Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 39


    గెడవలోళ్లు వచ్చారని వూరంతా చిటికెలో తెలిసిపోయింది. తమకు కావాల్సిన వస్తువుల కోసం జనం ఎగబడ్డారు. సీతారామయ్యకు వూపిరి సలపని పని... మధ్యాహ్నం మూడుగంటలకు భోజనానికి వచ్చాడు.

 

    ఆ సమయంలో సత్యవతి తల్లిదండ్రులు అడ్డాపింట్లో నిద్రపోతున్నారు. ఇక సత్యవతికి వడ్డించడం తప్పింది కాదు. తన ముందు నిలుచుని వడ్డిస్తున్న ఆమెను చూస్తుంటే మతిపోయింది సీతారామయ్యకి. చూరుకి తగిలే పొడవుతో, యవ్వనంపైకి తేలుతున్నట్లు మెరిసిపోతున్న ఆమెను అలా గుడ్లప్పగించి చూస్తున్నాడతను.

 

    తను తింటున్నానన్న విషయం మరిచిపోయాడు. మొదట సాంబారుతో తినబోయి, ఆ తరువాత రసంతో తిన్నాడు. రెండోసారికే మజ్జిగ పోసెయ్యమన్నాడు. అప్పుడే అన్నం తినడం పూర్తయితే లేచి వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని మళ్ళీ మొదటికొచ్చి సాంబారు పోయమన్నాడు.

 

    అతను పడే అవస్థంతా ఆమె చూస్తూనే వుంది. అతను తనవైపు అంత విస్మయంగా చూడడం గర్వంగా వుంది. చాలారోజుల తరువాత ఆమెకు తను బతికి వున్నానన్న స్పృహ కలిగింది.

 

    సీతారామయ్య ఎలాగో భోజనం ముగించి లేచాడు. తను తెచ్చిన సామానంతా ఎవరెత్తుకు పోయినా సరే ఆమెను వదిలిపోబుద్ధి కాలేదు.

 

    విధిలేక తిరిగి దేవాలయానికి బయల్దేరాడు.

 

    అంతకుముందు మంచి లాభాలు పొందాలని అన్నిటినీ విపరీతమైన ధరలకు అమ్మాలని నిర్ణయించుకున్న అతను ఆ క్షణం నుంచి తన మనసు మార్చుకున్నాడు. వ్యాపారం, లాభాలు, ఆస్తులు, సంపాదించడం ఇవన్నీ అల్పమైన విషయాలుగా తోచాయి.

 

    ఏవైతే అద్భుతమైన విషయాలుగా తోచాయో సత్యవతిని చూడగానే అవే అంత పనికిరాని విషయాలుగా అనిపించాయి. అతనికి ధ్యాసంతా సత్యవతి మీదనే వుండిపోయింది. కేవలం పదిశాతం లాభం పెట్టుకుని సామాన్లు యివ్వడం ప్రారంభించాడు.

 

    మధ్యాహ్నం బిజినెస్ రాత్రి తొమ్మిది గంటలవరకు సాగింది. సామాన్లన్నీ సర్ది యింటికి బయల్దేరాడు.

 

    రాత్రే కళ్ళాపు జల్లి, ముగ్గులు పెడితే ఇక ఉదయమే నిద్రలేచే పని వుండదు గనుక రాత్రే ఆ పనులు ముగించడం సత్యవతికి అలవాటు.

 

    అతను వెళ్ళేటప్పటికి ఆమె ముగ్గులు పెడుతోంది. ఆకాశంలో చంద్రుడు తెల్లగా ప్రకాశిస్తున్నాడు. చల్లటి గాలి వూరికంతా పహరా కాస్తున్నట్లు వీస్తోంది.

 

    చీరకుచ్చిళ్ళను కాస్తంత పైకి లేపి బొడ్లో దోపుకున్న సత్యవతి తన దగ్గరికి ఎవరో వచ్చినట్లనిపించి పైకి లేచింది. చీరలేని దగ్గర వెన్నెలంతా పడి అదోలా మెరుస్తోంది. అతన్ని చూసి చప్పున సిగ్గుపడి కుచ్చిళ్ళను కిందకు లాక్కుంది.

 

    "రాత్రుల్లో ముగ్గులు పెడుతున్నావే" అన్నాడు చిన్నగా. అతను బిగ్గరగా మాట్లాడడం కూడా మానుకున్నాడు. దేవుడు సాక్షాత్కారం అయ్యాక ఒక భక్తుడు ఎలా మిగిలిన విషయాలకు అంధుడైపోతాడో అతనూ అలా అయిపోయాడు.

 

    "తెల్లవారి కాస్తంత లేటుగా నిద్రలేచినా ఫరవాలేదు - ఇప్పుడే ఈ పనులన్నీ పూర్తిచేస్తే..."

 

    అతను మౌనంగా లోపలికి వెళ్ళాడు.

 

    ముగ్గులు పూర్తిచేసి వచ్చింది.

 

    సీతారామయ్య విస్తరి ముందు కూర్చున్నాడు. ఆమె అన్నంపెట్టి, మరోసారి పెట్టబోయింది.

 

    "వద్దు" అని ఆమె చేయి పట్టుకున్నాడు.

 

    ఆమె చివుక్కున చూసింది.

 

    "తప్పయితే క్షమించు. కానీ నీ స్పర్శ తగలకపోతే పిచ్చివాడ్నయిపోతాను" అన్నాడు తల వంచుకుని.

 

    ఆమె ఏమీ మాట్లాడలేదు.

 

    అతను అన్నం తినడం ముగించి బయటకు వచ్చేశాడు. ఆరుబయట మంచం మీద దుప్పటీ దిండూ వేసి అతని పడక సిద్ధంగా వుంది.

 

    పడుకోబుద్ధి కాలేదు. అలా వెన్నెల్లో నడిచి రోడ్డు దగ్గరికి వచ్చాడు. ఎంతసేపున్నాడో తెలియదు. తిరిగి వచ్చేటప్పటికి ఒకరిద్దరు స్త్రీలు నిద్ర లేచి ఇంటిముందు ఊడుస్తున్నారు. అతను మంచం మీద పడుకుంటూనే కోడి కూసింది.

 

    రెండోరోజు ఆలస్యంగా లేచాడు. వ్యాపారం లేటుగా ప్రారంభమైంది. మూడుగంటలకు భోజనానికి వెళ్లాడు. సత్యవతి ఎక్కడా కనపడలేదు.

 

    మనసు విలవిల్లాడిపోయింది. తను పట్టుకోవడం వల్ల కోపం వచ్చిందేమోనని భయపడిపోయాడు.

 

    రాత్రి కూడా సత్యవతి వడ్డించలేదు.

 

    భోజనం ముగించాక రోడ్డు వరకు నడిచి ఖచ్చితంగా ఆమె ముగ్గులు వేసేప్పుడు వచ్చాడు.

 

    "రేపు ఊరెళ్ళిపోతున్నాను" అన్నాడు స్థిరంగా.

 

    ఆ గొంతులోని వేదనను ఆమె పసికట్టింది.

 

    "నువ్వు వడ్డించక, మాట్లాడక - అలా ఏమీ సంబంధం లేనట్టు వుంటే ఎంత బాధగా వుందో ఆలోచించావా? గుండెను బయటికి తీసి బండరాయిమీద పెట్టి నలగ్గొట్టినా ఇంత బాధ వుండదు"

 

    ఆమె కొద్దిగా మెత్తపడిందని ఆమె ముఖమే చెబుతోంది. "ఈరోజు ఒంట్లో బాగాలేకపోతే రాలేదు. రేపటినుంచి నేనే వడ్డిస్తాలే" అంది తలవంచుకుని.

 

    అతను ఇక ఏమీ మాట్లాడలేదు. ఆ ఒక్క వరమే చాలనుకున్నట్లు లోపలికి వెళ్ళి పడుకుండిపోయాడు.

 

    రెండోరోజు అయెం లేచేటప్పటికి ఆటో రెడీగా వుంది. తమ ఇంటి ముందు ఆటో ఆగి వుండడం చూసి ఆశ్చర్యపోయింది.

 

    "ఎవరొచ్చారు?" అని అడిగింది తల్లిని.

 

    "సీతారామయ్య డాక్టర్ ని పిలుచుకువచ్చాడు. రాత్రి నీకు ఒంట్లో బాగా లేదని చెప్పావటగద?"

 

    అంతలో డాక్టర్, సీతారామయ్య వచ్చారు.

 

    డాక్టర్ ఏవేవో పరీక్షలు చేసి, ఓ ఇంజెక్షన్ చేశాడు.

 

    తిరిగి డాక్టర్ ను టౌన్ లో వదిలిపెట్టి సీతారామయ్య ఇంటికొచ్చాడు. సత్యవతి అన్నం వడ్డిస్తూ "ఇప్పుడు నాకేమైందని డాక్టర్ ని పిలుచుకొచ్చారు? ఈరోజు బిజినెస్ పోలేదా?" అంది నొచ్చుకుంటూ.   

 

    "బిజినెస్ ఏం వుంది ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది. నీకు చిన్న అనారోగ్యం వచ్చినా మనసు నిలవడం లేదు"

 

    "నాకేంకాదు గానీ బుద్ధిగా వ్యాపారం చేసుకోండి" అంది సత్యవతి.

 

    మధ్యాహ్నం తర్వాత సీతారామయ్య తన వ్యాపారం తెరిచాడు.

 

    సాయంకాలం కంటే ముందుగానే వ్యాపారాన్ని కట్టేయాల్సి వచ్చింది. ఆ రోజు ఉగాది. దేవాలయం దగ్గర ఆ ఊరి పూజారి రాశిఫలాలు చదువుతాడు. అందుకు కావాల్సిన ఏర్పాటు చేయాల్సి వుంది. వ్యాపారాన్ని త్వరగా ముగించమని ఊరి జనం చెప్పారు.

 

    రాశిఫలాలు చదవడం రాత్రి ఎనిమిదిగంటలకు మొదలవుతుంది. సీతారామయ్య స్నానం ముగించి మంచం మీద నడుం వాల్చాడు.    

 

    మైక్ లో భక్తిగీతాలు వినిపించగానే సత్యవతి తల్లిదండ్రులు బయలుదేరి వెళ్లిపోయారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS