మామూలుగానే నా కాళ్ళు అడవికేసి నడిచాయి. పెద్దియజ్వ నన్ను ఆదరించి గుహలో పద్మాసనం వేయించారు. పాంటు తొడుక్కుని పద్మాసనం వేయాలంటే ఇరుగ్గానే వుంది__వేశాను. కళ్ళు మూసి ఆ జ్ఞాన చక్రంలోకి సూర్యుణ్ని ఆహ్వానించాను. వెలుగు లోకం నా కళ్ళముందు వాకిలి తెరిచింది. ఆ అతిలోక సుందర దృశ్యాలను చూడటంలో మునిగిపోయాను.
9
శ్రీనాధయ్య ముత్యాల పల్లకిలో పలనాటి సీమలో ప్రయాణం చేస్తున్నారు. దారి కిరువైపులా చిన్ని చిన్ని గుండ్రాళ్ళు దూరంగా నాపరాతి గుట్టలు నాగులేరు బారున చిన్ని చిన్ని కుగ్రామాలున్నాయి. అవి చాలా అపరిశుభ్రముగా, అనాగరికంగా వున్నాయి. వెలుగోటి రాయప నాయకుడు పరిపాలించే దేశమిదేనా? అని ఆశ్చర్యపోతున్నారాయన. ఓ ప్రక్క సోమదేవుడు, మరొకప్రక్క దుగ్గన్నా వస్తున్నారు. సాయం సంధ్యాసమయంలో సవారి ఆగింది. అక్కడకు దగ్గరలోనే ఓ చెరువుగుట్టు మీద జనం గుంపులు కూడి ఏదో చిత్రం చూస్తున్నారు. మధ్య మధ్య పెద్దగా చెరువులూ, కేకలూ వినిపిస్తున్నాయి.
దుగ్గన్న ఆ ప్రాంతాలకు వెళ్ళి చూచి వచ్చాడు. అక్కడ జరుగుతున్నది కోడిపందెం. మాచర్ల ప్రభువు వెలుగోటి రాయప నాయకుడు పేరుమీద నెమలిపుంజు (ఒకజాతి కోడి) ని వదిలారు. దేవరకొండను పాలించే పద్మ నాయకి ప్రభువయిన పినవేదగిరి పేరుమీదుగా మరొక దానిని వదిలారు. జరుగుతున్నది జింకిణీ పందెం__ఆ పందెంలో కత్తులుండవు. నాలుగు సంవత్సరాలు దాటిన ముదురు రాజులకు కాటా బాగా పెరిగి, ముదిరి, గిడసబారి వుంటుంది. ఆ కాటాతో దెబ్బ వేసిందంటే మనిషికయినా చిల్లి పడాల్సిందే!
నెమలి పుంజులు త్వరగా జారిపోతాయి. ఎందుకంటే అవి రాగులు మనస్ఫూర్తిగా తినలేవు. ఇతర ధాన్యాలలో రాగులకున్నంత శక్తి లేదు.
పిన వేదగిరి బేసర డేగ రాగులు మస్తుగా తిని తెగ బలిసి వుంది. కేవలం అహంకారం ఆధారంగానే రాయపనాయకుడి తరపువారు నెమలిని దానిమీదకు వదిలారు. శ్రీనాధయ్యకు ఆసక్తి కలిగింది.
ఎవరో చదువుకున్న బాపనయ్య కోడిపందాలు చూడడానికి వచ్చాడనగానే గుంపు దారి వదిలింది. ఆయన అక్కడకు చేరే సమయానికి నెమలి విజృంభించి పోరాడుతున్నది. అది కొట్టే కాటా దెబ్బలు బెరసడేగకు ఈగ వాలినట్టు కూడా లేదు. నెమలి అలిసిపోయింది. కొట్టి కొట్టి అది తనశక్తినంతా వృధా చేసుకుంది. కాని బెరసడేగ కించిత్తు చలించలేదు. నెమలి మరికాసేపటికి తూలిపోయింది.
ఇప్పుడిహ డేగ రెక్కలు ఆపళించి మెడమీది ఈకలు కత్తుల్లా నిక్కపొడిచి కాళ్ళు కొంచెం ముందుకు వంచి రివ్వున గగనమార్గాన లేచింది. లేచి కత్తిలా ఉన్న కాటాతో నెమలి తలమీద పెఠీల్లున వొక తోపు తాకింది. ఫట్ మని శబ్దంతో నెమలి తల రెండుగా చీలింది. ఇది చూచిన శ్రీనాథయ్య తక్షణమే వెనుదిరిగి రాత్రి కూడా ప్రయాణం చెయ్యాలని పట్టుబట్టారు. ఇదేమిటో అర్థంకాని దగ్గుపల్లి దుగ్గయ్యా, సోమదేవుడూ మౌనంగా ఆయనను అనుసరించి మరునాటికి కొండవీడు చేరారు. దుగ్గయ్య అందించిన గొడ్డలి తీసుకుని మూలగూరమ్మకు ప్రణమిల్లి లేచింది వేమ. ఆమె ప్రసాదం తీసుకుని వెలుపలికి వచ్చే వేళకు సోమదేవుడు వీరకల్లుల వద్ద తచ్చాడుతూ కనిపించాడు. ఆమె అతనిని సమీపించింది.
"సోమదేవా! మూలగూరమ్మ నా మొర విన్నది. నీవు మరెప్పుడూ యుద్ధాల జోలికి పోనని వాగ్దానం చెయ్యాలి సుమా!" "అది నీకు ఆనందదాయకమా?" ప్రశ్నించాడు సోమదేవుడు. వేమ తల పొంచుకుంది. సమాధానం లేదు.
"వేమా! అటు చూడు, ఆ వీరకల్లులు. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేసి పునీతులయ్యారు. వారి చరిత్ర శాశ్వతమైనది. కేవలం సంసార బంధంలో చిక్కుకున్న వారికి చరిత్రలో చోటు దొరకదు. మహానీయత సాధించాలంటే ఏదో కొంత త్యాగం చెయ్యాలి" అన్నాడు సోమదేవుడు.
అయితే ఏదో క్రొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నావన్నమాట. ఈసారి ప్రయాణం!" వేమాంబ ప్రశ్న.
"సవులూరు యుద్ధంలో మా పినమామగారైన మాచారెడ్డి మరణించారటకదా! పినవేదగిరి ఆయన తలను నరికి తమ్మ పడిగలో బొమ్మ వేయించుకున్నాడట! ఈ వార్త విని రాజుఖన్నులై వున్నారు. కనుక నేను వారిని కలువలేదు" "అయితే నీవిప్పుడెటు పోతున్నావు" గుండె దడ దడ లాడగా ప్రశ్నించింది వేమాంబ. ఆమె కుడికన్ను అదిరింది.
"వేమా! నీ కోరిక మన్నించలేదని నన్ను శపించకు. నేను పిన వేదగిరి మీదకు పోతున్నాను. సవులూరు వద్ద యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఆ మూలగూరమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీ పిన తండ్రిని చంపిన ఆ వెలమ దొర పిన వేదగిరి తలకొట్టి మామగారి తమ్మపడిగలో బొమ్మ వేయించనిదే నేను స్నానం చెయ్యను. ఇది నా శపథం" అంటూ గుర్రాన్ని అధిరోహించాడు. వేమాంబ దేవళంలోకి వెళ్ళి హారతి తెచ్చింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదిమిపెట్టి అతని నుదుట వీర తిలకం దిద్దింది.
