Previous Page Next Page 


    పసిపాప ఒంటిపై తొణికిసలాడిన మిసిమి ఎలా వచ్చిందో తెలుసునా? పసిపాప తల్లి కన్నెపిల్లగా ఉన్నప్పుడు ఆమె ఎదలోదాగిన మృదుల మోహన మధుర ప్రేమ ఇప్పుడిలా బిడ్డ వంటిమీద నునుపైన సొగసుగా వికసించింది!'

 

    ముగ్గు పెడ్తున్న నా వేళ్ళు ఆగిపోయాయి!

 

    తల ఎత్తి చదువుతున్న నాన్నవైపు చూచి "నాన్నా...ఏమిటది?" అన్నాను.

 

    "గీతాంజలి" అన్నారు.

 

    నా హృదయం ఆ ప్రత్యూషాన ఎందుకో విచ్చుకున్న మొగ్గగా పులకితమైంది!

 

    "అందరిలో కలిసి ఆనందంలో భాగము పంచుకునే ఆ భాగ్యము నన్ను వదలి వెళ్ళకుండా నా ప్రార్థనని అనుగ్రహించు!" నాన్న పైకి చదువుతున్నారు.

 

    అవే మాటలు నేను మనసులో మననం చేసుకుని దేవుడ్ని ప్రార్థించాను.

 

    భూదేవికి కన్నీళ్ళతో కళ్ళాపి జల్లాను. చెరిగిన ముగ్గుని సరిచేస్తుంటే మెరుస్తూ కనిపించింది... ఉంగరం! అది సిద్ధార్థది. ఇచ్చెయ్యాలి.

 

    కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళాను.

 

    "సత్తెమ్మ ఇంక పనిలోకి రాదేమో! పిచ్చి మొద్దు. చాలా పెద్ద కష్టం వచ్చింది పాపం. పసిపిల్లల్ని పెట్టుకుని ఒంటరిగా ఎలా బ్రతుకుతుందో"! అంది నాతో అమ్మ.

 

    గదిలోకి వెళ్ళి పుస్తకంలోంచి కాయితం చింపి ఉత్తరం వ్రాశాను.

 

    "చచ్చిపోతానని బెదిరించి ఇద్దరు స్త్రీల జీవితాలతో ఆడుకునే హక్కు నీకు లేదు! ఇంకెప్పుడూ నా జీవితంలోకి రాకు. ఆముక్త."

 

    ఆ కవర్ లోనే ఉంగరం కూడా పెట్టి అంటించేశాను.

 

    కిటికీలో నుండి చూస్తుంటే కురుస్తున్న పొగమంచులోంచి కోటు తొడుక్కున్న నాన్న ఉదయపు వ్యాహ్యాళికి వెళ్తూ కనిపించారు.

 

    కాళింది చెప్పిందిగా! ఆయన పాటిస్తారు.

 

    పిల్లలమీద ఆయనకి తరగని ప్రేమ. మరి పిల్లలు పెద్దల మాటలు పాటిస్తారా? భారమైన నిట్టూర్పు ఒకటి నా గుండె తలుపు తోసుకుని వచ్చేసింది.


                                                        *  *  *


    "ఏవిటిది?" అడిగాడు వెంకట్.

 

    "స్నేహితుడిగా నువ్వు నాకీ సహాయం చెయ్యాలి. ఇది ఈ అడ్రెస్ లో ఇచ్చేసి రావాలి!" అన్నాను.

 

    సిద్ధార్థ పేరు చదివి "ఇతనెవరూ?" అన్నాడు.

 

    "నన్నేం అడక్కు" అన్నాను.

 

    "సరే...కానీ ఇదే చివరిసారి. ఇంకోసారి ఇలాంటి పనులు చేసే పరిస్థితి రానీయకు!" అన్నాడు.

 

    నేను తలవంచుకున్నాను. తల వంచుకునే పరిస్థితి కూడా ఇదే చివరి సారి కావాలి! అనుకున్నాను.

 

    వెంకట్ వెళ్ళిపోయాడు,

 

    చిత్రా, వైజూ గల గలా నవ్వుతూ నావైపు వచ్చారు.

 

    "ఏవిటి వెంకట్ తో మంతనాలు?" అన్నారు.

 

    చిత్రతో అంతా చెప్పేద్దామా అనిపించి అంతలోనే, మానుకుని "ఏం లేదు" అనేశాను.

 

    "అన్నట్లు చెప్పడం మరిచిపోయాను చిత్రా! మీ సిద్దార్థ నిన్న ముక్త కోసం కాలేజీకి వచ్చాడు" అంది వైజయంతి.

 

    చిత్ర భృకుటి ముడిపడింది.

 

    "ఎందుకూ?" అంది.

 

    "ఆరోజు కారులో నా పర్సు మర్చిపోయాను. అది యివ్వడానికి" అన్నాను.

 

    "ఓ!" అంది.

 

    "చాలా రొమేంటిక్ అనుకుంటానూ!" అంది వైజూ.

 

    "ఆ! అతనికి ఆల్రెడీ పెళ్ళయిపోయింది. ఒక బాబు కూడా" నావేపు అదోలా చూస్తూ అంది చిత్ర.

 

    "మైగాడ్! ఔనా? విన్నావా ముక్తా" అరిచినట్లుగా అడిగింది వైజూ.

 

    "దానికెందుకు అలా చెపుతున్నావు?" అడిగింది చిత్ర.

 

    నాకళ్ళు వైజూ కళ్ళతో కలుసుకున్నాయి.

 

    "వైజూ...అతనికి పెళ్ళయిందనితెలిసి అంత ఆశ్చర్యమెందుకూ?" అన్నాను.

 

    వైజూ సర్దుకుని "ఊరికే... అలా కనపడడు కదా...అందుకూ!" అంది.

 

    "ఔను మగవాళ్ళకి మెడలో మాంగల్యం సింధూరం వగైరాలు ఉండవుగా!" చిత్ర నవ్వింది. పరస్త్రీ మీద కోరిక కూడా చావదు! మనసులో అనుకున్నాను.

 

    సాయంత్రం ఇంటికి వచ్చాక, ఎక్కడ కారు హారన్ వినపడినా సిద్దార్థ వస్తున్నాడేమోనని ఉలిక్కిపడుతూ చూశాను. ఒకవేళ అతను నిజంగా ప్రేమించి వుంటే, ఏదయినా చేసుకోగూడనిది చేసుకోడు కదా!

 

    గుండెలో ఒకటే దడ! శరీరం అంతా చిరుచెమటలు. చెప్పరాని గాభరాగా ఉంది. ఏదో జరగరానిది జరుగుతుందని సిక్త్స్ సెన్స్ చెపుతోంది.

 

    పెరట్లో కరివేపాకు చెట్టు వాడిపోయిందిట. అమ్మ బాధపడ్తోంది! "నిక్షేపంలాంటి చెట్టు ఎవరి దృష్టి సోకిందో నిలువునా మాడిపోయిందండీ!"

 

    నాన్న ఓదార్పుగా "ఊరికే బాధపడకు" అన్నారు.

 

    "ఈ చేత్తో పెంచాను" లీలగా కంఠంలో తడి!

 

    నేను అస్థిమితంగా అటూ ఇటూ తిరుగుతున్నాను.

 

    చీకటి చుట్టుముట్టేదాకా ఇంటి బయట రోడ్డుకేసి చూస్తూనే ఉన్నాను. చీకటి పడ్డాక ఆకాశం కేసి!

 

    ఓ చుక్క రాలిపడింది. ఏవిటో తెలీని భయంతో ఒళ్ళంతా జలదరించింది. అన్నం సహించలేదు. కడుపులో నిప్పులకుండ దాచుకున్నట్లుగా ఏదో రగులుతోంది. రెప్ప మూతపడకుండానే కోడికూత వినపడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS