Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి  పేజి 37

    "హలో సర్! నమస్తే! నా పేరు ఆమని. బి.ఎస్ సి చదువుతున్నాను."

    "అలాగా అమ్మా! ఏమిటి నీ సందేహం?"

    "సర్! ఒక పాపకు ఇద్దరు కన్నతల్లులు వుండటం ఎలా సాధ్యం?"

    "మనం అసాధ్యం అనుకున్న వాటిలో కొన్ని సాధ్యమే అని నిరూపించబడ్డాయి. ఈ వాస్తవం ఒక పాప రూపంతో మీ కళ్ళ ఎదుటే వుంది. ఇదిగో నా ప్రక్కనే వుంది!

    కొన్ని కారణాలవల్ల ఇంతకాలం అజ్ఞాతంగా వుండాల్సి వచ్చింది.

    ఇప్పుడు ఆ దేశం తీసుకుపోతున్నాను. ఇదివరలో నేను వ్రాసిన వ్యాసాల ఫలితాంశాన్ని ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తాను."

    "యూ ఆర్ గ్రేట్ సర్! కాని అదెలా సాధ్యమయింది!"

    "ఆ ఫార్ములా నీకు చెప్పాలంటావా?"

    "మీకు అభ్యంతరం లేకపోతేనే"

    "లేకుండా ఎలా వుంటుందమ్మా! ఇలాంటి పిల్లలకోసం ఆసక్తి చూపుతున్న కొన్ని దేశాలు ఈ ఫార్ములాని చాలా ఎక్కువ రేటుకి కొంటామంటున్నాయి, అభ్యంతరం ఎందుకు ఉండదమ్మా! అది డబ్బుతో వ్యవహారం!" అని బదులిచ్చి ఆగిపోయాడాయన. మరెలాంటి సమాచారం యిచ్చేందుకు సుముఖత కనపరచలేదు.

    మాటలు ముగించాలని కోరుతున్నట్లు అనిపించింది.

    "పోనీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి సర్" ఇది తల్లి బిడ్డలకు సంబంధించిన వ్యవహారం కదా! దీనిలో కోర్టు ప్రమేయం ఎందుకు కల్పించుకుంది?"

    "అమ్మా ఈ కేసులో మొత్తం సమస్యలు చాలా వుంటాయి వాటిని చాకచక్యంగా పరిష్కరించుకునేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నాకు తెలుసు.

    కాని అప్పుడు తెలియక పరిశోధన ఏకముఖంగా సాగించాడు.

    ఇప్పుడు ఈ బిడ్డ వుందంటే ఇద్దరు తల్లులలో ఎవరికి చెందాలి?"

    ఈ విషయమై డాక్టర్స్ యిచ్చే తీర్పు ఏమిటి?

    కోర్టు చేసే నిర్ణయం ఏమిటి.

    ఎవరయినా త్వరపడి పోలీసు కేసులు పెట్టుకుంటే వారి యాక్షన్స్ ఏమిటి?

    అవి నాలుగు విధాల ప్రశ్నలు తలఎత్తాయి" అని వివరించాడు ప్రొఫెసర్.

    "తల్లులు ఇద్దరూ కోర్టుకు వెళ్ళారా? బిడ్డ నాదంటే నాదని వాదించుకున్నారా?

    "అవునమ్మా! కోర్టు ఏ విషయమూ తేల్చి చెప్పేందుకు వీలుకాలేదు."

    "అలాంటి సమయంలో మీ అభిప్రాయం తీసుకుంటారు కదా."   

    "కోర్టు నన్నడిగితే బిడ్డ యిద్దరిదీ అని చెప్తాను."

    "ఈక్వల్ గా ఇద్దరిదీ ఎలా అవుతుంది సర్. ఒకరికి ఎక్కువ అధికారం వుండాలికదా?" అని అడిగింది ఆమని.

    "ఈ ప్రశ్నకు సమాధానమే ఈ ఫార్ములా! అది తెలిసిన తరువాత మీకు ఇలాంటి సందేహాలేవీ కలిగే అవకాశం లేదు."

    "ఓ గాడ్!" అంది ఆమని సంభాషణ మళ్ళీ బయలుదేరిన చోటుకి వచ్చింది. కాని ఆయన ఆ ముడి విప్పరని ఆమెకు తెలుసు. కృతఙ్ఞతలు చెప్పి అంతటితో సంభాషణ ముగించింది.

    "ఆయన ఏమంటారు?" మిగిలిన వారు ఆసక్తిగా ఆమె చుట్టూ చేరారు.

    "బిడ్డ ఇద్దరికీ కన్నబిడ్డే అంటారు!"

    ఒకసారి జులపాలు ఎగిరిపడేలా విదిలించి మళ్ళీ అడిగింది విమ్మీ!

    "ఏమంటారే-?"

    "బిడ్డ ఇద్దరు కన్నతల్లులు పూజాఫలం" అంటున్నారు.

    విమ్మీ గట్టిగా జబ్బ మెలిపెట్టి రమీని అడిగింది.

    "రమీ! ఈ విషయము నీకేమాత్రమయినా అర్ధమయిందా!"

    "అర్ధం కాకపోయినా నమ్మాలి తప్పదు."

    వారు ఆ విషయం మీద చర్చించుకుంటూ హాస్టల్ చేరారు.

    స్నానం భోజనం ముగించిన తరువాత చదువుమీద మనసు నిలవలేదు. అక్క జ్ఞాపకం వచ్చింది, ఉత్తరం ప్రారంభించింది.

    "పెళ్ళి అయిపోయి చాలా నెలలు అయింది కదా! అక్కా నీకేమయినా విశేషమా! ఉంటే వెంటనే బద్ధకం వొదిలించుకుని ఉత్తరం వ్రాయి" అని ముగించింది.

    అక్క తల్లి కావటం అన్న ఆలోచన కౌగిలిగింతలు కలిగాయి.

    ప్రొద్దుపోయాక ఎప్పుడో రెప్పలు బరువుగా వాలాయి.


                           *    *    *


    కార్తీకమాసపు చిరు చలిగాలి వీస్తోంది. సమయం రాత్రి ఎనిమిది గంటలు.

    రాణి సుమిత్ర లాన్ లో కూర్చుని ఉంది. సాయంత్రం నాలుగు గంటలనించి ఆమె అలా కూర్చునే ఉంది-ఎంతకూ తెగిపోని ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది. మాటాడేందుకు వచ్చినవారిని గాయత్రి దగ్గరకు పంపింది.

    గాయత్రి ఇంటి ఆజమాయిషీ అంతా ముగించుకుని అలవాటు ప్రకారం ఎనిమిది గంటలకు అమ్మగారి రాత్రి భోజనం ఏర్పాటు చేయించింది.

    ప్రతి అణువుని పరిశీలించటం, ప్రతి చిన్న మాటని అతి చిన్న సంఘటన కూడ విశ్లేషించటం సుమిత్రాదేవి అలవాటు.

    ఆ విమర్శకు అందకుండా అంతా సవ్యమయిన పద్ధతిలో తీర్చిదిద్దింది.

    ఎవరూ పిలిచే అవసరం లేదు.

    సమయం ప్రకారం ఎక్కడ ఉండాలో ఆ సమయానికి అక్కడ ప్రత్యక్షమవుతుంది సుమిత్ర! కాని ఈరోజు ఎంతసేపు ఎదురు చూచినా ఆమె రాలేదు. ఎనిమిదిన్నర గంటలు కూడ దాటింది.

    భోజనం అరగంట విశ్రాంతి ఆ తరువాత నిద్ర తొమ్మిదిగంటలకు కార్యక్రమం యధాపూర్వంలా కొనసాగే అవకాశం ఇహలేదు.

    ఆమె ఏమయినా పరాకున పడిపోయినారెమో అని అనుమానించింది గాయత్రి. వర్ధని ద్వారా సమయం గుర్తు చేయించాలనుకుంది.

    కాని నిశ్శబ్ద సముద్రంలో గాఢంగా మునిగిపోయి వున్నట్లు కన్పిస్తున్న తల్లి గారి దగ్గరకు మనిషిని పంపేందుకు ధైర్యం చాలలేదు.

    సాయంత్రం ఇచ్చిన టీలు బిస్కట్లు అలాగే మిగిలిపోయి వున్నాయి. ఈ విషయాన్ని పనివాళ్ళు తెలుసుకుని గాయత్రికి వార్త అందించారు.

    తనే బయలుదేరింది తల్లి గారి మనోగతం ఏమిటో తెలుసుకోవాలని!

    అడుగుల చప్పుడు విని కూడ సుమిత్ర తలత్రిప్పి చూడలేదు.

    అప్పటికి చలి కొంచెం పెరిగింది.

    వెంట తీసుకుపోయిన షాల్ తల్లిగారి భుజాలమీద కప్పింది గాయత్రి. అయినా ఆమె ఉలకలేదు. పలకలేదు. పన్ను కదపలేదు.

    "అమ్మగారూ! సమయం ఎనిమిది గంటల ముప్పయి అయిదునిముషాలయింది. అంది సున్నితమైన కంఠస్వరాన హెచ్చరిక వినిపిస్తూ!

    "కాలం ఎవరికోసం ఆగదు గాయత్రి! దొర్లి పోతూ ఉంటుంది"

    "మీరు సాయంత్రం నాలుగు గంటలనించి టీ త్రాగలేదు. బిస్కట్లు యాపిల్స్ అలాగే ఉన్నాయి. అంతా క్రొత్తగా ఉంది!!"

    "క్రమశిక్షణ కోసం సమయాన్ని పాటిస్తారు. ఇది మనుషుల వంతు! కాని కోరిన కోర్కెలు మన అర్ధింపులు మర్చిపోయి మూగగా ఉండిపోవటం దేవుని వంతు! కాలం అనేది దైవం చేతిలో ఆటవస్తువు. కాబట్టి దానితో ఆడుకుంటాడు ఆ జగదీశ్వరుడు! తట్టుకునే శక్తి మన గుండెలకు ఉండాలి! ఓదార్పు వహించగల స్థాయి మనసులకు ఉండాలి! క్రొత్తకాక మరేముంది? అంతా ఎదురు తిరిగి నడుస్తోంది" అంది సుమిత్ర.

    "మీకింత పరధ్యానంగా ఉన్న కారణం ఏమిటండి? ఎందుకోసం బాధపడుతున్నారు?" అని తల్లిగారిని ప్రశ్నించింది గాయత్రి.

    "ఎవరు కన్పించినా అమ్మాయిగారికి ఏదయినా విశేషమా? అని అడుగుతున్నారు గాయత్రి! ఏమి చెప్పాలో పాలుపోవట్లేదు" అంది సుమిత్ర గంభీరంగా.

    ఆ మాటలు విని గాయత్రికి నవ్వు వచ్చింది. కాని తల్లి బాధ పడుతూ ఉన్న సమయంలో తాను అలా చేయటం మంచిది కాదని ఊరుకుంది.

    ఎంత చాదస్తం ఈ పెద్దవాళ్ళకి! పెళ్ళి జరిగి ఆరునెలలు దాటింది. అంతే! కనీసం అయిదారు సంవత్సరాలు పెళ్ళి తరువాత దంపతులు పిల్లలు లేకుండా స్వేచ్ఛగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న కాలం. ఆరునెలలు కూడా కాకముందే అమ్మగారు ఆ వార్త వినకపోయినందుకు ఇంతగా కృంగిపోవాలా! ఇది చాదస్తం కాకపోతే మరేమిటి?

    "నాకు చెప్పకుండా నువ్వేమయినా చేస్తున్నావుటే గాయత్రీ!" అని అడిగింది సుమిత్ర. గాయత్రికి దుఃఖం ముంచుకొచ్చింది.

    "అమ్మగారూ! ఈ విషయంలో నేను మీకు గతంలో వాగ్ధానం చేశాను. కాని వాగ్ధానం తప్పుతానని మీరు అనుకున్నారా?" అందామె కళ్ళు తుడుచుకుంటూ! కూతురు మనసు నొచ్చుకున్నదని అర్ధమయింది.

    సుమిత్ర చాలా బాధపడింది.

    "ఊరుకో గాయత్రీ! పెద్దవాళ్ళం చాదస్తంగా ఆలోచిస్తామని ఒప్పుకుంటున్నాను. పెళ్ళి అనగానే ఎవరి ఆశలు వారికుంటాయి. మీకు అది కోరికలు తీర్చుకునే అవకాశం! మాకూ కోరికలుంటాయి. వారసుల్ని ఎత్తుకోవాలని! మనం ప్రపంచంలో ఒంటరిగా బ్రతకలేము. మనచుట్టూ మనుషులుంటారు. వారు వారి సంగతులేకాక మన సంగతులు కూడ ఆలోచిస్తుంటారు. ఈ రోజు విశేషమా అని మాత్రమే కాకుండా మరో ప్రశ్న అడిగారు. పెళ్ళి అయిన దగ్గరనించి అబ్బాయిగారు వ్యాపారం పనుల్లో మునిగిపోయి పట్నంలో ఉంటున్నారట కదా? అని!

    ఆ మాటకి కాస్తంత కలతపడ్డాను. సమస్యలను ఎదుర్కోగల గుండె దిటవు చిన్నతనంలో ఎక్కువగా ఉంటుంది. పెద్ద అయింతరువాత గుండెదిటవు తగ్గిపోయి అనవసరమయిన ఆలోచనలు వస్తుంటాయి కదా!" అందామె.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS