"అలాగే అత్తా!"
"ఈ షరతుల్ని నువ్వు ఎప్పుడు ఉల్లంఘించినట్టు కనబడినా నిన్ను వెళ్ళగొడతాను!" పారిజాత అన్నిటికీ తలాడించింది."
14
"మనోహర బాబూ!"
ఇవాళ ఉదయం మేం సిటీకి వచ్చాం. మానాన్నమ్మ బాత్ రూంలో జారిపడింది. ఆవిడను హాస్పిటల్ కు తీసుకువచ్చాం. మీకు వీలైతే ఈ సాయంత్రం రాజేంద్రనగర్ లోని మా ఇంటికి రండి. కాస్సేపు మాట్లాడుకోవచ్చు. ఇట్లు రజని"
రజని కారు డ్రైవరు ఇచ్చిన చీటీ చదువుకొన్న మనోహర్ పెదవులమీద చిరునవ్వు వెలిగింది.
"ఒకగంట తరువాత వస్తానని చెప్పు."
ఒక గంట తరువాత తన స్కూటరు మీద హుషారుగా బయల్దేరాడు మనోహర్.
"రండి." చిరునవ్వుతో ఆహ్వానించి మేడపైకి తీసుకుపోయింది రజని.
"మీ నాన్నమ్మ హాస్పటల్లో ఉందా?"
"నర్సింగు హోంలో చేర్చాము"
"ఇప్పుడు ఎలా ఉంది?"
"రేపు ఏక్స్ రే తీస్తామన్నారు. కాలు బాగా వాచిపోయింది. ఎముక ఫ్రాక్చరైనట్టు అనుమానంగా ఉందన్నారు. అత్తగారు బాగున్నారా?"
"ఆఁ. ఈ సంగతి తెలిసి అమ్మ నాతో రావాలనుకొంది. కాని ఉదయం వస్తానని చెప్పింది."
పది నిమిషాల తరువాత రజని ఇచ్చిన టిఫిన్ ప్లేటు అందుకొని "ఊఁ విశేషాలు చెప్పండి" అన్నాడు మనోహర్.
"విశేషాలు మీరే చెప్పండి" ఓరగా చూచింది రజని.
రజని ముఖంలో చూచి ముగ్ధుడై పోయాడు మనోహర్. పెళ్ళిచూపులనాడు సాదాగా అలంకరించుకొన్న రజని అవాళ కొంచెం ప్రత్యేక శ్రద్ధతో అలంకరించుకొందనిపిస్తూంది. గులాబీ రంగు డ్రెస్ లో, తల్లో గులాబీ పువ్వులతో తనే గులాబీ సుందరిలా అందాన్ని విరజిమ్ముతోంది. "సంబంధం స్థిరపడినప్పటి నుండి అమ్మకు హడావుడి ఎక్కువైంది. నగలు చేయించడానికి ముందు నిన్ను పిలిపించి నువ్వు కోరిన డిజైనులు ఇవ్వాలనుకొంటున్నది."
"నేను రావలసిన పనిలేదని చెప్పండి అత్తగారికి ఏమి చేయించినా నాకిష్టమే" రజని చెంపల్లో గులాబీలు విరిశాయి.
"అమ్మ పాతకాలం మనిషి. ఆవిడకు నచ్చినవి మీకు నచ్చకపోవచ్చు"
"నాకు నచ్చవలసినవి నగలూ, బట్టలూ కాదు. వాటికి నా పుట్టింట్లో కరువేమీ లేదు."
"మరి నచ్చవలసినవి ఏమిటి?"
"నా జీవితం పంచుకోవలసినవాడు!"
"నచ్చాడా?"
"ఆసంగతి మానాన్నగారు చెబుతారు." రజని మధురంగా నవ్వింది.
"ఆ సంగతి నువ్వు చెబితేనే నాకు గర్వం, సంతోషం!"
"ఇలాంటి సంగతులు పెదవులు చెప్పేకన్నా కళ్ళు బాగా చెబుతాయి .ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు." సిగ్గు దాచుకోడానికి రజనీ టీ కోసం క్రిందికి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి ఆమె ముఖం మామూలుగా ఉంది.
టీ త్రాగడం పూర్తిచేశాడు మనోహర్.
వక్కపొడి భరిణ అతడి ముందుకు త్రోసి, "నటరాజ్ లో రెండు సీట్లు రిజర్వు చేయించాను" అంది.
"ఎవరికోసం?"
"ఒకటి నా కోసం ఇంకొకటి మీ కోసం!"
మనోహర్ టైం చూచుకొన్నాడు. "మరి ఇక ఆలస్యం ఏమిటి? టైం అయింది."
"ఆలస్యం ఏంలేదు పదండి."
ఏదో మాటకు నవ్వుకుంటూ క్రిందికి వస్తూన్న కూతుర్నీ, కాబోయే అల్లుడినీ చిరునవ్వుతో వీక్షిస్తూ అన్నాడు జగన్నాధరావు. "కుశలమా, మనోహర్ ఎప్పుడు వచ్చావు?"
