Previous Page Next Page 
ప్రతీకారం పేజి 37


    "నా బాధ నాకు శిక్ష పడుతుందని కాదు. లోకం నన్ను అపరాధిగానే తలుస్తుందనీ, స్త్రీ హత్యా నేరాన్ని నెత్తికెత్తుకొని కళ్ళు మూయాల్సి వస్తుందనీను. నాన్న గురించీ, నీ గురించీ ఆలోచించినకొద్దీ మరీ బాధగా వుంది ఇందిర."
    "ఒక పాట పాడనా రవీ!" అన్నది ఇందిర. రవిని ఆ మూడ్ నుంచి బయటపడేసే ఉద్దేశంతో.
    రవి ఆమె ముఖంలోకి చూస్తూ విరిగిన పాలలాంటి నవ్వు నవ్వాడు.
    ఇందిర పాట ప్రారంభించింది. రవి ముగ్ధుడై వింటూ కూర్చున్నాడు. పాట ముగిసింది.
    "నువ్వింత బాగా పాడగలవని నాకు తెలియదు ఇందూ?" అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
    ఇందిర వెక్కి వెక్కి ఏడవసాగింది.
    "ఏమిటి ఇందూ? ఏడుస్తున్నావా? ఇలాంటి పరిస్థితిలో నాకు ధైర్యం చెప్పాల్సినదానివి నువ్వే అధైర్యపడితే నేనేం కావాలి చెప్పు" అన్నాడు.
    ఇందిర ఏడుపు కట్టలు తెంచుకుంది. ఆమెను దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు.
    "నా మాటవిని నా గురించి ఆశలు వదులుకో! నన్ను ఈ మూడురోజులూ ఒంటరిగా వదిలెయ్" అన్నాడు రవి.
    శరీరంలో నుంచి ఎవరో బలవంతంగా జీవశక్తిని గుంజి వేస్తున్నట్టు ఇందిర విలవిలలాడింది.
    "ఇందిరా? ఏమిటి అలా అయిపోతున్నావు? ఇటు చూడు! నా ముఖంలోకి చూడు! ఈ మూడు రోజులైనా నన్ను సంతృప్తిగా బ్రతకనివ్వు! నువ్వు సంతోషంగా ఉండాలి. లే! వెళదాం! చూడు ఎవరో ఇటే వస్తున్నారు. పార్కులో కూర్చుని ఇలా ఏడవడం బాగుండదు."
    "ఈ మూడు రోజులైనా నీతో వుండనివ్వు రవీ!" దీనంగా వెక్కిళ్ళ మధ్య అన్నది ఇందిర.
    రవి నవ్వాడు...అదే విరిగిన పాలలాంటి నవ్వు...పెదవుల మీద కనిపించి ఇట్టే లీనం అయిపోయింది.
    "సినిమాకు తీసుకెళ్ళవా రవీ!" అడిగింది ఇందిర.
    "పద వెళదాం" అంటూ లేచి నిలబడ్డాడు.
    సినిమా చూస్తున్నంతసేపూ ఇందిర చెంపలమీదుగా కన్నీరు కారిపోతూనే వుంది. రవి సినిమా చూడటం మానేసి ఇందిరనే చూస్తూ కూర్చున్నాడు.
    సినిమా నుంచి బైటకు వస్తూ రవి ఓ జంటను చూశాడు. పోల్చుకున్నాడు. గబగబా జనాన్ని తోసుకుంటూ ముందుకు నడవసాగాడు.
    "ఇందూ! చూడు వాళ్ళే మనకు కావలసిన సాక్షులు" అన్నాడు ఆ యువ జంటను ఇందిరకు చూపిస్తూ.
    ఇందిర ఆరాటంగా "ఏరి? ఎక్కడ? ఎవరు?" అంటూ ఉండగానే జనం తోసుకొచ్చారు. ఆ యువజంట మళ్ళీ కనిపించలేదు.
    ఇద్దరు జనాన్ని తప్పించుకొని రోడ్డుమీదకు వచ్చేప్పటికి దూరంగా టాక్సీ ఎక్కుతూ ఆ యువజంట కనిపించింది. టాక్సీ నెంబరు నోట్ చేసుకున్నాడు రవి.
    రవి గబగబా కారు దగ్గరకు నడిచి కారు స్టార్టు చేశాడు. ఈలోగానే మరో టాక్సీ ఆ టాక్సీ వెనకే బయలుదేరింది. ఎంత ప్రయత్నించినా ఆ టాక్సీని తప్పించుకొని ముందు టాక్సీని అందుకోలేకపోయాడు రవి.
    చౌరస్తాలో ఆ రెండు టాక్సీలు దాటిపోయాయి. రెడ్ లైట్ చూపడం వలన రవి కారు ఆగిపోయింది. ఆ రెండు టాక్సీలు ముందుకెళ్ళిపోయాయి. బేగంపేట దగ్గరకు వచ్చేటప్పటికి గేటువేసి వుంది. ఆ టాక్సీలు దాటిపోయాయి.
    ఇందిర సీట్లో కూర్చోలేకుండా ఉంది. గేటు తెరిచాడు. ఎదుటినుంచి టాక్సీ వస్తూంది. అదే నెంబరు! రవి కారు దిగి టాక్సీని ఆపించాడు. టాక్సీ ఆగింది. ఆ టాక్సీలో వెళ్ళినవారు ఎక్కడ దిగారని అడిగాడు. డ్రైవర్ వాళ్ళు ఎయిర్ పోర్టులో దిగారని చెప్పాడు.
    రవి కారు స్పీడ్ గా ఎయిర్ పోర్టుకు చేరుకుంది. దిగి ఆత్రంగా లోపలకు పరుగుతీశాడు. అప్పటికే విమానం వెళ్ళిపోయి పది నిమిషాలయ్యిందని తెలిసి రవీ ఇందిర కుప్పకూలిపోయారు. ఎవరికీ మాట్లాడే శక్తిగానీ ఆలోచించే శక్తిగానీ లేకపోయింది. అలా ఎంతసేపు అలా కూర్చున్నారో తెలియదు.
    కొంతసేపటికి ఇందిరే ముందు సంభాళించుకుంది. ఆమె బుర్ర చురుగ్గా కర్తవ్యాన్ని గురించి ఆలోచించసాగింది.
    "రవీ! విమానంలోకి ఎనౌన్స్ మెంటు ఇప్పిద్దాం! వాళ్ళిద్దర్నీ తిరుగు విమానంలో వచ్చెయ్య వలసిందిగా రిక్వెస్టు చేద్దాం" అన్నది.
    రవి మాట్లాడలేదు. ఇందిర ఎయిర్ పోర్టు అధికారులతో మాట్లాడుతూ వుండగానే మైక్ లో ఎనౌన్స్ మెంటు విన్పించింది.
    "విషాద వార్త! ఇరవై నిమిషాల ముందు బయలుదేరిన విమానం కూలిపోయింది. ప్రయాణీకులు ఎవరూ బ్రతికే అవకాశం లేదు"
    ఇందిరా, రవి పిచ్చివాళ్ళలా ఒకరి ముఖాలలోకి ఒకరు చూసుకుంటూ నిలబడ్డారు.
    "పద! వెళదాం" అంటూ రవి ఇందిర చెయ్యి పట్టుకున్నాడు.
    కార్లో కూర్చున్నారు. రవి యాంత్రికంగా కారు నడుపుతున్నాడు. ఇందిర నిండుకుండలా, ఏ క్షణం అయినా బద్ధలయ్యేలా కూర్చున్నది.
    కారు ఇంటిముందు ఆగింది. రవి దిగి డోర్ తెరిచాడు.
    "రవీ! ఒక్కసారి దిగు! మా అమ్మను చూళ్ళేదు గదూ?" అన్నది బరువుగా.
    రవి మౌనంగా ఆమెను అనుసరించాడు.
    రాధాదేవి ఇందిరకోసం ఎదురుచూస్తూ వాకిట్లోనే నిలబడి ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS