Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 38


    "అలానే బాబూ! జాగ్రత్త. ఈ బంగారంతో నువ్వు రాజు అయిపోవాలి. అందరికంటే నువ్వు మిన్నగా బతకాలి" నర్సయ్య చీకట్లో కలిసిపోయాడు.

 

    శివరావు మరోసారి బంగారపు కడ్డీని చూసుకుని తిరిగి ఇంటికి బయల్దేరాడు.

 

    దారంతా ఏవేవో ఊహలు, ఆలోచనలు, ఉద్వేగంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఇంటికొచ్చాడు.

 

    పడుకున్నాడుగానీ నిద్ర రావడం లేదు. సవరం ఎలా లేదన్నా మూడువేల రూపాయల ధర పలుకుతోంది. అంటే తొంభై వేల రూపాయలన్న మాట. ఆ డబ్బుతో ఎంత పొలం కొనాలో, ఏమేం చేయాలో ఆలోచించడం ప్రారంభించాడు.

 

    భార్యకు ఒక చక్కటి బంగారు గొలుసు తేవాలనుకున్నాడు. గొలుసు చేతిలో పెట్టి జరిగిందంతా చెప్పి థ్రిల్ చేయాలనుకున్నాడు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆత్రుతతో ఎదురుచూడసాగాడు.

 

    కోడి కూస్తూనే భార్యను లేపాడు. సత్యవతి వయ్యారంగా ఆవులిస్తూ ఏమిటన్నట్లు చూసింది.

 

    అంత వయ్యారంగా ఎందుకు అవులించిందో తెలిసిన శివరావు, "అందుకు కాదు. నేను టౌన్ కి పోతున్నాను. సాయంకాలానికల్లా నీ మెళ్ళో బంగారు గొలుసుంటుంది. ఏమిటనుకున్నావ్. నీ మొగుడంటే - చిటికెలో లక్షలు సంపాదిస్తాడు" అన్నాడు.

 

    "ఏమిటంత హుషారుగా వున్నావ్? ఏమిటి కథ?"

 

    "సాయంకాలం మల్లెపూలతో, పూలదుప్పటితో రెడీగా వుండు. తీరిగ్గా చెబుతాను" అని మరో మాటకు తావివ్వకుండా శివరావు వెళ్ళిపోయాడు.

 

    సత్యవతి లేచి దినచర్యలో మునిగిపోయింది. తన భర్త అంత హుషారుగా వుండడానికి కారణం ఏమిటో ఎంత ఆలోచించినా తట్టలేదు.

 

    అంతలో సాయంకాలమైంది. భర్త చెప్పినదంతా గుర్తుకొచ్చింది. మల్లెపూలు జడలో తురుముకుంది! పూల దుప్పటిని మంచంమీద పరిచింది. కొబ్బరి చెట్ల కింద మంచం వేసింది.

 

    చీకట్లు పడడానికి మరికొంత టైముంది.

 

    అప్పుడొచ్చాడు రవి అనే కుర్రాడు. అతను టౌన్ లో పాలు పోస్తాడు. అతను కంగారు కంగారుగా సత్యవతి తండ్రితో చెబుతుంటే సత్యవతి వింది.

 

    "మీ అల్లుడు శివరావు నాయుడోళ్ళ మిషన్ దగ్గరున్న నేరేడు చెట్టుకి ఉరేసుకున్నాడు"

 

    మొత్తం వూరంతా గుమిగూడిపోయింది.

 

    సత్యవతికైతే మొత్తం శరీరమే పనిచెయ్యకుండా పోయింది. కళ్ళు మాత్రం వర్షిస్తున్నాయి. తల్లి వచ్చి కుదిపేవరకు మామూలు మనిషి కాలేకపోయింది.

 

    ఆమె తండ్రి, మరికొంతమంది వూళ్ళో జనం వెళ్ళి శవాన్ని తీసుకొచ్చారు.

 

    ఇంట్లో డబ్బు లేకపోవడం, అతని జేబులో బంగారపు పూత పూసిన రాగి కడ్డీ దొరకడం - వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే అందరికీ జరిగిన విషయం అర్థమైంది. అయినా అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. సత్యవతి విధవ అయిపోయింది.   

 

    ఆమె మళ్ళీ ఒంటరిదైపోవడాన్ని చూసి సంతోషించినవాళ్ళు కూడా లేకపోలేదు. ఎప్పటికైనా ఆమె తమవైపు ఆకర్షితురాలవుతుందేమోనన్న చిన్న ఆశ వాళ్ళను అలా ఆలోచించేటట్టు చేసింది.

 

    కర్మకాండ అయిపోయేసరికి నెలరోజులు పట్టింది. శివరావు ఇప్పుడు స్మృతిగానే మిగిలిపోయాడు.

 

    సత్యవతి మెల్లమెల్లగా ప్రపంచంలో పడుతోంది. గతంలో ఆమె కోసం ట్రై చేసిన వాళ్ళంతా మళ్ళీ రెట్టింపు వుత్సాహంతో తమ తమ ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ సత్యవతి చెదరలేదు. ఎవరెన్ని వెధవ వేషాలు వేసినా పట్టించుకోలేదు. ఎప్పుడైనా ఎవరైనా శృతిమించితే గట్టిగానే బుద్ధి చెప్పింది.   

 

    కానీ ఎన్నిరోజులు లేని బింకం నటించగలదు?

 

    మూడేళ్ళు గడిచిపోయాయి. ఈ మూడేళ్ళలో ఒక్క రిమార్క్ కూడా రాలేదు. సత్యవతి అంటే నిప్పు అని గిట్టని వాళ్లు సైతం అన్నారు.

 

    ఇలాంటి పొగడ్తలుగానీ, విమర్శలుగానీ పట్టించుకునే స్థితిలో లేదు ఆమె. జీవితం మీద పూర్తిగా ఇంట్రెస్టు పోయింది. నిస్తేజంగా వుండేది. ఇలా వుండడం కూడా కష్టమైపోయిందామెకు. కాస్తంత ప్రేమకోసం మనసు తపించిపోయేది. ఆ ప్రేమ లేకపోతే జీవితం ఎంత ఎడారిగా మారిపోతుందో స్వయంగా అనుభవించింది. ఇక తన వల్ల గాదు అనే స్థితికి వచ్చింది.

 

    అందుకే వ్యక్తికన్నా పరిస్థితులు బలమైనవి. వాటినుంచి ఎవరూ తప్పించుకోలేరు.

 

    అందుకే ఎవరైనా గాడితప్పితే వాళ్ళను విమర్శించకూడదు. ఆ పరిస్థితుల్ని గురించి తెలుసుకోవాలి. సానుభూతిగా అర్థం చేసుకోవాలి.

 

    సత్యవతి ఏమీ పాలుపోని స్థితిలో వుండగా పంటల నూర్పుళ్ళ కాలం వచ్చింది. ఎండలు బాగా ముదరక ముందే నూర్పిళ్ళ పనులు పూర్తి చేయాలని రైతులు ఉబలాటపడుతున్నారు.

 

    సత్యవతి వాళ్ళు పనులను ముగించారు.

 

    పండిన పంటంతా ఇంటికి వచ్చింది.

 

    ఇదిగో సరీగ్గా ఈ సమయంలో ఆ వూరికి 'గెడవలవోళ్ళు' వచ్చారు

 

    "గెడవలవాళ్ళా? వాళ్ళెవరు?" పూర్తిగా టౌన్ లో పెరిగిన ప్రేమ అడిగింది తరుణ్ కి అడ్డంపడి.

 

    "నిజానికి వాళ్ళని గడువుల వాళ్ళు అనాలి. కాని జనం నోళ్ళలో ఆ పదం తన షేపులను కోల్పోయి గెడవలవాళ్ళు అయింది. వీళ్ళూ ఒకరకంగా వ్యాపారస్థులే. లారీల్లో అల్యూమినియం పాత్రల దగ్గర్నుంచి, కప్పుకునే దుప్పట్ల వరకు పల్లెలకు తీసుకొచ్చేవాళ్ళు. రైతులకు ఏం కావాలంటే అవి యిచ్చేవాళ్ళు.  

 

    అంతా అప్పే. ఈ అప్పును గడువుమేరకు వంతులవారీగా తీర్చాలన్నమాట. ఈ గడువుల వాళ్ళు సామానులు యిచ్చి వెళ్ళాక నెలకోమారు వచ్చేవాళ్ళు. రైతుల దగ్గర్నుంచి మొదటికంతు వసూలు చేసుకుని వెళ్ళేవాళ్ళు. మళ్ళీ నెలకు వచ్చేవాళ్ళు. ఇలా అప్పు తీరేంతవరకూ అటూ ఇటూ తన స్వంత గ్రామానికి, అప్పిచ్చిన వూరికీ మధ్య తిరిగేవాళ్ళన్న మాట.

 

    ఈసారి కూడా వచ్చింది మామూలుగా వచ్చే గ్రూపే. ఈ గ్రూప్ లో మొత్తం నలుగురు వుండేవాళ్లు. ఆ వూరును ఈసారి సీతారామయ్యకు కేటాయించారు. మిగిలిన ముగ్గురు చుట్టుపక్కలున్న గ్రామాలను ఎంపిక చేసుకున్నారు.  

 

    అయితే నలుగురు వ్యాపారస్థులకీ ఆ వూరే సెంటర్ పాయింట్. లారీల్లో అన్ని సామానులు దిగాయి. పాత్రలు, కుర్చీలు, బట్టలు, ప్లాస్టిక్ సామాన్లు - ఒకటేమిటి మొత్తం బజారంతా అక్కడికే వచ్చేసినట్లుంది.  

 

    దేవాలయం ముందు తన సామాను దించుకున్నాడు సీతారామయ్య. అతనికి ముప్ఫై అయిదేళ్లుంటాయి. గిరిజాల జుట్టుతో, కోరమీసంతో ఆజాను బాహుడైన అతన్ని ఒకసారి చూసిన ఎవరూ అంత తొందరగా మరిచిపోలేరు.

 

    అతనికి ఆ వూర్లో వున్నన్ని రోజులూ భోజనం పెట్టడానికి సత్యవతి తండ్రి ఒప్పుకున్నాడు. భోజనం ఖర్చుల కింద రోజుకి ఇరవై రూపాయలివ్వాలి. అందుకు సీతారామయ్య సరేనన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS