Previous Page Next Page 
రామాయణము పేజి 37

    హనుమంతుని హెచ్చరికను విన్న రావణుడు ప్రళయకాల రుద్రుడై మంత్రి ప్రహస్థునితో "ఈ వనచరాధముడు తనయిచ్చ వచ్చిన రీతిని వదరుచున్నాడు! దీనిని వధ్యస్థానమునాకు కొనిపోయి శిరచ్చేదము కావించి, శిరమును తెచ్చి నాకు జూపుడు!" అన్నాడు.   
    రావణున కిద్దరు అనుజులున్నారు. మొదటివాడు కుంభకర్ణుడు. ద్వితీయుడు విభీషణుడు. విభీషణుడు రాజనీతి కోవిదుడు. అతడు రావణునితో 'అగ్రజా, నీకు తెలియనిది కాదు. దూతను చంపరాదు. వేరొండు శిక్షను విధింపుము'.   
    రావణుడు: అట్లే చేయుదము. వానరులకు వాలము అన్నమక్కువ మెండు. వీని తోకను తగులబెట్టి అంగవిహీనుని కావించుడు. దహించబడుచున్న వాలముతో వీనిని పురవీధులందు త్రిప్పి పరాభవించి తరిమివేయుడు.   
    తైలములో ముంచిన గుడ్డపీలికలను హనుమంతుని తోక కొసకు చుట్టినారు! అశోక వనమున సీతాదేవి చుట్టునూ కల రాక్షస స్త్రీలు ఆమెతో "మేము తెల్లవారు జామున నిద్రపోవు చుండగా నీవెవడో మర్కటునితో మాటలాడితివటగా?" ఆ కోతి తోకకిప్పుడు నిప్పుపెట్టుచున్నారు!" అని కసితో చెప్పినారు. సీతాదేవి అగ్నిదేవుని మనసునందు ధ్యానించినది. "వీతిహోత్రా హనుమంతుడు రామ కార్యమును నెరవేర్చుటకేగు దెంచినాడు. ప్రతిఫలాపేక్ష లేని ఉపకారబుద్ది గల కర్మయోగి ఆతడు. ఆ మహాత్మునకెట్టి హానియు కలుగకుండ కరుణించుము" అని ప్రార్ధించినది.   
    నాలుగు చక్రములున్న చట్రమున కమర్చబడి యున్న ఫలకముపై హనుమంతుని నిలబెట్టినారు. నూనె గుడ్డలకు నిప్పంటించినారు. అగ్నిజ్వాల పైకెగసినది. నలుదెసలకును వ్యాపించినది. కాని ఆతని వాలమునకు వేడి తగలలేదు! హనుమంతుడు అచ్చెరువందుచు ఆ మేలు సీతా మహాసాధ్వి వలన కలిగినదని ఊహించి మనసునందె ఆమెకు నమస్కరించినాడు. "అవివేకి యగు రావణుడు నాకు పరాభవమును కలిగించుచుంటినన్న భ్రమతో నా వాలమునకు అగ్నిని ఆయుధముగా సమకూర్చినాడు! పౌరుల హేళనకు లోనుజేయవలెనన్న తలంపుతో నన్నూరేగింపుడని ఆదేశించినాడే కాని అగ్నివాలముతో నన్ను పురవీధులందు తిరుగనిచ్చుట లంకకు చేటు అని తెలిసి కొన్నాడు కాదు! నేనిప్పుడీ రాక్షస భటులను తప్పించుకుపోవలెనన్నచో పోగలను. కాని అట్లు చేయను. ప్రతీకారమొనరించిన పిమ్మటనే నిష్క్రమించెదను!"   
    హనుమంతుడా నిశ్చయముతో నాలుగు చక్రముల శకటముపైన కదలకుండ, నిలిచినాడు. ఊరేగింపు ప్రారంభమైనది. బండి వెనుక జేరిన అలగాజనము గుప్పిళ్ళతో దుమ్మును తీసి హనుమంతునిపై పోయుచూ ఎగతాళిని చేయుచు అనుసరించినారు. హనుమంతుడు తన కార్యక్రమమును ప్రారంభించినాడు. తన వాలమును పెంచి మండుచున్న కొసను అల్లరి మూకలోనికి చొప్పించి వారి వస్త్రములకు నిప్పునంటించినాడు. ఒడళ్ళు బొబ్బలెక్కగా బాధతో హాహాకారాలు చేయుచు మూక యంతయు చెల్లాచెదురై పారిపోయినఃది. రాజవీధి నిరువంకల గల సౌధములందలి స్త్రీ, పురుషులు ద్వారములందు నిలిచి చోద్యము చూచుచుండగా హనుమంతుడా సౌధములందరి దారు నిర్మిత గవాక్షములకును, ద్వారములకును కవాటములకును అగ్నిని అంటించినాడు. వారి చోద్యము ఆందోళనగ మారి, అగ్నికాహుతి యగుచున్న తమ భవనములను కాపాడుకొనుటకు వ్యర్ధ ప్రయత్నములను చేసినారు. అనలమునకు (అగ్నికి) అనిలము (వాయువు) తోడై వీధి యిరుదెసల నుండియు జ్వాలలు వ్యాపించుటచే ఆ ఉష్ణమును భరించలేక బండిపై హనుమంతుని ఊరేగించుచున్న భటులు శకటమును విడిచిపోయి ప్రాణములను కాపాడుకొన్నారు.   
    రాజవీధి యందుగల విభీషణుని హర్మ్యము జోలికి హనుమంతుడు పోలేదు.   
    అతడు వీధి నుండి వీధి కెగరిపోయి అనలము నన్ని వీధులకును అందించినాడు. రావణుడు హనుమంతుని పుచ్ఛమునకు పెట్టించిన నిప్పే హనుమంతునకు లంకా దహనమున నుపయోగించినది. ఆతడు సముద్ర తీరమును చేరుకొని వాలమును నీట ముంచి నిప్పును చల్లార్చికొన్నాడు.   
    హనుమంతుడు తిరిగి నూరు యోజనముల సముద్రమును దాటి మహేంద్ర పర్వతముపై వ్రాలినాడు. ఆ లంఘనము అవలీలగను అవిఘ్నముగను జరిగినది.   
    ఆహార పానీయములనుపేక్షించి మహేంద్రా పర్వతముపై హనుమంతుని కొరకు నిరీక్షించుచున్న అంగద బృందము ఎదుట ఆతడు వ్రాలి "కనుగొంటిని సీతా సాధ్విని!" అని వెల్లడించినాడు. వారాతని అభినందించి, విషయమునంతనూ వివరముగా తెలిసికొని ఆనందాతిశయమున గంతులు వేసినారు. వారిని హఠాత్తుగా ఆకలిదప్పులు బాధించసాగినవి. వారు సమీపముననె ఉన్న సుగ్రీవుని మధువనమును ప్రవేశించినారు. చెట్ల మ్రానులను పట్టుకొని కుదిపి పండ్లను రాల్చి ఆరగించినారు. తేనె పట్టులను చిదిపి మధువును త్రాగివేసినారు. కావలివారు పోయి సుగ్రీవునితో ఫిర్యాదు చేయగా ఆతడు 'వారు నేడు సంతోషముతో పండుగను చేసి కొనుచున్నారు; చేసికొననిండు" అన్నాడు.
                       *       *        * 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS