Previous Page Next Page 
కావేరి పేజి 37

    కావేరి ఆలోచించటంచూసి తనలో తానే నవ్వుకున్నాడు మాధవరావు! యిలాంటివాళ్ళని తన సర్వీస్ లో ఎంతమందిని చూశాడు? ఒక్కొక్కరి దగ్గిర అవసరాన్ని బట్టి ఒక్కో అవతారం దాల్చుతున్నాడు. యిది ఎన్నో అవతారం? అని లెక్కచూసుకుంటే కూడికవేయటం అతనికి సాధ్యంకాలేదు.

    ఎందుకంటే వాళ్ళందరూ వ్యభిచారులుగానూ, కొంతమంది సినిమా నిర్మాతలకి వుంపుడుకత్తెలుగానూ, మరికొందరు తిరిగి ఇళ్ళకి వెళ్ళలేక, తెచ్చుకున్న డబ్బూ, బంగారం అయిపోవటంతో ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకునేటందుకు అన్నట్టుగా సముద్రంలోపడో? రైలుకింద తలపెట్టో చచ్చిపోయినవాళ్ళు!

    ఇలా ఎంతమంది అని గుర్తుతెచ్చుకోగలడు తను? కావేరీ చాలా అందమయినది. పైగా మంచి వయస్సులో వున్నది. మగవాడి స్పర్శ అనేది ఎరుగనిదానిలాగానే వుంది. అసలు పల్లెటూరిపిల్లలు అంతే! అనుకోకుండా ఏ మగవాడయినా ఎదురుపడితే తలుపుచాటుకి పారిపోయే బాపతు! సహజంగా అలాంటి వాతావరణంలో తమ పిల్లలను పరాయివానికంట పడకుండా పెంచుతారు....అలాంటి బంధాలు నుంచి కావేరి ఎలా తప్పించుకుని రాగలిగిందో అతని ఊహకే అందలేదు!

    ఇలాంటి దొర జామపండుని తేలికగా వదిలేటంత మూర్ఖుడు కాదు మాధవరావు. అతను బ్రతికేది. బ్రతుకుతున్నది ఇలాంటి అమ్మాయిల ప్రాపకంతోనే! ఎవరు ఎలాంటివారో వారి చూపులనుబట్టి. మాటలను బట్టి ఇట్టే తెలుసుకోగలడు!

    కావేరి నెమ్మదిగా మాధవరావు కూర్చున్న కుర్చీదగ్గిరకు వచ్చి నిలబడింది.

    మౌనంగా అతడినే చూస్తూ నిలబడిపోయింది. చేతిలోవున్న వెల్వెట్ బాక్సుని అతనిముందుకి చేతితోసహా జాపపోయింది. అంతలోనే కావేరి చేతులు వణికాయి. చెమట్లుపట్టాయి.

    "తనేమీ తొందర పడటంలేదుకదా?"

    అని తననుతాను ప్రశ్నించుకున్నది....ఈ సమయమ్లో తనను ఆదుకునేవాళ్ళు ఈ మాధవరావుతప్ప ఇంకెవరున్నారు? కాని కొన్ని అనుమానాలు బయలుదేరాయి. వాటిని అతడినే అడిగి తన అనుమానాలను నివృత్తి చేసుకుంటే?

    "నా మాటమీద నీకు నమ్మకం కలగటంలేదా కావేరీ?" అనడిగాడు ఎంతో మృదువుగా.

    "నేను సినిమాల్లో హీరోయిన్ కావాలని వచ్చాను. నా కోరిక తీరుతుందంటారా?...మీరు తీర్చగలరా? ..." భయం భయంగానే అడిగింది.

    "తీర్చుతాను! తప్పకుండాను! స్టేషన్ లో నిను చూడగానే అచ్చు జయప్రదలా వున్నావనిపించింది. జయప్రద రాజమండ్రినుంచి వస్తే నువ్వు విజయవాడ దగ్గిరలోనున్న ఓ పల్లెటూరినుంచి వచ్చావు. జయప్రద ఎంత వేగంగా సినిమారంగంలో గొప్ప హీరోయిన్ గా స్థిర పడిపోయిందో? నువ్వూ అంతే వేగంగా సినీరంగంలోకి ఒక ధ్రువతారగా వెలుగొందగలవు. అందుకు ఈ సినీరంగంలో నాకున్న పేరుప్రతిష్టలన్నీ నీకోసం ఉపయోగించుతాను. శాంతిశ్రీ ఇప్పుడెంత గొప్ప సినీస్టార్ అయిందో? నావలనేగా ఆమె అంత గొప్ప హీరోయిన్ గా తెలుగు, హిందీ, కన్నడ, మళయాళ భాషలలో స్థిరపడగలిగింది? అంతకంటే గొప్పగా నిన్ను తీర్చిదిద్దుతాను! ఈ తాళి అనేది నీ రక్షణ కోసమే! రేపే నిన్ను ఓ ప్రముఖ నిర్మాతదగ్గిరకు తీసుకెళ్ళి పరిచయం చేస్తాను. మనకంటూ ఓ చిన్నయిల్లు తీసుకుందాం. అలా యిల్లు అంటూవుంటే ఏ నిర్మాత అయినా నీతో మాట్లాడటానికి స్వేచ్చగా రాగలరు! భగవంతునిమీద ప్రమాణంచేసి చెపుతున్నాను..." అంటూ కావేరి చేతిలో తన చెయ్యినివుంచి, అదీ చాలదన్నట్టుగా రెండు చేతులనూ ఎత్తి తన తల మీద వుంచుకున్నాడు కావేరికి నమ్మకం కలగాలని!

    ఎంత అపనమ్మకం వున్నవారికయినా భగవంతుడు అతనిసాక్షిగా ప్రమాణం! అనే సెంటిమెంటు ఎదుటి మనిషిలోని అపనమ్మకం అనే జాడ్యాన్ని యిట్టే ఎగురవేసేస్తుంది. ఎంత మూర్ఖులయిన ఇట్టే నమ్మేస్తారు. ఇప్పుడు కావేరికూడా ఆ నమ్మకం ఏర్పర్చుకుని పెట్టెను మాధవరావు చేతికిచ్చి అంది-

    "మీ చేతులతోనే ఈ తాళిని నా మెడలో కట్టండి!"

    ఇంత తొందరగా దారిలోకి వస్తుందని అనుకొని మాధవరావు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. తనసంతోషాన్ని ఏమాత్రం వ్యక్తంచేయకుండాను, ఎంతో బెట్టుగా అన్నాడు-

    "నా చేతనే తాళి కట్టించుకోవాలన్న నీ అభిమతం నాకు నచ్చలేదు కావేరి? నీకు నువ్వే మెడలో వేసేసుకుంటే సరిపోతుందిగా?"

    "నా భార్య అని చెప్పుకోవలసి వస్తుందని భయంగావుందా?"

    "అదికాదు కావేరీ? తాళి నీ మెడలో కట్టాననుకో! అధికారం భర్తగా చెలాయించబుద్ది కలుగుతుంది. బాధ్యతకూడా ఆ అధికారంతోనే సంక్రమించుతుంది. అలాంటప్పుడు నీ మనసు నొచ్చుకుంటే  మదిద్దరిమధ్యా కలతలు రేగుతాయి! అలాంటి అవకాశాలు ఎక్కువగా వుంటాయి!"

    ఎన్నో నవలలు, వార, మాస సినీపత్రికలు చదివివున్న కావేరీకి మాధవరావు వాడిన పెద్ద పెద్ద మాటలు యిట్టే అర్ధం అయ్యాయి. ఓ సినిమాలో ప్రియుడు ప్రియురాలు సంభాషించుకునే తీరుగా వున్నాయి! ఎంతో ఆనందంకూడా కలిగింది.

    ఆలస్యం చేయకూడదు అన్నట్లుగా తాళితీసి గబగబా కావేరీ మెడలోవేసి శాస్త్రప్రకారం అన్నట్లుగా మూడు ముళ్ళూవేసి కావేరిని దగ్గిరకు తీసుకోబోయి దూరంగా జరిగాడు.

    ఆ రాత్రి తను రూంకి వెళ్ళిపోతానంటే కావేరి అందుకు వప్పుకోలేదు.

    "తనకి భయం...వంటరిగా వుండలేను!" అంది.

    "ఒక్క మంచం! ఇద్దరం ఎలా?" కావాలనే అడిగాడు.

    "ఇలా..." అంది మెడలోని తాళిని తీసి చూపించుతూ!

    మాధవరావు హాయిగా, తియ్యగా నవ్వుతూ కావేరిని దగ్గిరకుతీసుకుని బుగ్గమీద చిటికెవేస్తూ అన్నాడు.

    "నువ్వు చాలా తెలివయినదానివి! ఇతరుల మనస్సులో చొరబడకుండానే వారి మనసుని అర్ధంచేసుకోగలశక్తి నీకేవుంది. యింతటి సూక్ష్మదృష్టి వుండటం కాబోయే హీరోయిన్ కి ఎంతో అవసరం!"

    "అలాగా?" అంటూ నవ్వింది కావేరి ఇంకా అతడిని గట్టిగాహత్తుకుంటూ!

    ఆమెకీ అవసరమే మాధవరావుతో! అతను బయటికి వెళితే తిరిగి తన దగ్గిరకు రావటానికి మరురోజు ఏవేళ అవుతుందో? తన చాకచక్యం, అందచందాలతో తనదగ్గిరే కట్టిపడవేసుకోగలిగితేనే తనపని సులువు అవుతుంది! అని గడుసుగానే ఆలోచించుకుని ఈ నిర్ణయానికి వచ్చింది. అతడిని తన జీవితంలోకి మనస్పూర్తిగానే ఆహ్వానించింది. ఇప్పుడు ఈ అవసరం తీరితే తను హీరోయిన్ గా నిలదోక్కుకుంటే ఈ మాధవరావుని విదిలించుకోవటం ఏమంత కష్టంకాదనికూడా అనుకుంది!
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS