట్టుపక్కల ఇళ్ళల్లో దీపాలు వెలుగుతున్నాయి.
సారథి మెల్లగా భారతిని దించి, "ప్లీజ్, కమాన్" అన్నాడు సారథి మనోహర్ని.
