Previous Page Next Page 
ఆలింగనం పేజి 38


    ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఐ లవ్ యూ...నేను నిన్ను ప్రేమిస్తున్నంతగా జీవితంలో ఎవర్నీ, చివరికి మా అమ్మా నాన్నని కూడా ప్రేమించలేదు...నమ్ము" అన్నాడు.

 

    ఏదో విసురుగా అనబోయి అతని కళ్ళల్లోని నీటిని చూసి ఆగిపోయాను. మగవాళ్ళు కంటతడి పెట్టడం నాకు ఆశ్చర్యమనిపించింది.

 

    "నాకు చచ్చిపోవాలనుంది ఆముక్తా...అస్సలు బ్రతకాలనిలేదు. ఇంటికెళ్తే నరకం" కారు ఆపేసి స్టీరింగ్ మీద తలవాల్చి అన్నాడు.

 

    "మీకు పెళ్ళయిందనీ, ఓ కొడుకు కూడా ఉన్నాడనీ ముందే ఎందుకు చెప్పలేదు? అది మోసం కాదా? జరగరానిది జరిగాక నిజం తెలుసుకుని చచ్చిపోయుంటేనో?" బాధగా అడిగాను.

 

    "నిజమే...నీ అందం చూసి టెంప్ట్ అయి నిగ్రహించుకోలేక అలా పశువులా ప్రవర్తించాను. అందుకు సిగ్గుపడుతున్నాను. నీ పాదాలు పట్టుకుని క్షమార్పణ అడగటానికి కూడా అభ్యంతరం లేదు...నన్ను క్షమించు!" గబుక్కున వంగి నా పాదాల మీద చెయ్యివేశాడు!

 

    "ఒద్దు...ఒద్దు!" అన్నాను.

 

    "నన్ను క్షమించలేవా ఆముక్తా...నువ్వు నాకు దూరం అయితే నేను బ్రతకలేను. నీ కోసం దేన్నైనా వదిలేసుకుంటాను. చెప్పు...రేవతికి విడాకులిచ్చెయ్యనా... అపుడు నువ్వు నా దానివి అవుతావా? నా భుజాలు పట్టుకుని కుదిపెస్తూ అడిగాడు.

 

    ఏం చెప్పడానికీ నా మెదడు పని చెయ్యడం మానేసి స్తబ్దుగా అయిపోయింది.

 

    "నాకు తెలుసు...నువ్వు నా దానివని! నన్ను కాదనవని..." అంటూ నా మెడ ఒంపులో ముఖం దాచేసుకుని "ఐ లవ్ యూ... ఐ లవ్ యూ డార్లింగ్!" అన్నాడు.

 

    నేను అమాంతం తెలివి తెచ్చుకుని వదిలించుకున్నాను. "ఏమిటిది? పబ్లిక్ ప్లేస్ లో!" అన్నాను.

 

    "మా ఇంటికి పోదామా? నేనేం చెయ్యను. నన్ను నమ్ము. నన్నీ స్థితిలో వదిలేసి నిర్దాక్షిణ్యంగా పోకు... ఒకవేళ వెళ్తే రేపు నా చావు వార్త వింటావు!" అన్నాడు.

 

    "చచ్చిపోతా...చచ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా?" చిరాగ్గా అడిగాను.

 

    అతను బాధగా "ఔనులే, నేనుపోతే నీకేం? వెళ్ళు...వెళ్ళిపో...గుడ్ బై డియర్!" అని కారుడోర్ తెరిచి "దిగు...వెళ్ళిపో. ఓపిచ్చి ప్రేమికుడు చచ్చిపోయాడని తెలిసినప్పుడు మాత్రం రెండు కన్నీటిబొట్లు కార్చు...ఈ జన్మకిది చాలు!" అన్నాడు.

 

    నేను దిగబోతూ అతనివైపు చూశాను.

 

    అతని కళ్ళనిండా నీళ్ళు.

 

    మళ్ళీ వెనక్కి జారగిలబడి కూర్చుంటూ-

 

    "కళ్ళు తుడుచుకో..." అని కర్చీఫ్ అందించాను.

 

    "థాంక్స్!" అతను దాన్ని అందుకున్నాడు.

 

    "నీ తీరు నాకు అర్థం కావడంలేదు! ఒకసారి పెళ్ళయిన వాడ్ని, ఒక బిడ్డకి తండ్రినీ నేను ఎందుకు అంగీకరించాలి?" కొద్దిగా ఇరిటేట్ అయి పెద్దగా అరిచాను.

 

    "నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కాబట్టి!"

 

    "నువ్వు నీ భార్యని వదిలెయ్యడం... నన్ను చేసుకోవడం జరగని పనులు. నాకిష్టంలేదు! నీ సంసారం నావల్ల విచ్చిన్నం కాకూడదు" అన్నాను.

 

    "నీ ఇష్టం! కానీ నీ స్నేహాన్ని మాత్రం నేను వదులుకోను" నన్ను తనవైపు తిప్పుకుని నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు.

 

    "అంటే?" దూరంగా జరుగుతూ అడిగాను.

 

    "నువ్వు ఇంకో పెళ్ళిచేసుకున్నా ఇది కంటిన్యూ అవ్వాలి. ఆమాటివ్వు... ప్లీజ్!" అని చెయ్యి జాపాడు.

 

    నేను అవాక్కయిపోయి చూస్తుండిపోయాను.

 

    "లోకం దృష్టిలో మనం మంచి స్నేహితులం మాత్రమే! మనిద్దరికే తెలుస్తుంది ఎక్కడ, ఎప్పుడు కలుసుకోవాలో. ఆ ఇంటి 'కీ' ఒకటి నీ దగ్గరా, ఇంకొకటి నా దగ్గరా ఉంటుంది. ఎవరు ముందు వెళ్ళినా వెయిట్ చెయ్యాల్సిన పని కూడా ఉండదు. సరేనా...ఒప్పుకో.

 

    నీకేం తక్కువ కానియ్యను. నన్ను చూడగానే పెళ్ళి చేసుకోమని అడిగావుగా...ఇంకా ఎందుకు సందేహిస్తున్నావు? చెప్పరా...నా మీద నమ్మకం లేదా?" నా పెదవుల్ని మృదువుగా వేలితో రాస్తూ అడిగాడు.

 

    పంతొమ్మిదేళ్ళ నా పరువం ఆలోచించే వ్యవధిలేక నలిగిపోతోంది! అతని చేతులు ఎక్కడెక్కడో సంచరిస్తూ నాకు మత్తుని కలిగిస్తున్నాయి. ప్రతిఘటించడానికి నా చేతుల్లో బలం చాలడం లేదు.

 

    "కాదనకురా...నీకు జీవితం అంతా దాసుడినై పడి ఉంటానురా!" మత్తుగా అంటున్నాడు.

 

    ఎవరో వెనుక నుండి ఆపకుండా హారన్ మోగించడంతో త్రుళ్ళిపడి ఈ లోకంలోకి వచ్చాము.

 

    అతను నన్ను వదిలి కారు స్టార్ట్ చేస్తూ "ఏ సంగతి రేపు చెప్తావు కదూ!" అన్నాడు.


                                                         *  *  *


    నేను ఇంటికి వెళ్ళేసరికి మాధవ్ ఉన్నాడు.

 

    అతని చూపులు "ఎందుకు ఫోన్ చెయ్యలేదు" అని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నాయి.

 

    "బావున్నావా అమ్మా" అన్నాడు.

 

    "ఊ..." అని లోపలికి వెళ్ళిపోయాను.

 

    అమ్మ పనిమనిషికి గిన్నెలు వేస్తూ మాట్లాడ్తోంది.

 

    "నీ మొగుడికి బుద్ధిలేకపోతే పోయె...దానికైనా బుద్దుండక్కర్లేదా? సాటి ఆడదీ అందులోనూ అక్క అనైనా చూడకుండా వీడు పెళ్ళిచేసుకుంటానంటే మాత్రం అదెలా ఒప్పుకుందీ?"

 

    సత్తెమ్మ ఏడుస్తూ "మాయదారి ముండ, అదే వీడ్ని వలలో వేసుకుంది. వీడికి అటువంటి గుణం జలమలో వచ్చేది కాదు! దాన్ని అనవసరంగా ఇంట్లో జేరనిచ్చాను తల్లే...దాని నోరుపడా...అది నాశనమైపోనూ...ధూ! ఇంకో దాని మొగుడ్ని ఎత్తుకుపోయే బుద్దున్న దానికి ఎసుంటిచావొస్తుందో!" అని దుమ్మెత్తి పోస్తోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS