Previous Page Next Page 
ఆలింగనం పేజి 39


    నా చెవులు నిక్కబొడుచుకున్నట్లుగా అయి...ఆ తిట్లన్నీ నన్నే తిడ్తున్నట్లుగా అనిపించాయి.

 

    "కామాతురాణం...నలజ్జా...నభయం! అని...సిగ్గా...ఎగ్గా...ఛీ!ఛీ! అంతకన్నా చావకూడదూ. ఇంక మగాళ్ళేదొరకరా?" అంటోంది అమ్మ.

 

    నేను మంచంమీద వెల్లకిలా పడుకుని ఆలోచించాను. ఏవిటి సిద్ధార్థ మాట్లాడ్తున్నది?

 

    నేను ఎవరినైనా పెళ్ళి చేసుకున్నా తనకి అభ్యంతరం లేదుట! అక్కడ కూడా అప్పర్ హేండ్ అతనిదే. పాపం ఆ వచ్చేవాడి అభ్యంతరాలతో పనిలేదు!

 

    అతనంత భయంకరంగా మాట్లాడ్తుంటే నేను అడ్డుకోకుండా వింటూ కూర్చోవడం ఏవిటి?

 

    ఒక టైంలో అయితే అతను చచ్చిపోతాననగానే ఒప్పేసుకోవాలనిపించింది కూడానూ? ఎందుకు?

 

    అతని టచ్...ఎంతో అనుభవమున్న అతని చర్యలూ, ఆ మత్తు గొలిపే గుసగుసలూ! అన్నీ నన్ను అచేతనం చేసి స్వంత ఆలోచన లేకుండా చేశాయి.

 

    గుండెల మీదున్న ఓణీ మోయలేనంత బరువుగా అనిపించింది. అతని చెయ్యిపడ్డ ప్రతిచోటా ఏదో అలజడి! శరీరంలో అదోరకం అసౌకర్యం. మెడమీద ఇంకా అతని ముఖం తగులుతున్నట్లే ఉంది. ఎంత అధికారంగా ముట్టుకున్నాడూ? నేనెందుకు ఒద్దనలేదు?

 

    "నీ అందం చూసి టెంప్ట్ అయి...నిగ్రహించుకోలేకపోయాను..." అనే ఆ మాటలకి నేను పడిపోయాను.

 

    నేను కాదంటే చచ్చిపోతాడేమోనని నాకు జాలా? ఉహూ? గర్వం. మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవాలని ఆశ. నాలో నాకే తెలీని ఇంత కుత్సితం, స్వార్థ, అహం ఉన్నాయా? ఏమో!!! నా తల తిరిగిపోతోంది.

 

    రేపు జవాబు కావాలన్నాడు. రేపు కాలేజీకి వెళ్ళను.

 

    వెళ్ళకపోతే ఇంటికి వచ్చేస్తాడు! 'అమ్మో!' అలా కాకూడదు. "ఆముక్తా" మాధవ్ గొంతు వినిపించింది.

 

    దిగ్గునలేచి కూర్చున్నాను. అతని కళ్ళు దేనినో శోధిస్తున్నట్లుగా ఉన్నాయి. గభాల్న స్థానభ్రంశం చెందిన ఓణీ సరిజేసుకున్నాను.

 

    "నాకు వసంత ఎంతో నువ్వూ అంతే! ఏ ప్రాబ్లెమ్ వచ్చినా చెప్పమన్నాగా." మంచం మీద కూర్చున్నాడు.

 

    "నాకే ప్రోబ్లెమ్ లేదు!" అన్నాను.

 

    "పిచ్చితల్లీ!" నా తలమీద చెయ్యి వేస్తూ అన్నాడు. వసంతనీ ఇలాగే మాటిమాటికీ టచ్ చేస్తాడా?

 

    నాకు మళ్ళీ అశాంతి!      

 

    ఎందుకు ముట్టుకోవడం? ఒకడు కోరికతో...ఇంకోడు స్నేహంతో...మరోడు మంచి చేస్తానంటూ...

 

    ప్రతివాడూ ముట్టుకోవడమేనా?

 

    నా పేరు ఆముక్త. ఎన్నడూ ముట్టుకోబడనిదే అని అర్థం! ప్రతివాడూ ముట్టుకోకుండా మాట్లాడడేం?

 

    నేను విసురుగా దూరం జరిగి "మీకు థాంక్స్. నాకు ఏ సహాయం అక్కర్లేదు" అన్నాను.

 

    మాధవ్ నా వైపు ఆశ్చర్యంగా చూసి -

 

    "సరే...ఫోన్ చెయ్యకపోతే ఏం అఘాయిత్యం చేసుకున్నావో అని కంగారుపడి వచ్చాను. నువ్వు బావున్నావుగా అంతే చాలు!" అంటూ లేచి "నువ్వు అందరిలాంటి దానివి కాదు ఆముక్తా!" అడిగాడు.

 

    "ఏం?" ఎందుకని అన్నాను.

 

    "నీ అమాయకమైన చూపులు ఎవరినైనా నిద్రలో కూడా వెంటాడతాయి" అన్నాడు.

 

    "మిమ్మల్ని కూడానా?"

 

    మాధవ్ నవ్వి "లేకపోతే ఇంత దూరం వచ్చేవాడినే కాదు... వెళ్ళొస్తానమ్మా" అని వెళ్ళిపోయాడు.

 

    నేను అద్దంలో చూసుకున్నాను. నా చూపులు మామూలుగానే వున్నాయి. ఈ వయసులో స్త్రీ అందాన్ని పురుషుడు గుర్తించడం కంటే గొప్పేముంది.

 

    పొగడడాన్ని మించిన ఆనందం ఏముంది? అయినా ఎందుకీ అశాంతి.

 

    దీపం వెలుగుతోంది. కానీ కాంతి లేదు! ఇల్లు నిశ్శబ్దంగా ఉంది, కానీ శాంతి లేదు. విషాదం నామీద దుప్పటిలా పరచుకుంది. ఎక్కడైనా ఓ వెలుగు రేఖ కనపడితే బావుండ్ను!

 

    గాలి విడిచే వేడి నిట్టూర్పులు నన్ను కొలిమిలో పెట్టి కాలుస్తున్నట్లుగా ఉన్నాయి.

 

    కళ్ళు మూస్తే... 'ఐ లవ్ యూ... నువ్వు కాదంటే చచ్చిపోతాను' అన్న సిద్ధార్థ గొంతు... 'ఇంకోదాని మొగుడ్ని ఎత్తుకుపోవాలనుకున్న దానికి ఎటువంటి చావొస్తుందో!' అన్న సత్తెమ్మ మాటలూ...కాసేపటికి సత్తెమ్మ మాయమై ఆ ప్రదేశంలో రేవతి నిలబడి అవే తిట్లు...దుమ్మెత్తిపోస్తూ!

 

    మధ్యలో మాధవ్...నన్ను దగ్గిరకు తీసుకుని ఒళ్ళంతా తడుముతూ 'నీకు నేను ఉన్నానమ్మా!' అంటూ..

 

    రాత్రంతా దిండు తడిసిపోయేలా కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి. నేను ఏం తప్పు చేశానని ఈ శిక్ష?

 

    రేపీ పరిస్థితులని ఎలా ఎదుర్కోవాలి?


                                                        *  *  *


    పసిపాప నిద్రించువేళ ఆ పెదవులపై తేలియాడే చిరునవ్వు ఎక్కడి నుండి వస్తుందో తెలుసునా? చవితినాటి చంద్రుని పారిపోయిన కిరణం ఒకటి వసంత మేఘాంచలాన్ని తాకి, ఆ కురిసిన మంచు ప్రత్యూషాన తొలిగా చిందిన బిందువు ఆ చిరునవ్వుట! 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS