Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 37


    అతనంటే చిరాకు, రోత, అసహనం మిళితమైపోయినాయి ఆమె మనస్సులో.


    ఆమె ఎంత కఠినంగా తన విషయంలో ప్రవర్తించినా మనోహర్ బాధపడ్డంలేదు. తన వ్యక్తిగత ప్రవర్తన గురించి గతంలో విన్న వాళ్ళకి తనపట్ల సదభిప్రాయం ఉండదని అతనికి బాగా తెలుసు.


    ఏదోలా ఏనాటికైనా భారతి మనసు మారకపోదన్న ఓ నమ్మకం మాత్రం అతనిలో దృఢంగా ఉంది.


    బోసు అడిగాడు. "చూశావా, వాడు మనవెనకే తగలబడుతున్నాడు. మనం ఎక్కడికి పోతున్నామో చూడాలని కాబోలు!" అన్నాడు.


    భారతి ఆలోచనలో పడిపోయింది. మనోహర్ కి తనంటే ఏవగింపు కలిగేలా ప్రవర్తించాలి దానికిప్పుడు బోసుని సాధనంగా వాడుకోవాలి.


    అంతే మెరుపులాంటి ఆలోచన ఆమె మస్తిష్కంలో కదిలింది.


    "ఏదన్నా థియేటర్ దగ్గర ఆపు" అంది మెల్లగా.


    బోసుబాబు కళ్ళల్లో ఆనందం కొట్టొచ్చినట్టుగా కనబడింది.


    "సుదర్శన్ కి పోనీ!" అని ఆటోవాడికి చెప్పాడు. మరో అయిదు నిమిషాల్లో ఆటో సుదర్శన్ థియేటర్ ముందు ఆగింది.


    ఆటోలోంచి కిందికి దిగి చూసింది. రోడ్డుకి వారగా మనోహర్ కారుని పార్క్ చేసి తనకేసే చూస్తున్నాడు. అదే ఆమెకి కావాలి. ఆమె థియేటర్ లోపలికి నడుస్తుంటే వెనకే బోసుబాబు నడిచాడు.


    భారతి లాంజిలో నుంచొని రోడ్డుకేసి చూసింది. మనోహర్ వెళ్ళిపోలేదు.


    ఈలోగా బోసు టిక్కెట్టుకొనుక్కొచ్చాడు. ఎలక్షన్లో గెలిచిన అభ్యర్థి మొహంలా వెలిగిపోతోంది బోసు మొహం.


    లోపలికెళ్ళి సీటులో కూర్చుంది భారతి. భారతి పక్కనే వచ్చి కూర్చున్నాడు బోసు.


    అతని పక్కన కూర్చోడం కంపరంగా ఉంది అయినా తప్పదు.

     
    ఆమె మధ్య మధ్య గేటుకేసి చూస్తోంది.


    "భారతీ!" పిలిచాడు బోసు ఏదో చెప్పబోతూ.


    "ష్..... షట్ యువర్ మౌత్! నువ్వేం మాట్లాడనవసరం లేదు. నోరు మూసుకుని సినిమా చూడు" అంది.


    అతనదోలా నవ్వుకొని సర్దుకొని కూర్చున్నాడు.


    సినిమా మొదలైంది.


    ఆమె దృష్టి తెరపైన లేదు. బోసుతో కలిసి సినిమాకి రావడం పొరపాటుగానీ చేయలేదు కదా! అని ఆలోచిస్తోంది.


    మనోహర్ వెళ్ళిపోయేవరకూ వెయిట్ చేసి ఇంటికి వెళ్ళిపోవాల్సింది. కానీ అతను వెళ్ళిపోయాడన్న నమ్మకం మాత్రం ఆమెకి లేదు.


    తన నడుం దగ్గర ఏదో తగిలినట్టయింది.


    బోసుబాబు మోచేయి తగులుతోంది. కొంచెం ఆమె మీదకి ఒరిగి కూర్చున్నాడు.


    భారతీ తీక్షణంగా చూసింది.


    "చెయ్యి తియ్యి. పిచ్చి వేషాలేస్తే చెయ్యి విరిగిపోతుంది" అంది అతనికి మాత్రమే వినబడేలా.


    "ఈ మాత్రం దానికేనా, ఏమై పోయిందిప్పుడు?" అప్పుడు చెయ్యి తీసేస్తూ.


    "ఏమీ కానక్కర్లేదనే చెప్పేది"


    "ఓ అమ్మాయి, ఓ అబ్బాయి కలిసి సినిమా కొచ్చారంటే ఇలాంటివి చాలా మామూలు. ఈ మాత్రం కూడా లేకపోతే థ్రిల్ ఏముంది?"


    "నేను థ్రిల్ కోసంరాలేదు. మనోహర్ చూడాలని ఇలా వచ్చాను" అంది.


    ఆ తర్వాత బోసు చాలా మామూలుగా వూరుకొని వుండిపోయాడు.


    పిక్చర్ అయ్యేసరికి అయిదున్నరయింది.


    థియేటర్లోంచి బయటకొచ్చేసరికి మనోహర్ అక్కడే నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది.


    "ఎందుకిలా వెంటాడుతున్నాడు?


    అవంతిని కలుసుకొని ఓసారి మాట్లాడాలి. అతన్ని తనకెప్పుడూ కనబడవద్దని చెప్పమని చెప్పాలి.


    బోసు గర్వంగా మనోహర్ కేసి చూసి ఆటో మాట్లాడాడు.


    లెక్క ప్రకారం మరో అరగంటలో ఇంటి దగ్గర వుండాలి.


    మమ్మీకి క్లబ్ లో పంక్షన్ వుంది. అంచేత కాస్త లేటయినా ఫరవాలేదు.


    ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి.


    అతనికి తనంటే జుగుప్స కలగాలి. లేకపోతే తనని వదిలిపెట్టేలా కనబడలేదు.


    "బ్లూ ఫాక్స్ కెళదామా?" అడిగాడు బోసు మెల్లగా.


    "దేనికి?" అడిగింది.


    "దేనికేమిటి" సరదాగా నేనో జిమ్ లెట్ తీసుకొంటాను, నువ్వు ఆపిల్ జ్యూస్ తాగుదువుగానీ!" అన్నాడు.


    "ఊ....." అంది.


    "ఇంత కాలానికి పిట్ట దొరికింది. ఈ రోజు అటో ఇటో తేల్చేయాలన్న ఆలోచనలో వున్నాడు బోసుబాబు."


    బార్ లో ఓ కార్నర్ లో కెళ్ళి కూర్చున్నారు. బోస్ స్టివర్డ్ కి ఏదో చెప్పి వచ్చాడు.


    పది నిమిషాల తర్వాత ఆర్డర్ టేబుల్ మీదికి వచ్చింది.


    "ఏమిటిది?" అడిగింది గ్లాసుని చూస్తూ.


    "నోవాకోలా" చెప్పాడు.


    "నువ్వు తీసుకొనేది ఏమిటి?" అడిగింది.


    "రం....." అని చెప్పాడు.


    అతని మొహంలోకి అదోలా చూసింది భారతి.


    సరిగ్గా అప్పుడే లోపలికొచ్చి సమీపంలో కూర్చున్నాడు మనోహర్ అతనలా వస్తాడని భారతి ముందుగానే వూహించింది.


    అతనికేసి ఓసారి నిర్లక్ష్యంగా చూసి గ్లాసుని నోటి దగ్గరగా తీసుకొని సిప్ చేసింది.


    "ఏమిటిది? అదోలా వుంది" అంది.


    బోసు నవ్వాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS