"శాస్త్రిగారు ఈ మధ్యనే నాతో మాట్లాడుతూ 'తాను నూరేళ్ళూ బతకబోతానా' అని అన్నారు సరోజా. (మాట్లాడటమంటే ఆయన రాసి ఇచ్చిన దానిని మనం చదవడమన్నమాట)పాపం వారి చివరి సంవత్సరాలన్నీ మూగతనంతోనే గడిచిపోయాయి. ఇరవయ్యో శతాబ్దానికి అంపకం పెట్టిన తర్వాతనే వారు మరణిస్తారని గట్టిగా నమ్మేను. కానీ నా నమ్మకం వమ్మయిపోయింది.
నా చిన్నతనంలోనే కృష్ణశాస్త్రిగారు కవిగా నన్ను నన్ను ఆకర్షించేరు. తర్వాత వ్యక్తిగా ఆకట్టుకున్నారు. సినిమా పాటలకు సాహిత్య గౌరవం సాధించి పెట్టిన కొద్దిమంది కవులలో శాస్త్రిగారు ఒకరు.
భావికవితా భావన మూలస్థలంభాలలో ముఖ్యులుగా వారి పేరు చెప్పాక తప్పదు.భావికవిత్వానికి అనన్య ప్రచారం ఇచ్చినవారు కృష్ణశాస్త్రిగారు. ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలనుకునేవాళ్ళు కృష్ణశాస్త్రిగారి కవితలకు చదివి తీరాల్సిందే" అంటూ చెప్పుకుపోతూ వుంటే శ్రీశ్రీగారి చుట్టూ చేరిన పదిమందిమీ వింటూ కూర్చున్నాం. "వారు మంచి గాయకులు కూడా అన్న సంగతి ఈ తరం వారిలో చాలామందికి తెలియదు. గ్రామఫోను రికార్డుగానైనా వారి కంఠ మాధుర్యాన్ని దాచుకోలేకపోవడం నిజంగా మన దురదృష్టం" అంటూ "ఇక మీద 'కృష్ణశాస్త్రిగారూ' అని పిలవవలసిన పనిలేదు. 'కృష్ణశాస్త్రి' అనే పేరు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది" అని అంటూ వుండగా ఇద్దరు జర్నలిస్టులు వచ్చి కృష్ణశాస్త్రిగారి గురించి అడిగారు.
"వారి గురించే చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నాం. శ్రీశ్రీగారు కాగితం, పెన్ను చేతిలో వుంచుకుని చాలా సేపయింది" అన్నాను.
అయిదు నిముషాలైనా సమయం తీసుకోలేదు. నాలుగే నాలుగు పాదాలు రాసి నా చేతికి ఇచ్చి "చదువు సరోజా" అన్నారు.
"నా మనసు మనసులో లేదు. చదవలేనండి" అన్నాను. "మరేం ఫర్వాలేదు. చదువు" అన్నారు. అందులో_
'అబద్ధం బద్దలైంది
రోదసీ రోదించింది
షెల్లీ మళ్ళీ మరణించాడు
వసంతం వాడిపోయింది'
అని రాసి వుంది. మరోసారి ఆ లైన్లను చదువుకుని, జర్నలిస్టులకు ఇచ్చేశారు. అంతే. తర్వాత చాలామంది వచ్చేశారు. కృష్ణశాస్త్రిగారి గురించి అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
"టైము అవుతోంది. శ్రీశ్రీగారు స్నానం చెయ్యాలి. భోజనం చేసి రెస్టు తీసుకుంటారు. వెళ్ళిరండయ్యా" అని ఆ ఇంటి యజమానిగారు అందర్నీ పంపించేశారు.
రేపటి చరిత్రకు ఈ రోజే స్వాగతం
సాయంకాలం నిరీశ్వరాశ్రమం వార్షికోత్సవానికి వెళ్ళాం. చిన్న ఊరు అయినా ఎక్కడ్నుండి వచ్చారో ఆ జనం తెలియదు. సభలో కృష్ణశాస్త్రి గారి మరణవార్త చెప్పి, వారి ఆత్మశాంతికి అందరం శ్రద్ధాంజలి చేశాం. తరువాత_అందరి ఉపన్యాసాలు అయ్యాక శ్రీశ్రీగారు తన ఉపన్యాసం ప్రారంభించారు.
"నేడు ఈ నిర్వీశ్వరాశ్రమం వార్షికోత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకంగా వుంది. కులమత భేదాలు, దేవుడి భక్తి, జ్యోతిషం వంటివిషయాల్లో నమ్మకం వుండేవాళ్ళకి ఈ నిరీశ్వరాశ్రమ వార్షికోత్సవంలాంటి వేడుకలూ, మా నాస్తికత్వం కష్టంగా వుంటుందని నాకు తెలుసు.
'మీకు మతం, దేవుడూ, జ్యోతిషం వంటి విషయాల్లో నమ్మకం వుందా' అని నన్నెవ్వరయినా ప్రశ్నిస్తే జవాబు కోసం ఇంకా వెదుక్కుంటున్నాననే చెప్తాను. విశ్వాసం ఆ విశ్వాసంవైపే మొగ్గు చూపుతుంది.
నేటి పరిస్థితుల దృష్ట్యా క్రమశిక్షణ, లక్ష్యశుద్ధి అవసరం. మనం ఏం చెప్పినా ప్రజలకు సంబంధించి వుండాలి. ప్రజల సమస్యలమీద రాయాలి. కొత్త పంథాలో చెబితే ప్రజల మనసులో ఇంకడానికి అవకాశం వుంది.
నేను తెలుగుదేశానికి కొంచెం దూరంగా వుండిపోయాను. నేను రాయదలచుకున్నది. రాస్తున్నాను. వీలైనంత త్వరలో నేను పుట్టిన స్వస్థలం విశాఖపట్నానికి వచ్చి సెటిల్ డవున్ అయిపోవాలనుకుంటున్నాను.
విశాఖలో సముద్రపు ఒడ్డున చిన్న కుటీరం ఏర్పరచుకొని, దానికి 'నిర్వీశ్వరాశ్రమం' అని నామకరణం చేయాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. అందులో వుంటూ ఏవో కొన్ని సాహిత్యపరమైన రచనలు చేయాలని నా మనసులో వుంది.
దానికి నేను కొన్ని పరిస్థితులు క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడా స్థితిలో లేను. వాటి అన్నిటికీ ఒక స్థిమితం ఏర్పడాలి. తర్వాత, రచనతోనే మిగిలిన జీవితం గడపాలని వుంది.
నేను లోగడ ఒకసారి చెప్పాను_కవిత్వం డెవలప్ అవుతూ మారుతూ వస్తోంది. నా ప్రత్యక్ష పోరాటం విల్లంబులు ధరించి కాదు. నా ఆయుధం కలమే. పాలకవర్గ భాష నుంచి, పాటకవర్గ బాటవైపు ప్రయాణించాలి. సాంకేతిక, విజ్ఞానశాస్త్ర రంగాలలో జరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా అదే వేగంతో కవిత పెరగడం ఎంతైనా అవసరం. ఇరవయ్యవ శతాబ్దంలో పద్దెనిమిదవ శతాబ్దపు ఆలోచనా ధోరణి, ప్రవృత్తి కొనసాగించడం ప్రమాదకరం.
నేను ఇరవయ్యవ శతాబ్దానికి చెందినా నా దృష్టి ఇరవై ఒకటో శతాబ్దం మీదే వుంది.
ప్రజల నమ్మకాలే జానపదగాథలౌతాయి.
"ఆవు పాలు ఇచ్చును" అంటే 'అమ్మయ్యో ఎంత ఘాటయిన సత్యం' అని గుండె బాదుకునే వాళ్ళున్నారని నాకు తెలుసు. వాళ్ళకోసం ఘాటుపాలు తగ్గించకండి. ఎంతటి ఘాటునైనా తట్టుకొనే వాళ్ళు చాలామంది వున్నారని నమ్మండి. వాళ్ళలో నేనూ ఒకణ్ణని నన్ను కూడా జమకట్టుకోండి.
