Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 37


    "మరి భోజనం...." లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమైన అనూషను చేయి పుచ్చుకుని ఆపుతూ అంది.
    "చెప్పానుగా_ఆకలిగా లేదని. నువ్వేమీ అనుకోకు. ఈసారి వచ్చినప్పుడు అవీ ఇవీ అన్నీ కలిపి అప్పుడే లాగించేస్తాను, సరేనా!"
    "మొదటి నుంచి మొండి పట్టుదల గల దానివి. ఇక నిన్నాపగల శక్తి ఎవరికీ ఉండదే. కనీసం అప్పుడప్పుడు వస్తుండవే!" అంది అరుణ భారమైన హృదయంతో.
    అనూష జూనియర్ వీరేష్ మెడలో బంగారు లాకెట్టు వేసింది.
    "ఇప్పుడు ఇవన్నీ ఎందుకే?"
    "నీ పెళ్ళికి ఎటూ రాలేదు. కనీసం వీడినన్నా ఇలా ఆశీర్వదించనీయవే!" అంటూ అరుణ చేతిని తన చేతిలోకి తీసుకుంది.
    "ఆయనగారి వల్ల నీకేమన్నా కష్టం కలిగేట్టయితే వెంటనే వచ్చేయి, అటో ఇటో తేల్చేద్దాం" అంది అరుణ నవ్వుతూ.
    "అంతవరకు రానిస్తానా?" ఆత్మవిశ్వాసంతో అంటూ వెనుదిరిగింది అనూష.


                                                *    *    *    *


    కానిస్టేబుల్ వచ్చి ఇన్ స్పెక్టరు రమ్మన్నారని కబురు చెప్పగానే సాహితి తిన్నగా బయలుదేరి పోలీసు స్టేషన్ కు వచ్చింది.
    ఇన్ స్పెక్టరు వీరేష్ కూర్చోమన్నట్టు కుర్చీ చూపాడు.
    "అంకుల్! నన్ను పిలిపించడంలో ఏదైనా విశేషం ఉందా? అవతల నాకు కాలేజీకి టైమ్ అవుతున్నది. నన్ను ఎంత తొందరగా పంపితే అంత మంచిది."
    అలాగేనన్నట్టు తల వూపాడు. "సమ్రాట్ కూ, నీకూ ఎన్నాళ్ళ నుంచి పరిచయమమ్మా?" కాగితం తీశాడు రాయడానికి వీరేష్.
    తను ఊహించని ప్రశ్న అది. ఇన్ స్పెక్టరు తనను విచారించడానికి పిలిపించాడనుకోలేదు. తను చిక్కుల్లో పడింది! అతనిప్పుడు తన సాక్ష్యాన్ని రికార్డు చేస్తాడు. ఏం చెప్పాలి? ఆలోచనలో పడింది సాహితి.
    ఆమె మౌనంగా ఉండడం గమనించి మళ్ళీ అడిగాడు.
    ఈసారి అతని గొంతులోని మార్పును గమనించింది. పోలీసు ఆఫీసరుని అడుగుతున్నాను, నిజం కావాలన్నట్టు ఉందతని గొంతు.
    అసలు, తను ఒంటరిగా పోలీసు స్టేషన్ కు ఎందుకు వచ్చినట్టు?
    ప్రస్తుతం తనను దోషిలా నిలదీసి ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది.
    ఇన్ స్పెక్టరు వీరేష్ ఏదో కక్షతో సమ్రాట్ మీద సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్టు కనిపిస్తున్నది. తను సాక్ష్యం చెబితే రేపు అది సమ్రాట్ మెడకి ఉరితాడులా బిగుసుకోవచ్చు.
    అతనికి ఏ హాని జరిగినా తను సహించలేదు. అతని కోసం, అతని ప్రేమ కోసం తను ఎన్ని కష్టాలనయినా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నది!
    "నిన్నే! వినబడలేదా? ఎన్నిసార్లు అడగాలి?"
    అతని ఆవేశానికి నిలువెల్లా వణికిపోయింది సాహితి.
    "సుమారు సంవత్సరం నుంచి పరిచయం అంకుల్" అంది ఖంగారుగా.
    "అతని ప్రవర్తన గురించి, అతని గదికి తరచు వచ్చే అమ్మాయిల గురించి చెప్పు!" ప్రశ్న వెంట ప్రశ్న వేశాడు.
    ఈ ప్రశ్నలు సరిగ్గా సమ్రాట్ ను కోర్టు బోనులో నిలబెట్టడానికి సరిపోతాయి. ఇక తను సమ్రాట్ ను రక్షించుకోవడం ఎలా? సమాధానం చెప్పకుండా యెలా తప్పించుకోవాలి?
    "ఏమిటి? అడిగిన ప్రశ్న అర్థం కాలేదా? లేక సమాధానం చెప్పకూడదనుకున్నావా?" అసహనంగా అన్నాడు.
    "నాకేం తెలుసు? అయినా, అతని గదికి వెళ్ళి అవన్నీ గమనించవలసిన అవసరం నాకెందుకు ఉంటుంది?" లేని ధైర్యం తెచ్చుకుని ఎదురు ప్రశ్న వేసింది.
    "ఐసీ! అతని గదికి నువ్వెప్పుడూ వెళ్ళలేదా? అతని చుట్టూ తిరిగే అమ్మాయిల గురించి నీకు తెలియదా!" అతని మాటలు వ్యంగ్య ధోరణిలో ఉన్నాయి.
    "లేదు, నాకు తెలియదు!" అంది తడబడుతూ.
    "అబద్దమాడకు!" ఆవేశంగా అరిచాడు. కోపంతో అతని కళ్ళు చింతనిప్పులయ్యాయి.
    "అంకుల్! నన్ను అవమానపరచడానికే పిలిచారా? లేక నా సాక్ష్యం రాసుకోవడానికి పిలిచారా?" అసహనంగా కుర్చీలోంచి లేచింది సాహితి.
    గది బయట కాపలాగా ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు.
    సాహితికి పరిస్థితి అర్థమయ్యింది. ఇన్ స్పెక్టర్ దౌర్జన్యం చేసి అయినా, తన చేత సమ్రాట్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు గ్రహించింది. ఈ నేపథ్యంలో ఘర్షణ పడడం వలన నష్టపోయేది తనే. ముందు ఇక్కడి నుండి బయటపడే మార్గాన్ని ఆలోచించాలి అనుకుంటూ మారుమాట్టాడకుండా కుర్చీలో కూర్చుంది.
    "సమ్రాట్ కు నాలా అనేకమంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లూ నాకెలా తెలుస్తాయి అంకుల్?" అంది సౌమ్యంగా.
    "మిస్ సాహితీ! సమ్రాట్ కూ, నీకూ మధ్య అభిమానం తప్పించి ఇంకే సంబంధం లేదా?"
    అతని ప్రశ్నకు సాహితి ముఖం వాడిపోయింది. ఆమె కనుకొలకులలో నీళ్ళు నిండాయి.
    పోలీసు భాష చాలా దారుణంగా ఉంటుందని పత్రికలలో చదివిందే కాని ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంది.
    సాహితి వెక్కివెక్కి ఏడ్వటం గమనించాడు వీరేష్.
    "ఇట్స్ ఆల్ రైట్ సాహితీ! టేకిట్ ఈజీ...." అంటూ టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళ గ్లాసును ఆమె చేతికి అందించాడు.
    నోరు తడారిపోవడంతో నీళ్ళు గడగడ తాగేసింది. చేతి రుమాలుతో పెదవులు, కళ్ళు తుడుచుకుంది.
    "నీ క్లాస్ మేట్స్ గౌతమికీ, కళ్యాణికీ జరిగిన అన్యాయానికి నీ మనసు చలించలేదా సాహితీ? నీ తోటి ఆడపిల్లల జీవితాలతో చెలగాట మాడినవాడి మీద అసహ్యం వేయడం లేదా? చదువుకున్న దానివి. బాగా ఆలోచించు! బలవంతంగా అతనికి నీతో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించడం నా అభిమతం కాదు. నీలో న్యాయా న్యాయాల గురించి ఆలోచించగల విజ్ఞత వుంది. వెళ్ళు, వెళ్ళి ఇప్పటికైనా నిజాయితీగా ఆలోచించు. నీ మనసు మారినప్పుడే నిన్ను విచారిస్తాను. యూ కెన్ గో నౌ!"
    అతని మాటలలో బాధ, ఆవేశం మిళితమై ఉన్నాయి.
    "ఎవరి నమ్మకం వారికి వుంటుంది. ఆయా నామ్మకాలపైనే నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పడతాయి. సమ్రాట్ ను దోషి అని మీరనుకుంటున్నారు. అది మీ నమ్మకం. అతను ముమ్మాటికీ నిర్దోషి అని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. మీరు నన్ను ఎన్నిసార్లు విచారించినా అతను నిర్దోషే నంటాను. ఒకవేళ అతను నిజంగా వాళ్ళ చావులకు కారణమయితే అతను వాళ్ళిద్దరినీ ప్రలోభపెట్టి ఉండాలి. అలా ప్రలోభ పెట్టడానికి వాళ్ళేమైనా చిన్నపిల్లలా, లేక చదువు సంధ్యలు లేని అమాయకులా? తప్పు అనేది ఒకవైపునే ఉండదు. అంకుల్! అతను వాళ్ళకు అన్యాయమే చేసి వుంటే వాళ్ళతన్ని ధైర్యంగా ఎదిరించవలసింది. పిరికివాళ్ళు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారు. అందుకు అతడెందుకు బాధ్యుడవుతాడు?" ఆవేశంగా అంటూ అతని పట్ల తన ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS