Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 37


    "బావుంది. వాడేమో నీపేరు చెప్పి, నీవేమో వాడిపేరు చెప్పి మధ్యలో నన్ను ఫూల్ చేద్దామని చూస్తున్నారా! ఆ పప్పులేం ఉడకవు. బాస్ గాడు దొరికేదాకా నిన్ను ఇక్కడే ఉంచుతాను.


    వాడు దొరికిన తరువాత అప్పుడు మీ ఇద్దరి సంగతీ ముఖాముఖీ తేలుస్తాను" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు కోపంగా అరుస్తూ అన్నాడు.


    "మీరు మమ్మల్ని జైల్లో ఉంచినందువల్ల మాకేమీ నష్టంలేదు సార్! బాస్ గాడు మా పేర్లు తప్పు చెప్పి, మమ్మల్ని ఇంకా కష్టాలపాలు చేయాలని చూస్తున్నాడూ అంటే, వాడికి మా మీద ఎంత కోపం వుంది అర్థమవుతున్నది.


    ఇప్పుడు మీరు మమ్మల్ని విడిచిపెట్టినా, మేము క్షేమంగా ఉండం సరికదా. మరింత ఆపదకి దగ్గర అవుతాం. ప్రస్తుతం వాడు తోక తొక్కిన పాములాగా వున్నాడు. మమ్మల్ని చూస్తే చంపిపారేస్తాడు. పదికాలాలపాటు చల్లగా వుండాలంటే ఖయిదులో వుండటమె బెటర్ సార్!"


    జాలిగా, అమాయకంగా అన్నాను.


    సమయానికి కరెంటు పోవటం వల్లనో, నా మాటల ప్రభావమో కానీ, మొత్తానికి ఇన్ స్పెక్టర్ వర్ధనరావు, కుర్చీలో కూర్చున్నవాడు అలాగే కరిగి నీరయ్యారు.


    "నీవేమో నీపేరు విజయరాజ్ అంటున్నావు. ఆ బాస్ గాడేమో ఫోన్ లో నీ పేరు చెబుతూ గుండూరావ్ అని చెప్పాడు. ఇప్పుడు నీ పేరు..."


    "ఆగండి సార్! ఆగండి..." అంటూ గబుక్కున చొక్కా విప్పేశాను. ఆయనకి దగ్గరగా వెళ్ళినా జబ్బ చూపిస్తూ "ఇది చూడండి సార్! పచ్చబొట్టు. ఒకసారి తిరణాలకి వెళ్ళినపుడు అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ తమతమ పేర్లు పచ్చబొట్టు పొడిపించుకుంటూ వుంటే నేను నా పేరుని ముంచేతిమీద పొడిపించుకోవటం ఇష్టంలేక జబ్బమీద పచ్చబొట్టుతో పొడిపించుకున్నాను. చూసీచూడంగానే పదిమందికీ నాపేరు తెలియకూడదు. కానీ నాపేరు నావంటిమీదనే వుండాలి. అందుకని జబ్బ మీద పొడిపించుకున్నాను." అంటూ వివరించాను.


    "హత్తెరి పచ్చబొట్టుకి ఇంత మహత్యం వుందా? ఈ పచ్చబొట్టే లేకపోతే అన్యాయంగా నిన్ను గుండూరావే అనుకుని, బాస్ గాడు కనపడేదాకా నిన్ను జైల్లోనే వుంచేవాడిని. ఒక మనిషి దోషో, నిర్దోషో తెలియాలంటే ఇలాంటి గుర్తులుండటం కూడా చాలామంచిది. నన్ను ఎవడైనా సలహా అడిగితే. ప్రతివాడూ తనపేరుని శరీరంమీద ఎక్కడో అక్కడ పచ్చబొట్టుగా పొడిపించుకోవాలని చెబుతాను. ఇప్పుడు నమ్ముతున్నాను. నీపేరు గుండూరావు కాదు. ఆ బాస్ గాడు నన్ను తప్పుదోవ పట్టించటానికి ఇంత పెద్ద అబద్ధం ఆడాడూ అంటే వాడు ఎంత పెద్ద గుండెలు తీసిన బంటో తెలుస్తూనే వుంది. పోలీసువాళ్ళు అంటే పిచ్చి కుంకలు అని అనుకుంటున్నట్లు వున్నాడు. ఒక్కసారి నా చేతికి చిక్కాలి మటాష్ అయిపోతాడు వాడు..."


    పచ్చబొట్టు గురించి పదినిముషాలసేపు మాట్లాడాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.

    
    "వున్న విషయమేదో ఒక్క అబద్ధం కూడా ఆడకుండా వివరంగా చెబుతాను సార్! ఇంక మీరు ఎలా చెబితే అలా చేస్తాను. మీరు మమ్మల్ని కొన్నాళ్ళపాటు మీదగ్గర ఖైదులోనే వుంచండి. అలా అయినా మా ప్రాణాలు కొద్దికాలం పాటు రక్షింపబడతాయి." అంటూ మేము ఖైదులోనే వుండటానికి ఇష్టపడుతున్నట్లుగా నమ్మదగిన విధంగా మాట్లాడాను.


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు పది నిముషాలసేపు దీర్ఘాలోచన చేసి, చివరికి ఒక నిశ్చయానికి వచ్చినవాడిలాగా తలపంకించాడు.


    "నాకో మంచి ఐడియా వచ్చింది. కోటీ యాభై లక్షల వజ్రాల గురించీ బాస్ కి బాగా తెలుసని, వాడు మమ్మల్ని తప్పుదోవ పట్టించటానికి ఫోన్ చేశాడని, మీరు నిరపరాధులనీ, పూర్తిగా నమ్ముతున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని విడుదల చేస్తాను. ప్రతిరోజూ మీరు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒకసారి నాకు కనపడి హాజరు వేయించుకోవాలి..."


    "బాస్ మమ్మల్నేమన్నా..." అంటూ భయం నటించాను.


    "అదేనయ్యా! నేను చెప్పబోయేది. బాస్ మీమీద కక్ష తీర్చుకోటానికి తప్పక మిమ్మల్ని వెంటాడుతాడు. మేము కూడా ఒక కంట మిమ్మల్ని చూస్తుంటాము కాబట్టి, మీకేం భయంలేదు. బాస్ కనపడగానే వాడిని పట్టేస్తాము. నాటకాలు, ట్రిక్కులు చేయకపోతే నేరస్తులు పట్టుబడరు. ఈ సాయంత్రమే మీ విడుదల కానీ, మీరు ఏదైనా వెధవ్వేషాలు వేసినట్లు తెలిసినా, నేరస్తులు అని అనుమానం వచ్చినా మళ్ళీ బొక్కలోకి తోసేస్తాను జాగ్రత్త." అంటూ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చాడు.


    "అదికాదు సార్! వీళ్ళని వదిలిపెట్టడం అంత మంచిదికాదేమో!" నసుగుతూ అన్నాడు కానిస్టేబుల్ అహోబిలం.


    "ఈ స్టేషన్ కి ఇన్ స్పెక్టర్ ని నేనా? నువ్వా?" కళ్ళెర్రజేసి అడిగాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.


    "మీరేసార్! మీరే!" అహోబిలం కంగారుగా అన్నాడు.


    "మరి నువ్వు ఇక్కడ ఏమిటి?"


    "హెడ్ కానిస్టేబుల్ అహోబిలాన్ని సార్."


    "ఆమాత్రం గుర్తుంది కదా! హెడ్ లేని హెడ్ కానిస్టేబుల్ లాగా ప్రవర్తించకు. నేనిక్కడ ఏం చెబితే అది తు.చ. తప్పకుండా చెయ్యటమే నీ డ్యూటీ. నాకు హెడ్డు లేనట్లుగా ఉచిత సలహాలు ఇవ్వకు. ఈ సాయంత్రమే వీళ్ళని విడుదల చెయ్యి!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS