Previous Page Next Page 
రామాయణము పేజి 38

              

                         విభీషణ శరణాగతి
    హనుమంతుడు శ్రీరాముని దర్శనము చేసి మ్రొక్కి, సీతాదేవి యిచ్చిన చూడామణిని సమర్పించి నాడు; ఆమె వచించిన కాకాసుర వృత్తాంతమునూ జ్ఞప్తికి తెచ్చినాడు. శ్రీరాముడు సంతోషముతో పవనాత్మజుని కౌగిలించుకొని తన కృతజ్ఞతను తెలుపుకొన్నాడు.
    సీతాదేవి లంకయందున్నదనియూ ఆమెను హరించినవాడు లంకేశ్వరుడేయనియూ రూడియైనది కనుక లంకాపురి ముట్టడి ప్రయత్నము ఆ దినముననె ప్రారంభమైనది. సుగ్రీవుడు మును జంబూద్వీపము దశదిశల నుండియూ కోట్లసంఖ్యలో రప్పించి యుంచిన వానర యోధ బృందములన్నింటిని ఏకము చేసి ఆ మహాసైన్యమును దక్షిణ సముద్ర తీరమునకు తరలించినాడు.
    శ్రీరామచంద్రుడు "ఈ అపారమగు దండుతో నూరు యామడల కడలిని దాటి లంకాపురిని ముట్టడించుట యెట్లు?' అని యోచించుచుండగా ఆకాశమార్గమున ఐదుగురు అసురులేతెంచి భువికి దిగినారు. వారిలో ముందున్నవాడు "రామప్రభూ శరణు శరణు! మేము లంకాపురి నుండి వచ్చినాము. నేను లంకేశ్వరుడగు రావణుని కనిష్ఠ సోదరుడను. ఈ నల్వురును నా సచివులు. నా పేరు విభీషణుడు. ఇటీవల దహింపబడిన లంకాపురిని తిరిగి నిర్మించవలసి వచ్చిన నా అగ్రజుడు నాతో చిరాకుగా 'నేనానాడు నాకాగ్రహము కలిగించిన ఆ మర్కటుని వధించుడని ఆదేశించగా నీవు 'దూతను చంపరాదు' అనుచు అడ్డువచ్చి విడిపించినావు. వాడు లంకాపురికి నిప్పుపెట్టి పోయినాడు!' అన్నాడు. అగ్రజుని మాటలలో నాకు 'లంకా దహనమునకు నీ వలన దోహదము కలిగినది!' అని స్పురించినది. నేను 'అన్నా ఆ వానరోత్తముని హిత వాక్యములు నీకు రుచించనప్పుడు వానినుపేక్షించి నీవూరుకొనవలసినది. కాని నీ వాతనికి ఘోరమగు అవమానమును తలపెట్టి నావు! నీవాతని వాలమునకు రగిల్చిన అగ్నినే సాధనముగా జేసికొని మనపై పగను తీర్చికొన్నాడు!....అగ్రజా అతడా నాడు సభలో నీకు చేసిన హెచ్చరిక నాకిప్పుడు స్పురణకు వచ్చుచున్నది. మహా పతివ్రత సీతాదేవిని నీవు హరించి తెచ్చి మృత్యువునే తెచ్చినావు! నా ప్రార్ధన నాలకించుము. సీతాదేవిని శీఘ్రముగ కొనిపోయి ఆమె భర్తకు సమర్పించి అపరాధ క్షమను కోరుకొనుము. నీ ప్రాణములను కాపాడుకొనుము. నీవారమగు మా అందరి అసువులను నిలబెట్టుము. దనుజ కులమును వినాశనము నుండి రక్షించుము' అన్నాను.....నేను శ్రేయమును కోరి సవినయముగ చేసిన విజ్ఞప్తి అగ్రజునాకు అమితమగు ఆగ్రహమును కలిగించినది. కోడెత్రాచు వలె లేచినాడు. 'నీవు భ్రాతృద్రోహివి! ఆ నరుడు రాముని నాముందు పొగడుచు నీ పిరికితనమును వెలిబుచ్చుకొనుటయే కాక నా కొలువులోని దానవ వీరులకు పిరికి మందును పోయుచున్నావు! నీవు లంకాపురిలో ఉండతగిన వాడవు కావు. వెంటనే వెడలిపొమ్ము!' అన్నాడు. లంకాపురిలో స్వలాభాపేక్షతో అగ్రజుని ఆనందపరచెడి ముఖస్తుతి పరాయణులెందరో ఉన్నారు. దానవేంద్రుడు వారి ప్రియ వాక్యములకు పొంగిపోవుచున్నాడే కాని రానున ఉపద్రవముణు గమనించుట లేదు. అగ్రజుడు నన్ను లంకాపురి నుండి బహిష్కరించెనని నేను విచారించ లేదు. నేను లంకాపురిలో ఉండిపోయి అగ్రజున కొనరించగల మేలేదియూ లేదని తెల్లమైనది. నా హిత వాక్యములు - పైత్యరోగికి పంచదార చేదన్నట్లు- ఆయనకు రుచించక పోవుటయే కాక మా నడుమ సంఘర్షణకు దారితీసి అశాంతిని కలిగించినవి. అగ్రజుడు 'పొమ్మ'నుటతోనే ప్రశాంత జీవితము నభిలషించి ఈ నల్వురు సహచరులతోనూ లంకాపురి సముద్రతీరమును చేరుకొన్నాను. 'ఎచ్చటికి పోవలెను?' అన్న ప్రశ్న ఉదయించినది. రామప్రభూ, మున్ను నీ చరిత్రమును నేను విన్నాను. పితృవాక్యమును నిలబెట్టుటకు యువరాజు పదవిని వదలి వనవాసమునాకు వచ్చిన త్యాగమూర్తివి! నీవిప్పుడు మహేంద్ర పర్వతమునకు సమీపమున సముద్ర తీరముననె వానర సేనతో విడిసియున్నావని తెలిసి నూరుయోజనముల కడలిని ఆకాశ మార్గమున దాటివచ్చి నీ శరణుజొచ్చినాము. మాకాశ్రయ మొనంగి నీ సేవాభాగ్యమును కలిగించుము.
    సుగ్రీవుడు: రామప్రభూ శత్రువు సోదరునకు ప్రాపునీయరాదు. 
    జాంబవంతుడు: ఇచ్చినను విశ్వాసపాత్రుడని రూఢియగు వరకును ఒక కంట కనిపెట్టుచునే ఉండవలెను.
    శ్రీరాముడు: హనుమంతుడా, నీ అభిప్రాయమును తెలుపుము.   
    హనుమంతుడు: రామప్రభూ ఈ దానవోత్తముడు విభీషణుని నేను రావణుని కొలువులో చూచినాను. రావణునకు నా హిత వాక్యములు రుచించనట్లే ధర్మపరుడునూ రాజనీతి కోవిదుడునూ అగు ఈ అనుజుని హితోపదేశమునూ ఆగ్రహమును కలిగించియుండును. ఆగ్రహావేశముతో 'తమ్ముడ'న్న దాక్షిన్యమును వీడి దానవేంద్రుడీతని 'లంకాపురి నుండి పొమ్మ'ని యుండును. ఈతని మనము శంకింప పనిలేదు.   
    శ్రీరాముడు: శరణుజొచ్చిన వానికి ప్రాపునిచ్చి బ్రోచుట నా వ్రతము. రావణుడే వచ్చి అర్ధించిననూ ఆతని కాశ్రయమీయబడును....అసురోత్తమా, విభీషణా! నీవునూ నీవారునూ ణా వారు వలెనే మీ జీవితములను మాతో నిశ్చింతగా గడుపుడు'.   
    విభీషణుడు: రామప్రభూ, ధన్యవాదములు.      
                              *         *         *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS