Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 37

"అంతేనండీ!"
"వాడి చెవులు చిన్నవా పెద్దవా?"
"సరిగ్గా మీ చెవులంత వుంటాయండీ!" ఇన్ స్పెక్టరు చెవులవైపు వేలుపెట్టి చూపిస్తూ మరీ చెప్పాడు పుండరీకాక్షయ్య.
ఇన్ స్పెక్టరు గతుక్కుమన్నాడు.
"నీ దుంపతెగ. నీ కళ్ళకి నా చెవులే కంటపడ్డాయా! నేరస్తుడి నోరు ఎట్లా వుంటుందని ఈ తఫా అడిగితే, మీ నోరు కన్నా కాస్త పెద్దదో చిన్నదో" అని చెప్పేటట్లు వున్నాడు. ముందే వార్నింగ్ ఇస్తే మంచిది." అనుకున్న ఇన్ స్పెక్టరు "ఎప్పుడూ కూడా మా వేపు వేలు చూపించి చెప్పకూడదు. నీకు తెలిసినట్లు చెప్పు, అంతవరకే" అంటూ కాస్త కరకుగా చెప్పాడు.
"నాకు తెలియదు కదండీ! అందుకనే అలాగ చెప్పాను. ఇంకెప్పుడూ అలాగ చెప్పను లెండి." అమాయకంగా ముఖం పెట్టి అన్నాడు పుండరీకాక్షయ్య.
"నలుగురు నేరస్తులని చూశావ్! అవునా?"
"అవునండీ!"
"వాళ్ళ నలుగురినీ వర్ణించి కూడా చెప్పావు. కానీ వాళ్ళల్లో వున్న వంకలు మెల్లకన్ను, కుంటికాలు అలాంటివేమైనా వుంటే వాటి వివరాలు చెప్పలేదు. బాగా గుర్తుతెచ్చుకుని నీవు చూసిన ఆ నలుగురిలో గుర్తుపట్టటానికి వీలయిన లోపాలు ఏమైనా వుంటే వాటి గురించి వివరంగా చెప్పు." అన్నాడు ఇన్ స్పెక్టరు.
ఇన్ స్పెక్టరు ఆ మాట చెప్పంగానే కొద్దిసేపు తీవ్రాలోచన చేస్తున్నవాడిలా ముఖంపెట్టి "ఎబ్బే! ఎవరికీ ఏ లోపం లేదండీ!" అని తేల్చేసి చెప్పేశాడు.
"బాగా గుర్తు తెచ్చుకో."
"వాళ్ళలో ఏ లోపం లేనిదే, ఎంత బాగా గుర్తుతెచ్చుకున్నా ఏం లాభం అండీ!" అని ఎదురుప్రశ్న వేశాడు పుండరీకాక్షయ్య. కానీ, ఆయన తీవ్రంగా ఆలోచించింది మరొకటి.
"పార్వతమ్మా నీ కొడుకుకి అనుకున్న సమయానికి పిండి వంటలు అందించలేకపోయాను. అడుగడుగునా అడ్డంకులే. అయినా ఏం పరవాలేదు. వీటన్నింటినీ అధికమించి వీలయినంత తొందరగా ప్రయాణం చేసి చంద్రాన్ని చేరి బ్యాగ్ ని అందించటమే కాదు, బ్యాగ్ లో వున్న తీపి పిండివంటలని, నా చేత్తో నోట్లో పెట్టి మరీ తినిపిస్తాను."
పుండరీకాక్షయ్య అనుకున్నది ఈ మాటలు.

                                      16

పుండరీకాక్షయ్యకి పట్టిన శని ఇంకా వదలలేదు.
పోలీసులతో వ్యవహారం అంటే ఆషామాషీ కాదు.
పుండరీకాక్షయ్యని జిడ్డులా పట్టుకున్నాడు ఇన్ స్పెక్టరు. "పాత నేరస్తుల ఫోటోలు చూపించటం అయ్యింది. ఫలితం కానరాలేదు. అడ్డమైన ప్రశ్నలూ ఆ తరువాత వెయ్యటం జరిగింది. ఆ ప్రశ్నలు వేటికీ తిన్నగా సమాధానాలు రాలేదు.
ఇహ, మిగిలిన కార్యక్రమం ఒకటి వుంది.
తమ దగ్గర సెల్ లోవున్న నేరస్తులని పుండరీకాక్షయ్యకి చూపించి, 'వాళ్ళల్లో ఎవడి పోలికలన్నా ఆ నేరస్తులకి దగ్గరగా వున్నాయా' అని అడగటం, దానివల్ల లాభం వున్నా లేకపోయినా డ్యూటీ ప్రకారం చెయ్యక తప్పదు." విధి నిర్వహణ లోనికి దిగాడు ఇన్ స్పెక్టరు.
అక్కడ సెల్ లో రకరకాల నేరస్తులు. ఇరవయ్యారు మంది వున్నారు. ఆ ఇరవయ్యారు మందినీ ఇవతలకి పిలిపించి, వరుసగా నుంచోబెట్టించి పుండరీకాక్షయ్యని అక్కడకి తీసుకువెళ్ళాడు ఇన్ స్పెక్టరు.
పుండరీకాక్షయ్య ఒక్కొక్కళ్ళనీ చూస్తూ వీడికన్నా కాస్త ఎత్తు, వీడికన్నా కాస్త ఎత్తు తక్కువ, లావు, సన్నం అంటూ మార్పులూ చేర్పులూ చేసి మరీ చెప్పాడు.
వాళ్ళల్లో ఒకడిని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు వుంటే "ఇలాంటివాడిని ఎక్కడ చూశానబ్బా!" అనుకుంటూ పుండరీకాక్షయ్య వాడి ముఖంలోకి గ్రుచ్చి గ్రుచ్చి చూస్తూంటే వాడు కళ్ళు ఎర్రచేసి పుండరీకాక్షయ్యని చూశాడు. దాంతో పుండరీకాక్షయ్య పూర్తిగా వెనక్కి తగ్గాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS