Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 37


    "నా బిడ్డా తన గుర్తుగా ఆకసుగాయ నొకదాన్ని భూమ్మీద మిగిల్చిపోయింది. తల్లి ఎలాగూ కరువైంది. వున్న తండ్రిని కూడా ఉద్యోగం ఊడగొట్టించి జైలుకి పంపి ఏం సాధిస్తాము?"

    "అటువంటితండ్రి వుంటే ఏం? లేకుంటే ఏం?" ఆశ్చర్యపోయింది ఆవిడ ధోరణికి హరిత.

    "మంచివాడో, చెడ్డువాడో దాని పోషణ భారాన్ని స్వీకరించేవాడు వుండాలికదా? మేము తీసుకుపోయి సాకలేము. మా దగ్గర అంత ఆర్దికస్తోమత లేదు!"

    "అయితే ప్రమీల కూతుర్ని మీరు తీసికెళ్ళరా?" ఇంకా ఆశ్చర్యపోయింది హరిత.

    "మా బ్రతుకులే మాకు భారం. ఆ పసిబిడ్డభారాన్ని కూడా ఎక్కడమోయగలం? ఇప్పుడు బిచ్చమెత్తి సాకినా పెళ్లీడు వచ్చాక అప్పుడు పెద్ద సమస్యేకదా? ఇక్కడుంటే ఉద్యోగస్తుడైన తండ్రి ఆమెకోసం ఏమయినా చేయగలడు!"

    "యిప్పుడు ప్రమీలకే వినగల శక్తి వుంటే వీళ్లు కన్నవాళ్ళా, కసాయివాళ్లా అని తప్పకుండా అనుకొంటుంది!"

    "దరిద్రం మనుషుల్ని కసాయివాళ్లనేకాదు, రాక్షసులనుకూడా చేస్తుందమ్మా" ఆవిడ కళ్లు తుడుచుకుంటూ లేచింది.

    వారం పదిరోజుల తరువాత ఒకనాడు హరిత కాలేజీనుండి వస్తూంటే జానకి కనబడింది.
 
    "ఏమిటి విశేషాలు? ప్రమీల ఎలావుంది? వాళ్లాయన మునుపటిలాగే ప్రవర్తిస్తున్నాడా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

    "ఇంకెక్కడి ప్రమీల? వాళ్లాయన కాల్చి చంపేశాడు." అంటూ ఆ సంగతులన్నీ చెప్పింది హరిత.
 
    "అరే! మాకెందుకు తెలియజేయలేదు?"

    "అక్కడ ఎవరూ సహకరించే పరిస్థితి కనిపించలేదు! చివరికి కన్నవాళ్లుకూడా "తల్లి ఎలాగూ లేదు. తండ్రిని కూడా జైలుకి పంపి లాభమేమిటి?" అని వాదిస్తూంది ప్రమీల తల్లి. తమకింత గర్భశోకం  కలిగించిన వాళ్లకు తగిన ప్రాయశ్చిత్తం చేయాలన్న ఆలోచనే లేదు వాళ్ళకు. నాకదే ఆశ్చర్యంగా వుంది."

    "నాకు మాత్రం ఆశ్చర్యం ఏం లేదు. మాకెక్కడ చూసినా ఇలాంటి కేసులే ఎదురవుతుంటాయి. వరకట్న మరణాలకు సంబంధించిన చాలా కేసులు ఇలా చేజారిపోయినవే! తల్లి ఎలాగూ పోయింది. వున్న తండ్రినికూడా జైలుకి పంపితే పిల్లల గతేమిటి? చచ్చింది ఎలాగూ రాదుకదా?"  అంటూ కేసుపెట్టడానికి వప్పుకోరు తల్లిదండ్రులు. పెట్టినా మధ్యలో విరమించుకొనేవాళ్లు చాలామంది. చివరివరకు  నిలచి హంతకుడికి  శిక్షపడడం అనేది చాలా కొద్దికేసుల్లో జరుగుతుంది. ఒక ఆడపిల్లను మగడు, అత్తకాల్చి చంపితేనో,  కొట్టి చంపితేనో ఆ హత్యానేరం ఆ ఇద్దరిదే కాదు. చంపినా, నరికినా  మీ ఇంట్లోనే వుండాలి పిల్ల అని అత్త వారింట నెట్టివెళ్లే  తల్లిదండ్రులదీ, భార్యాభర్తల తగాదాలో జోక్యం చేసుకోకూడదని తప్పుకొని వాళ్లకి చంపే అధికారం  ఇచ్చిన సమాజానిది.

    "అసలు ఈ జనాలను చూస్తే నాకు చెప్పలేనంత కోపం. రేపీపాటికల్లా వాడి అపరాధాన్నంతా  మరిచిపోతారు. భార్యను చంపిన కిరాతకుడని మరిచిపోతారు.  అన్నీ మరిచిపోయి బార్యను పోషించగల మగాడు అని మాత్రమే గుర్తుపెట్టుకొంటారు. కాళ్లుకడిగి కన్యాదానం చేయడానికి క్యూలో నిలబడతారు."

     "నిజానికి ప్రతి నేరస్థుడినీ కోర్టుకి పంపించలేం. నేరనిరూపణ  అన్నది చాలా కష్టసాధ్యమైన విషయం కాబట్టి. కోర్టులలో  దొరికే న్యాయం చాలా ఖరీదయినదేకాదు.  అపూరూపమయిందికడా. సామాన్యుడు వెళ్లడానికి జంకుతాడు. తమ పిల్లల్ని పోగొట్టుకుని ఎంత కడుపు మండుతున్నా పోలీసు కంప్లెయింటు ఇవ్వరు. ఎందుకంటే  కేసును తల్ల క్రిందులు చేస్తారన్న భయం. కోర్టులుకూడా అందుకు తగ్గట్టుగానే వున్నాయి.

    "కాబట్టి నేరస్తుడికి శిక్షపడాలంటే ప్రజలే తీర్పరులు కాగలస్థితికి ఎదగాలి. ఇలాంటి హంతకుల్ని సంఘ బహిష్కారం చేయాలి. మళ్లీ ఎవరూ పిల్లనివ్వకుండా కట్టుదిట్టం చేయాలి భార్యను చంపుకున్నందుకు అతడు ప్రతి నిమిషం కుమిలిపోయే పరిస్థితి కల్పించాలి. ఆ మార్పు ప్రజల్లో వచ్చిననాడే ఆడపిల్లకు ఈ దుర్మరణాలు తప్పుతాయి."

    "ఈ మార్పు కనుచూపుమేరలో కనిపించడంలేదు" నిస్పృహగా అంది హరిత.



                      *    *    *    *   



    ఎం. ఎ. ఫైనల్ పరీక్షలు దగ్గరికి వస్తూంటే సంబంధాలు వెదకడం తీవ్రతరం చేశారు హరిత తలిదండ్రులు. హరిత ఆఖరు పరీక్ష అయిన మర్నాడే ఇంజనీరు చేస్తున్న ఒక అబ్బాయితో  పెళ్లి చూపుల ఏర్పాటు జరిగింది.

    హరిత ముందుగానే ఒక కండిషన్ పెట్టింది. "మీరు ఏ అబ్బాయితో పెళ్లి నిశ్చయంచేసినాసరే చేసుకొంటాను. కాని అతడు కట్నం తీసుకోని ఆదర్శవంతుడయి వుండాలి."

    "సరే!  నీ ఆదర్శాన్ని గౌరవించేవాడినే చూస్తాం" అని మాటిచ్చారు కూతురికి.

    కాని వాళ్లు చాటుగా నవ్వుకొన్నారు. "పిచ్చిపిల్ల మంచి సంప్రదాయమూ, చదువూ, ఆస్తీ వున్న యువకుడు కావాలనుకుంటే అతని ఎత్తు ధనం పోయకుండా అల్లుడు రావడానికి ఎలా ఒప్పుకొంటాడు? అవన్నీ లేకపోయినా ఆదర్శాలు మాత్రమే వుంటే అతడికెలా ఇస్తారు పిల్లను?  వెయ్యి అబద్దాలు అడయినా ఒక పెళ్లి చేయొచ్చునన్నారు కదా పెద్దలు. అందుకు తొలి అబద్దం కూతురిదగ్గరే ఆడితే సరి! కట్నం ఎవరికి ఎంతిచ్చినా అది హరితకు తెలియకుండా జాగ్రత్తపడితే సరి" అనుకొన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS