Previous Page Next Page 
మంచివాడు పేజి 37

"నా పేరు భాస్కర్. హైదరాబాద్ లో పోలీసు సూపర్నెంటుగా పని చేస్తున్నాను." అంటూ భాస్కర్ అతనికేసి చూశాడు.
ఆమె ఉలిక్కిపడటం భాస్కరు గమనించాడు.
"ఆమె మీ భార్యా?" అడగకూడదని తెలిసీ అడిగాడు భాస్కరు.
ఆనందరావు కనుబొమలు ముడి పడ్డాయి. ఓ క్షణం ఆలోచించాడు. "కాబోయే భార్యా భర్తలం!" అన్నాడు ఆనందరావు అయిష్టంగానే.
భాస్కరు అదోలా నవ్వాడు.
ఆనందరావుకు వళ్ళు మండి పోయింది. సంభాషణ పొడిగించడం ఇష్టంలేక ముఖం తిప్పుకొని, రైలు ముందుకు పోతుంటే, వెన్నెల్లో వెనక్కు పరుగులు తీస్తున్న పంట పొలాలనూ, చెట్లనూ, టెలిగ్రాఫ్ స్తంభాలను చూస్తూ కూర్చున్నాడు.
భాస్కరు "అనిత" కేసి చూశాడు. ఆమె బిగుసుకుపోయి బెర్తుమీద రెండు కళ్ళూ పెట్టుకుని కూర్చుంది వుంది.
భాస్కరు సిగరెట్టు దమ్ములాగి గతంలోకి జారిపోయాడు.
భాస్కరు ఐ.పి.యస్. పాసయి, ట్రైనింగు నుంచి తిరిగి వస్తూ బందరు వెళ్ళాడు. తండ్రి డ్యూటీలో జాయిన్ అయ్యేముందు ఒకసారి అర్జెంటుగా రావలసిందని టెలిగ్రాం ఇచ్చాడు. తీరా వెళ్ళాక పెళ్ళిచూపులకని తెలిసింది. భాస్కరు విసుక్కున్నాడు. అతను చదువుకొనే రోజుల నుంచి అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని కలలు కనేవాడు. కట్నం బాగానే ఇస్తామన్నారు. కాని భాస్కరుకు అమ్మాయి నచ్చలేదు. వెంటనే నచ్చలేదని చెప్పకుండా హైదరాబాద్ వెళ్ళి ఉత్తరం రాస్తానని తండ్రితో అని బయలుదేరాడు.
విజయవాడ స్టేషన్ కు వచ్చేసరికి మద్రాసు హైదరాబాద్ ఎక్స్ ప్రెస్సు మూడు గంటలు లేటని తెలిసింది.
బండి ఏ ఒంటిగంటకో గాని రాదు. ఫస్టుక్లాసు వెయిటింగ్ రూంలోకి వెళ్ళి రెండు కుర్చీలను చేర్చి పడక తయారు చేసే ప్రయత్నంలో వుండగా ఓ యువతీ లోపలకు వచ్చింది.
ఎంతో దూరం నుంచి ఎవరో తరుముతూ వుంటే తప్పించుకొని పరుగెత్తుకొచ్చిన దానిలా కన్పించింది. ఆమె కళ్ళలో బెదురూ... ముఖంలో భయం ...
"ఇది మగవాళ్ళ వెయిటింగ్ రూమ్. పక్కనే ఆడవాళ్ళ వెయిటింగ్ రూమ్ వుంది" అన్నాడు భాస్కరు ఆమె ముఖంలోకి పరిశీలనగా చూస్తూ.
"అందంగా వుంది" అనుకున్నాడు మనసులోనే.
ఆమె ఓ క్షణం అతని ముఖంలోకి చూసి "ఆ సంగతి నాకూ తెలుసు. అక్కడ చాలా కిసాటుగా వుంది. ఇక్కడ నేను కూర్చుంటే మీకు ఇబ్బందా?" అన్నది.
"అవును ఇబ్బందే" అని అనాలనిపించినా సంస్కారం అడ్డొచ్చి "అబ్బే నాకేం ఇబ్బంది? పొరపాటుగా వచ్చారేమోనని అన్నాను" అన్నాడు భాస్కరు.
భాస్కరు పక్కగా వున్న కుర్చీని ఓ మూలకు లాక్కుని ముడుచుకొని కూర్చుంది ఆ యువతీ.
ఆమె కూర్చున్న తీరూ, గాబరా చూసి ఆమె దేనికో భయపడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తూనే వుంది.
పోలీసుశాఖలో ట్రైనింగ్ అయి, ఆఫీసరుగా ఉద్యోగంలో చేరబోతున్న భాస్కరుకి ఆమె భయానికి కారణం తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. కాని ఎలా ఆమెను మాటల్లోకి దించాలో తెలియడం లేదు.
ప్లాట్ ఫారం మీద జనం ఎక్కువగా లేరు. భాస్కరు బయటికి వెళ్ళి ఓ పది నిముషాలు అటూ ఇటూ తిరిగి వచ్చాడు.
ఆమె అదిరిపడ్డట్టు భాస్కరు కేసి చూసింది. ఆమె తత్తరపాటును గమనించీ గమనించనట్టే కూర్చున్నాడు.   
దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచి గోడకేసి చూస్తూ కూర్చుంది ఆమె.
ఆమెనే చూస్తూ ఆలోచిస్తున్నాడు భాస్కరు. చూసినకొద్దీ ఆమెలో కొత్త అందాలు కన్పిస్తున్నాయి. పాలరాతి విగ్రహంలా వుంది అనుకున్నాడు.
"ఏమండీ! ఇక్కడ మంచినీళ్ళు దొరుకుతాయా?" ఆమె భాస్కరును అడిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS