Previous Page Next Page 
ఏటిలోని కెరటాలు పేజి 37


    "ఎందుకో?"

    "మరే, నీకిష్టమో, కాదో అడుగుతారట."

    బోధపడినా తెలియనట్లే అడిగింది "ఏది ఇష్టమని?"

    "అత్త తెచ్చుకొన్న అబ్బాయినట, నువ్వు చేసుకొంటావో, లేదోనని" చిలిపిగా గిలిగింతలు పెట్టింది అక్కను, సిగ్గును అభినయిస్తూనే చెల్లెలిని అనుసరించింది దేవదాసి.

    "నిజంగా, వదినా! నువ్వు చేసిందొక తెలివితక్కువపని. నా బిడ్డనిచ్చి చేయమంటే దాన్ని సమర్థించడమన్నమాటే!" అంటోంది శ్రీలక్ష్మి. "వచ్చింది నీ కోడలు, దాన్ని అడుగు దానికి ఇష్టమైతే మేం  అనడానికి ఏముండదు." దేవదాసి మీద భారంవేసి ఆమె కాదంటే తమ మీద నిందపోతుందని ఊహ!

    "చెప్పమ్మా రమణారావును పెళ్ళాడ్డానికి సమ్మతమేనా?" తండ్రి అడిగాడు లాంఛనప్రాయంగా.

    తలొంచుకొనే అన్నది దేవదాసి. "నా ఇష్టాయిష్టాలు బావకు నన్నిస్తానన్నప్పుడు అడగలేదెందుకు?"

    "అది వేరు. బావ నీకు అన్నివిధాల తగిన వాడనుకొన్నాం. నువ్వు ఇష్టపడకపోవడమంటూ ఉండదని ఆశించాం. కాని, ఇది....."

    "ఈయనకున్న లోపాలు చెప్పండి"

    తల్లిదండ్రులు నిరుత్తరులయ్యారు.

    "ఇంత మంచి అత్త నాకెక్కడ దొరుకుతుంది? నన్ను మరో యింటికి యిచ్చే ప్రయత్నం చేయవద్దు."

    మెల్లగా వెళ్ళిపోయింది దేవదాసి.

    "పుణ్యం కొద్దీ పురుషుడు! అతడి మంచి చెడ్డలు మనం ఏం చెప్పగలం! అదంతా ఆడదాని రాత." ముఖం చిన్న బుట్టుకొంది శ్రీలక్ష్మి. "వదినా నీ పట్టే నెగ్గింది సుమా! అత్తా కోడలు ఒకటయ్యాక మేమేం చేయగలం!" బలవంతంగా నవ్వింది శ్రీలక్ష్మి. లోలోన కూతురు ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ.

    "మాట యిచ్చాక తప్పేది మన యింటలేదు. అక్కా, ఏడాది సూతకం వెళ్ళందే కన్యాదానం చేయడం ఎలా? మరి కొన్నాళ్ళు ఓపిక పట్టాలి నువ్వు" అన్నాడు సూర్యదేవులు.

    "అయితే దేవిని నాతో పంపించండి. పెళ్ళికి ముందు వధూవరులు పరస్పరం అర్ధం చేసుకొని అనురాగ దాంపత్యానికి బాటలు వేసుకోగలరు!"

    "పెళ్ళి కాకుండానే వధూవరులు ఒకచోట ఉండడమా? అనే సంకోచం బయటపెడితే, దేవిని భార్గవుడికి ఇస్తామన్నప్పుడు కలుగలేదేమిటి? అంటుందేమో కృష్ణవేణి! మనసునొచ్చుకుంటుందేమో!"

    "ఉఁ" అనక తప్పలేదు మనసులో అయిష్టతగానే ఉన్నా.
   



                                    16



    తలభారంగా ఉందన్నావు తగ్గిందా, అమ్మా?" గదిలోకి వచ్చిన రమణ ఆప్యాయతా, జాలి మిళితమైన స్వరంలో ప్రశ్నించాడు.

    "రా, నాయనా." కొద్దిగా జరిగి మంచం పట్టెమీద చోటు చూపించంది కృష్ణవేణి. "తగ్గలేదు జలుబు చేసింది కదా? రెండు మూడు రోజులు బాధపెట్టిగానీ మరి వదలదు."

    "మందు పుచ్చుకోవా?"

    దీనికేం మందు? రెండు మూడురోజుల్లో అదే తగ్గిపోతుంది."

    మౌనంగా కూర్చున్నాడు రమణ. రమణ నుండి ఏం పొందదలచిందో అది సంపూర్ణంగా పొందుతూనే ఉంది కృష్ణవేణి అయినా ఆమెకు సంతృప్తి కలగడంలేదు. మనస్సింకా అశాంతితో, ఆరాటంలో కుములుతూనే ఉంది. "అమ్మా" అని నోటినిండా పిలుస్తాడు. తమ మంచి చెడ్డలు మనస్ఫూర్తిగా పరామర్శిస్తాడు అయినా కృష్ణవేణి దృష్టికి కృత్రిమత్వమే గోచరిస్తుంది. అతడి ప్రవర్తనలో ఆత్మీయత కంటే కృతజ్ఞతాభావమే అధికంగా కనబడుతుంది. అతడి తండ్రి కొంత స్థితిమంతుడే అయినా ఆరుగురు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళుచేసి, ముగ్గురన్నదమ్ములు పంచుకొనేనాటికి చాలా కొద్ది ఆస్తి మాత్రమే వస్తుంది. అలాంటిది కృష్ణవేణి పుణ్యమా అని లక్షల ఆస్తికి అధికారి అయ్యాడు! కలలో కూడా అతడు ఊహించి ఉండని అపురూప లావణ్య రాశిని సహచరిణిగా సమర్పిస్తున్నది! అతడి హృదయం కృతజ్ఞతా భరితం కాకుండా ఎలా ఉంటుంది? నిజంగా రమణ సహజంగా ప్రేమించలేడు, ఇరవయ్యేళ్ళ కాలం మరొకచోట పెరిగివచ్చాడు ఏ చెట్టునో పెనవేసుకు సాగినలతను తీసుకువచ్చి మరొక ఆధారానికి చుట్టితే అస్తవ్యస్తం కాకుండా, సహజత్వానికి దూరంకాకుండా ఎలా వుంటుంది?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS